కవితా కాంతులు వెదజల్లే స్పాటిక ‘’ పటిక పువ్వులు ‘’
హోసూర్ బస్తీ యువక బృందం తరఫున డా అగరం వసంత్ కూర్పరిగా వెలువడిన 13వఉగాది కవితల’’పొత్తం’’నాకు ఈరోజే 8వతేదీ శనివారం ఉదయం అందింది .మధ్యాహ్నం చదివి సాయంత్రం స్పందిస్తున్నాను .ముఖచిత్రంగా ‘’పటికపువ్వులు ‘’తమఅందాన్ని , వైభవాన్ని తెలియ జేశాయి .పటిక ఒక స్పటికం కూడా కనుక రంగులు వెదజల్లే లక్షణాలుంటాయి .ఇందులోని42 కవితలు అలాగే ఉన్నాయి .వివిధభావాలకు వేదికగా , వేర్వేరు ప్రాంతాల కవులు రాసిన కవితలు సామాజిక స్పృహకు దర్పణంలా ఉన్నాయి .అందరూ అభినందనీయులే .హోసూరులో తెలుగు బడులన్నీ నిర్బంధ తమిళ చట్టం కారణంగా తమిళ బడులైపోయి తెలుగు పై అభిమానమున్న అందరికీ ఆశనిపాతమై బాధించిందని ,కనీసం అయ్యవార్లు చొరవ తీసుకొని ఆప్షనల్ భాషగా తెలుగు బోధించమని డా వసంత్ చేసిన విజ్ఞప్తి సత్ఫలితాలనివ్వాలని తెలుగువారందరం మనస్పూర్తిగా కోరుకొందాం .దీనికి తెలుగు సంఘాలు అభిమానులు నాయకులు, తలిదండ్రులు తమ వంతు కృషి చేయాలి .
‘’వివాహం చేసుకున్న వితంతువులా ,జాగృతి నొందిన జాతిలా ,,చైతన్యానికి ప్రతీకలా ,పతాకలా వాడిన మోడు వురుటాకులు తొడిగే నవ వసంతానికి ‘’నిరీక్షిస్తున్నట్లు డా రాధశ్రీ చెప్పారు .’’భూమ్మీద భాషలకు వ్యాకరణాలకు కొదవ లేదు –సంభాషణలే సాధ్యం కాదు ‘’తాను భాషల వైఫల్యం ను౦చి పుట్టానని ,అందుకే తనకు దినవారాలుతప్ప జన్మదినం లేదని ,తానొక నిశ్శబ్దాన్ని ‘’అనీ రాణి శివ శంకర శర్మ ఉవాచ .డా.యెన్ గోపీ మాత్రం ‘శబ్దం శబ్దత్వాన్ని కోల్పోవచ్చు కాని పర్యవసానం వ్యర్ధం కాదు ‘’అంటూ క్రమ౦గా నిశ్శబ్దమే మాట్లాడుతుంది అని ప్రాఫెటిక్ గా చెప్పారు .’’ఈ దేశం లో ప్రశ్నించి ప్రతిఘటించే –ప్రజల సమీకరణేతప్ప –మరో దారిలేదని –‘’కొనసాగుతున్న చరిత్ర చెబుతోందని నిఖిలేశ్వర్ భావన .
భావుకుడు పలమనేరు బాలాజీ ‘’కథ లాంటి మనిషి కవి –మనిషిని చూడటం అంటే జీవించటం –కళ్ళతో కళలతో కలలతో జీవించటం ‘’అని అర్ధం చెప్పి ‘’మనిషిలోపలి మనసుని ,మనిషిలోపలి శిశువునీ –కాపాడుకొనే వాడే –కవి ,మనిషి’’ అని నిర్వచించాడు .’’అవసర హడావిడి –అంతశ్చేతన ను తొక్కేస్తోంద ‘’ ని బాధపడ్డాడు డా టి.శ్రీరంగస్వామి .’’ఉగాది పచ్చని ప్రకృతిలోపరిఢవించే –తొలిపండుగ’’అని సంబరపడ్డాడు రానాశ్రీ .చెన్నై డా.ఉప్పలధడియం వెంకటేశ్వరకు ‘’చెట్టుకొమ్మలన్నీ రామ చిలుకలై ‘’మురిసిపోయాయట.చల్లని సంజెవేళ అతడి’’ హృదయం కాగితప్పడవవుతుంది ‘’
డా.మౌనికి ‘’తాను అంతఎత్తులో నిలబడినప్పుడు –అమ్మ ఒదిగిన పండ్ల చెట్టు లా ,నిలువెల్లా ఆన౦దాశ్రువయింది ‘’అందుకే ‘’అమ్మను మించి మూర్తీభవించిన కవిత్వం ‘’ఈ ధరణిపై లేనే లేదని పించింది మౌనికి .
