సోమేపల్లి వారి నాలుగవ నానీల సంపుటి –చేను చెక్కిన శిల్పాలు

 సోమేపల్లి వారి నాలుగవ నానీల సంపుటి –చేను చెక్కిన శిల్పాలు

అందమైన శీర్షిక భావాన్ని ప్రతిబింబించే పచ్చని చేలు, అందులో పండిన బంగారు మొలకలు , ధాన్యం  తో అబ్బు ఆర్ట్స్ అలరించిన అలరించిన ముఖ చిత్రం తో ,లోపలి కవితా శీర్షికలకు  అంతే ప్రతిభతో గీసిన ‘’పాణి ‘’చిత్రాలతో ,చూడంగానే ‘’చేను చెక్కిన శిల్పాలు ‘’మనసును యిట్టె ఆకర్షిస్తుంది .ఇక్కడొక సంగతి గుర్తుకొచ్చింది .అప్పుడెప్పుడో ముళ్ళపూడి వెంకట ‘’రమణ ‘’ఒక కథ రాసి ,తన నెయ్యపుచెలికాడు’’ బాపు’’తో దానికి బొమ్మ గీయించి పత్రిక సంపాదకుడు విద్వాన్ విశ్వం దగ్గరకు తీసుకు వెళ్లి ఇస్తే ,క్షణాలలో చూసి ‘’ఇడ్లీ కంటే చట్నీ బాగుంది .అన్నట్లు నీ కథ కంటే నే స్నేహితుడి చిత్రం బాగుంది కనుక వెంటనే  ప్రింట్ చేస్తాను ‘’అని హామీ ఇచ్చి నిలబెట్టుకోన్నట్లు రమణ రాసుకొన్నాడు .ఈ సంపుటిలోనూ చిత్ర రచయిత సామర్ధ్యం అంత గొప్పగా ఉందని చెప్పటానికే పై ఉదాహరణ తప్ప వేరే పోలికా, వ్యంగ్యం లేదని మనవి చేస్తున్నాను .

  ఇది  ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు ,కవి నానీలలో నిండా నానినవారు  ,విమర్శకులు ,కవితా సేద్యం తో పాటు, సేద్యానికీ ప్రాముఖ్యమిచ్చే శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారి నాలుగవ నానీల సంపుటి .ఇప్పటికే ‘’తదేక గీతం ‘’వచన కవితా సంపుటిని’’ నానీల తాతయ్య’’డా యెన్. గోపి కి అంకితమిచ్చి,’’పచ్చని వెన్నెల ‘’నానీల సంపుటిని డా సి నారాయణ రెడ్డి గారి చేతులమీదుగా ఆవిష్కరింప జేసిన ఘనత  శ్రీ వెంకట సుబ్బయ్యగారిది .నాకు సరస భారతికి ఆత్మీయులైన సోమేపల్లివారు ఆత్మీయంగా పంపిన ఈ పుస్తకం ఈ రోజే 11-5-19 శనివారం ఉదయం నాకు అందింది .వెంటనే చదివేశాను .మనసుకు హత్తుకొనే కవితా శిల్పాలని పించాయి నానీలు .చేను చేక్కేది బంగారం పంట .ఆ బంగారం పంటలాగున్నాయి ఈ నానీలు .శ్రీ గోపి అన్నట్లు ‘’నిబ్బరమైన వ్యక్తిత్వం ,నిరంతర కవిత చింతనం ,మానవీయ వైఖరి శ్రీ సోమేపల్లి వారి సంపద’’ .వాటిని అందరికీ పంచటం ఆయనకున్న అరుదైన సద్గుణం . ఈ సంపుటిలో వంద నానీలున్నాయి .అంటే వంద బంగారు నానీ రాశులను కవితా కేదారం లో పండించారు సుబ్బయ్యగారు .అయితే ఇందులోఎక్కువభాగం  చేను ,సేద్యానికి చెందినవి మాత్రమే నేను ఉదహరి౦చి, శీర్షికకు న్యాయం చేస్తాను ..

