నెల్లూరులో ఉన్న మూడుగంటల్లో సభలో ఉన్నది అరగంట మాత్రమే
అనే నెల్లూరు ప్రహసనం
వారం క్రితమే నెల్లూరు నుంచి సర్వేపల్లి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు స్టేట్ లీడర్ పక్షపత్రిక సంపాదకులు శ్రీ సర్వేపల్లి రామూర్తిగారు ఫోన్ చేసి తమ ట్రస్ట్ తరఫున నాకు4-4-19గురువారం సాయంత్రం ఉగాది పురస్కారం అందజేయ బోతున్నట్లు తెలిపి తప్పక రావలసిందిగా కోరారు .సరే అన్నాను .వెంటనే శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి ద్వారా వట్సాప్ లోను ,నాకు తర్వాత పోస్ట్ లో కూడా ఆహ్వానం పంపారు .శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారితో పాటు నాకూ పురస్కారం లభించటం సంతోషంగా ఉంది .వెంటనే మా అబ్బాయి శర్మకు మెయిల్ రాసి అనుకూలంగా రైల్ టికెట్స్ బుక్ చేయమంటే ,వెళ్ళేటప్పుడు బెజవాడలో మధ్యాహ్నం 1-10కి బయల్దేరే కృష్ణా కు ,వచ్చేటపుడు రాత్రి 8-55కు అక్కడ బయల్దేరే చార్మినార్ కు ఎ. సి. లో బుక్ చేశాడు . మార్చి 31సరసభారతి ఉగాదివేడుకలు, ఏప్రిల్ 2శారదా స్రవంతి ఉగాది పురస్కారం హడావిడి అయిపొయింది .
సర్వేపల్లి చారిటబుల్ ట్రస్ట్ వారి ఉగాదిపురస్కారం
ఏప్రిల్ 4గురువారం ఉదయం 10-30కే భోజనం చేసి 11కు ఉయ్యూరు సెంటర్ లో బస్ ఎక్కి విజయవాడ చేరి మధ్యాహ్నం 12-20కి రైల్వే స్టేషన్ చేరాను .దారిలో ‘’మెయ్యటానికి ‘’మా ఆవిడ పులిహోరకలిపి బాక్స్ ఇచ్చింది .నేను చక్రకేళీలు ,ద్రాక్ష ,కమలాలు హార్లిక్స్ బిస్కెట్లు సిద్ధం చేసుకొన్నాను .సరిగ్గా టైం కే కృష్ణా వచ్చింది .1-10కి బయల్దేరాల్సింది బెజవాడ కృష్ణానది చల్లగాలికి కాసేపు విశ్రాంతి తీసుకొన్నట్లు తాపీగా 1-35కు బయల్దేరటానికి ఇష్టం లేక బయల్దేరినట్లు బయల్దేరింది .దాదాపు ప్రతి స్టేషన్ లోనూ ఆగుతూ ,తూగుతూ ఆగాల్సిన సమయం కంటే రెట్టిపు సమయం తీసుకొని ఆగుతూగర్భిణీ స్త్రీలా ఆపసోపాలు పడుతూ మమ్మల్నీ పడేస్తూ ,ఆ ‘’తిరుపతి తెల్లారేలోపు చేరలేకపోతానా ‘’అనే ధీమాతో ఉసూరుమంటూ, అనిపిస్తూ గంటంబావు ఆలస్యంగా 6-45కు నెల్లూరు చేరి మమ్మల్ని హమ్మయ్యా అనిపించింది .మొత్తం మీద 5-45నిమిషాలు సా—గించి ప్రయాణం గమ్య స్థానం చేర్చింది .ఈలోపు సర్వేపల్లివారు ప్రయాణం వాకబు చేస్తూ నేను శివలక్ష్మితోబాటు మావాళ్ళకు తెలియజేస్తూ ఆరగా ఆరగా నేను తెచ్చుకోన్నబిస్కెట్లు మినహా మిగతావన్నీ తిని ఖాళీ చేశాను .