పుట్టివారి పురస్కారం

పుట్టివారి పురస్కారం

17-5-19శుక్రవారం సాయంత్రం గుడివాడ లైబ్రరీలో శ్రీమతి పుట్టినాగ లక్ష్మి అందజేసిన పురస్కారం

 

పుట్టి వారి పురస్కార ప్రదానోత్సవం

తలిదండ్రులమీద అమితమైన భక్తీ తాత్పర్యాలు ఉండవచ్చు ,వారి గురించి గొప్పగా చెప్పుకోవచ్చు కాని వారి ఆశయాలసాధనకు ఒక సంస్థ నెలకొల్పి ,,దాన్ని సామాజిక సేవా కేంద్రంగా మలచి ,ప్రతిసంవత్సరం వారిని స్మరించే విశిష్ట కార్యక్రమ౦ నిర్వహిస్తూ ,సమాజంలో లబ్ధప్రతిస్టు లైన వివిధ రంగాలకు చెందిన వారిని వడబోసి ఎన్నిక చేసి వారికి ఆ రోజు పురస్కారాలు అందజేయటం ఏ కొందరో చేస్తున్న విశేషమైన కార్యక్రమం .అలాంటి అరుదైన కార్యక్రమాన్ని చేబట్టి పోలీస్ ఆఫీసర్ అయిన తమ తండ్రి కీశే శ్రీ పుట్టి వెంకటేశ్వరరావు గారి పేరిట ‘’సామాజిక సంస్థ ‘’ఏర్పరచి ప్రతి ఏడాది ఇలాంటి విభిన్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నగుడివాడకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయిని  శ్రీమతి పుట్టి నాగలక్ష్మి మిక్కిలి అభినందనీయురాలు .

తమ తండ్రిగారి 13వ వర్ధ౦తి నాడు 17-5-19 శుక్రవారం సాయంత్రం గుడివాడ ‘’షా గులాబ్ చాంద్ ఫాజ్మల్ జీనావాత్ ప్రధమ శ్రేణిశాఖా గ్రంధాలయం లో ‘’ప్రతిభా పురస్కార ప్రదాన సభ ‘’నిర్వహించి అందరి దృష్టినీ ఆకర్షించి అందరి మనసులలో స్థిర స్థానం సంపాదించుకొన్నారు .నాకు కూడా పురస్కారం ఇవ్వబోతున్నట్లు ,ఆమె సుమారు వారం క్రితం ఫోన్ చేసినా, నేను అందుబాటులో లేనందున ,ఆబాధ్యత శ్రీ పూర్ణచంద్ గారికి చెప్పటం, ఆయన ఫోన్ చేసినప్పుడూ నేను స్పందిచక పోవటం వలన నేనే ఆయనకు కారణం అడగటం ఆయన వివరంగా చెప్పటం నేను సరేననటం జరిగిపోయిది. ఆతర్వాత దాదాపు ప్రతిరోజూ నాగలక్ష్మి గారు నాకు ఫోన్ లో టచ్ లో ఉన్నారు . వాట్స్ అప్ లో పెట్టిన’’ ఎర్రక్షరాల ‘’ఆహ్వాన పత్రాన్ని శివ లక్ష్మి నాకు పంపితే ,ఆ అక్షరాలంటే భయపడే నేను ,అందులో చదవటానికీ ఇబ్బంది కూడాపడి నా పేరుమాత్రం చూసుకొని అందరికీ ఫార్వార్డ్ చేశాను .

శుక్రవారం సాయంత్రం 4-30కు ఉయ్యూరు నుంచి షేర్ ఆటోలో పామర్రు చేరి ,అక్కడ మరో ‘’షేరు’’లో ఎక్కి గుడివాడ చేరి సభాస్థలికి వెళ్లేసరికి సాయంత్రం 5-45అయింది .అప్పటికే కార్యక్రమం షురూ అయింది  .అదే -గుంటూరు కు చెందిన విశ్రాంత ప్రాచార్యులు ,’’పర్యావరణ పరిరక్షణ ప్రధాన అంశం ‘’గా రాసి దర్శకత్వం చేసి మహిళామణుల చే నిర్వహిస్తున్న ‘’ప్రకృతి విలాసం ‘’

