‘’దండీ మార్చ్’’ అనే ఉప్పుసత్యాగ్రహం

image.png

భారత స్వాతంత్ర్య పోరాటం లో కొన్ని సంఘటనలు నాటకీయంగా ఉత్తేజపూరితంగా చారిత్రాత్మకంగా నిలిచిపోయాయి .అందులో ఒకటి మహాత్మా గాంధీ చేబట్టిన దండి మార్చ్ .బ్రిటిష్ ప్రభుత్వం ఉప్పు పై వేసిన పన్ను కు నిరసన తెలియ జేయటమే అసలు ముఖ్య కారణం .కాని ఇ౦తకంటే తీవ్రమైన లోతైన ప్రభావశీలమైన ప్రాముఖ్యత పొందింది .ఈమార్చ్ స్వాతంత్ర్య పోరాటాగ్నికి పవిత్ర సమిధగా మారింది .ఇదే  స్వాతంత్ర్య  సత్యాగ్రహానికి   శాసనోల్లంఘన  కీలలను రాజేసింది .

   1929  డిసెంబర్ లో  అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ‘’సంపూర్ణ స్వరాజ్యం ‘’ అనేదే దేశప్రజల నినాదంగాప్రకటించి 1930 జనవరి 26 న భారత దేశమంతటా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా అశేష జన సమూహాలతో నిర్వహించింది .ఈ నేపధ్యం లో గాంధీజీ కాంగ్రెస్ నాయకుడిగా మొదటి దశ  శాసనోల్ల౦ఘన౦  అనే   ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించాడు .

  సత్యాగ్రహం గురించి వైస్ రాయ్ కి  1930 మార్చి 2న నోటీస్ పంపిస్తూ అందులో బ్రిటిష్ ప్రభుత్వ అణచి వేత విధానాలవల్ల భారత దేశం శిధిలమై పోయిందని ,పేదప్రజల జీవనానికి అత్యవసరమైన ఉప్పు పై కూడా పన్నులు వేసి జీవన విధానాన్ని దెబ్బ తీసినందుకు నిరసనగా ఉప్పు పన్నుకు ప్రతీకాత్మక నిరసన తెలియ జేస్తున్నానని ,భారత స్వాతంత్ర్యం యెంత ముఖ్యమో తెలియ జేయటానికి ఇది నాంది అని తెలియ జేశాడు .తర్వాత వైస్ రాయ్ ఇచ్చిన పెడసరి సమాధానికి ‘’నేను మోకాళ్లమీద నిలబడి అన్నం పెట్టమంటే రాళ్ళు వేశారు’’అని దులిపేశాడు .

  తన ఉద్యమానికి గుజరాత్ లోని సముద్ర తీర గ్రామం అయిన దండి సరైన స్థలం అని గాంధి నిర్ణయించాడు .అహమ్మదాబాద్ లోని ఆశ్రమం నుంచి 241మైళ్ళదూరం అంటే సుమారు 360 కిలోమీటర్లలో ఉన్న దండి కి కొద్దిమంది ముఖ్య అనుచరులతోకలిసి 1930మార్చి 12న బయల్దేరి దండి మార్చ్ ని  నడిచి వెళ్లాలని నిశ్చయించాడు  .అగ్నికి ఆజ్యం పోసినట్లు మార్చి మొదటి వారం లో చాలా ఉద్రిక్తమైన కాలం గడిచింది .సర్దార్ వల్లభ భాయ్ పటేల్ ‘’బోర్సాద్’’ లో   ప్రజలను సమాయత్తం చేసి ,గాంధీకి బాసటగా సత్యాగ్రహులను పంపటానికి  జిల్లా అంతటా ఘన స్వాగతం పలకటానికి ఏర్పాట్లు చేయటానికి వెళ్ళాడు .కాని పటేల్ ను మార్చి 7 న బ్రిటిష్ ప్రభుత్వం’’ రాస్ ‘’లో అరెస్ట్ చేసి౦ది .దీనితో ఆగ్రహజ్వాల మరింత రాజుకొన్నది .అనుకోకుండా మార్చి 9న సబర్మతి నది ఇసుకపై లో 75 వేలమంది ప్రజలు స్వచ్చందంగా సమావేశమై గాంధీజీ సమక్షం లో  తామంతా ‘’సర్దార్ పటేల్ బాటలోనే నడిచి, భారత స్వాతంత్ర్యం సాధించేదాకా విశ్రమించమని , రాక్షస తెల్ల దొరల ప్రభుత్వానికి శాంతి లేకుండా చేస్తాం’’  అని శపథం లాంటి ఒక తీర్మానం ఆమోదించారు .దీని ప్రతిధ్వని దేశమంతటా మారు మ్రోగి ఊపు తెచ్చి ఉర్రూత లూగించింది .దేశం లోనేకాదు  విదేశాలనుండి కూడా గొప్ప ప్రోత్సాహం లభించింది .

