అమెరికా జాజ్ సంగీత రాణి–ఎల్లా ఫిట్జరాల్డ్ -గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ మహిళా వెబ్ మాసపత్రిక -ఏప్రిల్

అమెరికా జాజ్ సంగీత రాణి–ఎల్లా ఫిట్జరాల్డ్ -గబ్బిట దుర్గా ప్రసాద్

సంగీత నృత్యాలపై అభిలాష పాటకు ప్రథమ మహిళగా ,జాజ్ సంగీత రాణి గా ,లేడీ ఎల్లా గా అందరూ ఆప్యాయంగా పిలిచే ఎల్లా ఫిట్జ రాల్డ్ 1917 ఏప్రిల్ 25 అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం లో న్యు పోర్ట్ న్యూస్ లో జన్మించింది .తండ్రి విలియం ఫిట్జరాల్డ్ .తల్లి టె౦పీ హెన్రి .ఆరవ ఏటనే స్కూల్ లో చేరి చదువులో అద్వితీయురాలైంది .1929లో బెంజమిన్ ఫ్రాన్సిస్ స్కూల్ లో చేరే లోపు చాలా స్కూళ్ళలో చదివింది .మూడవగ్రేడ్ లో ఉండగానే డాన్స్ పై విపరీతమైన మక్కువ ఏర్పడింది .మెథడిస్ట్ చర్చికి సంబందీక కుటుంబం కనుక తరచుగా చర్చికి వెళ్లి ప్రార్ధనలలో పాల్గొనేది .ఆమెలోని సంగీతాభిలాషకు చర్చి వారు మెచ్చి ఆర్ధిక సాయం తో ప్రోత్సహించారు .పియనోకూడా నేర్చుకొని విద్వత్తు సంపాదించింది .

జాజ్ సంగీత౦ లో ప్రవేశం:

 అప్పటి ప్రముఖ జాజ్ సంగీత గాయకులు లూయీ ఆర్మ్ స్ట్రాంగ్ ,బింగ్ క్రాస్బి, బాస్వేల్ సిస్టర్స్ రికార్డ్ లను అత్యంత శ్రద్ధగా వినేది .వీరిలో బాగా పేరుపొందిన’’ కొన్నీ బాస్వేల్ ‘’అనే ఆమె సంగీత రికార్డ్ లను తల్లి తీసుకొచ్చి కూతురి కిచ్చేది. అవి వింటూ అచ్చం బాస్వేల్ లాగా పాడటం ప్రాక్టీస్ చేసింది .1932లో ఆమెతల్లి కారు ప్రమాదం లో చనిపోయింది .తర్వాత హార్లెం వెళ్లి ఆంట్ ఇంట్లో ఉన్నది .చదువు పై శ్రద్ధతగ్గి , బడి ఎగగొట్టటం తో గ్రేడ్ లు తగ్గాయి .కొన్ని విచిత్ర పరిస్థితులలో ఆమె ను అధికారులు బ్రాంక్స్ లోని రివర్ డేల్ లో ఉన్న కలర్డ్ ఆర్ఫాన్ అసిలియం లో చేర్చారు .ఇక్కడ రద్దీ ఎక్కువ అవటం తో తర్వాత న్యు యార్క్ లోని హడ్సన్ లో ఉన్న గర్ల్స్ ట్రెయినింగ్ స్కూల్ లో చేర్చారు .ఇక్కడ కూడా ఉండలేక పారిపోయింది .చివరికి ఉండటానికి జానెడు చోటు కూడా లేకపోయింది ఆమెకు .

