యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -23
శాకల్యుడు ‘’శరీరం హృదయం దేనిలో ప్రతిస్టింప బడ్డాయి ?’’ యాజ్ఞవల్క్యుడు ‘’ప్రాణవాయువు లో .అది అపానవాయువులో .అది వ్యానవాయువులో .అది ఉదాన వాయువులో అది సమానవాయువులో ప్రతిష్టింప బడినాయి ‘’అనగానే ఇక మాట్లాడక ఊరుకున్న మేనమామను ‘’ఔపనిషద పురుషుని గురించి నువ్వు వివరించిచెప్పు ..చెప్పకపోతే తలపగిలి చనిపొతావు ‘’అన్నాడు .శాకల్యునికి ఆ వివరం తెలియకపోవటం తో తలపగిలి చచ్చాడు .బ్రాహ్మణ్యం అంతా మహర్షి వేతృత్వాన్ని వేనోళ్ళ పొగడి , శాకల్యుని అజ్ఞానాన్ని అహంకారాన్ని దూషించారు .అవతారపురుషుడు యాజ్ఞవల్క్యుడని మెచ్చారు .శాకల్యుని శిష్యులు గురువుకు జరిగిన పరాభవం మరణం గురించి బాధపడి ఆయన అస్థులనుమూటకట్టి ఉత్తరక్రియలకోసం తీసుకు వెడుతుంటే దొంగలు అందులో డబ్బు ఉందనుకొని ఎత్తుకొని పారిపోయారు .బ్రహ్మ వేత్తలను ద్వేషిస్తే ఇహ, పరాలు దక్కవు అని అందరికి అర్ధమైంది .
శాకల్యుని కథ సమాప్తి చెందటం తో జనకరాజు ఆస్థానానికి వచ్చిన వారు ఇక నోరు మెదపకుండా కూర్చుంటే యాజ్ఞవల్క్యుడే ‘’మీలో ఇంకెవరైనా కానీ ,కొందరుకానీ అందరూ కలిసి కానీ సందేహాలుంటే అడగండి .మీరు అడగకపోతే నేనే మిమ్మల్ని ప్రశ్నించాల్సి వస్తుంది ‘’అన్నాడు .కిమిన్నాస్తి .ఎవ్వరూ మాట్లాడలేదు .అప్పుడు మహర్షి యాజ్ఞవల్క్యుడే వారందరితో ‘’పురుషుడిని వనస్పతి తో పోల్చవచ్చు .ఎలాగంటే శరీరానికి వెంట్రుక లున్నట్లు వృక్షాలకు ఆకులున్నాయి .పురుషుడికి జన్మ ఉన్నట్లు చెట్టుకూ ఉంది .పురుషునికి రక్తం కారినట్లే చెట్లకూ బంక కారుతుంది .మనకు మాంసం ఉన్నట్లే వాటికి శకలాలున్నాయి .మన నరాలలాగే వాటికీ దృఢమైన కీనాటం ,ఎముకలులాగా వాటిలో దారువులు ,మనకు కొవ్వు ఉంటె వాటికి చేవ సమాన ధర్మాలుగా ఉన్నాయి .చెట్టును నరికితే ,మూలం నుంచి మళ్ళీ పుడుతుంది .మృత్యువు చేత చేది౦పబడితే మనిషి ఏ మూలం నుంచి పుడతాడు ?.రేతస్సు అని చెబుతారేమో ?బ్రతికి ఉన్నవాడికే రేతస్సు ఉంటుంది .చెట్టు చచ్చిపోయినా బీజం వలన మళ్ళీ పుడుతుంది . వ్రేళ్ళతో పెకలిస్తే మళ్ళీ పుట్టదు .చనిపోయినవాడు ఏ మూలం నుంచి పుడతాడు ?పుట్టినవాడు మళ్ళీ పుట్టడు కనుక ఈ ప్రశ్న అసంబద్ధం అంటారా ?కాదు .పుట్టినవాడు చనిపోయాక జన్మమే లేకపోతే వాడు చేసిన పుణ్యపాపాలకు ఫలం నశించటం చేయని వాటికి ఫలం రావటం జరుగుతుంది .కనుక చచ్చినవాడు మళ్ళీ పుడతాడు అనే చెప్పాలి .అప్పుడు అతడిని ఎవరు పుట్టిస్తారు ?’’అని ప్రశ్నలు సంధించగా తెల్లమోహాలేసి ఎవరూ మారు మాటాడలేదు .కనుక ఇందులో తేలిన సారాంశం –అన్నిటికీ మూల విజ్ఞాన గుణ ,ఆనంద స్వరూపం పర బ్రహ్మమే .యాజ్ఞావల్క్యమహర్షి ని బ్రహ్మ వేత్త గా ,అధిగమించరాని పండితోత్తమునిగా అందరూ భావించి ప్రశంసించారు .అతడినే అనుసరించి జన్మలు చరితార్ధం చేసుకోవాలి నిర్ణయించుకొన్నారు .
అప్పుడు జనక చక్రవర్తి యాజ్ఞవల్క్య మహర్షి తో ‘’పరమ పురుషా !శతకోటివందనాలు .నీ దశావతార మహిమ తెలియక కొందరు అపోహపడి భంగపడ్డారు .వేలకొలది విద్వా౦సు లున్న ఈ సభలో ‘’బ్రహ్మిస్టుడవు ‘’అని ఖ్యాతి గడించావు .మా పురం లో ఉంటూ బ్రహ్మ విద్యా వ్యాప్తి చేస్తూ ,పరబ్రహ్మ తత్వాన్ని నాకు వివరంగా బోధించి నన్ను ధన్యుడిని చెయ్యి ‘’అని సభాముఖంగా ప్రకటించాడు .యాజ్ఞవల్క్యుడు ‘’సార్వ భౌముడు తలచుకొంటే కానిదేమున్నది ‘’అని తన అంగీకారం తెలిపి ,చాలాకాలం మిధిలానగరం లోనే ఉంటూ జనకునికి బ్రహ్మ విద్య నేర్పుతూ జనులకు ఐహికాముష్మిక జ్ఞానమార్గం బోధించాడు .గార్గి తనతో వచ్చిన మైత్రేయి దృష్టి అంతా యాజ్ఞావల్క్యుని పైనే ఉన్నదని ,ఆమె మనసంతా అతడు వ్యాపించి ఉన్నాడని ఆమె అతడిని గాఢంగా ఇస్టపడుతోందని ,ఇంటికి వెడుతూ గ్రహించింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-3-19-ఉయ్యూరు