రాజా బహరీ పామనాయక భూపాలుడు
18 వ శతాబ్దం మధ్యలో సురవరం సంస్థానాన్ని వైభవంగా పాలించినవాడు రాజా బహారీ పామనాయక భూపాలుడు .అసలుపేరు రాఘవ భూపాలుడు .పీతాంబర నాయకుని పౌత్రుడు .తండ్రి రమణ భూపాలుడు, తల్లి లక్ష్మమాంబ .సురపురమే షోరాపురమైంది .దీన్ని బేడరు లేక’’ నిర్భయులు’’ అనే తెలుగు నాయకులు పాలించారు .వీరు అనాగరికులని ,మైసూరులోని దక్షిణ మహా రాష్ట్ర వీరి ఆదిమ నివాసమని తెలుస్తోంది .ఈ రాజులలో చివరివాడు బాలుడుగా ఉన్నప్పుడు కల్నల్ మెడోస్ సంస్థానాదికారి గా ఉండి, అతనికి యుక్తవయసు రాగానే 1853లో రాజ్యాన్ని అప్పగించాడు .1857ప్రధమ భారత స్వాతంత్ర్య సమరం లోపాల్గొనటం వలన యితడు బంధింపబడి మరణ దండన విధించారు .కాని పునర్విచారణలో అయిదేళ్ళు కారాగార వాసం తో రాయవేలూరుకు పంపారు .కాని మార్గమధ్యమం లో ఆత్మహత్య చేసుకొన్న తొలితరం స్వాతంత్ర సమరయోధుడుగా వన్నె కెక్కిన త్యాగ శీలి అయ్యాడు .ఈ విప్లవ యుద్ధం లో నిజాం నవాబులు బ్రిటిష్ వారికి సాయం చేయటం వలన సుర పుర సంస్థానాన్ని బ్రిటిష్ వారు నవాబులకు భక్షీస్ గా అప్ప చెప్పారు .
ఇంతటి ఘన చరిత్రకాల వీర వంశం లో పుట్టిన పామ నాయక భూపాలుడు కూడా అరివీర భయంకరుడే .ఈయనకాలం లో శ్రీ బుక్కపట్టణం అణ్ణయ్య దీక్షితులు ,శ్రీమన్నిగమాంత దేశికులు గా భావింపబడిన శ్రీ బుక్కపట్టణం శ్రీనివాస దీక్షితులు సోదర కవులు ధర్మవరం నుంచి సురవరం వచ్చి రాజగురువులయ్యారు .రాజును ‘’పరమభాగవత భక్తి తాత్పర్యుడు ‘’అని మెచ్చారు .అణ్ణయ్య దీక్షితుల కుమారుడు కిరీటి వెంకటాచార్యులు .ఈ ముగ్గురు భారత దేశమంతా పర్యటించి కవితా విజయ దుందుభులు మ్రోగించారు .
పామనాయకుడు రాజుమాత్రమేకాక స్వయంగా కవికూడా .’’భార్గవ పురాణం ‘’అనే వైష్ణవ గ్రంథం రాశాడు .ఇందులో 8ఆశ్వాసాలున్నాయి.ఈ రాజులకులదైవం వేణుగోపాలస్వామికి అంకితం.రాజు ఆస్థాన కవుల వర్ణన ప్రకారం ఈ రాజవంశానికి మూల పురుషుడు సీతా రామ లక్ష్మణులను గంగను దాటించిన గుహుడు .ఈ వంశం లో ప్రసిద్ధులు నరసింహ మహీపాలుడు,వడియర నాయకుడు పెదపామ ధరణీ నాధుడు ,పీతాంబరావనీ పాలుడు మొదలైన 15మంది .
బేడరు నాయక రాజులు బిజాపూర్ గోలకొండ నవాబులకుసహాయపడి ఔరంగజేబుతో యుద్ధం చేశారు .పూర్వం వీళ్ళకు రాజధాని వాకిన్ ఖేడా .దీనినే ‘’వాగినగిరి’’ అంటారు .ఇక్కడి వేణుగోపాలస్వామి వీరికి ఆరాధ్య దైవం .ఈ దుర్గాన్ని ఔరంగజేబు 1704లో జయించాడు .జేబు చనిపోయాక వీరు మళ్ళీ దుర్గాన్ని స్వాధీన పరచుకున్నారట .పామభూపాలుడు ‘’దిగంత కీర్తికాంతా మనోహరుడు ‘’,’’సకల ధర్మ ప్రతిపాలకుడు ‘’అని కీర్తి పొందాడు .అతని ‘’భుజప్రతాప శిఖి శిఖా పరంపరలకు అహిత భూ భ్రున్నికాయంబు శలభ నిచయంబు మాడ్కి విలసిల్లె నట ‘’.
రాజు రాసిన భార్గవ పురాణం అంటే పన్నిద్దరాళ్వారుల చరిత్రమే .రాజుకు వేణుగోపాలుడు కలలో కన్పించి ఈ కృతి చేయమని ఇలా ఆనతిచ్చాడు –
‘’పరమ వివేక శీలుడవు ,బ్రాహ్మణ పోషణ తత్పరు౦డ వై-యరయుట ,యేను బ్రాహ్మణ మఖాభి వశాస్తి దనర్చు టున్కి ,నిన్
వరమతి బ్రోవ నిచ్చటికి వచ్చినవాడను నొక్క సూక్తి భ –వ్య రచన జేతు నీ కిపుడు బాలక పామ ధరాధి పాలకా ‘’
‘’అస్మత్ప్రభావ మౌనట్టి శ్రీ విష్ణు పురాణ౦బు తెనుగున రసికు లెన్న –కృతి రచియి౦పి౦ఛి తత
భక్తి మా కంకితంబు చేయించిన ధన్యమతివి
యరయ పన్నిద్ద రైనట్టి మద్భక్తుల చరితంబు ,నాంధ్ర భాషా ప్రబంధ –మును జేసి మా కిస్టముగ సమర్పణము గావి౦చినచో పృధివీ స్థలమున
సకల పుణ్య తరా (ఫలా )వాప్తి సంఘటించు-నీ కనుచు సురపుర వాసుడై కడంగు
దేవుడా కృష్ణమూర్తి యద్రుశ్యు డౌట-మేలుకని మానసోత్సాహ లీల దనర .
పామ భూపాల నాయకుని కవిత్వానికి మరొక మంచి పద్యం చూద్దాం –
మత్తేభం –పర్వ తత్వార్ధ పరిష్క్రియాభిరతి ,శు౦భ త్పాండ్య భూమండలే -శ్వర సద్వైష్ణవతా విధాయి ,కరుణా౦చద్భట్ట పాదార్య ,సా
దర లీలా చిద చిద్విశిస్ట మత సిద్ధాంత స్ఫురద్దర్పణా౦-తర విద్యోదిత దివ్య విగ్రహ నమద్భక్తాదరానుగ్రహా ‘’
ఇంతటి ఉత్తమ గ్రంథం మరుగున పడి పోయినందుకు ఆచార్య బిరుదరాజు రామరాజు గారు మిక్కిలిగా విచారించారు .
ఆధారం –ఆచార్య బిరుదరాజు రామరాజు గారి ‘’చరిత్ర కెక్కని చరితార్ధులు ‘’-(విస్మృత కవులు –కృతులు )
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -12-5-19-ఉయ్యూరు