రైలు కాఫీ ,టీ లు తాగటం అలవాటు లేదు .మధ్యలో రామయ్యగారి బంధువులు భీమవరం డాక్టర్ గారు శ్రీ గంగాధర్ గారు ఫోన్ చేసి నేను వారికి మార్చి 13న పోస్ట్ లో పంపిన ఆహ్వానం ఈ రోజే తాపీగా 21రోజులతర్వాత ‘’కానుపు’’ అయింది అంటే డెలివరీ అయిందని చెప్పారు . ఇదీ పోస్టల్ భాగోతం .ఉగాది వేడుకలు చాలాబాగా జరిగాయని తమవారినందర్నీ ఎంతో ఆప్యాయంగా చూసుకున్నామని సంబరపడి చెప్పారు అది మా ధర్మం అన్నాను .భీమవరం వచ్చి తమ ఆతిధ్యం తీసుకోమన్నారు డిసెంబర్ లోనే మా మనవడు సంకల్ప్అమెరికానుంచి వస్తే అందరం కలిసి భీమవరం మీదుగా అంతర్వేది వెళ్లి వచ్చామని చెప్పి అనుకూలమైనప్పుడు తప్పక భీమవరం వస్తామని చెప్పాను. ఫంక్షన్ జయప్రదం కావటానికి రామయ్యగారి బంధువులంతా రావటమే ముఖ్య కారణం అన్నాను .మనమంతా అంతటి గొప్ప శాస్త్ర వేత్త కు సమకాలీనులవటం, మీరు బంధువులవటం మన అదృష్టం అన్నాను . తర్వాత శ్రీ గీతా సుబ్బారావు గారుకూడా ఫోన్ చేసి ఆంజనేయ దేవాలయాలు చదివానని చాలాబాగుందని మొదటిభాగం పంపగలరా అని అడిగితె నెల్లూరు నుంచి రాగానే పంపుతానని చెప్పాను .
నెల్లూరు స్టేషన్ లో నన్ను ‘’తిక్కనసోమయాజి పీఠం’’అధ్యక్షులు ,మహాకవి కావ్యకర్త శ్రీ ఆలూరు శిరోమణి శర్మగారు ,సర్వేపల్లి వారు ఆప్యాయంగా రిసీవ్ చేసుకొన్నారు .వీరిద్దరికీ సరసభారతి ఆరే డేళ్ళ క్రితం ఉయ్యూరు ఆహ్వానించి సత్కరించింది .శర్మగారికి నన్ను శ్రీ రంగనాధ స్వామి కోవెల దర్శనం చేయించమని చెప్పి మూర్తిగారు సభకు వెళ్ళారు .దగ్గరే కనుక తెచ్చినకారులో నన్ను ‘’తల్పగిరి శ్రీ రంగనాధ స్వామి దేవాలయం ‘’కు తీసుకు వెళ్ళారు అప్పటికి 7అయింది .స్వామికి ‘’శాత్తు మొర ‘’చేసే సమయం .తెరవేసేశారు .పది నిమిషాలలో తీస్తారు అంటే ఉండిపోయి ఈ లోగా శ్రీ రంగనాయకి అమ్మవారు అండాల్ అనే గోదాదేవి అమ్మవారిని ,శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించి ‘’తెరతీయగరావా ‘’అంటూ స్వామి దర్శనం కోసం వెయిట్ చేశాం .స్వామి మొరలో మామొర ఆలకి౦ చేవారరే లేకపోయారు .అంతా అయి తెర లేపేటప్పటికి -7-40అయింది .తర్వాత గోష్టి .