7-ఇనుగండ్ల కృష్ణ ప్రధాని
‘’ధర్మరాజాశ్వమేధం ‘’అనే అయిదు ఆశ్వాసాల ద్విపదకావ్యం రాసిన ఇనుగండ్ల కృష్ణ ప్రధాని ఏ కాలం వాడో తెలియదు. అతని కావ్యం వ్రాతప్రతికూడా శిధిలావస్థలో దొరికింది .దీన్ని శ్రీరంగపతికి అర్పితం చేశాడు కవి .ఆశ్వాసాంత గద్యం లో తండ్రి ఇనుగండ్ల సోమమంత్రి అని ,తిరుమల వేంకటేశ దేశికుని చరణ సేవకుడైన తాను రాశానని చెప్పాడు .దీనినిబట్టి కవి ఆశ్వలాయనస గోత్రీకుడని,నందపురాగ్రహారవాసి అని తెలుస్తోంది .ఇనుగంటి వెంకన్న అగ్రహారం ,నందపురి వలస అనే గ్రామాలు విశాఖజిల్లా గజపతినగరం తాలూకాలో ఉన్నాయని ,కవి ఇక్కడి వాడోకాడో చెప్పలేమని బిరుదరాజువారన్నారు .గద్వాలలో తిరుమలవంశీయులన్నారని రాజుగారన్నారు .
ద్విపదకావ్యాన్ని కవి శ్రీరంగనాయకస్వామి స్తోత్రం తో ప్రారంభించాడు .
‘’శ్రీలక్ష్మి యనుమించు చెలువు వహించు –నీలమేఘస్పూర్తి నెరమించు మూర్తి
కావేరి నడుమ భక్త జనావళి బ్రోవ –తావేరి కొనియున్న ధర్మానువర్తి
అనుపమ శంఖ చక్రాది సమస్త –ఘనసాధనంబుల గనుపట్టు దీరు
ప్రణవ మంత్రాస్పద సంధాయి సకల స౦స్థాయి – శ్రితపుణ్య ఫలదాయి శ్రీరంగశాయి
పాద సరోజముల్ భక్తి సేవించి -ఆ దేవదేవుని ఆత్మలో నుంచి ‘’
జైమిని భారతం లో ‘’ధర్మమర్మములకు దావలమైన ,ధర్మరాజేశ్వమేధ విదానమేను దేవకీ సుతు కృపద్విపదకావ్యంబు –గావింతు ‘’అని చెప్పి కథాక్రమమ వివరించాడు .సరళమైన కవిత్వం తో మనసుకు హత్తుకోనేట్లు రాశాడు .వ్యాసుడు ధర్మరాజుకు హయమేధ విధానం సవిస్తరంగా తెలియజేసి అంతర్హితుడయ్యాడు ..
ఆధారం -.–ఆచార్య బిరుదరాజు రామరాజుగారి ‘’చరిత్ర కెక్కని చరితార్ధులు ‘’-(విస్మృత కవులు –కృతులు )
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -15-5-19-ఉయ్యూరు
—