3-శేషభట్టరు శి౦గరాచార్యులు
జటప్రోలు సంస్థానాదీశులైన సురభివారు మంచి కళాపోషకులు .కాకతీయ, విజయనగర ,గోల్కొండ రాజులకు సామంతులు గా ఉన్నారు .శ్రీ వెల్లాల సదాశివ శాస్త్రి గారు ‘’జటప్రోలు సంస్థానాధీశ్వరుల చరిత్ర ‘’రాశారు .ఈ సంస్థాన రాజులలో 21వ తరానికి చెందిన చిన్నమాధవరావు భూపాలుని ఆస్థానకవి యే శేషభట్టరు శి౦గ రాచార్యులు ‘’శూద్ర ధర్మోత్పల ద్యోతినీ స్మృతి కౌముది ‘’అనే ధర్మశాస్త్ర గ్రంథం రాశాడు .దీనికి సంస్కృత మూలం 14వ శతాబ్దికి చెందిన శ్రీ రాయ మదనపాలుడు రాశాడు. చిన మాధవరాయలు’’చంద్రికా పరిణయం ‘’అనే ప్రౌఢ ప్రబంధాన్ని రాసిన నరసి౦గ రాయల కొడుకు .కనుక మన కవి 18వ శతాబ్దివాడు అని బిరుదు రాజువారు తేల్చి చెప్పారు .కవి రాసిన శిధిల తాళపత్ర గ్రంధాన్ని ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వానికి గద్వాల సంస్థానాధీశులు కానుకగా అందజేశారు.శింగరాచార్యకవి సుదీర్ఘమైన పీఠిక రాశాడు .సురభిరాజుల వంశావళిని విపులంగా చర్చించాడు .
ఈ గ్రంథం సంస్కృత శ్లోకంతో ప్రారంభమైంది .అదీ శిధిలంగా అసంపూర్ణం గానే ఉన్నది
శ్లోకం –‘’శ్రీ రాజ శేఖరః పాయాద —తమ భవాన్వితః -శ్రీమన్మాధవ రాజేంద్రం పంటపల్లి పురాధిపం
శ్లోకం –శ్రీ రామా పరిరంభ జ్రు౦భణమునన్ జెన్నొందు వక్షంబునన్ –దారం బూనని ,తారహారము మహోద్యల్లీలలందాల్చి భో
గారూడిం దాగు సి౦గ పట్టణ నృసింహస్వామి బ్రోచు౦ దయన్ -సూరీ౦ద్రా వంశ వనశీలునిన్ సురభి వంశ్యున్ మాధవోర్వీశ్వరున్’’
తర్వాత లక్ష్మి శివ పార్వతీ వృషాకపి (శ్లేష )వృషాకపాయి(శ్లేష )వినాయక ఆన్జనేయాది దేవతలను రాజుకు సకల సౌభాగ్యాలు ప్రసాదించమని ప్రార్ధించాడు .మాధవరాయలకు ఉనికి పట్టు అయిన ‘పంటవెల్లి ‘’పురవర్ణన విపులంగా చేశాడు .ఆగ్రామం ఇప్పుడు ‘’పెంట్లేల్లి ‘’గా మారింది .ఇది కొల్హాపురానికి అయిదు మైళ్ళ దూరం లో ఉన్నది.కావ్యం లో ప్రబంధ వర్ణనలన్నీ గుది గుచ్చాడు . రాజు గుణగానం పలురకాలుగా చేశాడు –
కం-‘’నరసింగ మాధవేంద్రుని-స్థిరతర సత్కీర్తి చెలగ దిశలన్
కరిభిద్దర గిరిభిచ్చర –కరిభిద్వర శైలతుల్య కాంతి స్ఫురణన్ ‘’
అంటూ రాయల ఆస్థానకవి చెప్పిన కరిభిద్గిరిభిద్ తరహాలో చెప్పాడు .బిజ్జల తిమ్మభూపాలుని రెండవభార్య పెద్దకొడుకు నరసింహరాయలు మాధవ రాయలకు స్నేహితుడై ఉంటాడని రామరాజుగారు ఊహించారు .మాధవరాయల తండ్రీ ,తాతకూడా కావ్యాలు రాశారు .శేషభట్టరుకవి శ్రీకేశవ విలాసం వంటికావ్యాలు రాశాడు .బారిగడుపులనారసింహుడు కలలో కన్పించి శ్రీరాయ మదనపాలుడు రాసిన ధర్మశాస్త్రాన్ని తెలుగులో రాసితనకు అంకితమివ్వమని ఆదేశించాడు .తర్వాత 60పద్యాలలో సురభి వంశ వర్ణన చేశాడు .గ్రంథరచన 13-7-1760అని కవి చెప్పాడు .
బ్రాహ్మీ ముహూర్తం లో చేయాల్సినపనులు ,దంతధావన విధి , శూద్ర ప్రాతఃకాల ,మాధ్యాహ్నిక స్నానవిది ,శూద్ర బ్రహ్మయజ్ఞ తర్పణ విధానం ,శ్రాద్ధపద్దతి ,భోజనపద్దతి వివరంగా రాశాడు .కావ్యంలోని వచనాలు ఆనాటి వ్యావహారిక భాషకు మంచి ఉదాహరణలు అని, పీఠిక ఆనాటి చారిత్రిక విషయాలకు దర్పణం అని అన్నారు బిరుదురాజువారు .
ఆధారం –ఆచార్య బిరుదరాజు రామరాజుగారి ‘’చరిత్ర కెక్కని చరితార్ధులు ‘’-(విస్మృత కవులు –కృతులు )
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-5-19-ఉయ్యూరు