మేము చీకట్లోనే రంగనాయక స్వామిని దర్శించి నెత్తిన ఉన్న కిరీటాన్నిబట్టి ఆయనేనా స్వామి అని శర్మగారిని అడిగితె అవుననంగానే నమస్కరించి ‘’అసలే నల్లనాయన పైగా కటిక చీకటి .పెళ్లి రోజున అరుంధతీ నక్షత్రం కనిపించకపోయినా కనిపించింది అని చెప్పినట్లు దర్శనం అయిందనీ మనసులో సం తృప్తిపడి ఇంతదూరంవచ్చినందుకు ఇదే పెన్నిధి అని అన్నమయ్య అనుకొన్నట్లు అనుకోని ఈ లోపు మూర్తిగారు ఫోన్ చేస్తే వచ్చేస్తున్నామని చెప్పి కారెక్కి బయల్దేరాం .బయట శ్రీ వేదాంత దేశికాచారి గారి ఆలయం బయటనుంచే చూసి రామానుజ విగ్రహం వద్ద గుడి గోపురం వద్దా ఫోటోలు దిగి సభా స్థలికి చేరేసరికి 7-55అయింది .దేశికులపై డా శ్రీదేవి మురళీధర్ అద్భతమైన రిసెర్చ్ గ్రంధం రాసి 2012లో మేము అమెరికానుంచి వచ్చేసరికి అందేట్లుపంపిన విషయం గుర్తుకొచ్చింది
సభ అప్పుడే షురూ చేశారు .శ్రీ గుత్తికొండ సుబ్బారావు ,నెల్లూరు ప్రముఖ రచయిత్రి శ్రీమతి పెళ్ళకూరి జయప్రద ,శ్రీమతి పాతూరి అన్న పూర్ణగార్లను కలిశాను .శర్మగారితో నాకు 8-45ట్రెయిన్ ఉందని 8-30కల్లా నన్ను పంపించేయాలని ముందే చెప్పాను కనుక నాకు సుబ్బారావు గారికి ఒకేసారి సర్వేపల్లి సోదరులు శాలువా ,జ్ఞాపిక ,పెద్ద తాటికాయంత శ్రీవారి లడ్డు లతో సత్కరించారు కవిపండిత సమక్షం లో ఒక పోలీసు ఆఫీసర్ గారు .బెజవాడనుండి రేడియో ఆర్టిస్ట్ ఎబి ఆనంద్ గారుకూడా వచ్చి అభినందించారు .ముందు సుబ్బారావు గారు మాట్లాడారు .తర్వాత నేను మాట్లాడాను .నేను సరసభారతి ఉగాది వేడుకలు శారదస్రవంతి నాకు పద్మశ్రీ తుర్లపాటితో ఇప్పించిన సాహితీ పురస్కారం ,డా. రామయ్య ,డా పుచ్చా గార్లపుస్తకాలగురించి నేనురాసిన కోనసీమ ఆహితాగ్నులు ,గీర్వాణ౦ మూడుభాగాలు ఆ౦జ నేయదేవాలయాలు రెండుభాగాలు పూర్వా౦గ్ల కవుల ముచ్చట్లు వగైరా చెప్పి విక్రమసి౦హ పురిలో మనుమసిద్ధి తిక్కన నడయాడిన దివ్యసీమలో నాకు పురస్కారం అందజేయటం అందులో సుబ్బారాగారి సరసన అందుకోవటం చిరస్మరణీయాలని కృతజ్ఞతలు చెప్పి సరసభారతి పుస్తకాలు శర్మగారికి మూర్తిగారికి వేదిక మీదనే అందజేసి కంగారు లో సుబ్బారావు గారి శాలువా జ్ఞాపికా ఆయన ప్లాస్టిక్ టిఫిన్ బాక్స్ నా సంచీలో ఉంటె చూసుకోకుండా తెచ్చాను 8-40 కి మళ్ళీ శర్మగారు నేను బయల్దేరి కారులో స్టేషన్ చేరేసరికి రాత్రి 8-50 అయింది .డ్రైవర్ గా వచ్చినాయన ఒక ఫోటో, వీడియో గ్రాఫర్ .