వరించి వచ్చిన అదృష్టం: 

1933-34కాలం లో హార్లెం వీధులలో పాటలు పాడుతూ వచ్చిన డబ్బుతో జీవించింది .1934 నవంబర్ 21న ఆమె 17వ ఏట అమెచ్యూర్ దియేటర్ లో అపోలో నైట్స్ లో పాడే అదృష్టం అనుకోకు౦డా వచ్చి తలుపు తట్టింది .స్టేజి మీద డాన్స్ చేయాలను కొన్న కల చెదిరి అక్కడి స్థానిక డాన్సర్లు ఎడ్వర్డ్ సిస్టర్స్ అభ్యంతరం చెప్పటం తో, పాడటానికి అవకాశం లభించింది .తన సత్తా చాటి, కొన్నీ బాస్వేల్ లాగా అద్భుతంగా ‘’జూడీ ‘’ ,’’ది ఆబ్జెక్ట్ ఆఫ్ మై ఎఫెక్షన్ ‘’ పాటలు పాడి ఫస్ట్ ప్రైజ్ పొందింది .ఒక వారం రోజులు పాడే అవకాశం ఉన్నా యాజమాన్యం ఆమెకు అవకాశం ఇవ్వలేదు .

జాజ్ సంగీత రాణి:

1935 ఫిబ్రవరి లో హార్లెం ఒపెరాహౌస్ లో టైనీ బ్రాడ్ షా బృందంతో ఒకవారం పాడే అవకాశం వచ్చి తన సమర్ధత రుజువు చేసుకొన్నది .తర్వాత ఏల్ యూని వర్సిటి లో పాడే అవకాశా మిస్తామన్నారు .బృందగానం లో పాల్గొంటూ సవాయ్ బాల్ రూమ్ లో అనేక హిట్ సాంగ్స్ పాడింది .కాని 1938లో నర్సరీ రైమ్ వంటి ‘’ఎ టిస్కేట్- ఎ టాస్కెట్’’పాటతో జనం లో విపరీతమైన క్రేజు పాప్యులారిటీ పొందింది .ఆపాటను ఇ౦కరితో కలిసి ఆమే రాసింది.రేడియో లో గొప్ప హిట్ సాంగ్ గా, ఆ దశాబ్దంలోనే అత్యధికంగా అమ్ముడైన రికార్డ్ గా రికార్డ్ సృష్టించింది ఆ పాట.

ఈ బృందం నాయకుడు వెబ్ మరణించటం తో ఎల్లా బృందంగా ప్రసిద్ధి చెంది ఆమెయే ఆ బాండ్ నాయకురాలైంది .1935-42మధ్య వెబ్ ఆర్కెస్ట్రా తో ఎల్లా ఫిట్జరాల్డ్ సుమారు 150 పాటలుపాడి రికార్డ్ చేసింది .’’ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఎల్లా గాన సమ్మోహనాన్ని విపరీతంగా మెచ్చి, కొత్తదనం తో పరవశం కలిగిస్తోందన్నది .వెబ్ ఆర్కెస్ట్రా తోపాటు బెన్నీ గుడ్మన్ ఆర్కెస్ట్రా తోనూ పని చేస్తూ ,తనకంటూ ఒక ప్రత్యేకంగా ‘’ఎల్లా ఫిట్జరాల్డ్ అండ్ హర్ స వాయ్ ఎయిట్’’అనే బృందాన్ని ఏర్పాటు చేసుకొంది.

1942లో ఎల్లా బాండ్ ను వదిలేసి తానే ప్రత్యేకంగా సోలోలు పాడటం మొదలు పెట్టింది .’’డేక్కా రికార్డ్స్’’ కంపెనీకి పాడుతూ అనేక సూపర్ హిట్ పాటలకు ప్రాణం పోసింది .1940లో నార్మన్ గ్రా౦జ్ ఆమె మేనేజర్ గా ఉన్నాడు .అప్పుడు జాజ్ సంగీతం పాడటం మొదలుపెట్టింది .స్వింగ్ యుగం క్షీణించటం , బిగ్ బాండ్ ల టూరింగ్ లు తగ్గిపోవటం తో జాజ్ సంగీతం లో పెద్దమార్పు వచ్చింది .తన స్వరాన్నికూడా ఎల్లా తదనుగుణంగా మార్చుకొన్నది .తన కచేరీలలో స్కాట్ సింగింగ్ కూ అవకాశమిచ్చింది .బాండ్ వాద్యం లో హార్న్స్ ను అనుకరించి పాడటం మొదలుపెట్టింది .