ఇందులో శ్రీమతి భమిడి కమలాదేవి (తణుకు )శ్రీ లలితా పరమేశ్వరిగా ,ఆచార్య రాజ్యలక్ష్మి శ్యామలా మంత్రిణి గా ,వసంత ఋతువు పాత్రను శ్రీ మతి యెన్ కనకదుర్గ (నూజివీడు )గ్రీష్మర్తు ను శ్రీమతి సి హెచ్ కళ్యాణ లక్ష్మి (విజయవాడ ) వర్షఋతువు ను శ్రీమతి చల్లా సీతామహాలక్ష్మి (విజయవాడ )శరత్తుగా డా.  శ్రీమతి వేమూరి సత్యవతి (విజయవాడ )హేమంత రుతువుగా డా.శ్రీమతి మైలవరపు లలితకుమారి (గుంటూరు )శిశిరఋతువు ను డా .శ్రీమతి తాడేపల్లి వరలక్ష్మి (తణుకు ) చక్కగా పోషించి ,రుతుధర్మాలను వివరిస్తూ ,అందులో వచ్చే పండుగ పబ్బాలను ,వాటిలోని పరమార్ధాలను విశేషాలను చేతిలో స్క్రిప్ట్ లేకుండా చక్కగా వివరించి ఆకర్షణీయంగా వివరించి  అందరి మన్ననలనందుకొన్నారు.అందులో లలితా పరమేశ్వరి గా భమిడి కమలాదేవిగారు అద్భుతంగా ఉండటమేకాదుసాక్షాత్తు ఆ పరాభట్టారిక మన ఎదుట ఉన్నంత పవిత్రతను నిండు తనాన్ని చేతు లెత్తి నమస్కరించేట్లుగా పోషించారు .తర్వాత నాకు బాగా నచ్చినపాత్ర లలితకుమారిగారి హేమంతం .అద్భుతః అనిపించింది గొప్ప విదుషీమణి అవటం తో పాత్ర స్వరూప స్వభావాలతో బాగా రాణించారు  . ఈ సాహిత్యరూపకం రెండేళ్లలో 12 ప్రదర్శనలు పొంది దిగ్విజయం పొందింది .నేను అభినందిద్దామనుకొంటే సభ అంతా  అయాక  లలితకుమారిగారు  నా వద్దకు వచ్చి తాను రాసిన ‘’ఆంద్ర మహాభాగవతము –సఖ్యభక్తి ‘’పుస్తకాన్నిందించారు .నేను సరసభారతి ఆహ్వానిస్తే ఉయ్యూరు రావాలని కోరాను తప్పక వస్తానన్నారు . ఇవాళ అంటే శనివారం ఆమెకు బుక్ పోస్ట్ లో మన పుస్తకాలు 4పంపాను .

అందరూ శ్రమపడి వ్యయప్రయాసలకోర్చి ఈ వేసవిలో మన హృదయాలను రసప్లావితం చేయటానికి చాలా శ్రమపడ్డాడు .వీరి టీం నాయకు రాలు రాజ్యలక్ష్మి గారి పూనిక రచన దర్శకత్వం మార్గదర్శకం మిక్కిలి అభినందనీయం .కాని అసలే పైన అట్టలు ఊడిపోయి  ,ఎసిలున్నా పని చేయలేదో లేక వేయటం మర్చే పోయారో తెలీదు కాని  చమటలో తడిసి ముద్ద అయ్యాము అందరం .అన్ని రుతువులుకలిసి’’ గ్రీష్మరుతువై ‘’ప్రకృతి విలాసం బదులు ‘’విలాపం ‘’తెచ్చినట్లనిపించింది .కనుకఅక్కడ  ప్రకృతి సహకరించి ఉంటే రూపకం మరింత ఆకర్షణీయంగా ఉండేది .ఈ విషయాలను సభలో చెబుదామనుకోన్నాకాని  బాగుండదేమోనని సంకోచించి సభ అయిపోయి టిఫిన్లు కూడా తిన్నాక కేబి లక్ష్మి గారి దగ్గరకు వెళ్లి నెమ్మదిగా చెప్పగా ఆమె ,పగలబడి నవ్వి’’ ఎంత బాగా గమనించారు మీరు ‘’అన్నారు .ఏది ఏమైనా ఒక గొప్ప ప్రదర్శన గుడివాడలో ఏర్పాటు చేయి౦చిన ఘనత శ్రీమతి పుట్టినాగలక్ష్మి  గారిది.