శర్మగారు ఆయనతో స్టేషన్ కాంటీన్ నుంచి ఇడ్లి పార్సెల్ కట్టించి తెప్పించి వాటర్ బాటిల్ తో సహా ఇప్పించారు .వారిద్దరికీ ధన్యవాదాలు చెప్పాను . సభలో కాఫీ కాని రిఫ్రెష్ మెంట్స్ కాని లేకపోవటం ఆశ్చర్యమేసింది .ఈ విషయం శర్మగారి దృష్టికీ తెచ్చాను. ఆయనా చాల బాధ పడ్డారు .ఎన్నో సార్లు చెప్పి చూసినా ప్రయోజనం కలగటం లేదని నిట్టూర్చారు .సందట్లో సడేమియా అన్నట్లు నన్ను ఒకటవ నంబర్ ప్లాట్ ఫాం పై ది౦పాల్సి౦ది పోయి రెండులో దింపారు .చార్మినార్ లేట్ అయి 9-10కి వస్తుందని అనౌన్స్ చేయటం తో ఉరుకులు పరుగులతో అండర్ వే ద్వారా ఒకటికి వచ్చి ,కాస్త ఊపిరి పీచుకొని ఇడ్లీ పొట్లం విప్పి తిందామని చూశాను .అసలే నాకు ఇడ్లీ ఎలర్జీ .ఎంతోబాగుంటేనే చట్నీ మరీ బాగా ఉంటేనే రెండు తింటే గగనం .నాలుగు చూడగానే తినాలనే యావ సగం చచ్చింది .దానితో నంచుకోవటానికి సా౦బారేమోనని మూట విప్పితే అది నీళ్ళ చట్నీ .దీనితో అస్సలు తినాలనే ధ్యాస పూర్తిగా పోయి ఎట్లాగోఅట్లా ఒక ముప్పాతిక ఇడ్లీ నోట్లో ‘’కుక్కుకొని’’ నీళ్ళు తాగి బిపి మందేసుకోన్నాను .చార్మినార్’’ పొగ’’వదుల్తూ రాత్రి 9-30కు వచ్చి 9-45కు లో బయల్దేరింది . నా కంపార్ట్ మెంట్ లో నాబెర్త్ పై పడుకొని బిస్కెట్లు నాలుగు తిని మంచినీళ్ళు పట్టించి అందరికీ బయల్దేరానని ఫోన్ చేసి బెడ్ పై వాలాను .నిద్ర పడుతుందా చస్తుందా ?అలాగే పక్కమీద దొర్లుతూ రాత్రి 1-15కు బెజవాడ చేరి ,ఆటోకి 40ఇచ్చి 1-30కు బస్ స్టాండ్ చేరి ఒకకాఫీ త్రాగి బస్సులకోసం ఎదురు చూపులతో కాలక్షేపం చేశా .ఇంతలో 2-30కి నెత్తిన పాలుపోసినట్లు పేపర్ వాన్ ఆయనవచ్చి అవనిగడ్డ వెడుతున్నాను వస్తారా అని అడిగితె ‘’వాయస్ ‘’అని యెంత అంటే’’ ఫిఫ్టీ ‘’ అంటే డబుల్ వాయస్ చెప్పి ఎక్కి ఉయ్యూరుకు ,ఇంటికి తెల్లవారుఝామున 3-30కు చేరి, విశ్రమించాను .కనుక ఉదయం 11గంటలకు ఉయ్యూరులో బయల్దేరినవాడిని సుమారు 16గంటలతర్వాత ఉయ్యూరు చేరానన్నమాట .నెల్లూరులో 6-45కి దిగి రాత్రి 9-30కు తిరుగు ప్రయాణం చేసినా సభలో ఉన్నది కేవలం అర్ధగంట మాత్రమే.మొదటిసారి నెల్లూరు గడ్డపై కాలుపెట్టి ఎంతో అనుభూతి పొందుదామనుకొంటే అంతా ఉరుకులూ పరుగులే అయింది .నాతోపాటు మీరూ ఆయాసపడే ఉంటారు కనుక ఆ శ్రమ పోగొట్టటానికి నెల్లూరు కబుర్లు చెబుతాను .
