15-త్రిలోక భేది
‘’సకల ధర్మ సారం ‘’కర్త త్రిలోక భేది .ఇది అసలుపపేరో బిరుదో తెలీదు .పీఠిక లేని 4ఆశ్వాసాల గ్రంధం .మధ్యలో కృతిపేరు ‘’సకలధర్మ సారాయ౦ ‘’అయింది .ఆశ్వాసాంత గద్య లో కవి తనను గురించి చెప్పాడు –‘’నవరసానుబంధ బంధుర ప్రబంధ నిబంధ చాతురీ ధురీణ ,సకల విద్యా ప్రవీణ గౌతమగోత్ర పవిత్ర గౌరనామాత్య పౌత్ర ,,రామయమంత్రి పుత్ర,సకల జన స్తోత్ర సంభావిత త్రిలోకభేది ప్రణీతంబైన హరి వంశము నందు ‘’సకలధర్మ సారాయంబు నందు ‘’కవి గౌరనమంత్రికి మనుమడు అయి ఉండచ్చునని బిరుదరాజు వారూహి౦చారు .కాలం 1485 అయి ఉండచ్చు .శిదిలభాగం తర్వాత ఉన్న కందపద్యం ,పంచ చామరం లలో శివ్వనమంత్రి శివపూజా దురంధరత్వం చెప్పాడు –
‘కం-శివపూజా పరిపూర్ణా-స్తవ జంగమ పాదపద్మసంసేవక ,స
ద్వివర విహార ,మహామహ – కవి జన సన్మిత్ర తాపఘన సత్పుత్రా ‘’
పంచచామరం –‘’సదా సదాశివార్చనాది సారసాప్త తేజ ,దుర్మదా,మదాదినాగసింహ మానతస్దుర స్థిరా
న్వదాన్వదాను దానకర్ణ పారిజాత జాత స౦-పదా పదాభిరాన లోకపావనాంగ సంహృదా’’
రెండవ ఆశ్వాసం లో కృతి పతి గురించి –
‘’శ్రీ మల్లికార్జునార్పిత –ప్రేమాతిశయాను రాగ పృధ్వీజన సు –
త్రామ ,కరుణాపయోనిధి సీమాంతర జయవిహార శివ్వగ భీరా ‘’
తృతీయాశ్వాసం చివర చెప్పినపద్యం బట్టి శివ్వ మంత్రి అసాధారణ ప్రతిభ కలవాడని తెలుస్తుంది .అందులోని మాలిని పద్యంలో శివ్వన తల్లి మల్లమా౦బ అని తెలుస్తుంది .కవికీ శివ్వనమంత్రికి ఎలాటి సంబంధముందో తెలీదు .నాలుగవ ఆశ్వాసం లో ‘’పాండవులకు సకల ధర్మంబులు దెలుపుటయు ,వారి సన్నిధికి దూత ఏ తెంచుటయు,కృష్ణుడు ద్వారక కేగుటయు అను కథలు గలవు ‘’అని చెప్పాడు కవి .
వ్రాయసకాడు తన ఊరి పేర్లు కూడా చేర్చాడని ,తప్పులుంటే క్షమించమని విన్నపం కూడా చేశాడని రాజుగారన్నారు –
పెద్దలయివారు ప్రేమతో జూచియు –దిద్దరయ్య మీరు తిట్టబోక
సద్దు శాయకురయ్య జాగేలరా మొగిలి –గిద్దె రంగధామ కీర్తి ధామా ‘’
‘’కాళిదాసుకవిత్వం కొంత, తనపైత్యం కొంత’’అన్నట్లు తయారు చేశాడు వ్రాయసకాడు .అతడు వెంకటేశం అనే వైష్ణవ నియోగి బ్రాహ్మణుడు .మెహబూబ్ నగర మండలం షాద్ నగరం తాలూకాలో మొగిలి గిద్దె గ్రామం ఉన్నదని,వ్రాసిన తేదీ 3-1-1646.అంటే గ్రంథంపుట్టాక 200 ఏళ్ళ తర్వాత వ్రాయసగాడు ఈ ప్రతిని రాశాడని ఆచార్య రాజుగారు చెప్పారు .
ఆధారం – ఆధారం -.–ఆచార్య బిరుదరాజు రామరాజుగారి ‘’చరిత్ర కెక్కని చరితార్ధులు ‘’-(విస్మృత కవులు –కృతులు )
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-5-19-ఉయ్యూరు