1945లో విక్ స్కోహెన్ ఏర్పాటు చేసిన స్కాట్ రికార్డింగ్ తో ఎల్లా పాడిన ‘’ఫ్లైయింగ్ హోమ్’’ రికార్డ్ ‘’ ఆ దశాబ్దం లోనే అత్యంత ప్రేరణాత్మక జాజ్ రికార్డ్ .ఎల్లా ఫిట్జ రాల్డ్ జాజ్ గానం నభూతో గా ఉంది ‘’అని న్యూయార్క్ టైమ్స్ రాసింది .అప్పటికే ఆమె పేరు ప్రపంచం అంతా మారు మోగి పోతోంది .

విదేశీ పర్యటన:

1954 జులై లో తన బృందం తో కలిసి ఆస్ట్రేలియా దేశం లో పర్యటించి అనేకచోట్ల ప్రదర్శనలిచ్చింది .అక్కడ జాతి వివక్షతకు గురై ఇబ్బందిపడింది .దానిపై కోర్ట్ కు వెళ్లి విజయం సాధించింది .గ్రాన్జ్ తో జాజ్ సంగీతం పాడుతూనే ఉంది .1955లో డేక్కా , గ్రాన్జ్ కంపెనీలను వదిలేసి తనమేనేజర్ పెట్టిన ‘’వెర్వ్ రికార్డ్స్ ‘’కు పాడింది .వర్ణ, జాతి వివక్ష వలన తనకంటూ పాడటానికి స్థానమే లభించటం లేదని బాధపడి ,ఇంకేదైనా చేయాలని సంకల్పించి ‘’ఎల్లా ఫిట్జ రాల్డ్ సింగ్స్ ది కోల్ పోర్టర్ సాంగ్ బుక్ ‘’ఏర్పాటు చేయటం తో ఆమె జీవితం గొప్ప మలుపు తిరిగింది .

పాటకు ప్రాణం పోసిన నల్లజాతి వజ్రం:

1955మార్చి 15న హాలీ వుడ్ లోని ‘’మొకా౦బో నైట్ క్లబ్ ‘’లో ప్రదర్శన ఇచ్చింది .ప్రముఖ హాలీ వుడ్ నటి మార్లిన్ మన్రో టికెట్ బుకింగ్ కు బాగా తోడ్పడింది .రికార్డింగ్ కలెక్షన్స్ వచ్చాయి .మొకాంబో లో ఒక ఒక నల్లజాతి మహిళ పాడటం అదే మొదటిసారి .అదొక అరుదైన రికార్డ్ అయింది .ఆమె ‘’సాంగ్ బుక్ ‘’1956లో ఆవిష్కరింప బడింది .అందులోని ఎనిమిదిపాటలు సూపర్ డూపర్ హిట్ అయి ఆల్ టైం రికార్డ్ అయింది .ప్రేక్షకులే కాక విమర్శకులనుంచి కూడా ఆమెకు గొప్ప ప్రశంసలు లభించాయి .1972-83మధ్య అనేక ఆల్బమ్స్ పాడి విడుదల చేసింది .అన్నీ బాగా అమ్ముడుపోవటమేకాదు జన హృదయాలలో చిరస్థానం పొందాయి .

ఇంత బిజీగా ఉంటూనే ఎల్లా ఏడాదిలో సుమారు 40వారాలపాటు అమెరికా లోనూ , అంతర్జాతీయంగా నూ పర్యటిస్తూ జాజ్ సంగీత స్వరమాధురి అందించింది .ఆమె పాడిన వెర్వ్ రికార్డ్ లు ఎం. జి . ఎం. సంస్థకు 3మిలియన్ డాలర్లకు అమ్మారు .’’ఎల్లా ఇన్ లండన్ ‘’పేరుతొ 20 రికార్డ్ లు ఇచ్చింది .1972లో విడుదలైన ‘’జాజ్ అండ్ సాంటామోనికా ‘’ఆల్బం విపరీతమైన విజయం సాధించి అందర్నీ ఆశ్చర్య పరచింది .మూడు సార్లు పెళ్లి చేసుకొన్నది .

