4-కొటికలపూడి వీర రాఘవాచార్యులు
‘’నవీనం ద్రోణ పర్వం ‘’రాసిన కొటికలపూడివీర రాఘవాచార్యులు గద్వాల సోమనాధ భూపాలుని ఆస్థానకవి .17వ శతాబ్దం వాడు .కొటికలపూడి వీరరాఘవకవి సంస్కృతం లోశ్లోక తాత్పర్యాలతో సహా రాసిన భారత౦ లోని ఉద్యోగ పర్వాన్ని 1821లో గద్వాలప్రభువులు ముద్రింపి౦చారు .దీన్ని పూడూరి చెన్నకేశవస్వామికి అంకితం చేశాడు కవి .ప్రతి ఆశ్వాసం లోనూ స్వామిని స్తుతించాడు . ఇందులో తనది శాండిల్య గోత్రం అని ,మూలపురుషుడు సూరకవి అని చెప్పి తర్వాత వంశ చరిత్ర చెప్పాడు .సోమభూపాలుడు ఉద్యోగ పర్వాన్నివిని రచన తిక్కన సోమయాజి రచనలాగా ఉందనిమెచ్చి కవికి ‘’నూతన తిక్కన సోమయాజి ‘’అనే బిరుదునిచ్చి ,భీష్మాదిపర్వాలను కూడా రాయమని ప్రోత్సహించాడు .అలాగే భీష్మపర్వం రాసి ,రాజు కోరికపై అక్కడే ఉండిపోమ్మనికోరగా ,ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి, అనుజ్న పొంది స్వపురానికి వెళ్లి రాజు పిలుపుతో మళ్ళీ వచ్చాడు .రాజు తనగురువు ఆనతినిప్పించాడు .దేవుడుకూడా కలలో కన్పించి రాయమన్నాడు .
‘’కార్యము యుక్తమే నియు నగమ్యము మిక్కిలి వ్యాస వాక్య ,తా -త్పర్యమటంటి వేని సతతంబు మదీయ సభన్ వసియించు నా
చార్యులు దెల్పు వారది నిజంబుగ,సంశయమైన చోట చా–తుర్యము పేర్మి నీకయిన దోచు మదిన్బరికింప మత్క్రుపన్ ‘’అని వెన్ను తట్టాడు వెన్నుడు .ఉద్యోగపర్వమేకాక అనేక భారత పర్వాలు కవి రాసినట్లు అర్ధమౌతోంది .
అలాగే ద్రోణ పర్వం కూడా ఆ చెన్నకేశవుడికే అ౦కితంచేశాడు .మొదటిపద్యం –
కం-శ్రీ వర కౌస్తుభ రత్న –శ్రీ వక్షస్ఫురిత వక్షశ్రిత జనరక్షా
పావన వనమాలా౦చ ద్గ్రీవా –పూడూరి చెన్నకేశవ దేవా’’
తర్వాత పద్యం
కం-శ్రీమత్పరాశర్యకృ-పామహిమ రచింతు ద్రోణపర్వ ముభయభా
షామార్మిక సూరిజన –స్తోమము లుప్పొంగ నాంధ్ర సూక్తి నిపుణతన్ ‘’
దీనితర్వాత ద్రోణ పర్వకథ ప్రారంభం చేశాడు –
గీ-భావము చెలంగ సేనాధిపత్యమంది –బలము వ్యూహముగా బన్ని ప్రధన కాంక్ష
బలియులైనట్టి నీ తనూభవుల తోన-అమ్మహారధి యాచార్యుడపుడు వెడలె ‘’
గుడ్డిరాజుకు సంజయుడు యుద్ధ వార్తలు వినిపించటం తో కథ మొదలౌతుంది ‘
మనకు లభించిన ద్రోణపర్వం అసంపూర్ణం .ద్రోణపర్వం లో కవి నేర్పు తెలుసుకోవటానికి మరి రెండు పద్యాలు చూద్దాం –
కం-వననిధి ఇంకిన తెరగున –కనక మహీధరము పాదు గదలిన రీతిన్
దినమణి వ్రాలిన కైవడి –ధనురాచార్యుండు వడుట తాళుదు నెటులన్ ‘’
గీ-గర్వ దుర్వార జనతిరస్కార శీలు-డతినిపుణ ధార్మికావన ప్రతత బుద్ధి
శత్రుసంతాపనుండగు చాపగురుడు –విడిచె రారాజు కొరకు జీవితము నకట ‘’
ఆ.వె.-మందభాగ్యులైన మనవారి విజయాశ –యే మహాత్ము నాశ్రయించి యుండె
బుద్ధిబలము చేత బుధగురుకవి సము-డతడు సమర నిహతు డౌట యెట్లు ‘’
అని నమ్మలేక పోయాడు. ద్రోణ మృతిని జీర్ణించుకోలేకపోయి పెద్దగా బాధ పడ్డాడు పెద్ద వృద్ధరాజు .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-5-19-ఉయ్యూరు