2-భారి గడ్పుల ధర్మయా మాత్యుడు
ఆరు ఆశ్వాసాల ‘’నృసింహ పురాణం ‘’రాసిన బారి గడ్పుల ధర్మయా మాత్యుడుకూడా విస్మృత కవి అయ్యాడు .దీని శిధిల తాళపత్ర గ్రంథం గద్వాల సంస్థానం నుంచి ఆచార్య బిరుదరాజు రామరాజు గారు సంపాదించి ఆ కవి, కృతి చరిత్రను లోకానికి అందించి పుణ్యం కట్టుకొన్నారు .ఇందులోని చివరి పత్రం వలన రాసిన తేదీ తెలిసింది .ఇది 250ఏళ్ళ నాటి గ్రంథంగా రాజు గారు పేర్కొన్నారు .మొదటి భాగం లో ఇస్టదేవతాస్తోత్రాలు ఉండి ఉండవచ్చు .రెండవ కమ్మ లో ఆంజనేయ స్తుతి ఉంది .తర్వాత మూడు పద్యాలలో పూర్వ గీర్వాణ, ఆంద్ర కవుల ప్రశంస ఉంది.
కం.’’మనమున నే భజియింపుదు-ననయము వాల్మీకి వ్యాసు ననిమిష మౌనిన్
ఘన సుర వందితులను స-న్ముని మాన్యుల హరికథాను మోదిత మతులన్ ‘’.
ఉ-‘’చారు మనః ప్రమోదమున సంస్కృత కావ్యమున౦ బ్రవీణులౌ –ధీర మయూరు, బాణు,జయదేవుని జోరుని గాళిదాసునిన్
భారవి ,మాఘు,బిల్హణుని ,భైరవునిన్ ,శివభద్రునిన్ ,హరిన్ –గూరిమితో నుతింతు మదిగోరిన కోర్కి కనుగ్రహింప గన్’’
కం-తగ న౦ధ్ర భాష నేర్పరు-లగు నన్నయ భట్టు తిక్కనాహ్వయు,భీమున్
సుగుణుని బమ్మెర పోతన –నొగి భాస్కరు రంగనాథు నొనర దలతున్ ‘’
ఇందులో నృసింహపురాణం రాసిన కవిత్రయం లోని ఎర్రన గురించి లేకపోవటం ఆశ్చర్యమే .తర్వాత రెండు పద్యాలలో కుకవి నిరాదరణ చేశాడు .తర్వాత తన ఇస్ట దైవం ‘’బారిగడుపుల నరసింహస్వామి ‘’ని ఒక పవిత్ర స్థల౦లో లో కూర్చుని ప్రార్ధించాడు కవి . బారిగడుపుల గ్రామం జటప్రోలు సంస్థానం లో ఉంది .ఊరు,ఇష్టదైవం ఒకటేకనుక ఇంటిపేరు కూడా బారి గడుపుల అయి ఉంటుంది .స్వామి ప్రత్యక్షమయ్యాడు రెండు ‘’సీసా’’లతో ఆస్వామిని నుతించాడు.తర్వాత వచనం లో ‘’పూర్వం ద్విపద రూపంగా నృసింహ పురాణం రాసి నాకు అ౦కిత మిచ్చావు’’అన్నాడు స్వామి .అది ఏమైందో తెలియదు .
తర్వాత ఉన్న రెండు కందపద్యాలు-
‘’విను మెరిగి౦చెద నే నీ –జనకుని గరుణి౦చినాడసాక్షాత్కార౦
బున మిమ్ము బ్రోతునేని –ట్లనుదినము ను సంతసిల్లుమని కడిమి మెయిన్ ‘’’’
‘’ఒగి నరసింహ పురాణం -బగణితమది వచన కావ్యమై భువి బరగం
దగ రచియి౦పుమ ఈ కృతి-జగతి బ్రవర్తిల్లు చుండు శాశ్వత మగుచున్ ‘’
వచనకావ్యం అంటే ఇప్పుడు మనకున్న వచనకావ్యం కాదన్నారు బిరుదు రాజు వారు .భగవ దాజ్నను తండ్రికి తెలిపాడు .ఆయన కొడుకుతో –
కం-‘’పరగ మన భాగ్యమున శ్రీ –ధరుడార్త శరణ్యు డతిముదంబున మనలం
గరుణి౦ఛి ఇచట ప్రబలిన –తెరగేనెరిగింతు వినుము ధీర విచారా ‘’అని అనునయించి –
గీ-‘’ప్రబలముగ కశ్యపు బ్రహ్మ మౌని- మహితుడై గౌతమీ మధ్యదేశ
మునను తపమతి నిష్టతో మొనసిచేయ –వరడుడై చక్రి వేడుము వరములనిన ‘’
ఉ-‘’సన్నుతులోలి జేయుచును సంయమి చంద్రుడు విన్నవించెనో –పన్నగతల్ప ,ఆర్తజన బాంధవ నన్గరుణి౦చితేని నీ
విన్నగభూమి నిల్వు మది ఇష్టము నాకనిన౦ ,బ్రియంబుతో –వెన్నుడు నిల్చి మౌనికిని వేడ్క జని౦ప బ్రసన్న చిత్తుడై’’అని పూర్వ విషయం తెలియజేసి తండ్రి కొడుకుతో ‘’ఈ ప్రదేశానికి పూర్వం చరణాద్రి అనే పెరున్నదని ,కలియుగం లో అది ‘’కాళ్ళకల్లు’’అయిందని ,ఆదేవుడిని నిశ్చలభక్తితో పూజించానని ,కలలో దేవుడు కన్పించి కశ్యపుడు తనను ఇక్కడ ఉండిపోమ్మన్నాడని నువ్వుకూడా కాశ్యప గోత్రీకుడవు కనుక ఈ గిరి గహ్వరం లో బారిగాడుపుల నరసింహ మూర్తిగా వెలుస్తాను తనకు ఒక కోవెల కట్టించమని ఆనతిచ్చాడు .అలాగే చేశాడు కృతికర్త తండ్రి .కనుక నృసి౦హ పురాణ ప్రబంథా ఆ దేవ దేవుడికే అంకితం చేయమని హితవు చెప్పాడు కవిగారి తండ్రి .
ఇది నృసిమ్హపురానమే అయినా జయ విజయుల మూడు జన్మల చరిత్ర కూడా ఉంది .మొదటి ఆశ్వాసం లో ‘’శ్రీ బారిగడుపుల నృసింహ వర ప్రసాద కాశ్యపగోత్ర పవిత్ర తిమ్మయామాత్య పుత్ర,రంగనాహ్వయ సహోదర ధర్మయ నామధేయ ప్రణీ౦తంబైన నృసింహ పురాణ౦బను మహా ప్రబంధంబునందు నైమిశారణ్య వర్ణనం బును శౌనకాదిమునుల మహత్వమును ,నారదాగామనంబును ,నారదుడు భక్తివిజ్ఞానబోధయును –‘’వగైరా వగైరా ఉన్నట్లు చెప్పుకొన్నాడు .
ఆధారం –ఆచార్య బిరుదరాజు రామరాజుగారి ‘’చరిత్ర కెక్కని చరితార్ధులు ‘’-(విస్మృత కవులు –కృతులు )
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-5-19-ఉయ్యూరు
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com