సినీ, టి.వి .నటన:

1955లో ‘’పీటర్ కెల్లీస్ బ్లూస్ ‘’అనే సినిమాలో జాజ్ గాయనిగా ఎల్లా నటించింది .కొన్ని సిని మాలలో పాడింది కొన్నిటిలో గెస్ట్ ఆర్టిస్ట్ గా నటించింది .అలాగే టెలివిజన్ లోనూ ఫ్రాంక్ సైనాట్రా షో మొదలైనవి చేసింది .టివి కమ్మర్షియల్స్ లోనూ ఉన్నది .కొందరు సహనిర్మాతలతో కొన్ని చేసి౦ది కూడా .ఫ్రాంక్ సైనాట్రా తో కలిసి పని చేయటం ఆమెకు ఎంతో నచ్చేది .ఇద్దరూ లాస్ వేగాస్ లో 1975లో చేసిన ప్రదర్శనకు 10లక్షల డాలర్లు వచ్చాయి .

బాధించిన డయాబెటేస్ –మరణం:

ఎల్లా చాలాకాలం డయాబెటేస్ వ్యాధితో బాధపడింది .దీనివలన అనేక ఇబ్బందులు పడింది .1985లో శ్వాసకోశ సంబంధమైన వ్యాధికి చికిత్సకోసం హాస్పిటల్ లో చేర్చగా నయమైంది .తర్వాత 1986లో గుండె జబ్బు తో బాధపడింది .1990లో ఊపిరి పీల్చటం కష్టమై మళ్ళీ ఆస్పత్రి లో చేరింది .త్వరగానే కోలుకోన్నది .1990మార్చిలో లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో జాజ్ ఎఫ్ ఎం .ఆవిష్కరణ లో పాల్గొన్నది .గ్రాస్ వేనార్ హౌస్ హోటల్ లో పాడింది డిన్నర్ లో పాల్గొంది .1993లో రెండు మోకాళ్ళు డయాబెటిస్ వలన వంకర పోయాయి .కంటి చూపు తగ్గింది. జాజ్ సంగీతంతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించి ఆ సంగీత సన్నజాజి పరిమళాలను ప్రపంచమంతా వెదజల్లిన జాజ్ సంగీత రాణి ఎల్లా ఫిట్జరాల్డ్ 15-6-1996న 79ఏళ్ళ వయసులో గుండె పోటుతో మరణించింది .ఆమె మరణించిన కొన్ని గంటలతర్వాత హాలీవుడ్ బౌల్ లో ‘’ప్లే బాయ్ జాజ్ ఫెస్టివల్ ‘’నిర్వహి౦చి ‘’ఎల్లా వుయ్ విల్ మిస్ యు ‘’గీతం ఆలాపించి అంజలి ఘటించారు లాస్ ఏంజెల్స్ లోని ఇంగిల్ వుడ్ పార్క్ సెమిటరి లో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు .

పొందిన అవార్డ్ లు:

ఎల్లా ఫిట్జరాల్డ్ 13గ్రానీ అవార్డ్ లను ,1967లో ‘’గ్రానీ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ ‘’ను అందుకొన్నది .1958 ఇనాగరాల్ షోలో పాడి మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ మహిళగా విజయం సాధించి రికార్డ్ సృష్టించింది .సింగర్స్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ ,పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ మెడల్ ,ప్రెసిడెన్షియల్ మెడల్ ఫర్ ఫ్రీడం పురస్కారాలు పొందింది .అనేక యూనివర్సిటీలనుండి తన ప్రతిభకు తగిన ఎన్నో అవార్డ్ లు అందుకొన్నది .

