అగ్నికి ఆహుతి కాబోయి చేతికి చిక్కిన శ్రీ కోట పేరిశాస్త్రిగారి శ్రీ ఆనందేశ్వర శతకం

అగ్నికి ఆహుతి కాబోయి చేతికి చిక్కిన శ్రీ కోట పేరిశాస్త్రిగారి శ్రీ ఆనందేశ్వర శతకం

నిన్న13-4-19 శనివారం ఉదయం  మా శ్రీమతి వేడినీళ్ళు కోసం దొడ్లో కాగుపెట్టి పాత చిత్తు కాగితాలతో నిప్పు అంటించ బోతుంటే అకస్మాత్తుగా అందులో ఒకచిన్న,బాగానలిగిన,దాదాపు కాగితాలు ఊడిపోయిన   పుస్తకం కనిపించి పొయ్యిలో పెట్టటానికి మనస్కరించక నన్ను పిలిచి  నాచేతికి అందించింది .తీరా చూస్తే, అది శ్రీ కోట పేరిశాస్త్రి కవి గారు రాసిన ‘’శ్రీ ఆన౦దేశ్వర శతకం’’.అది నాదగ్గరకు ఎలావచ్చిందో వచ్చి౦ది పో నా చిత్తుకాగితాల లోకి ఎలా ఎప్పుడు చేరిందో ,ఇంతకాలం నాకు ఎందుకు కనిపించలేదో ఎంత బుర్రబద్దలు కొట్టుకొన్నా నాకు అర్ధం కాలేదు .ఏమైతేనేమి నాకొక పెన్నిధి దొరికి౦దన్నపరమానందం కలిగింది .కళ్ళకద్దుకొని నిన్నల్లా మా దేవాలయం లో శ్రీరామనవమి ,శ్రీ సీతారామకల్యాణం హడావిడిలో తీరిక దొరకక  ,ఇవాళ పొద్దున్న తీరికగా దాన్ని తీసి ఊడిపోయిన కాగితాలను అంటించి, శ్రద్ధగా చదివి మురిసిపోయాను .102పద్యాలున్న 18పేజీల శతకం ఇది .బహుశా దీనిని మా కోట గురువరేణ్యులు కీ.శే.బ్రాహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రిగారి కుమారులు అంటే మా గురు పుత్రులెవరైనా కాని లేక వారి కజిన్ శ్రీ కోట సీతారామ శాస్త్రి గారు ఇచ్చి ఉండవచ్చు నేమో అనిపించింది .కవిత్వం లోకి వెళ్లేముందు ఆ శతకం ఎలా,ఎక్కడ  ఆవిర్భవించిందో వివరాలు తెలుసుకొందాం .

కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర బేతవోలు లో ఉన్న శ్రీ ఆనందేశ్వర మహాశివునిపై శ్రీ కోట పేరిశాస్త్రి గారు శార్దూల పద్యరత్నాలతో ,’’ఆనందేశ్వర !బేతవోల్పుర విహారా !చంద్ర రేఖాధరా ‘’అన్న మకుటంతో  రచించిన శతకం .రచనాకాలం 25-4-1989.శతకాన్ని కవిగారుపరమహంస పరివ్రాజకాచార్య  శ్రీ నిర్వికల్పానంద భారతీ స్వామి వారి గుణ గరిస్టత  ను ప్రశంసించారు  .స్వామివారిని ‘’పరమార్ధ భావ విహరణ –పరి శోభితులౌచు నన్ గృ  పామల దృష్టిన్ –బరికి౦చుచున్నవారలు – చరితార్ధునిగా దలంతు సంయమి  చంద్రా “’అని కీర్తించారు . స్వామివారు –‘’శమదమాది కఠోరనిష్టా గరిష్ట!-సుస్థిర జ్ఞాన వైరాగ్య శోభితాత్మ !భవ్య నిర్వికల్పానంద భారతీ ,వి –భాసమాన యతీంద్ర !తుభ్యం నమోస్తు ‘’అని నిండుమనసుతో స్తుతించి,అనన్య  గురుభక్తి ప్రకటించి ధన్యులైనారు శిష్యవరేణ్యులు శాస్త్రిగారు .ఈ శతక కృతిని శాస్త్రిగారు పరమహంస పరివ్రాజకాచార్య అనంత శ్రీ విభూషిత శ్రీ అద్వయానంద .భారతీ స్వామి వారి పాదుకలకు అంకితమిచ్చి ధన్యులయ్యారు.’’అల్పుని కృతి అని మనసులో తలచకుండా సమ్మోదం తెలిపినందుకు ‘’కృతజ్ఞతలు చెప్పుకొన్నారు .అంకితం పుచ్చుకోన్నవారు –‘’సరస సాహిత్య విజ్ఞాన సారహృదయ –అఖిల వేదాంత విద్యారహస్య వేది-‘’ఐన శ్రీఅద్వయానంద భారతీ స్వామి వారు .ఇద్దరు మహాస్వాముల కరుణాకటాక్షాలు పుష్కలంగా పొందిన పేరి శాస్త్రికవి  ధన్యతములు .అందుకే’’ సమర్పణ ‘’శార్దూల పద్య౦గా అద్భుతంగా చెప్పారు పేరి శాస్త్రిగారు –

‘’అర్దే౦దూజ్వల రత్న రంజిత కిరీటా !భవ్య సద్భక్తి భా –వార్ధ ప్రోత సుశబ్ద పద్య సుమ మాల్యం బిద్ది గైకొ గదే

శార్దూలాజిన ధారణంబు తదపేక్షా దృష్టి గా నెంచి యీ-శార్దూలంబుల నర్చగానిడితి ఈశా నన్ గటాక్షి౦పవే ‘’అని శార్దూల నైవేద్యం పెట్టారు చాకచక్యంగా .

