‘’స్త్రీ శక్తి ‘’పై
సరసభారతి 31-3-19శ్రీ వికారి ఉగాది వేడుకలలో
నిర్వహించిన కవిసమ్మేళన కవితలు -2
విన్నపం –వచన కవితలలో ఎక్కడైనా కవిత పలచబడిందని ,పునరుక్తమైనదని నేను భావించిన చోట్ల మార్పులు చేసి ,ధారకొనసాగి ,చిక్కబడేట్లు చేశాను .నా సాహసాన్ని మన్నించండి –దుర్గాప్రసాద్
11-శ్రీమతి సామినేని శైలజ –విజయవాడ -8247753633
స్త్రీ శక్తి
రాగ సరాగాల లలనగా –రసమయ జగత్తులో రాధావిహారిగా
సహనమే కవచంగా ,స్వలాభాపేక్ష లేని త్యాగమయిగా
సంస్కృతీ సాంప్రదాయాలే పాపిట సిందూరం గా
సాగే సరసిజ ,ప్రణయరాగ పయోనిధి.
భాషణ భూషణాలతో ,స్వజనులభారం వహించే సాత్విక
బంధాల అనుబంధాల అత్మీయతాఝరి
బహుముఖప్రజ్ఞాశాలి
సేవా సుగంధాలు వెదజల్లే త్యాగమూర్తి
పరిస్థితులనర్ధం చేసుకొని ఒదిగే శాంతమూర్తి అన్నపూర్ణ
వీరపత్నిగా వీరమాతగా జేజేలందుకొనే వీరనారీ శిరోమణి
సమతా మమతా మందారమాల మగువా !వందనం అభివందనం .
12-శ్రీమతి మాచిరాజు మీనాకుమారి –విజయవాడ -9246418222
స్త్రీ స్వేచ్ఛ
అక్షరాలూ నేర్వని అనాదికాలాన –లింగభేదం లేశమైనా లేని
ఆకలీ అవసరాల కాలాననే
ప్రకృతి లో తెలియని స్థితి లో అసమానతలు
విజ్ఞత పెరిగి నారగత నేర్చిన తరుణాన
భావాల మేళవింపు సాగిన సంస్కృతిలో
దృష్టిమారి గురితప్పిన ఆలోచనల పరిపాటిలో
స్త్రీ పురుష భేదాల ఆకాశ –భూ సామ్యపు తూకం లో
మేటలు వేసుకొని గట్టిపడిన
కరడుగట్టిన కరుగని భావాలు
ఆదర్శాలూ ,అవకాశాలూ అలాఅలా
ఆవరించి ఉన్నా కానరాని కట్టడాల తెరలూ పొరలూ
చెదురు మదురుగా మించిన సాహిత్యాల ,పౌరుషాల
పరిఢవిల్లిన పడతు లెందరో
అయినా బెదిరింపులు ,కరగని భావాలఅడ్డగొడలే
సాంప్రదాయ అడుగులనుండి
విజ్ఞానపు అంచుల ప్రయాణం లో
వెల్లు వెత్తిన విద్యా విప్లవజ్వాల
ఎనలేని విజయ పరంపరలో నేటి ముదిత
నేలవిడిచి సాముకాని ప్రయత్నమేదీ ?
ప్రమాదంలోనైనా ప్రమోదం లోనైనా
మనో వికాసాల మందహాసమే
స్వేచ్ఛ కావాలికానీ –అధఃపతన మార్గం కారాదు స్త్రీ స్వేచ్ఛ’’.
13-శ్రీమతి పుట్టి నాగలక్ష్మి –గుడివాడ -9849454660
అమ్మాయిలూ !పారాహుషార్
నాడు
గడ్డివాములు ,పొలాలు తోటలు
ఎడ్లబళ్ళు ,జట్కాలు ఆసాముల లోగిళ్ళు
నిన్న
స్కూళ్ళు కాలేజీలు యూని వర్సిటీలు
గెస్ట్ హౌసులు ,గోప్పోళ్ళ ఇళ్ళు
నేడు
ట్రాక్టర్లు ఆటోలు మినీవాన్లు
కార్లు బస్సులు రైళ్ళు
కావేవీ అత్యాచారాల కనర్హం .
కాశ్మీరు నుండి కన్యాకుమారిదాకా
పోర్బందరు నుండి ఈటా నగరం దాకా
ఢిల్లీ ‘’నిర్భయ ‘’చట్టం అమలౌతున్నా
అభాగ్యనగర అభయులకు ఆలవాలం
అనూహ్యలు ,అసిఫాలు నెలల పసికందులకూ
రక్షణ ఎండమావే !
ద్రౌపదీ మానస రక్షకుడు కృష్ణుడుఎక్కడ ?
కత్తీ,కరాటే ,కారం కు౦కుమలలో
పరకాయ ప్రవేశం చేశాడట
మీ మాన ప్రాణ రక్షణకోసం
ఆయన తోడు మరువకండి
అమ్మాయిలూ పారాహుషార్ .
14-శ్రీమతి గుడిపూడి రాధికారాణి-మచిలీ పట్నం -9494942583
అసలేమనుకున్నావ్ !
ఆడ ననుకున్నావా ?
ఆ మండిపాటు మాడు కెక్కితే
వణికి మాయం అవటానికి ?