సాయంత్రం 6-30 అయింది రూపకం పూర్తయ్యేసరికి .ఆతర్వాత డా జి వి పూర్ణ చ౦ద్ అధ్యక్షతన బిరుదప్రదాన ,పురస్కార సభ ప్రారంభమైంది .ముఖ్య అతిధిగా గుడివాడ అక్కినేని నాగేశ్వరరావు కళాశాలకార్యదర్శి శ్రీ కాట్రగడ్డ సింహాద్రి అప్పారావు ,ఆత్మీయ అతిధులుగా అదే కాలేజికి చెందిన విశ్రాంత గ్రంథాలయాదికారి శ్రీ పావులూరి శ్రీనివాసరావు ,బాల సాహితీవేత్త శ్రీమతి భమిడిపాటి బాలా త్రిపురసుందరి ,మచిలీపట్నం అన్నపూర్ణ వృద్దాశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీమతి కరెడ్ల సుశీల పాల్గొని ఇచ్చిన సమయం లో తమ మనోభావాలను వివరించారు .ఎవరూ ‘’సమయపు సరిహద్దు ‘’దాటకుండా పూర్ణచంద్ గట్టిగా,నిక్కచ్చిగా సెంట్రీ డ్యూటీ చేశారు  .

తర్వాత ప్రపంచ తెలుగు రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారికి ‘’సాహితీ సేవా సేనాని ‘’బిరుదును ,శ్రీమతి డా కే బి లక్ష్మిగారికి ‘’తెలుగు కథా కల్పవల్లి ‘’బిరుదును అందజేస్తున్నట్లు ,ఎందుకు ఇస్తున్నారోకూడా తెలియజేసి పూర్ణచంద్ ప్రకటించగా అ౦దరూ హర్షధ్వానాలతో ఆమోదించారు .పిమ్మట ప్రతిభా పురస్కార ప్రదానం జరిగింది .ముందుగా గుడివాడకు చెందిన 92ఏళ్ళ సీనియర్ రంగస్థల నటులు శ్రీ బొడ్డపాటి సువిశ్వేశ్వరరావు ,,సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ,భావతరంగిణి మాసపత్రిక సంపాదకులు శ్రీ భవిష్య ,ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం అధ్యక్షులు శ్రీ వేములపల్లి కేశవరావు ,రచయిత్రి ,విప్లవవీరుడు అల్ల్లూరి సీతారామరాజు గారి వంశీకురాలు యెపిఐఐసి మేనేజర్ శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి ,స్థానిక పొట్టి శ్రీరాములు హైస్కూల్ వ్యాయామోపాధ్యాయులు శ్రీ మడకా వెంకట సత్య సాయి ప్రసాద్ గార్లకు గుత్తికొండ ,పూర్ణచంద్ ల చేతులమీదుగా పుట్టి వెంకటేశ్వరరావు స్మారక ప్రతిభా పురస్కారాలను అందజేయించారు తానూ, తమతల్లిగారు ,కుటుంబ సభ్యుల సమక్షంలోనాగలక్ష్మిగారు  . బిరుదు గ్రహీతలు,పురస్కారగ్రహీతల చేత ముందే మాట్లాడించి ఒక కొత్త ప్రక్రియ చేబట్టి తర్వాత సత్కార కార్యక్రమం నిర్వహించటం చాలాబాగుంది .పురస్కారంగా శాలువా జ్ఞాపిక ,శ్రీమతి పుట్టినాగలక్ష్మి అక్టోబర్ లో గాంధీ జయంతి నాడు వెలువరించిన ‘’స్టాంపుల్లో మహాత్ముడు ‘’పుస్తకం ,అతిదులందరికి రెండేసి బంగినపల్లి మామిడి పళ్ళు అందజేశారు .

ఈ సభలో కొన్ని తమాషాలు –కేబి లక్ష్మిగారు సభాముఖంగా ‘’దుర్గాప్రసాద్ గారు నన్ను ఉయ్యూరుకు పిల్చి సరసభారతి పురస్కారం ఇంతవరకు ఇవ్వలేదు అని అభియోగం మోపుతున్నాను ‘’అన్నారు నవ్వుతూ .వెంటనే నేను ఫ్లోరా స్కూల్ లో సరసభారతి కార్యక్రమం లో గుత్తికొండ వారి ఆధ్వర్యం లో సత్కరించాము ‘అనగా అలాకాదు ‘’నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి మీ చేతులతో సన్మానం చేయాల్సిందే ‘’అన్నారు బుంగమూతి పెట్టి అల్లరిపిల్లలా .సరే అలాగే చేస్తాం అన్నాను .లక్ష్మిగారు నాకు గొప్ప సాహితీ ఫాన్ .నాకు ఆమె అంటే విపరీతమైన సాహిత్యాభి భిమానం . అందుకే అంత చనువుగా మాట్లాడారు .

