‘’స్త్రీ శక్తి ‘’పై
సరసభారతి 31-3-19శ్రీ వికారి ఉగాది వేడుకలలో
నిర్వహించిన కవిసమ్మేళన కవితలు -3
విన్నపం –వచన కవితలలో ఎక్కడైనా కవిత పలచబడిందని ,పునరుక్తమైనదని నేను భావించిన చోట్ల,విషయానికి సంబంధం లేని చోట్ల మార్పులు చేసి ,ధారకొనసాగి ,చిక్కబడేట్లు చేశాను .నా సాహసాన్ని మన్నించండి –దుర్గాప్రసాద్
20-శ్రీ తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు –విజయవాడ -9703776650
ప్రబోధాత్మక ,ప్రమోదాత్మక,ప్రణయాత్మక ప్రమాదా౦తక శక్తి -ప్రమద
1-ప్రబోధాత్మక
-సీ-గార్గేయి ,మైత్రేయి ,కాత్యాయని వేద –మంత్రాల ద్రస్టలౌ మౌని వరులు
ఆధ్యాత్మ విద్యల౦దగణిత ప్రజ్ఞతో –వేద వాదములందు విజయులైరి
వేద కాలము లోనె విజ్ఞానఖనులౌచు –బ్రహ్మవాదినులైరి ప్రాకటముగ
తొలి విద్యలన్ వారు తులలేని పారగుల్ –మార్గ దర్శులు వారు మహిళలకును
అగ్ర పీఠాధి మూర్తులై అతివలపుడు –పూరుషులమించి పొందిరి పూజాలెన్నొ
తిరిగి చూడుము మానినీ !ధీరమతిని-గౌరవ స్థాననమిచ్చెను కాలమెపుడొ.
2-ప్రమోదాత్మక శక్తి
క్యూరీపొందెను నోబులిద్ధరిణి వోహో రెండు పర్యాయముల్ –కారే రాణులు ,శాస్త్ర వేత్తలును ,సాకారాత్మ రుద్రాణులై
పోరంజాలెడు ఝాన్సి రాణి తెగువన్ పోనాడినా౦గ్లేయులన్-పారంజాలిన కానిపించెదరుగా ప్రాముఖ్య రంగంబులన్ .
3 –ప్రణయాత్మక శక్తి
సీ- స్త్రీశక్తి లేకున్నశివుడైన కదలడు-ప్రణయమే ప్రణవమౌ ప్రాకృతంబు
కైకతో ప్రణయమే కీడయ్యె దశరధు-నికిని పుత్ర శోకాన నిధానమొందె
ముంతాజ్ ప్రణయమే మోహన శిల్పమై –పండువెన్నెల వోలెనిండి వెల్గు
గాలిబ్బు గళములో కమనీయ కావ్యము –సాకీలతా హస్త చషకమయ్యె
మేఘుడందించు ప్రణయంబు మినుకు లవియె-పద్మ పత్రాల దుష్యంతు ప్రణయ లేఖ
విక్రమాలి౦గితోర్వశీ విహ్వలంబు –ప్రణయ శక్తి కి నీయవి పరమపదులు
4-ప్రమాదా౦తక శక్తి
సీ-సావిత్రి భక్తితో ,సత్యవంతుని మృత్యు –పాశమ్ము తెగదెంపి భార్త గాచె
ఇందిరాగాంధీ నాడి౦డియా పార్శ్వంపు –తూర్పు పాకిస్తాను వేర్పరించి
పాకు బలమును తా బలహీన పరచి –పెట్రేగు పాకుల పీచమణచె
ఆశ్రయ రహితుల కాశ్రయమిచ్చెను –థెరిసమాతయె గదా దివ్యమాత
తనదు బిడ్డలకే ప్రమాదమ్ము రాక -రెప్ప యగు చుండు తల్లియ గొప్ప రక్ష
సత్వ తమములు ,రజమును స్త్రీత్వ మగుట –నెల్ల శక్తుల కామెయేమూలశక్తి .
21-శ్రీ మేకల లక్ష్మీ భాస్కరరావు నాయుడు –బెంగుళూరు
గీతాసారం శాంతికి మార్గం
ప్రయత్నం లో లోపం చేయకు
ఫలితం దైవా ధీనమని భావించు
లేనిదానికి బాధవద్దు –ఉన్నదే ముద్దు
కాలం అత్యంత విలువైంది
మంచిపనులను వాయిదా వేయవద్దు
కోపం ఆవేశం వదిలి ఉపకార గుణం పెంచుకో
సకలప్రాణి సేవ సదా భగవానుని సేవ యే అని గ్రహించు
స్త్రీ శక్తి గుర్తించి కీర్తించి యశము పొందు
తరించటానికి ఇంతకంటే సన్మార్గమే
లేదని వేదాలు చెప్పాయి వేమన్నా చెప్పాడు.
21-శ్రీ శిస్ఠు సత్యరాజేష్ –అమలాపురం -7674072583
స్త్రీ శక్తి
స్త్రీ అంటే సహనం –స్త్రీ అంటే ప్రేమ
స్త్రీ అంటే త్యాగం ,ప్రేరణ ,శక్తి స్వరూపం
పురుషుని విజయానికి వెన్నెముక
మగజాతి కీర్తి శిఖరాలకు మూలము స్త్రీ కాదా !