  మొదటి నాని –పల్లెకు ఫస్ట్ బస్సొచ్చింది –నిండా –వాటర్ ప్యాకెట్లు —కోలాలు ‘’

కవిత నేటి పల్లె కోల్పోయిన ప్రకృతి సౌందర్యాన్ని ,ఆధునికతపై మోజును తెలియజేస్తే ,దీనికి పాణి గీసిన  చిత్రం  భావాన్ని ద్విగుణీకృతం చేసిప్రాణం పోసింది .చేను చెక్కిన శిల్పం ‘’ఆటుపోట్లకు అదరను –బెదరను ‘’అని నిర్భయంగా చెబుతుంది ‘’అన్నదాత వెన్ను విరిగింది ‘’కానీ .’’ధరలదీ దళారులదీ-పంట పండింది ‘’అన్నారు .సాగులో సవ్య సాచే అతడు ‘’రాబడి పద్మ వ్యూహం లో మాత్రం –అభిమన్యుడు ‘’అని భారత పరంగా భారంగా విషాదాంతంగా   అందంగా చెప్పారు పర్యవసానాన్ని .పొలం ఒక పాఠ శాలగా కనిపించింది కవికి –‘’విత్తనమంత విమర్శ –చెట్టంత పరామర్శ’’ను చూసి .’’అప్పుడు ,ఎప్పుడూ- ఆకలికి ప్రత్యక్ష దీపం –అన్నదాతే’’అంటారు చేనుకు నీటి జవజీవాలనిచ్చే పిల్ల కాలువ ‘’నిత్యం పలకరిస్తూ ,పరవశిస్తుందట ‘’.

  చేనుగట్టు మీద విస్తరించిన చెట్టు ‘’నేలతల్లికి –గొడుగు పట్టి నట్టుంది ‘’ట భావుక కవికి .పల్లె సౌందర్యం అంటే నీరు చెట్టూ చేమ పచ్చని పొలాలే కదా.కనుక ‘’మట్టీ మనిషి –కలకాలం కలిసి ఉండాలి ‘’అని కోరుకొంటారు సేద్యంతోపాటు కవితా సేద్యమూ చేసే సోమేపల్లికవి  .రైతు జీవితం ఒక మహా భారతం కొంచెం ఘాటుగా చెప్పాలంటే ‘’మహా భరాటం’’.కనుక అతని ‘’కస్టాలు రాయాలంటే 18కాదు ఎన్ని పర్వాలైనా పడతాయంటారు .బోరుబావి విషాద౦  కళ్ళకు కట్టించిన నానీ –‘’నోరు తెరచింది-బోరుబావి –వాడ వాడంతా –విషాదపు దీవి ‘’అల్పాక్షరాల్లో అనల్పార్ధాలు అంటే ఇవే . ‘’చెట్టు చేమల -సయ్యాట –గుండె వాకిట –ఉల్లాసపు ఊగులాట ‘’అని ఉప్పొంగి పోతాడుకవి .ఇవాళ ‘’పొలం –కొందరికి పినతల్లి –కష్టం వోర్చుకోలేక –కౌలు కిచ్చేస్తూ ‘’అని బాధపడ్డారు .దీనికి ‘’పాణినీయం ‘’బాగుంది .ఒండ్రు నీరు చేలకు బలం .ఆ నీటి ప్రవాహం పాత నీటితోకలిసి కొత్త రంగు పులుముకోటం మనం చూస్తాం .దీన్ని కవితాత్మకంగా చెప్పారు సుబ్బయ్యాజీ ‘’నీళ్ళలోనూ –ఊసర వెల్లి ఉందా ?-కొత్తనీరుకలిస్తే –రంగు మారుతోంది ?’’అని బోల్డు ఆశ్చర్యపోయారు .రంగుమారటాన్ని ఊసరవెల్లి తత్వానికి సరిపోల్చారు .రైతుకీ ,చేనుకు ఉన్న అనుబంధాన్ని కమ్మని నానీలో బంధించారు –‘’నాన్ననీ ,చేనునీ –అనుసందానంచేసేది –పంటా –పగ్గమే కదా ‘’.