  ఈ స్పందన గాంధీకి మరింత ఉత్సాహం కలిగించి దేశ విదేశీ విలేఖరులకు ప్రముఖులకు ఇంటర్ వ్యూలు ఇస్తూ తన పోరాట స్పూర్తి వివరిస్తూ ప్రార్ధన సమావేశాలలో ప్రజలను ఉత్తేజితులను చేస్తూ స్వాతంత్ర్య దీక్షను నిలబెట్టాడు .ఆశ్రమంలో సందర్శకులకు ప్రార్ధన సమావేశాలకు ఉన్న  పరిమితి తీసేసి ఎక్కువమంది కి అవకాశం కల్పించారు .ఈకాలం లో గాంధీకి మద్దతు నిస్తూ వేలాది మెసేజ్ లు వచ్చాయి .రివల్యూషనరి పార్టీ గాంధీని ‘’కామ్రేడ్ గాంధి ‘’అని సంబోధించి ,ఆయన అహింసా ఉద్యమానికి మూడేళ్ళు గడువు ఇస్తున్నట్లు ప్రకటించింది .జర్మనీ నుంచి ఒక డాక్టర్  ‘’మీ సేవలకు అభినందనగా ఒక వినయపూర్వక మనిషి ఉదయం సాయంత్రం  మీ విజయం కాంక్షిస్తూ ప్రార్ధన చేస్తున్నాడు ‘’అని రాశాడు .న్యూయార్క్ నుంచి రివరెండ్ హోమ్స్‘’గాడ్ గార్డ్ యు ‘’అనే మెసేజ్ పంపాడు .ఇవన్నీ గాంధీకి మద్దతుగా ఉన్నప్పటికీ , గాంధీజీ ఈ పాప్యులారిటి  చూసి  అసూయ చెంది బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేసి ఇబ్బంది పాలు చేస్తుందేమోనని భారత ప్రజలు  సందేహించారు .

  దండి మార్చి కి ముందురోజు మార్చి 11సాయంత్రం 10వేలమంది హాజరైన ప్రార్ధన సమావేశం లో గాంధీజీ ‘’బహుశా ఇదే నా చివరి ప్రసంగం కావచ్చు .ఒకవేళ రేపు ఉదయం దండి మార్చ్ కి ప్రభుత్వం నన్ను అనుంతి౦చి నాకూడా పవిత్ర శబర్మతి నదీ తీరం లో ఇదే నా చివరి ఉపన్యాసం కావచ్చు .బహుశా నా జీవితం లోకూడా ఇవే చివరి మాటలుకూడా కావచ్చు ‘’అని ప్రసంగం ముగించాడు .

  అనుకొన్న రోజు మార్చి 12ఉదయం 6-30కి  దండి మార్చ్ ప్రారంభించాడు శబర్మతి ఆశ్రమమం నుంచి మహాత్ముడు .దీనిని ఆశ్రమ జర్నలిస్ట్ ‘’గౌతమ బుద్ధ దేవుని మహాభి నిష్క్రమణ ‘’ గా అభి  వర్ణించాడు .బక్కపలచటి మనిషి చేతికర్ర ఊతంగా 61ఏళ్ళ వయసులో 78మంది సత్యాగ్రహులతో మార్చ్ ప్రారంభించాడు .ఈ సత్యాగ్రహులలో ఆంధ్రా బెంగాల్ బీహార్ బాంబే గుజరాత్ కర్నాటక కేరళ కచ్ మహారాష్ట్ర పంజాబ్ రాజపుటానా సింద్ తమిళ్ నాడు ,ఉత్తరప్రదేశ్ ఉత్కల్  నేపాల్ వారున్నారు .హిందువులతోపాటు ఇద్దరుముస్లిం లు ఒక క్రిస్టియన్  ఇద్దరు హరిజనులు కూడా ఉన్నారు .అంటే మొత్తం భారత దేశమంతా రిప్రజెంట్ అయింది .సత్యాగ్రహులవెంట వేలాది ప్రజలుస్త్రీ పురుషులు  నడిచారు .దారి అంతా స్వాగత తోరణాలతోశోభాయమానంగా అలంకరించారు.

  బయలు దేరేముందు మహాత్ముడు మాట్లాడుతూ ‘’నా యాత్ర అమర నాథ్   బదరీ  కేదార నాథ యత్రలా అనిపిస్తోంది  .ఇది నా జీవితం లో నిజంగా పవిత్ర తీర్ధయాత్రయే’’అన్నాడు .మోతీలాల్ నెహ్రు ‘’శ్రీరాముడు లంకకు చేసిన యాత్ర లా చారిత్రాత్మకం గాంధీజీ దండి యాత్ర ‘’అన్నాడు .డా ప్రఫుల్ల చంద్ర రే (పిసి రే )’’మోజెస్ నాయకత్వం లో ఇస్రలైట్లు చేసిన దేశత్యాగం ‘’లా ఉందన్నాడు .మహాత్ముడు ఇంతకూ ముందు ఎన్నో ప్రదేశాలు కాలినడకన నడిచి వెళ్ళాడు .కాని ఈ యాత్ర అంతా దుమ్ము ధూళీ సరైన నడకదారి లేనిది .రాళ్ళు రప్పలతో ఇబ్బందికరమైనది .అయినా మొక్కవోని దీక్షతో స్వాతంత్ర్యజ్వాల హృదయం లో జ్వలిస్తుండగా కోట్లాది భారతీయులా ఆకాంక్ష  సంపూర్ణ స్వరాజ్యం కోసం నడిచిన చారిత్రాత్మకమైన యాత్ర దండి యాత్ర .అహ్మదాబాద్ నుండి 13మైళ్ళ దూరం లో ఉన్న ‘’అస్లాలి’’లో మొదటి రోజు యాత్ర పూర్తవగానే గాంధీజీ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ‘’ప్రభుత్వం ఉప్పు పన్ను ఎత్తి వేసేదాకా ,భారత దేశానికిస్వాతంత్ర్యం వచ్చేదాకా నేను మళ్ళీ శబర్మతి ఆశ్రమం లోకి అడుగు పెట్టను ‘’అని హర్ష ద్వానాలమధ్య తన మనో నిశ్చయాన్ని మళ్ళీ ప్రకటించాడు .

  ఈ రోజు ‘’మార్చి 12దండియాత్ర రోజు’’ సందర్భంగా పురాజ్ఞాపకాలు

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-3-19-ఉయ్యూరు 

image.png

image.png

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.