శ్రీ అద్వాయానంద భారతీ స్వామి  ‘’సంమోదము ‘’అనే ఉపోద్ఘాత వ్యాసం లో మనకు కావాల్సిన విషయాలు గ్రాంధికంగా తెలియజేశారు. నేను దాన్ని వ్యావహారికంగా మీకు అందజేస్తున్నాను .’’నేడు గుడివాడ పట్నం లో ఒదిగిన బేతవోలు ప్రాచీనమైనది .  ఆపేరును బట్టే  అది చాలాపురాతనమైన ప్రదేశం అని తెలుస్తోంది .ఒకప్పుడు ఇది జైన స్థావరం .గుడివాడ పూర్వం ‘’గృధ్ర వాక’’మండలానికి ముఖ్యస్థానమై జైన,బౌద్ధాలకు ఆలవాలమై ఉండేది .ఆ అవశేషాలు ఇప్పటికీ అక్కడున్నాయి .

బేతవోలులోని శివుడు శ్రీ ఆన౦దేశ్వరుడు  .ఆలయం చాలా ప్రాచీనమైనది .శిదిలమైపోతే  కృష్ణాజిల్లా గురజ జమీందారు పునః ప్రతిష్ట చేసి ఆలయం నిర్మించారు . ఈ ఆన౦దేశ్వరుడు  తైత్తిరీయ ఆనందవల్లి లో వర్ణించబడిన బ్రహ్మానంద మూర్తి .చిచ్చంద్ర రేఖా ధరుడు .త్రికాలారాధ్యుడైన సత్యమూర్తి .బహుజన్మ సంస్కారుడైన ఏ కవి అయినా ఆయన ఆకర్షణకు లోనౌతాడు .కవి పేరిశాస్త్రిగారు మన హృదయాలనిండా ఆనందం నింపాడు .శతకాన్ని గంగా నిర్ఝర సదృశ దారాళవాగ్ధాటితో పలికాడు .ఆనందేశ్వరుడికి కవితా పీయూష (అమృత )ధారాభిషేకం చేశాడు.కవి చిన్ననాటి నుంచి శ్రీ విశ్వనాథ కవితా భావుకుడు .ప్రౌఢ కవితాప్రియుడు .శతకం అంతా ప్రౌఢ సరస్వతీ విన్యాసమే దర్శనమిస్తుంది .సమాసకల్పన లో ఒక ప్రత్యేకత ,ఠీవి, శైలిలో ఓజస్సు ,చమత్కారంతో ఉన్న ప్రసాదగుణ౦ ,ఔచిత్యంతో కూడిన సంబోధనలు ,ఆ ,సంబోధనలో  ఒక మార్మికత, వాక్యాలలో వేదాంత స్పూర్తి,ఆగని స్వచ్చకవితా ధార ,బహు స్పష్టమైన శబ్దాదికారం రచనను దీప్తిమంతం చేసింది .

శాస్త్రిగారితో నాకు యాభై ఏళ్ళుగా పరిచయం ఉంది .అయన కల్మషం ఎరుగని చిత్తశుద్ధికలవాడు .సజ్జనుడు .నిగూఢ సాధకుడుగానే ఉండిపోయాడు .రచనలు చేసినా వెల్లడించకుండా నే ఉండిపోయిన నిర్లిప్తుడు ‘’అని కవి పేరిశాస్త్రి గారి గురించి శ్రీ అద్వయానందభారతీ స్వామి తెలియజేశారు .కవిగారి ఇతర రచనలు గురించి మనకేమీ తెలియదు .కానీ చివరిదైన 102శార్దూలపద్యం లో శాస్త్రిగారు తనగురించి కొంత చెప్పుకొన్నారు స్వామికి నివేదనగా –

‘’నేనీ దాసుడ ,కోట వంశజుడ ,కౌ౦డిన్యాఖ్య గోత్రుండ,నో –ప్రాణేశా ! పెదపున్నయాఖ్యునకు ,ధర్మాచార సంపంన్న,దీ-క్షా నిర్నిద్ర సరస్వతీ సతికి నిం గారాము పుత్రుండ ,నీ

ధ్యానాసక్తుడ పేరి శాస్త్రి యభి దుం డర్పించు నర్చా శతం –బానందేశ్వర !బేతవోల్పుర విహారా !చంద్ర రేఖాధరా ‘’

ఇంతటి అద్భుత శతకం నా చేతిలో పడటం నా అదృష్టం .శతకం లోని కవితా విశేషాలు తరువాత తెలియజేస్తాను .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-4-19-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.