4-4-19 ఢిల్లీ లో రాష్ట్రపతి పురస్కారం అందుకో బోతున్న శ్రీ శలాక రఘునాధ శర్మ ,శ్రీ బూరగడ్డ నరసింహా చార్యులు
13-భారత ధ్వని దర్శన పరిశోధకులు –ప్రాచార్యులు శ్రీ శలాక రఘునాధ శర్మగారు
జనన విద్యాభ్యాసాలు
సంస్కృతాంధ్రాలలో మహా విద్వత్తు కలిగిన మహా పండితప్రకాండులు శ్రీ శలాక రఘునాధ శర్మ గారు కృష్ణా జిల్లా నూజివీడు తాలూకా గొల్లపల్లి లో 23-7-1941 న శ్రీ శలాక నరసయ్య శ్రీమతి దుర్గాంబ దంపతులకు జన్మించారు .గొల్లపల్లి హైస్కూల్ లో సెకండరీ విద్య పూర్తి చేశారు .ఆగిరిపల్లి లో ప్రసిద్ధ శ్రీ మార్కండేయ సంస్కృత కళాశాలలో 1955 -56 లో చేరి శ్రీ పేరి వెంకటేశ్వర శాస్త్రి గారి వద్ద సంస్కృత వ్యాకరణం అభ్యసించారు .శ్రీ రామ చంద్రుల కోటేశ్వర శర్మగారి దగ్గర కావ్యాలు నేర్చారు .ప్రైవేట్ గా మెట్రిక్ చదివి ఉత్తీర్ణులై 1960 తెలుగు సంస్కృతాలలో భాషా ప్రవీణ ప్రధమ శ్రేణిలో పాసయ్యారు .,ప్రైవేట్ గానే చదివి బి .ఎ .డిగ్రీ కూడా1963 -64లో పొందారు . 1965-67 మధ్యకాలం లో ఉస్మానియా యూని వర్సిటి లో తెలుగు లోఎం ఏ .చదివి మొదటి తరగతి డిస్టింక్షన్ లో కృతార్ధులై స్వర్ణ పతకం పొందారు . వీరి గురుపర౦పరలో డా దివాకర్ల వెంకటావధాని ,డా .పాటి బండ్ల మాధవ రామ శర్మ, ఆచార్య బిరుదురాజు రామ రాజు గారు ఉన్నారు .1975 లో శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం లో ‘’మహా భారతం లో ధ్వని సిద్ధాంత సమన్వయము ‘’పై పరిశోధన చేసి పి .హెచ్ .డి.పొందారు .ఇదే ‘’భారతం లో ధ్వని దర్శనం ‘’గా పుస్తక రూపం లో వెలువడింది .వీరి గైడ్ పరిశోధన పర బ్రహ్మ ఆచార్య కోరాడ మహాదేవ శాస్త్రి గారు .
ఉద్యోగ సోపానం
1960 నుండి 65 వరకు అయిదేళ్ళు హైస్కూల్ ,హయ్యర్ సెకండరీ స్కూల్స్ లో తెలుగు పండితులుగా పని చేశారు . శ్రీ దేవుల పల్లి రామానుజరావు గారు నిర్వహిస్తున్నఆంద్ర సారస్వత పరిషత్ కు చెందిన హైదరాబాద్ తిలక్ రోడ్ లోని ఓరియెంటల్ కాలేజి లో1967-68 లో ఒక ఏడాది ఆంద్ర సంస్కృత లెక్చరర్ గా ఉద్యోగించారు . .1968.అనంతపురం శ్రీ కృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయం లో గీర్వాణాంధ్ర లెక్చరర్ గా చేరి 17 ఏళ్ళు పని చేసి ,శాఖాధ్యక్షులుగా ,డాక్టోరియల్ ప్రొఫెసర్ గా ,డీన్ గా క్రమంగా పదోన్నతి పొంది 16 ఏళ్ళు పనిచేసి మొత్తం 33 సంవత్సరాలు సర్వీస్ చేసిన ఘనత పొంది 2001 లో పదవీ విరమణ చేశారు .
