మానాప్రగడ శేషసాయి ఇక లేరు!

విజయనగరం, మే 7: ప్రముఖ సాహితీవేత్త, మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల పూర్వాచార్యులు మానాప్రగడ శేషసాయి (93) మంగళవారం ఉదయం 5.15 గంటలకు తుదిశ్వాస విడిచారు. పట్టణంలోని పూల్‌బాగ్‌లో నివాసం ఉంటున్న ఆయన గత ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1927 ఆగస్టు 14న పశ్చిమగోదావరి జిల్లా గునుపర్రులో మానాప్రగడ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సూరమ్మ, బాపిరాజు. వారణాసిలోని బెనారస్ విశ్వవిద్యాలయంలో ఎంఏ (సంస్కృతం) విద్యాభ్యాసం చేశారు. తెలుగు, సంస్కృతం, ఆంగ్లభాషల్లో ఆయన దిట్ట. విజయనగరం సంస్కృత కళాశాలలో ప్రిన్సిపాల్‌గా 1966 నుంచి 79 వరకు 13 ఏళ్లు సమర్థవంతంగా పనిచేశారు. ఆయన హయాంలోనే కళాశాలలో పనిచేసిన అధ్యాపకులకు యూజీసీ స్కేళ్లు ఇప్పించారు. 1969లో కళాశాల శతజయంతి ఉత్సవాలు నిర్వహించిన ఘనత ఆయనకే దక్కింది. అప్పటి రాష్ట్ర గవర్నర్ ఖండుబాయ్ కె. దేశాయ్, విద్యాశాఖ మంత్రి పీవీ నర్సింహరావు కళాశాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆయన విజయనగరం సాంస్కృతిక పునరుజ్జీవనానికి కారకులయ్యారు. ఆ విధంగా ఆయన హయాంలో కళాశాల స్వర్ణయుగంగా విరాజిల్లింది. ఆయన శిష్యులు ఎంతోమంది ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఉత్తరాంధ్రలో ఎందరినో పండితులుగా, కవులుగా తీర్చిదిద్దిన మహానుభావుడు శేషసాయి. ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సుప్రభాతం రాశారు. అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణస్వామి, సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి, అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి మీద శతకాలు రాశారు. ప్రతీ ఏటా శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి ఆయన రెండు దశాబ్దాలపాటు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 2013లో విజయభావన సంస్థ వార్షికోత్సవంలో పద్యకళా ప్రవీణ బిరుదుతో ఆయనను సత్కరించారు. 2017లో ద్వానా శాస్ర్తీ సాహితీ కుటీర్, విజయభావన సంయుక్తంగా కలసి ఆయనకు జీవిత సాఫల్య బిరుదును అందజేశారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్లు కెవి రమణారెడ్డి, సీతారామారావు, డీఆర్వో వెంకటరావు తదితరులు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆయన మృతిపట్ల ఆయన శిష్యులు మీగడ రామలింగస్వామి, జక్కు రామకృష్ణ, సహోద్యోగి డాక్టర్ ఎ.గోపాలరావు, ఎంఎస్‌ఎస్ మూర్తి, భళ్లమూడి శంకరరావు, ఆర్‌ఎంఎస్ శాస్ర్తీ, బుడితి బలరాంనాయుడు (సీరపాణి), కథా రచయిత పివిజి శ్రీరామమూర్తి, విజయభారతి, రిటైర్డ్ ఈఈ టి.సూర్యప్రకాశరావు, ధవళ సర్వేశ్వరరావు, డాక్టర్ బిఎస్‌ఆర్ మూర్తి, కౌముదీ పరిషత్ అధ్యక్షులు దవళ సర్వేశ్వరరావు, కార్యదర్శి కె.శారదాప్రసాద్, అభినందన సేవా సంస్థ అధ్యక్షులు డాక్టర్ పీవీఎల్ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి ఎ.నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు బి.విజయభారతి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.