సింహపురి, విక్రమసింహ పురియే నెల్లూరు
1-‘’నెల్లూరు పట్టణానికి తూర్పు సుమషలారామ వీధుల సముద్రము మ్రోగు
దక్షిణమందు కేదార భూములు ,వనలక్ష్మితో ఖగ మృగ రాజి దనరు
పడమట వేదాద్రి భగవాను గుడులు ,సస్య శ్యామలములైన సారభూము
లోత్తరమున ,ఈశ్వరోత్తమా౦గము పైని ,మిన్నేటి కెనయైన పెన్నవాగు
అచట పుట్టిన శిశువైన ఆయుధమను –హయము పైనెక్కి స్వారి చేయంగ జూచు
పెన్న అలల గాలికి ప్రజా వీణ మ్రోగ –లలిత కళ లేచి దేశాంతరముల బ్రాకు ‘’
2-తల్లి చాటు బిడ్డల వోలె ఎల్లప్రజలు –ప్రణవ గాయత్రి గోమాత భక్తి గొలుతు
రట్లె,ధర్మార్ధ కామమోక్షార్ధు లగుచు –హరిహర బ్రహ్మ సేవింతు రహరహంబు .
3-యాగమొనరించి తా సోమయాజి యయ్యె-భారతము పదునైదు పర్వములు వ్రాసి
జ్ఞాన నేత్రమ్ముతో ,తిగకన్నులున్న-తిక్కనకవి బ్రహ్మయె ప్రజా దేవుడయ్యె’’
4-ఖడ్గతిక్కన తో పోరాడగలుగు వాడు –రుద్రమూర్తికి ఈడైన భద్రమూర్తి (బ్రహ్మరుద్రయ్య )
5-తెలుగుగడ్డ లోకానికే వెలుగుగడ్డ –పాడి పంటల సిరులకు పసిడిగడ్డ
మగసిరులు పొంగి పోటెత్తు మగలగడ్డ –తెలుగు తల్లికి ముద్దు బిడ్డలము మనము’’ అని
కవిరాజు ,సాహిత్య సరస్వతి 95ఏళ్ళ వేటపాలెం వాస్తవ్యులు శ్రీ కడెము వెంకటసుబ్బారావు గారు తమ ‘’ఖడ్గ తిక్కన ‘’కావ్యం లో వర్ణించారు.
నెల్లూరు అంటే కవిబ్రహ్మ తిక్కనసోమయాజి రాసిన హరిహరాద్వైత పద్యం స్పురిస్తుంది –
‘’శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవి౦ప ,భ
ద్రాయత మూర్తి యై ,హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూ
పాయ నమశ్శివాయ యని పల్కెడు భక్త జనంబు వైదిక
ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము గొల్చెద నిష్ట సిద్ధికిన్ ‘’
మనుమసిద్ధి రాజుకు ,కాటమరాజు కు మధ్యజరిగిన పుల్లరి యుద్ధం లో శైవ వైష్ణవ తగాదాలు పెచ్చు పెరగటంతో తిక్కన హరిహరాద్వైతాన్ని ప్రచారం చేసి శాంతి చేకూర్చాడు అలాంటి సీమ నెల్లూరు .