తెలుగు సంస్కృత వ్యాకరణాలపై శర్మగారికి అభిమానం జాస్తి .సంప్రదాయ సాహిత్యమన్నా ,సాహిత్య విమర్శనమన్నా కూడా విపరీతమైన ఆసక్తి ఉన్నది .రిసెర్చ్ పై మక్కువ ఎక్కువ .ఎన్నో విషయాలపై పరి శోధన చేసి దాదాపు 40 విలువైన గ్రంధాలను ప్రచురించారు .100 సెమినార్లలో పాల్గొని రిసెర్చ్ పేపర్లు రాసి సమర్పించారు .3 రిసెర్చ్ ప్రాజెక్ట్ లు నిర్వహించారు .80 దాకా ప్రత్యేక వ్యాసాలూ రాశారు . శర్మగారి వద్ద 24విద్యార్ధులు పరిశోధనలు చేసి పి .హెచ్. డి .పొందారు . .23మందికి ఎం .ఫిల్. కు మార్గ దర్శనం చేశారు .
శాస్త్రి గారి విద్యా విశేషాలకు తగిన గుర్తింపు లభించింది .ప్రశాంతి నిలయం లోని సత్య సాయి ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో 15 ఏళ్ళు మెంబర్ గా ఉన్నారు . శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం ,కాకతీయ విశ్వ విద్యాలయం ఉస్మానియా విశ్వ విద్యాలయం, తిరుపతి పద్మావతీ మహిళా కళాశాల, నాగార్జున విశ్వ విద్యాలయంలలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో సభ్యులుగా గౌరవం పొందారు . ,పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం అకాడెమిక్ సెనేట్ ,హయ్యర్ పవర్ కమిటీలలోసభ్యులుగా పని చేశారు . స్టేట్ లైబ్రరి కమిటీ ,అనంతపూర్ లోని చిన్మయా మిషన్ ఎక్సి క్యూ టివ్ కౌన్సిల్, హైదరాబాద్ యూని వర్సిటి స్కూల్ బోర్డ్ ఆఫ్ హ్యుమానిటీస్ లో మెంబర్ .అనంతపూర్ శ్రీ రమణ సత్సంగ్ కు అధ్యక్షులు .
వివాహం –సంతానం
నూజి వీడుకు చెందిన శ్రీ చెరుకుపల్లి సుందర శివ శర్మ శ్రీమతి బుచ్చిరామ కృష్ణమ్మ దంపతుల కుమార్తె శ్రీమతి రాజ రాజేశ్వరి గారిని శ్రీ రఘునాధ శర్మగారు 26-5-1962లో వివాహమాడారు . ఈ దంపతులకు అయిదుగురు కుమార్తెలు. . .వారందరి వివాహ బాధ్యతలు తీర్చి ,ప్రస్తుతం రాజ మండ్రి లో ఉంటున్నారు .
శ్రీ శలాక వాజ్మయ స్రవంతి
1-దండి ‘’దశకుమార చరిత్ర ‘’ను తెలుగులోకి అనువది౦చి వ్యాఖ్యానం రాశారు .2-బాణుని ‘’హర్ష చరితాను వాదం వ్యాఖ్య 3-శ్రీ బ్రహ్మ దత్త జిజ్ఞాసువు హిందీ లో రాసిన ‘’సరలతమ విధి’’ ని తెలుగులోకి తర్జుమా చేశారు .4-భారతధ్వని దర్శనం అనే పి హెచ్.డి ధీసిస్ –రెండు సార్లు ముద్రణ పొంది ఖ్యాతి చెందింది .5-సంస్కృత వ్యాకరణం ‘’లఘు సిద్ధాంత కౌముది ‘’ని అనువదించారు .6-నన్నయ భారతం పై ‘’భట్టారక భారత భారతి ‘’రాశారు 7-మహా భారత విరాట పర్వాన్ని తెనిగించారు 8-‘’షట్పది కనక దారలు’’ 2 స్తోత్రాలకు వ్యాఖ్యానం రచించారు .9-మహా భారతం లోని ఉద్యోగ పర్వం ,విదుర నీతి ,యక్ష ప్రశ్నలు అనువాదం చేశారు .10-అంతరంగ నివేదనం అనే కవితా సంపుటి 11-సహృదయ భావ లహరి అనే సాహిత్య వ్యాస సంకలనం 12-సనత్సుజాతీయం ,భాగవత నవనీతం ,మహా భారతం –శాంతి పర్వం-ఆర్ష భావ చంద్రికలు,అనుగీత కరదీపిక ,స్పురణ దీప కలికలు ,జగద్గురు శ్రీ పాదార్చన ,ఉత్తర గీత సౌరభ౦ వంటివి ఎన్నో రచనలు చేశారు .13-కవిత్రయ భారతం మొత్తం లో 120 రమణీయ పద్యాలను ఎంపిక చేసి విస్తృత వివరణ రచించారు .14-ప్రశ్నోపనిషత్ సౌరభవం రాశారు 15-పంచామృత రసవాహిని భాగవత నవనీతం ఉత్తర గీత సౌరభం రచించి ఎన్నెన్నో విలువైన విషయాలను వెలుగులోకి తెచ్చారు .
