5-బోయినపల్లి కుమార వేంకటరాయలు
‘’కవిరాజుల చరిత్రయేకాదు,రాజకవుల చరిత్ర కూడా కాలగర్భం లో కలసిపోయింది ‘’అని ఆచార్య బిరుదరాజు రామరాజుగారు బాధ పడ్డారు .బోయినపల్లి కుమార వెంకట రాయలు పానగల్లు దుర్గాధిపతి ఐన పద్మనాయక ప్రభువు .కవి పండితులను పోషించటమేకాకుండా సప్త సంతానాలను ప్రతిస్టించినవాడు .కాలం 17వ శతాబ్ది మధ్యభాగం .’’ద్రౌపదీ పరిణయం ‘’అనే అయిదు ఆశ్వాసాల ప్రబంధం రాసి, తిరుపతి వెంకన్నకు అంకితమిచ్చాడు .
ప్రారంభపద్యం –
‘’శ్రీ వత్సా౦కము భూమి భామయను దృష్టిం జేస్టల౦ దత్సమీ –క్షా వృత్తిన్,దన దివ్య కౌస్తుభమణీ చ్చాయన్నిరోధించి లీ
లా వైముఖ్యము దోపకుండ నలమేల్మంగ౦ భరీ రంభ సౌ-ఖ్యావిర్భూతి నలర్చు వెంకట నగాధ్యక్షుండు మమ్మేలుతన్ ‘’
రెండవ పద్యం లో కవి ఇలవేల్పు నరసింహస్వామి స్తుతి చేశాడు .తర్వాత దైవప్రార్ధన 11వ పద్యం లో తన ఆచార్యుడై సముద్రాల తిరుమలాచార్య దౌహిత్రుడైన వేంకటాచార్యకుమారుడు కొనపాచార్య మొదలైన వారి విశేషాలు చెప్పాడు.12వ పద్యం లో తండ్రి గురించి చెప్పి తర్వాత పూర్వకవుల్లాగా కుకవి నిందా చేశాడు .ఒకరోజు స్వప్నం లో ‘’కలుములీనెడు కేలు గల మేలు నెలమేలు నలమేలు మంగ ము౦గ లను బెనయగా’’ ఏడుకొండలవాడు కనిపించి ,తనకు ఒక కృతితిరాసి అ౦కితమిమ్మని కోరాడు .
మర్నాడు కొలువులో విషయం చెప్పి బోరవెల్లి నరసింహకవి ని పిలిపించి గౌరవించగా .కవి రాజు గారి ప్రతిభను ఇలామెచ్చాడు సీసం లో –
‘’గోపగోపక గోపగోపనల్ నలువొందు-నీ దయోదయ భోగ నియతికలన –రాజరాజవ రాజ రాజజుల్ జులుకన –నీనిదాన ధనారి నిధాన నిధులు
ధర్మ ధర్మజ ధర్మ ధర్మముల్ ములుసూప –వరయ నీ శమన సత్యరుతి గతుల –రామరామారామ రామమూర్తులతుల –నీబల ధర్మార్ధ నిశ్చయములు
గీ –గండ భేరుండ గండరగండ చండ-నమర నిశ్శంక బిరుదాంక సదకలంక
పద విశ౦కట వెంకట ప్రభు కులాధి – నాయక కుమార వెంకట రాయ ధీర’’అని పొగిడాడు .సంతోషపడినరాజు వెంకటరాయడు –
శా-‘’ఆర్వేలాన్వగేయ రాయసము మల్లామాత్య సూర్య న్వయా-యోర్వీదేవ మత స్వతంత్ర కపి గోత్రోద్భూత దత్తాహ్వయాం
తర్వాణి ప్రియ సూను కృష్ణ విదుషా త్మప్రోద్భవుం డైనయా –బోర్వెల్లీ పుర నారసింహ కవి సంబోధించి ఇట్లంటొగిన్’’అని కవిగారి వంశజుల ఘనతను పొగిడాడు రాజు –
‘’మీ తాతతాతకు భ్రాత్రుజ సూతి గ –దా రాయసము మల్లసూరి చంద్ర
భాను చరిత్ర మొప్పగ జెప్పె,మీ తాత –దత్తన్నశబ్దశాస్త్ర ప్రవీణు-డతని సుతుండు కృష్ణప యయాతి చరిత్ర –మిశ్రకావ్యమొనర్చె మీ జనకుడు
చేసితివీవు దక్షిణకాశ్యలంపురి -నృహరి దయోదయో మహిత కలిత
గీ-కృతి యతని కంకితముగ బండితుల మతుల –నెనయ సౌవర్ణ కాఖ్యాన మనగ నొకటి
యుభాయభాషా విశేషోక్తియు (శిధిలం )-సిద్ధముగ సాంప్రదాయ ప్రసిద్ధి గనుచు ‘’
ఈపద్యాలలో బోరవెల్లి నరసింహకవి తండ్రి తాతలగురించి వారి రచనలగురించి మనకు తెలుస్తోంది .కాని మన దురదృష్టం ఆ ప్రబంధాలజాడ కనిపించనే లేదు .కుమారరాయ ప్రభువుకు బోరవెల్లి కవి ‘’గురుడే గురుడే వరుడే ‘’అయి పూజనీయ స్థానం పొందాడు .
రాజు కవికి తన స్వప్న వృత్తాంతం చెప్పగా కృతి చేయమని కవి ప్రోత్సహించగా గురుకవిని సన్మానింఛి రచన ప్రారంభించాడు కుమారరాయ ప్రభువు .ముందుగా ‘’పెన్ఫాల గోత్రం లో బోయినపల్లి పద్మనాయక కులం లో గండ భేరుండ బిరుదున్న రాక్షమనాయకుడు పుట్టాడు .ఇతని తర్వాత రామరాయలు తిమ్మరాయలు కోననాయకుడు రాజులయ్యారు .కోన కు అప్ప ,మాద ,తిమ్మ,వెంకట అనే కొడుకులున్నారు .కుతుబ్ షాహీ చేత వీరు సత్కారం పొంది మెతుకు గిరి దుర్గాధిపతులయ్యారు .తిమ్మనాయకుడికి ‘’విభాళ సాళువ’’బిరుదు ఉంది .చివరివాడైన వేంకటరాయలు పానుగల్లు ప్రభువు .ఇతని పెద్దభార్యకొడుకు కోనరాయలు చిన్నభార్య నరసంబ కొడుకే ద్రౌపదీ కళ్యాణ ప్రబంధకర్త మన కవిరాజు వేంకటరాయలు గండభేరుండ బిరుదు పొందాడు .
ప్రతి ఆశ్వాసం చివర గర్భ బంధకవిత్వాన్ని దట్టించాడు .చివరిదైన పంచమాశ్వాసం లోని ఒకమత్తేభ పద్య స్వారస్యం చూద్దాం
‘’అతులంబై ఆకలంకమై ప్రభు సమాజాకర్ణ్యమై,వర్ణ్యమై- యతి పాపావహమై ,శుభావహమునై ,యాచంద్ర తారార్క ,సు
స్థితమై యుండెడు గాక వెంకట నగాధిస్వామి యుష్మద్గుణా౦-కిత మేతత్కృతి యీ క్షితిన్ కవిజనా౦గీకార సారోన్నతిన్ ‘’
ఆధారం -.–ఆచార్య బిరుదరాజు రామరాజుగారి ‘’చరిత్ర కెక్కని చరితార్ధులు ‘’-(విస్మృత కవులు –కృతులు )
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-5-19-ఉయ్యూరు