గాలిలో వ్రేలాడే దేవాలయం గా ,మిస్టీరియస్ టెంపుల్ గా ప్రపంచమంతా ఆశ్చర్య పోయే దేవాలయం చైనా దేశం లో పర్వత శిఖరం పై భూమికి 246అడుగుల ఎత్తున మౌంట్ హీంగ్ పై డటాంగ్ సిటీ దగ్గర హన్యుయన్ కౌంటిలో షాంక్సి ప్రాంతం లో ఉంది .దీనికి దగ్గర సిటీ డటాంగ్ 64కిలోమీటర్ల దూరం లో ఉంది .సుమారు 1600 ఏళ్ళనాటి ఈ ఆలయం గొప్ప టూరిస్ట్ అట్రాక్షన్ గా నిలిచింది .దీని మరోప్రత్యేకత చైనాలోని మూడు ముఖ్యమతాలైన బౌద్ధ ,టావో,కంఫ్యూషియన్ మతాల ఉమ్మడి దేవాలయం అవటం .
పర్వతాగ్రం పై రంధ్రాలు చేసి ఓక్ చెట్టు కాండాలను దృఢం గా పాతి వాటిపై ఆలయం నిర్మించారు .ముఖ్యమైన ఆధార నిర్మాణం భూభాగం లో దాగి ఉంటుంది .నిటారైన లోయ బేసిన్ లో ఉండటం వలన దేవాలయ శరీర నిర్మాణం పర్వతాగ్రం మధ్య ఆలయ శిఖరం క్రింద వ్రేలాడుతున్నట్లు అనుభూతి నిస్తూ వర్ష౦ వలన కోతను , సూర్య రశ్మి నుండి రక్షణను కల్పిస్తుంది .అనేక రాజవంశాల సేవలో శతాబ్దాలపాటు సంరక్షి౦ప బడుతూ .రంగు మారకుండా ఆలయం నిలవటం విశేషం .2010 డిసెంబర్ టైమ్స్ పత్రిక ఈ ఆలయాన్ని ప్రపంచ ప్రసిద్ధ అసాధారణ ప్రమాద భరిత పది నిర్మాణాలలోఒకటి గా పేర్కొన్నది .
ఈ వ్రేలాడే దేవాలయ నిర్మాణం’’ ఉత్తర వీ ‘’వంశరాజుల చివరి కాలం లోఒకే ఒక వ్యక్తి ‘’లియోరన్’’అనే సన్యాసి ప్రారంభించాడు .తర్వాత 1400సంవత్సరాలలో అనేక మరమ్మత్తులు ,విస్తరణలు జరిగి ఇప్పుడున్న స్థితిలో కనిపిస్తోంది .మొత్తం 40 హాలులు ,మండపాలు భూమికి 98అడుగుల ఎత్తులో ఉన్న పర్వతగ్రాలపై (క్లిఫ్ఫ్స్ )నిర్మించబడ్డాయి .ఆలయ ఉత్తర దక్షిణాల మధ్య దూరం ,తూర్పు పడమరల మధ్య దూరంకంటే ఎక్కువ .ఉత్తర ద్వారం నుంచి దక్షిణ ద్వారానికి వెళ్ళే కొద్దీ పర్వతం పై ఎత్తు క్రమంగా పెరుగుతూనే ఉంటుంది .ఇందులో క్వీలాన్ హాలు ,అనే సంఘారామ హాలు ,అధికారులకోసం సంగువాన్ హాలు ,చున్యాన్ హాలు ,శాక్యముని హాలు , మూడుమతాలహాలు , గుయానిన్ హాలు ఉన్నాయి .
మూడు మతాల హాలులో బుద్ధ విగ్రహాలు తావోయిజం ,కన్ ఫ్యూషియనిజం మతాల ప్రముఖుల విగ్రహాలున్నాయి .మధ్యలో శాక్యమునివిగ్రహం దానికి ఎడమవైపు టావోమతప్రవక్త లావోజే విగ్రహం, కుడివైపున కంఫ్యూ షియస్ విగ్రహాలుంటాయి .దీనివలన 1368 నుంచి 1911 వరకు పాలించిన మింగ్ ,క్వింగ్ వంశరాజులపాలనలో ఈ మూడు మతాల భావం ఒకటే అని మత సమైక్యతకు నిదర్శనమని లోకానికి చాటి చెబుతున్నట్లు అనిపిస్తుంది.
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-3-19-ఉయ్యూరు
—