శ్రీ శర్మగారు ప్రస్తుతం శ్రీపమిడి ఘంటం కోదండ రామయ్య గారి ‘’ఆర్ష విజ్ఞాన ట్రస్ట్ ‘’ఆధ్వర్యంలో వేదవ్యాస మహా భారతాన్ని శ్లోక తాత్పర్యాలతో తెలుగులోకి అనువదించే బృహత్ కృషిలో మునిగి ఆర్ష సేవ చేస్తున్నారు .ఇప్పటికి 10 పర్వాలు పూర్తి చేశారు .త్వరలో మిగిలిన 8 పర్వాలు తెలుగులో వెలుగు చూడ నున్నాయి .ఇదొక వాజ్మయ దీక్షాతపస్సు .శర్మ గారు మాత్రమే చేయ గలిగిన ,చేయదగ్గ వాజ్మయ యజ్ఞం .
ఎందుకోకాని శర్మ గారి దృష్టి వాల్మీకి రామాయణం పైనా,ఇతర రామాయణ రచనలపైనా పడినట్లు లేదు.పడి ఉంటే వాటి లోని అనర్ఘ రత్న రాశులను కూడా త్ర్వవ్వి తలకెత్తే వారు అనిపించింది నాకు .
శర్మ గారి కంఠం శ౦ఖ ధ్వనిని పోలి ఉంటుంది .ఏ విషయం పై ప్రసంగించినా అమృత ధారా ప్రవాహం గా ,మూలాలను తరుస్తూ ,చేతిలో పుస్తక సాయం లేకు౦డానే సంస్కృతా౦ధ్ర వాజ్మయం లోని సకల విషయాలను సందర్భోచితంగా వివరిస్తూ తన్మయం చెందిస్తారు .దూర దర్శన్ లో ధర్మ సందేహాలు తీర్చారు మరో వ్యాసునిలా .రేడియోలో సాహిత్య ,ధార్మిక ఆధ్యాత్మిక ప్రసంగాలను లెక్కకు మించి చేశారు .ఏది చేసిన శ్రోతృ పర్వం గా ,రమణీయంగా ఉండటం శర్మగారి ప్రసంగ ప్రత్యేకత .
బిరుదులూ –సత్కార సన్మానాలు
ఇంతటి విస్తృత పరిశోధన ,రచన ,ప్రవచనం చేస్తున్న శ్రీశలాక శర్మగారి విద్వద్వైభవానికి తగిన సత్కారా సన్మానాలు అందుకొన్నారు .ప్రభుత్వ, ప్రభుత్వేతి సంస్థలు పోటీ పడి ముందుకొచ్చి వారిని గౌరవించి వాజ్మయ సరస్వతీ సమార్చన చేశాయి .
1986 లో బెస్ట్ టీచర్ అవార్డ్ ను ప్రభుత్వం నుంచి పొందటం తో ప్రారంభమైన ఈ పురస్కార వేడుక అప్రతి హతంగాసాగి కవిత్వవేది నారాయణ రావు అవార్డ్ ,పేరాల భరత శర్మ మెమోరియల్ అవార్డ్ ,భూతపురి సుబ్రహ్మణ్య శర్మ మెమోరియలవార్డ్ ,సద్గురు శ్రీ శివానందఎమినెంట్ట్ సిటిజెన్ ప్రైజ్ ,ఏలూరు గుప్తా అవార్డ్ ,శ్రీకాకుళం మహతి విశిస్టసాహితి అవార్డ్,మంత్రాలయం రాఘ వేంద్ర స్పెషల్ అవార్డ్ , తణుకు శ్రీ నన్నయ భట్టారక పీఠం పురస్కారం ,శ్రీ పులికంటి కృష్ణా రెడ్డి సాహితీ సత్కీర్తి పురస్కారం ,మల్లాప్రగడ శ్రీ రంగరాయ స్మారక పురస్కారం ,శృంగేరి శారదా పీఠ పురస్కారం , ,రాజమహేంద్రవర కళా గౌతమి సన్మాన పురస్కారం ,రాజమండ్రి విరించి చారిటీస్ వారి నుండి ‘’సువర్ణ కంకణ ప్రదానం ‘’శ్రీ కంచికామ కోటి పీఠ పురస్కారం ,అజో –విభో –కందాళ౦ వారి విశిష్ట సాహితీ మూర్తి పురస్కారం వంటివి ఎన్నో అందుకుని పులకింప జేసేదాకా వచ్చి౦ది . సాహితీ సరస్వతి స్వరూపులు శ్రీ శలాక రఘునాధ శర్మగారు అని నిశ్చయంగా చెప్పవచ్చు ..2015 ఉగాది వేడుకలలో సరసభారతి శ్రీశర్మ గారిని సగౌరవంగా ఆహ్వానించి మా తలిదండ్రులు కీ .శే .లు గబ్బిట భావానమ్మ,మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక పురస్కారాన్ని అందజేసి ,వారి సమక్షం లో నా రచన ‘’’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’ను హైదరాబద్ రేడియో స్టేషన్ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మాన్య శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారి చేతుల మీదుగా ఆవిష్కరి౦ప జేసి ధన్యులమయ్యాం .
