అరవిందాశ్రమ ”మదర్ ”(మాత్రు దినోత్సవం సందర్భంగా )

నేను ఒక దేశానికి చెందిన దాన్ని కాను, నాకు ఒక సామాజికత అంటూ లేదు, నేనొక ప్రత్యేక నాగరికతకు చెందిన దాన్ని కాదు, నాకు ఒక జాతి అంటూ లేదు కానీ నాలో దివ్యత్వం నిండి ఉంది’… ఈ మాటలు చెప్పుకోవడానికి ఎంత ధైర్యం కావాలి? ‘నేను ఏ యజ మాని ఆజ్ఞలకూ లోబడి పని చేయను. నాకు ఒక రాజు లేడు. ఒక చట్టం లేదు. ఒక మత సమ్మేళనమంటూ లేదు. అయినప్పటికీ నాలో దైవత్వం ఉంది’ అని బహిరంగంగా చెప్పడానికి ఎంత సాహసం కావాలి? సాధారణంగా ఇలా మాట్లాడే వారిని వారిని పిచ్చి వారిగానో, దేశద్రోహులుగానో పరిగ ణిస్తారు ప్రజలు.

అయితే ఈమెను మాత్రం యావద్భారత ప్రజలూ అమ్మగా ఆదరించారు. దేవతలా ఆరాధించారు. ఇంతకీ ఇలా మాట్లాడిందెవరంటారా? ఆమె ఒక విదేశీయురాలు. పుట్టింది, పెరిగింది ప్యారిస్‌లో అయినా, తన జ్ఞానఫలాన్ని, యోగబలాన్ని భారత దేశానికే అంకితం చేసిన సిసలైన ఆధ్యాత్మికవేత్త. ఆమే మిర్రా అల్ఫస్సా. అరవింద యోగిగా ప్రసిద్ధులైన ఆరబిందో ఘోష్ శిష్యురాలు. అరవిందుల ఆనంతరం దాదాపు యాభై ఏళ్లకు పైగా ఆయన నెలకొల్పిన ఆశ్రమాన్ని సజావుగా నిర్వహించారు. అరవిందులు వెలిగించిన ఆధ్యాత్మిక దీపాన్ని ఆరిపోకుండా కాపా డారు. ఆ వెలుగును అందరికీ అందిం చారు.

అందుకే భార తీయులు ఆమెను శక్తిస్వరూపిణి అయిన శ్రీ మాత అని పిలిచారు. ఆదిపరాశక్తిలా పూజించారు. ఆమె వెలిగించిన జ్ఞానజ్యోతులను తమ దేహాలయంలో వెలిగించుకున్నారు.  కర్మయోగి, జ్ఞానయోగి, ఆధ్యాత్మిక, తాత్విక చింతనకు ఆనవాలు శ్రీ అరవిందులు. అరవిందుల బోధలకు ప్రభావితురాలైన ఒక విదేశీ వనిత మిర్రా అల్ఫాస్సా. యోగవిద్యలో ఆమె నిష్ణాతు రాలు. జన్మతః విదేశీయురాలైనప్పటికీ భారతీయ తాత్విక చింతన పట్ల ఆకర్షితురాలైంది. బాల్యం నుంచి  యోగవిద్యను అభ్యాసం చేసింది. ఆధ్యాత్మిక జ్ఞానతృష్ణను తీర్చుకోవడం కోసం దేశవిదేశాలలోని ఎందరో యోగులను, బాబాలను కలిసింది.

కర్మభూమి, పుణ్యపుడమి అయిన భారతదేశంలో అయితే తనను పట్టి పీడి స్తున్న కొన్ని సందేహాలకు సరైన సమాధానం దొరుకుతుందన్న ఆశతో ఆమె పాండిచ్చేరిలోని శ్రీ అరవిందాశ్రమం చేరింది. ఎప్పుడైతే అరవిందులను చూసిందో, ఆమెలో గతజన్మలలోని వాసనలు విచ్చుకున్నాయి. అరవిందుడికి, తనకు పూర్వజన్మ బంధమేదో ఉన్నట్లుగా భావించింది. అంతకాలంగా తాను వెదుకుతున్న ఆధ్యాత్మిక గురువులు అరవిందులేన న్న భావనం ఆమెలో బలంగా ఏర్పడింది. అరవిందులను కృష్ణుడిగా, తనకు తాను యశోదగా ఊహించుకుంది. భారతదేశమే తన అసలైన మాతృభూమిగా భావించింది. తన తుదిశ్వాస వరకు ఇక్కడే ఉండిపోయింది.