ఈ పోత్తంలో పెన్నేటి పాటకవి విద్వాన్ విశ్వం ను గుర్తు చేసుకొని కృతజ్ఞత తెలిపాడు ‘’విశ్వం పాట’’లో ఆకుల రఘురామయ్య .అభినందనలు రఘూ ..’’పెన్నేటి పాట అంటే –కస్ట జీవుల బతుకాట –కరువు జీవి కన్నీటి గాధ –చిద్రమై పోయిన బతుకుల అద్దం.’’గంజికరువు చేసిన గాయాన్ని –హృదయవేదనగా మలచాడు ‘’విశ్వం అనే’’ మీసరగండ విశ్వరూపాచారి. ‘’సాహిత్య సృజనతో మానవ పరివర్తన కోరుకొన్న ‘’విద్వాన్ పట్టనే ఇంటిపేరుగా ఉన్న విద్వాన్ విశ్వం .’’చెలి సోయగాల పరిమళాలు –సౌందర్య కుసుమాలై విస్తరించిన వేళ’’డా విస్తాలి శంకరరావు ప్రేమగీతం ఆలపించాడు .ఎస్.శశికళకు ‘’అమ్మానాన్నలే అక్షరాలయం ‘’అనిపించారు –అదే తన జీవితాలయం ‘’అని పరవశించింది .’’గాడితప్పిన బుద్ధులపై దాడి చేసి-మానవుడిగా మార్చమని ‘’సందేశమిచ్చాడు డా యడవల్లి పాండురంగ .’’నాగలి నానీలతో దున్నేసి రైతు ప్రతాపం చూపించాడు ఎస్ ఆర్ ప్రతాపరెడ్డి –‘’గుండె మండితే –రైతు ఝలిపిస్తాడు –దగాకోర్లపై –ముల్లుగర్రా చెర్నాకోలా ‘’అని హెచ్చరించాడు .హోసూరు పెద్దాయన నంద్యాల నారాయణ రెడ్డికి ‘’కొండా కోనా యేరూ సెలయేరూ ‘’లలో తెలుగు భజనాలు హరి కధలు ,కీర్తనలు ప్రతిధ్వనింఛి ‘’ప్రాణవాయువై ,ఊపిరై రక్తమై ప్రాణమై మానమై మౌనమై –గుండెల గుడిలో ,నవనాడుల్లో –వెలుగొందుతూ కొలువైఉన్న ‘’అమ్మనుడి –తెలుగు ‘’ ఇప్పుడు సర్వం కోల్పోయి ‘’ప్రాణవాయువే లేని బొగ్గుపులుసు వాయువే నిండిన ‘’స్థితి చూస్తె కల చెదిరి కన్నీరే మిగిలింది ‘’అనేక యుద్దముల నారియు తేరిన యోద్ధ నారాయణ రెడ్డిగారికి .హోసూరు ప్రాంతం లో తెలుగు ఉన్నతిని అధోగతిని కళ్ళకు కట్టించి కర్తవ్య బోధ చేశారు .రెడ్డిగారూ జిందాబాద్ .
‘’మారుతున్నమనిషిగా -పులుముకొన్న మతం రంగు దులుపుకొని –అంటుకున్న కులతత్వాన్ని వదులుకొని –రాజకీయ రొ౦పిని దాటుకొని –మానవత్వం తోడుగా ‘’కొత్త అడుగు లేస్తున్నానని డా కాళియప్ప పాండు రంగం హామీ ఇచ్చాడు .తెలుగు సిమ్లా, కాశ్మీరం అయిన ‘’లంబసింగి ‘’ ని అక్షర బద్ధం చేశాడు బి శంకరరాజు .సాహో రాజా –‘’అక్కడి కొండపనస –తియ్యని బాసలు చెబుతుంది –మనుషులు పరమ బుద్ధులుగా మారిపోతారు ప్రకృతి తోట తేనీటినందిస్తుంది –జలపాతం ఊయలలూపుతుంది –లిమ్కాకు బదులు తేనే ధారల రుచి తెలుస్తుంది ‘’అంటూ ‘’లంబ సింగి యాత్రలో –కాలం విలంబనమౌతుందని –దృశ్యం ‘’థింసా’’నృత్యమై హృదయం లో పెనవేసుకు పోతుందని పరవశించి చెప్పాడు .