  వర్షం రైతన్నకు హర్షం .అది ‘’దూరపు బంధువు –అందుకే –ఎప్పుడో కాని రాదు ‘’అని కవితాత్మకంగా దిగులు చెందారు .పత్తి వేసి  మిత్తి వాత పడిన రైతు గురించి –‘’ఉరకలేస్తు౦దను కొన్నా-పత్తి-అతి వృష్టి రూపం లో –మిత్తి’’.చెట్టుకూ పండుగ తెస్తుంది వసంతం అంటారు మరో నానీలో .’’అచ్చమైన పల్లె –స్వచ్చంగా చూపే ప్రేమవల్ల ‘’మనసుకు హాయి .నాగటి చాలుకూ నడతకు చక్కని పోలిక చెప్పిననానీ –‘’నాగటి చాలు –నడకకిస్పూర్తి –జోడెద్దులు –నడతకి కీర్తి ‘’.

  రంగవల్లులగురించిన నానీ –‘’నేల నుదుట –నక్షత్రం –రంగురంగుల – రంగవల్లి చిత్రం ‘’.దీనికీ ‘’పాణినీయం ‘’ కేమిస్ట్రి బాగా కుదిరింది .కవికీ,కలానికి బంధం –మట్టికీ మనిషికీ –అనుబంధం ‘’అని తాత్వికంగా చెప్పారు .’’మా ఊరే –మాకు గొడుగు –పిల్లా జెల్లల్ని –నడిపించేది పెద్దలే ‘’అని మంచి సుద్ది చెప్పారు .’’నులక మంచం పై –కమ్మటికల –అల్లిక జిగిబిగి –అమ్మానాన్నదే ‘’అని కీర్తించారు .పిల్లగాలికి ఊగే చెట్టు కవికి ‘’ఒళ్ళంతా వయ్యారం ‘’గా అనిపించింది .రోడ్లమీద ఫ్లెక్సీలపై విసిరిన వ్యంగ్యాస్త్రం –‘’నడి రోడ్డుపై –నిరశన నాట్లు –ఆశ్చర్యం –విరగపండింది పంట ‘’.మబ్బులు రంగస్థలం పై రంగుల వేషాలు కట్టే వారు గా కనిపించారు .’’సెల్ ఫోన్ చెరలో -బాల్యం బందీ ‘’అయిపోయినందుకు విచారిస్తారు కవి .ముసలితనం లో కలిసిన బాల్యమిత్రుల ‘’తలరంగు మారిందికాని –మనసు మెరుస్తూనే ఉంది ‘’అన్నారు దీనికీ ‘’పాణినీయం’’ముచ్చటగా కుదిరింది .’’కృత్రిమ కొరత సృష్టించేవాడు కవిగారికి ‘’ఆధునిక బ్రహ్మ ‘’లా కనిపించాడు.పాణిగీసిన చిత్రం గాంధీ గారి మూడు కోతులను గుర్తుకు తెస్తుంది .కాలుష్యపు కాలువ ‘’నీళ్ళతోపాటు నిప్పుల్నీ మోసుకొస్తుంది ‘’అని సామాజిక స్పృహతో చెప్పారు .నల్లడబ్బును కొండ చిలువతో పోలుస్తూ ‘’ఒళ్ళు విరుచుకొంటే –ఓట్లను కూడా మింగుతుంది ‘’అనే నేటి వోటు -నోటు  కు దర్పణంగా చెప్పారు .బొమ్మా బాగా వేశారు పాణి.చివరి నానీ –‘’పల్లె మెడలో –పచ్చని మణిహారం –బారులు తీరిన – చెట్లదే సోయగం ‘’

  సోమేపల్లి వారి భావుకతకు ,సృజనకు ,సామాజిక స్పృహకు ,నానీలపై పట్టుకు ,మంచి కవితాదారకు ‘’చేను చెక్కిన శిల్పాలు ‘’నానీల సంపుటి అద్దం పడుతుంది .మరిన్ని కవితా  సంపుటులు వారి నుంచి ఆశిద్దాం .అందరు తప్పక చదివి ఆనది౦చమని మనవి .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-5-19-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.