పేరుకు శిష్యురాలైనప్పటికీ అరవిందులు ఆమెలోని ఆధ్యాత్మిక చైతన్యానికి మంత్రముగ్ధులయ్యారు. వెనువెంటనే ఆమెను శిష్యురాలిగా స్వీకరించారు. అయితే ఆమె ముందు తాను ఎంతో చిన్నపిల్లాడిగా భావించారు. అమ్మగా అభిమానించారు. తోబుట్టువులా ఆదరించారు.స్నేహితురాలిలా చూశారు. . నోరారా అమ్మా అని పిలిచేవారు. యోగి అరవిందులు ఆమెతో మెలుగుతున్న తీరును చూసి ఆశ్రమాన్ని సందర్శించడా నికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆమెను అమ్మగా గౌరవించేవారు. ఆమెను ఎంతో గౌరవంగా శ్రీ మాత అని సంబోధించే వారు. అనంతర కాలంలో ఆమె శ్రీ మాతగా సుప్రసిద్ధురాలయింది.

అరవిందులు జీవించి ఉన్నకాలంలోనే ఆశ్రమ నిర్వహణ బాధ్యతను ఆమెకు అప్పగించి, ఒక విధమైన తపస్సులో, యోగంలో మునిగిపోయేవారు. ఆమె అరవిందులకు అనేక లేఖలు రాసింది, లేఖాసాహిత్యంలో అవి ఎంతో ప్రసిద్ధిపొందాయి. ఆయన మహాసమాధి చెందిన తర్వాత కూడా ఆశ్రమాన్ని ఎంతో సమర్థంగా నిర్వహించింది. శిష్యులు అడిగే అనేక సందేహాలకు ఎంతో ఓపికగా, సూటిగా, స్పష్టంగా, వివరంగా సమాధానాలు చెప్పింది. అవన్నీ గ్రంథాలుగా వెలువడ్డాయి. అమితమైన ఆదరణ పొందాయి. ‘‘నా జీవితాన్ని, శక్తిని, ఆస్తిపాస్తులను, ఒకటేమిటి నా సర్వస్వాన్నీ అతనికే సమర్పించుకుంటాను. అతను నా రక్తమే కావాలని అడిగితే ఆఖరు బొట్టువరకు ఆనందంగా ధారపోస్తాను’’

ఇక్కడ అతను అనే పదం ఎవరికి వర్తిస్తుంది? అనడిగితే భగవంతుడు అని చెప్పుకోవచ్చు. ఆమె అమితంగా అభిమానించిన అరవిందులు అని కూడాచెప్పుకోవచ్చు. మన దేశంలో పుట్టి మన దేశంలో పెరిగి, మన దేశంలో జ్ఞానాన్ని సముపార్జించి, డాలర్లకోసం తమ ప్రతిభా సామర్థ్యాలన్నింటినీ విదేశాలకు ధారపోసే ప్రబుద్ధులెందరినో చూశాం మనం. కానీ, పొరుగు దేశంలో పుట్టి, మన దేశసంస్కృతీ సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు, ఆధ్యాత్మికతకు ప్రభావితురాలై, తన తుదిశ్వాస వరకూ భారతదేశ ప్రజలకోసమే పరితపించిన సిసలైన శ్రీ మాత ఆమె. అందుకే ఈ దేశంలో శ్రీ మాతా ఎంటర్‌ప్రైజెస్, శ్రీ మాతా ఇంజినీరింగ్ వర్క్స్, శ్రీ మాతా టెక్స్‌టైల్స్.. ఇలా ఆమె పేరుతో ఎన్నో పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు వెలిశాయి. జనం గుండెల్లో కొలువుండిపోయింది.

– డి.వి.ఆర్.భాస్కర్

image.png

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.