చీడ ననుకున్నావా
బూతు పదాలు ప్రయోగించి
తిరిగి తలెత్తుకోకుండా చేయటానికి ?
క్రీడ ననుకున్నావా
తోచిన ప్రయోగాలతో
నన్ను శిధిలం చేయటానికి ?
పీడ ననుకున్నావా
కిరోసిన్ ,యాసిడ్ లతో
అంతం చేయటానికి ,చేయబూనడానికి .
గోడ నను కున్నావా
నీ అవినీతి కోటను
కూలేందుకు దాచేందుకు .
ఆడబొమ్మ ననుకున్నావా
ఆదమరచి ఆబగా ఆడి
నలిపి నాశనం చేసేందుకు
ఒరే!నేను నిన్నుకన్న అమ్మనురా
పసిపాపలో కూడా అమ్మనే చూడు
తప్పు చేశావని తెలిస్తే
నేను తల్లినైనా ,నీ పాలిట‘’తలారి ‘’నౌతానని మర్చిపోకు .
15-కుమారి మాదిరాజు బిందు దత్తశ్రీ –ఉయ్యూరు -8686609670
ముచ్చుటగా మూడుమాటలు
1-స్త్రీ —-శక్తి స్వరూపం
స్త్రీ —సృష్టికి మూలం
స్త్రీ – జన్మ అపురూపం .
2-సృష్టిలో సగభాగం స్త్రీ
పరమశివుని లో అర్ధభాగం స్త్రీ
నేడు అన్నిటిలో అధికభాగం స్త్రీ .
3-ఓర్పుకు నేర్పు తోడైతే మగువ
సమస్యల పోరాటం లో చూపుతుంది తెగువ
ఇంటా బయటా బాధ్యతలబరువు మోసే పృథ్వి
16-డా.శ్రీమతి గురజాడ రాజరాజేశ్వరి –మచిలీ పట్నం -9440709939
స్త్రీ శక్తి
ప్రకృతి.(స్త్రీ )పురుష సంయమనం –ఈప్రపంచం
బాలగా బాలికగా మాతగా గృహిణి గా
పంచుతుంది తన మమకారపు తీపి దనం
నీతి నిజాయితీ ధర్మ న్యాయాల నాలుగు పాదాల
నడిపించాలనే తాపత్రయంతో నడుపుతుంది సంసారం
స్త్రీ ఆది శక్తి ,పరాశక్తి ,ప్రకృతి శక్తి
త్రిశక్తి రూపంగా తానందిస్తుంది ప్రేమను మాతృరూపంగా
ఆ పరమేశ్వరుడే తనబిడ్డ రూపంగా జన్మించాడని
భావించి లాలించి బుజ్జగించి ముద్దాడుతుంది
బుద్ధులు చెప్పి ,బాధ్యత నేర్పుతుంది .
‘’గృహిణీ గృహ ముచ్యతే ‘’
అంటే ,ఇంటికి ఇల్లాలికి అన్యోన్య సంబంధం ‘’స్త్రీ శక్తి ‘’
ఇంటికి మూలస్తంభం ,ప్రపంచానికి బీజం స్త్రీశక్తి యే
కుటుంబ వంశాభి వృద్ధికి కారణ శక్తి ఆమె
ఎక్కడ స్త్రీలు గౌరవి౦ప బడుటారో
అక్కడ దేవతలుంటారన్నది సార్వకాలీన సత్యం .
17-శ్రీమతి తుమ్మల స్నిగ్ధమాధవి –విజయవాడ -7337596711
స్త్రీ శక్తి
సృష్టిని మోసే ,అనావృస్టి భరించే ధరణి లా
కన్నసుతులే కాలదన్నినా
అవమానాలు భరించి
ని౦డు కుండలా ప్రశాంతంగా నిలుస్తుంది
ఇంట్లో బయటా అన్ని బాధ్యతలు
తానేవహించి సమర్ధంగా నడుపుతుంది .
ప్రకృతిలా పులకించి పూవులా పలకరించి
‘కాయగా ఆకర్షించి పండుగా ఫలిస్తుంది
ప్రేమ కరుణా మయ దివ్య మూర్తి స్త్రీ
పున్నమి వెన్నెల పంచే అమృతమూర్తి స్త్రీ .
18-శ్రీమతి ఎస్.విజయ దుర్గాభవాని-విజయవాడ -9652262157
ప్రకృతి శక్తి స్త్రీ
స్త్రీశక్తి కి మారుపేరు ప్రకృతి
ప్రకృతి లేకుంటే ప్రపంచానికి లేదు ఆకృతి
పుట్టినింటికి మేట్టినింటికీ వన్నె తెచ్చేది మహిళ
ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా
ఆమె ది అజేయ మహిత శక్తి .
19-శ్రీమతి పెళ్లూరిశేషుకుమారి –నెప్పల్లె-7013027633
స్త్రీ
సృష్టిని లయింపజేసేది స్త్రీ
సహనం ,నిస్వార్ధ సేవ సదవగాహన సమయస్పూర్తి
ఆభరణాలుగా వెలిగే జ్యోతి స్వరూపిణి
జీవన శైలిలో వైవిధ్యానికి ,
అంతరాలను పెంచే మధుకలశం స్త్రీ
సామూహిక స్త్రీ శక్తి ని ఏ శక్తీ
ఎదిరించలేదని నిరూపిద్దాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-4-19-ఉయ్యూరు
—