ఒక్కమాటగా చెప్పాలంటే శ్రీ శర్మ గారితో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్ .వారికి సరసభారతి రచనలు పంపినప్పుడల్లా ఫోన్ చేసి ,అందిందని చెప్పే సంస్కారం వారిది . వారిని శృంగేరి జగద్గురువులు శ్రీ భారతీతీర్ధ స్వాముల వారు తరచూ పిలిపించి సంస్కృత కవిసమ్మేళణాలు,ధార్మిక ప్రసంగాలు వారి ఆధ్వర్యం లో జరిపిస్తూ సత్కరిస్తూ సమ్మానిస్తున్నారు .ఇంతటి మహనీయులు శర్మగారు సంస్కృతం లో కూడా యేవో రచనలు చేసి ఉంటారని అనిపించింది .వారి గురించి నెట్ లో వెదికితే నాకేమీ కనిపించలేదు .తప్పక శర్మ గారి గురించి రాయాలి అని పించి వారి ముఖత వారి వివరాలు తెలుసుకొందామని నేను నాలుగు రోజుల క్రితం వారు విశాఖ లో ఉండగా ఫోన్ ద్వారా ఇంటర్వ్యు చేసినప్పుడు చాలా ఓపికగా నాకు కొన్ని వివరాలు చెప్పారు. అప్పటికప్పుడు నేను నోట్ చేసేసుకొన్నాను. . తమ సంస్కృత రచనలు, సంస్కృత కవి సమ్మేళనాలలో పృచ్చకులుగా సంధించిన ప్రశ్నలు ,పూరణల వివరాలు త్వరలోనే నాకు పోస్ట్ లో పంపిస్తామని చెప్పారు . ఈ ఉదయం హైదరాబాద్ నుండి వారి మనుమడిగారి ద్వారా ఇంగ్లీష్ లో ఉన్న వారి బయోడేటా అంతా మెయిల్ లో పంపారు .ఈ రచనకు నా ఫోన్ ఇంటర్వ్యు ,వారి బయోడేటా ఈ రెండూ ఆధారం .వారి గీర్వాణ వాణీ వైభవాన్ని రెండవ ఎపిసోడ్ లో వారు పంపిన వాటి ఆధారం గా రాసి తెలియ జేస్తాను .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-12-16 –ఉయ్యూరు .
2-గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
1-పూర్వ మీమాంస భాష్య వార్తిక మత భేదాలపై పరిశోధన చేసిన –ప్రొఫెసర్ శ్రీ బి నరసింహా చార్యులు
హైదరాబాద్ బాగ్ లింగం పల్లికి చెందిన శ్రీ బి నరసింహా చార్యులు 16-7-1944 న జన్మించారు .ఉస్మానియా యూని వర్సిటిలో విద్య నభ్యసించి న్యాయం లో బి ఓ ఎల్.1963 లోను ,సంస్కృతం లోఎం.ఏ 19 66 లోను ,సంస్కృతం లో పి హెచ్ డి .లు పొందారు .రష్యన్ భాషలో అడ్వాన్సేడ్ డిప్లొమా 1985 లో ,గ్రాండ్ స్టెఫీన్స్ 1966 లోను అదే యూని వర్సిటి నుంచి సాధించారు .సంస్కృత సాహిత్యం ,కవిత్వాలలో తెలుగు సంస్కృత తులనాత్మక పరిశోధనలో ,ప్రాచీన న్యాయ శాస్త్రం లోను మిక్కిలి అభి రుచి ఉన్నవారు .