పూర్ణ చంద్ గారు నా గురించి చాల మంచి విషయాలు చెప్పారు .నిరంతర రచనా వ్యాసంగ శీలిగా  పేర్కొన్నారు .సంస్కృత కవులపై ఎవరూ చేయేనంత కృషి చేసి మూడు సంపుటాలు ప్రచురించారు .ఏదైనా విషయం ఇచ్చి రాయమంటే గడువుకు ముందే రాసి పంపటం ఆయన తీరు. మాటలోఎంత స్పీడో రచనలోనూ అంతకంటే ఎక్కువ స్పీడ్ అన్నారు .ఈ సారి  కృష్ణా జిల్లా రచయితల సంఘం సమావేశం ఉయ్యూరు లో దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యం లో జరిపించాలి అనగానే అందరూ చప్పట్లు కొట్టి నా గుండెలో రైళ్ళు పరిగెత్తించారు .సరసభారతి కార్యక్రమాలకోసం ఏ ఒక్కరినీ ఒక్క రూపాయి చందా అడగకుండా పదేళ్లుగా నిర్వహిస్తున్నాము . కృష్ణాజిల్లా రచయితల సంఘం సభలకు విరాళాలకోసం కెసీపి సహాయం అడగటానికి సుబ్బారావు ,పూర్ణచంద్ గార్లతో కలిసి  వెళ్ళటమేకాని ,ఎప్పుడూ మా సభలకు వారి ఆర్దిఅక సాయం కోరలేదు .అలా నడుపుకొస్తున్నాం .సరే ఎందుకొచ్చిందో పూర్ణచంద్ గారి నోటి వెంట ఆమాట . భవిష్యత్తు ,మాసువర్చలాన్జనేయ స్వామి తేల్చాలి .

నేను మాట్లాడుతూ ‘’శ్రీ లక్ష్మీ నృసింహ జయంతి నాడు, రేపు బుద్ధ ,అన్నమయ్య జయంతి సందర్భంగా ఇందరు ప్రతిభామూర్తుల సమక్షం లో పురస్కారంఅందుకోవటం ఆనందంగా ఉంది .నేను రాసినవన్నీ ఒక ఎత్తు అయితే ‘’కోన సీమ ఆహితాగ్నులు ‘’గురించి అంతర్జాలం లో రాసింది ఒకయెత్తు. దీన్ని దేశ విదేశాలలోని వారంతా స్వాగతించి అభినందించారు .అది నా అదృష్టం .నాగలక్ష్మిగారు ఎన్నో సార్లు తమ సభలకు రమ్మని ఫోన్ లో పిలిచేవారు  .ఎప్పుడూ రాలేదు .దాదాపు 15ఏళ్ల తర్వాత గుడివాడ సాహిత్య సభలో పాల్గొన్నాను .అంతకుముందు శ్రీ వసుధ చేసే సభలకు చాలాసార్లు వచ్చాను .కడిమిళ్ళ వారి జంట అవధానానికి వచ్చాను చివరిసారిగా మిత్రుడు శ్రీ తుమ్మోజు రాలక్ష్మణాచార్య్యులు గారికి  స్థానిక  ‘’అమ్మ సేవాసమితి’’ పురస్కారం ప్రదానం చేస్తున్నప్పుడు ఫోన్ చేసి నేను రావాలనికోరితే వచ్చాను .మళ్ళీ ఇప్పుడు గుడివాడలో కాలుపెట్టాను .తండ్రి పేరిట పురస్కారం నేను అందుకోవటం ఇది మూడవ సారి .మొదటిసారి 2012లో అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం షార్లెట్ లో మా అమ్మాయి శ్రీమతి విజ్జి అల్లుడు  అవధాని దంపతుల ఇంటిప్రక్కన ఉన్న శ్రీమతి గాయత్రి తన తండ్రి గారి తిథి రోజున నన్ను పిలిచి భోజనం పెట్టి శాలువాకప్పి 100డాలర్లు ఇచ్చి  సరసభారతికి వినియోగించమని కోరింది .రెండవది ఈ సంవత్సరం ఏప్రిల్ 2న  బెజవాడలో శారదా శ్రవంతి నిర్వాహకులు శ్రీ పంతుల వెంకటేశ్వరరావుతమ తండ్రిగారి స్మారక ఉగాది పురస్కారం అందజేశారు ,ఇప్పుడు శ్రీమతి పుట్టినాగలక్ష్మి గారు తమ  పితృ పాదుల జ్ఞాపకార్ధం సాహితీ పురస్కారం అందించారు  ఇది నాకు ‘’పోలీస్ అవార్డ్ ‘’లాగా అనిపించి హాయినిచ్చింది .ఈ మూడిట్లో రెండు కూతుళ్ళు ఇచ్చినవి .తండ్రిపై కూతుళ్ళ  కున్న మమకారానికి గౌరవాదరాభిమానాలకు ఇవి నిదర్శనలు .నాగలక్ష్మిగారు మరింత సాహితీ సేవ  చేస్తూ తలిదండ్రుల ఋణం తీర్చుకోవాలని కోరుతున్నాను .