చత్రపతికి, థామస్ లకు తల్లే కదా మొదటి గురువు
తల్లి యశోధర అడ్డు చెబితే
గౌతముడు బుద్ధడయేవాడా !
బాలశ౦రుని తల్లి సన్యసించ వద్దంటే
శంకరాచార్య జగద్గురువయ్యేవాడా !
యశోద ,లక్ష్మీబాయ్ ,రుద్రమ దేవి ,ఇందిరలు
శక్తి స్వరూపులై జయజయ ధ్వానాలు అందుకోలేదా ?
స్త్రీ మర్మాంగం చూసి చొల్లు కార్చకు
అదే నీ జన్మస్థానమని ఎరుక కలిగి ఉండు .
22-శ్రీ చలపాక ప్రకాష్ –విజయ వాడ -9247475975
నూతన ఉషస్సులు
కొత్త పల్లకి కొంగ్రొత్త రూపం లో ముస్తాబవుతోంది
కొత్తపల్లకి అంటే కొత్త సంవత్సరమే కదా .
పాత తరాన్నంతా –పాతకాలం లోకి నెట్టేసి
పాతరోజుల్ని గోల్డెన్ డేస్ గా
చరిత్ర పుటల్లో కెక్కి౦చేసే
కొంగ్రొత్త పల్లకీ సిద్ధమై పోతోంది
కొత్త తెలుగు వత్సరమై మనము౦గిళ్ళ లోకి
కొత్త కాంతులు తీసుకు వచ్చేస్తోంది .
కొత్త నోట్లకు మల్లే సరికొత్త సువాసనలతో
కొత్త డైరీల్లాగా అక్షరాలూ లిఖి౦చు కోవటానికి
నూతన ఉషోదయ కాంతుల ఉషస్సు లను తెస్తోంది
హుషారుగొలిపే –యువత ఆనంద డోలికలలో
చిన్నారి మోములా బోసినవ్వుల
కొత్త కేరింతలతో వచ్చేస్తోంది
మహిళాశక్తి మహితాన్వితమని
చాటి చెబుతూ కొత్త ఏడాది వస్తోంది
నూతన హుషారుకు సరికొత్త స్రవంతి తెస్తోంది .
23-శ్రీమునగంటి వేంకట రామాచార్యులు –విజయవాడ -9618475140
స్త్రీలు జీవన శ్రీలు
ప్రాణాంతక ప్రసవ వేదన
పడక ప్రపంచం లో బిడ్డ బతికి బట్ట కడుతుంది
అమ్మ ఆలనా పాలన పొందనివారు
స్తన్యం గ్రోలి గుజ్జనగూళ్ళు తిని పెరుగనివారు అరుదు
ఆదిగురువు ,జీవనాధార వధువు ఆమె
జీవన వృత్తం లో స్త్రీ కేంద్ర బిందువు
బాధ్యతా భద్రతలనందించే పురుషుడు పరిధి
అతిక్రమించనిదే కదా స్థిరబిందువు
కుటుంబ కల్ప వల్లి ,సహాయ సహకారాలందించే పాలవెల్లి .
24-శ్రీ కందికొండ రవి కిరణ్ –విజయవాడ -9491298990
శక్తిమంత
నూతన రూపం దాల్చిన ప్రకృతే స్త్రీ
అసమాన ప్రవీణ ,అమిత మనోబల
లాలనా మురిపాలలో లేరు ఆమెకు సాటి
సౌందర్య దయ ధైర్యాల నెలవు
చంద్రమతీ రుద్రమ నారీ తానే .
పురుషులు గెలువలేని సమ్మోహన శక్తి స్త్రీ
ఆడటం ఆడించటం లో బహు నేర్పరి
వంశ వృక్ష చివురులనిచ్చే పుడమి ‘
క్షమ,శౌర్యాలను రెండు కళ్ళలో చూపే వాల్గంటి .
మనసిస్తే ప్రేయసి ,మనసు నొస్తే చేస్తుంది మసి.
అతడు దీపం ఆమె ప్రకాశం
ఆజ్యంకై వేచిఉండే అగ్ని కణం
మగాడి మనుగడకు తీపి చెరుకుగడ
అతడికి ఎన్ని ఉన్నా
ఆమె చెంత లేకుంటే అతని విలువ సున్నా.
అన్నిటా విజయసోపానాలు అధిష్టించే మగువా!
స్వీయ రక్షణలో కూడా చూపించు తెగువ
ఇక గెలుపు అన్నిటా నీదే ‘’యుద్ధేషు విజయిష్యసి’’.
25-శ్రీ మైనేపల్లి సుబ్రహ్మణ్యం –ఆకునూరు -9290995112
ఆదిపరాశక్తి
మానవ శక్తి ఆదిపరాశక్తి
శక్తిలేని విప్లవం రాణించదు
శ్రామిక ప్రచండ శక్తి రాజకీయ ప్రభావ శక్తి
వరాలకు లొంగి అస్తిత్వం కోల్పోకు
స్త్రీ ఒక అద్భుతవరమైన ప్రకృతి
ఆమె ప్రసన్న ఐతే నీకు శుభం
శోకిస్తే నీకు మిగిలేది పతనం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-4-19-ఉయ్యూరు