హైదరాబాద్ తాండూర్ ప్రభుత్వ హై స్కూల్ లో,ఒయాసిస్ పబ్లిక్ స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో తెలుగు సంస్కృత ఉపాధ్యాయులుగా ఉద్యోగం ప్రారంభించి,న్యు సైన్స్ కాలేజి ,సర్దార్ పటేల్ కాలేజి లోలెక్చరర్ గా ,30 ఏళ్ళు లెక్చరర్ ,రీడర్ ,ప్రొఫెసర్ గా సైఫాబాద్ పి జి కాలేజ్ ఆఫ్ సైన్స్ ,ఈవెనింగ్ కాలేజి ,ఉస్మానియా యూనివర్సిటి కాలేజ్ ఆఫ్ ఆర్త్సండ్ సైన్స్ లోను పని చేశారు .10-11-1993 నుండి 2-3-1996 వరకు జులై 9 9 నుండి జులై 20 01 వరకు ,జూన్ 2003 నుంచి జులై 2004 వరకు ,ఉస్మానియా సంస్కృత శాఖాధ్యక్షులుగా పని చేసి రిటైర్ అయ్యారు .
పూర్వపు ఆంధ్రప్రదేశ్ సంస్కృత అకాడెమి డైరెక్టర్ గా పని చేశారు .సంస్కృతం లో యు జి మరియు పి జి బోర్డ్ ఆఫ్ స్టడీస్ కు చైర్మన్ గా ,,1996 నుండి సురభారతి సమితి సేక్రేటరిగా ,నేషనల్ అసెస్మెంట్ ,అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ కమిటీ మెంబర్ గా ఉన్నారు .
ఆచార్యులవారు 19 మంది విద్యార్ధులకు ఎం ఫైల్ డిగ్రీకి ,5 గురికి పి హెచ్ డి.కి గైడ్ గా వ్యవహరించారు .30 దాకా జాతీయ సెమినార్లకు హాజరయ్యారు .9 గ్రంధాలను 30 పరిశోధన పత్రాలను రాసి ప్రచురించారు .సిలబస్ రివిజన్ కమిటీ మెంబర్ గా ,సెలెక్షన్ బోర్డ్ మెంబర్ గా ,ఉన్నారు రేడియోలో చాలా విషయాలపై ప్రసంగించారు .ఎన్నో సంస్థలకు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు
రొడ్డం నరసింహఆంగ్లం లో రాసిన ‘’యోగ వాసిస్టం ‘’ను తెలుగులోకి అనువదించారు.16 వ శతాబ్ది కి చెందిన యతీంద్ర మతదీపిక అనే శ్రీనివాసాచార్య సంస్కృత గ్రంధాన్ని తెలుగు చేశారు .వినోబా భావే హిందీలో రాసిన వేద చింతన ను తెలుగు లోకి అనువదించారు.మార్కండేయ పురాణం లోని హరిశ్చ౦ద్రో పాఖ్యానాన్ని తెలుగు చేశారు .సంస్కృత అకాడెమి ప్రచురించిన యోగ సూత్ర సార ,దాతు కారిక లకు సంపాదకత్వం వహించారు .
- వీరిరిసేర్చ్ పేపర్లలో ముఖ్యమైనవి –ధర్మ సూరే మల్లినాధస్య ,అధమార్ణత్వం ,రాసకలిక ,సీతారామ విహార కావ్యధూర్త సమాగమం మొదలైనవి . ఈ క్రింది 12 గ్రంధాలకు పీఠికలు రాశారు .
- -Purvamimamsa Bhashyavartikayormatabhedanamadhyayanam, M.Phil. Thesis in Sanskrit, A. Yajnaramulu, 1993.
- Nirnaya Sindhu, Dr.K.Narasimhacharya, 1994.
- Sri Gayatri mantrakshara mala, Sri K.Suryanarayana, 1995.
- Sri Alavandar Strotram, Burgula Ranganatha Rao, 1995
- Telugu loni vinnapasahitya Samiksha, Ph.D. Thesis, K.Perumallacharya, 1996.
- Andhralankara Vangmaya Charita, Ph.D.Thesis, S.G. Ramanuja Charya, 1998.
- Vaidika Chandah Sastram, P.Koteswara Sharma, 2000.
- Ramanuja Sampradaya Saurabham, Sriman Samudrala Srinivasacharyulu, 2004.
- Kutova manusham, Dr.A.Prabhavati Devi, 2002.
- Nuti Manjari, Bhallamudi Radha Krishnamurthy, 2003.
- Surya Satakam, Ummadi Narasimha Reddy, 1999.
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -28-10-16 -ఉయ్యూరు