గానానికి మచ్చు తునక:

ఆమెను ‘’క్విన్టె స్సిన్షియల్ స్వింగ్ సింగర్ ‘’అంటే తత్వ గాయని లేక గానానికి మచ్చు తునకగా భావిస్తారు .ఎక్కువ ఆల్బమ్స్ పియానో సహకారం తో చేసినా గిటార్ పై చేసినవి అత్యంత నిర్దుష్టం అని ,శ్రావ్యత ,స్వరమాదుర్యాలకు శిఖరాయమానమనీ సంగీత విశ్లేషకులు భావించారు .తన కెరీర్ లో ఎందరెందరో జాజ్ సంగీత విద్వాంసులకు సోలో గాయకులకు అవకాశమిచ్చి ప్రోత్సహించింది .ఫ్రాంక్ సైనట్రా తో పాడి చేసిన ఆల్బమ్స్ ను ఆల్ టైం రికార్డ్ ఆల్బమ్స్ గా గుర్తించారు .

అమెరికన్ సివిల్ రైట్స్ కృసేడర్:

ఎల్లా ఫిట్జరాల్డ్ నల్లజాతి వారి పౌరహక్కుల ఉద్యమకారిణి కూడా .అమెరికాలోని జాతి వివక్షకు , అడ్డుగోడలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది .ఈ పోరాటాలకు ఆమెకు ‘’నేషనల్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్ మెంట్ కలర్డ్ పీపుల్ ఈక్వల్ జస్టిస్ అవార్డ్ ‘’ను ‘’అమెరికన్ బ్లాక్ అచీవ్ మెంట్ అవార్డ్ ‘’ను పొందింది ఆమెను ‘’అమెరికన్ సివిల్ రైట్స్ కృసేడర్’’గా రచయిత బిల్ రీడ్ అభి వర్ణించాడు .

సాంస్కృతిక రాయబారి:

ఎల్లా జీవితమంతా వర్ణ వివక్షత పై పోరాటమే సాగింది .అనేక అడ్డంకులు వచ్చినా, అధిగమించి ప్రజా హృదయాలకు దగ్గరై సాంస్కృతిక రాయబారి (కల్చరల్ ఎంబాసడర్)గా గుర్తింపుపొంది ,అమెరికాలో అత్యున్నత పౌర పురస్కారం ‘’నేషనల్ మెడల్ ఆఫ్ ఆర్ట్స్ ‘’ను 1987లోను ,ప్రెసిడెన్షి యల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం అవార్డ్ అందుకొన్నసాంఘిక సేవా తత్పరురాలు .

చారిటబుల్ ట్రస్ట్ స్థాపన- సేవా కార్యక్రమాలు:

1993లో ‘’ఎల్లా ఫిట్జరాల్డ్ చారిటబుల్ ఫౌండేషన్ ‘’స్థాపించి బాలబాలిక విద్యాభి వృద్ధికి ,విదిహీన జీవుల నిత్యావసరాలకు ,డయాబెటీస్ గుండె జబ్బు ,కంటి చూపు లపై రిసెర్చ్ ప్రాజెక్ట్ లకు ఆర్ధిక సాయం అందించిన దయామయి ఎల్లా .అదృష్ట హీనులకు ,నిత్యం ప్రమాదం అంచున ఉండేవారికి ఆసరాగా నిలబడటమే ధ్యేయంగా ట్రస్ట్ సేవలు నిర్వహించిన మానవీయ మూర్తి ఆమె .అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ,సిటి ఆఫ్ హాప్,రెటీనా ఫౌండేషన్ వంటి స్వచ్చంద సంస్థలకు వెన్నుదన్నుగా నిలబడి ఆర్ధిక సాయమందించిన వితరణశీలి ఎల్లా ఫిట్జరాల్డ్.

-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.