నెల్లూరును విక్రమసింహపురి అని సింహపురి అనీ అనేవారు. విక్రమసింహ రాజు పాలించటం వలన మొదటిపేరు, వన్యప్రాంతం కనుక సింహాలు ఎక్కువగా ఉండటం వలన రెండవ పేరు వచ్చింది .నెల్లి అంటే తమిళం లో వరి అని అర్ధం .వరి బాగా పండేప్రాంతం కనుక నెల్లి ఊరు నెల్లూరయింది .నెక్కంటి రెడ్డి అనే భక్తుడికి నెక్కంటి అంటే త్రినేత్రుడైన శివుడు కలలో కనిపించి ‘’నెల్లి చెట్టు ‘’అంటే ఉసిరి చెట్టు కింద ఉన్న లింగాన్ని ప్రతిస్ట చేయమని చెప్పాడుకనుక నెల్లి ఊరు నెల్లూరు అయిందనీ అంటారు .నెల్లూరు ప్రాంతాన్ని మౌర్య ,చేది,శాతవాహన ,కాకతీయ ,పల్లవ ,చోళ ,కళింగ,పాండ్యరాజులు, నవాబులు ,బ్రిటిష్ వారు పాలించారు .క్రీ.పూ.3వ శతాబ్దం లోనే మౌర్యచక్రవర్తి అశోకుని కాలం లో నెల్లూరు భాగం గా ఉండేది .
నెల్లూరులో తల్పగిరి లో శ్రీ తల్పగిరి రంగనాధ దేవాలయం 6వేల ఏళ్ళనాటి అతి ప్రాచీన దేవాలయం .ప్రపంచం లో ఉన్న మూడు రంగనాధ ఆలయాలలో ఇది ఒకటి .మిగిలినవి రెండూ శ్రీరంగం లో ,శ్రీరంగపట్టణం లో ఉన్నాయి .అమ్మవారు రంగనాయకి .నెల్లూరు దగ్గరున్న ఉదయగిరి కోట 3,079అడుగుల ఎత్తైన కోట .ఈ జిల్లాలో పులికాట్ సరస్సు టూరిస్ట్ సెంటర్ .బొగ్గూరు ,బీరపేరు ,పెన్నేరు నదుల సంగమం పవిత్రమైనది. ఇక్కడి చోళ దేవాలయం గొప్ప దర్శనీయ పుణ్య క్షేత్రం .ఎవరైనా స్త్రీ కాస్త నాజూగ్గా ఉంటె ‘’నెల్లూరి నెరజాణ’’అనటం మనకు తెలుసు .నెల్లూరు వంకసన్నాల బియ్యంచాలా ప్రసిద్ధి చెందినవి .వీటిని ‘’మొలగొలుకులు ‘’అంటారని జ్ఞాపకం .
ఆధునికంగా శ్రీహరికోట రాకెట్ కేంద్రం జగత్ ప్రసిద్ధం .నెల్లూరు జిల్లా ప్రసిద్ధులు శ్రీ పొట్టి శ్రీరాములు బెజవాడ గోపాలరెడ్డి పుచ్చలపల్లి సుందరయ్య వెంకయ్యనాయుడు ,రమణారెడ్డి ,సింగీతం శ్రీనివాసరావు ,ఆచార్య ఆత్రేయ ,బాలు ,వాణిశ్రీ ,పి.పుల్లయ్య ,నేదురుమిల్లి జనార్దనరెడ్డి ,నారాయణ కాలేజీల పొంగులేటి నారాయణ మొదలైనవారు .పెంచలకోన నరసింహస్వామి ఆంజనేయ స్వామి మూలస్థానేశ్వర దేవాలయాలు సుప్రసిద్ధమైనవి .ఆనాడేకాదు ఈనాడు కూడా నెల్లూరు గొప్ప విద్యా వైజ్ఞానిక ,సాంస్కృతిక కేంద్రమే .
నెల్లూరు ను గూగుల్ ‘’ Nellore –an ancient indian breed of large steel –gray to almost white cattle used chiefly for heavy draft and introduced in many warm regions for cross breading with European cattle ‘’అని నిర్వచించింది .
ఇంతటి ప్రసిద్ధ విశేషమైన కేంద్రం అయిన నెల్లూరు లో కేవలం మూడు గంటలు మాత్రమె ఉండటం ,అందునా సాహితీ కార్యక్రమం లో అరగంతమాత్రమే గడపటం అసంతృప్తిగా ఉన్నది .
రేపు శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-4-19-ఉయ్యూరు
–
–