మరోకమాట –శ్రీ బొడ్డపాటి చంద్ర[i]శేఖరరావు గారు గురువారం రాత్రి ఫోన్ చేసి గుడివాడలోశుక్రవారం జరిగే పురస్కార గ్రహీతలలో తమ తండ్రిగారు కూడా ఉన్నారని చెప్పేదాకా నాకు తెలియదు .రావు గారు సభకు వచ్చారు .92ఏళ్ళ వారి తండ్రిగారికి సరసభారతి తరఫున పురస్కారం 27,28,29లలో జరిగే శ్రీ హనుమజ్జయంతి కార్యక్రమాలలో ఒకరోజు అందజేస్తామని ఇంతవరకు నాటకరంగం లో వారి ప్రతిభను గుర్తి౦చ లేకపోవటం సిగ్గుగా ఉందని చెప్పి ,సభాముఖంగా కూడా ప్రకటించి సంతృప్తి చెందాను .

ఇవాళ శనివారం  బొడ్డపాటివారికి  నెట్ లో ఆహ్వానం పంపి ఫోన్ చేసి చూడమని చెప్పగా ఆయన గుడివాడలోని తమ తండ్రిగారు సోదరులతో సంప్రదించి 27వ తేదీ సోమవారం ఉయ్యూరు వచ్చి పురస్కారం  తీసుకొంటారని  తెలియజేసి ఆనందం కలిగించారు .

ఈ సభలో నా అజ్ఞానం బయట పడిన సందర్భం .సభలోనేను కూర్చున్న సీటు వెనక సీటులో కూర్చున్న ఒక పెద్దాయన నన్ను చూసి నవ్వితే నవ్వానే కాని ఆయనెవరో గ్రహించలేకపోయాను. ఆయనే పలకరిస్తే ‘’నిస్సిగ్గుగా ‘’మిమ్మల్ని గుర్తు పట్టలేదు అన్నాను ఆయనే నేను కోట  సీతారామాంజ నేయులు , మిమ్మల్ని చూడటానికి వచ్చాను ‘’అనగా తలది౦చు కొన్నాను సిగ్గుతో .వారు మా గురు వరేణ్యులు బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రిగారి కుమారులు .విశ్రాంత కెమిస్ట్రీ లెక్చరర్ ,బేతవోలు వాస్తవవ్యులుల. శ్రీ కోట సీతారామాంజనేయులు గారు .సారీ సారీ అని చెప్పినా మనసుకు సమాధానం చెప్పుకోలేకపోయాను .ప్రతి సెప్టెంబర్ 5గురుపూజోత్సవానికి వారు ఉయ్యూరు వస్తూనే ఉన్నారు .ఎలా గుర్తించలేకలేకపోయానో ఆశ్చర్యం. అజ్ఞానమే అనుకొన్నాను .ఆయన నాకు ఒకసంచీలో రెండు భగవద్గీతలు ,ఒక స్వామివారి ఫోటో పెట్టి అందజేసి ,తము ఇంటికి వెళ్ళాక మెయిల్ రాస్తామన్నారు .

సభ అంతా అయ్యేసరికి రాత్రి 9 దాటింది .అందరికి ఇడ్లీ ,గారే ,స్వీటు పెట్టారు .తినేసి పామర్రుకు పరుగు లంకించుకొన్నాను .

నేనుఉయ్యూరు చేరే సరికి  రాత్రి 10-30అయింది .పామర్రుదాకా షేర్ ఆటోలో వచ్చి ఉయ్యూరుకు ఆటో కోసం ఎదురు చూస్తుంటే ,సుమారు 30ఏళ్లక్రితం ఉయ్యూరు హై స్కూల్ లో నాశిష్యుడు పోలినాయుడు వచ్చి ‘’సార్ నేను ఇప్పుడే  అవనిగడ్డ నుంచి వస్తూ మిమ్మల్ని చూసి కారు ఆపాను కార్లో వేద్దాం రండి ‘’అని సాదరంగా పిలిచి ఎసికారులో ఉయ్యూరులో మా ఇంటి దగ్గర దింపాడు .మజ్జిగాన్నం తిని, ఫోటోలు పెట్టి ,కోట సీతారామా౦జ నేయులు గారికి ‘’మన్నించండి ‘’అని మెయిల్ రాసి అర్ధరాత్రి నిద్రకు ఉపక్రమించాను .

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-5-19-ఉయ్యూరు

 

— 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.