‘’మన ప్రతి ఉశఃషు యుగాధవుతుందట –అందుకే వచ్చే ఉగాదులకు నామకరణం చేయ’’మని పురోహితురాలిగా ‘’ఏం ఆర్ అరుణకుమారి చెప్పింది . ‘’బాధ్యత మరచి బేకారౌతున్న యువత – పెద్దల్ని విస్మరించి పెడతోవలో వనితా ‘’ లను చూసి బాధపడ్డ పరా౦కుశ నాగరాజు ‘’విస్మరించిన బాధ్యత విషాదాన్ని మిగిలిస్తే –పోగొట్టుకొన్న బంధం అతుకుతుందా ?’’అని ప్రశ్నించాడు .కవిని ఆలూరికి ‘’నాగరకతలో అనాగరకత ‘’కనిపించి మానవ సమాజ ‘’లోతులను , జీవనాన్నీ వెలికి తీయాలి ‘’అనిపించింది .’’ఊతకర్ర ‘’కవితలో పఠాన్ ఖాదర్ వలీ ‘’అవసరం ఆవిష్కణకు తల్లిలాంటిది –ఇప్పుడు కట్టెనే అయినా –ఒకప్పటి వృక్షాన్ని –పస్తులున్నవారికి ఫలహారమయ్యాను –సుస్తుగా ఉన్నవారికి శక్తినయ్యాను –రోగులకు ఔషధమయ్యాను –మాడు కాలే వారికి నీడనయ్యాను ‘’అని గతవైభవాన్ని స్మరించి ‘’ఇప్పుడు ఎవ్వరి ఆదరణ లేక –ఎండి ఎండుకట్టె నయ్యాను –నిజంగా పనికిరాని కట్టె నే నేను’’అని వ్యధ చెంది ‘’రేపు నీ సంగతేంటి మహా వృక్షమా “’అని తాత్వికంగా ప్రశ్నించాడు .తెలుగు అక్షరాలు అ ఆఇఈ మొదలైనవి ‘అమృత వర్షం ‘అన్నాడు ఫణీంద్ర విస్సాప్రగడ .’’వచ్చే ,రావలసినకాలం –తప్పకుండా రైతుదే’’అని వంగాల సంపత్ రెడ్డి ’’ఆశాభావంగా అన్నాడు .’’నాట్లు కాలం లోనే –నలగర్ని చూసి మాటలు నేర్చుకొన్నాను-కోతలు కాలం లోనే తెగిన వేళ్ళ సాచ్చిగా-బతుకు కతలు ఎన్నో సదువుకున్నాను-పైరు వాసన తగిలినపుడల్లా -పైరు కర్రనై మొలకెత్తుతుంటాను –కయ్యా, కాలవా కళకళ్ళాడితే కదా-ఊళ్లైనా దేశమైనా ఊపిరి తో తిరగాడేది ‘’అని సుద్ది మాటలు ,పొలం కబుర్లతో అత్యంత నేటివిటి తో చెప్పాడు తెలుగు టీచర్ పల్లి పట్టు నాగరాజు .
‘’వసంతం వచ్చేది ఏడాదికి ఒకసారే –కానీ ఆకలి పేగు నవ్వే ప్రతిసారీ నీకు వసంత రుతువే –కలతెరగని కన్నీటి బొట్టురాలే ప్రాతిసారీ నీకు ఉగాది పండుగే ‘’అని కర్తవ్య బోధ చేశాడు వేంపల్లి అబ్దుల్ ఖాదర్ .’’చిట్టిపోట్టికవితలు ‘’లో డా అగరం వసంత్ గట్టి సత్యాలనే ఆవిష్కరించాడు .1-’’ప్రజలరక్తం ఏరులైతే రాజులైనారు –చెమట చుక్కలు నదులై పారితే –రారాజు లైనారు ‘’’2-’చెమటోడ్చి సంపాదిస్తే నోట్లు –చెమటల్ని పూడ్చి సంపాదిస్తే –కోట్లు ‘’3-యాసిడ్డు గాయంపై –ఎగసి పడిన ఆవిరి –యముడిలామారి –యెన్ కౌంటరై మాయమయింది .4’-’ఎన్నికల్లో కురిసిన నోట్ల వర్షానికి- కొట్టుకు పోయింది –ప్రజాస్వామ్యం –పౌరులసాక్షిగా ‘’
హోసూరు మట్టి సువాసన ,పటిక పూలపరీమళం,అచ్చమైన తెనుగుతనం ,భావుకత ,నేటివిటీ ,సమాజ దృక్పధం నిశిత పరిశీలన ,కర్తవ్యం ,కాపాడుకోవటం మొదలైన రంగులు ప్రతిఫలించిన స్పాటిక పటిక పువ్వులు అభిరుచికీ ,నిబద్ధతకు ప్రతిబింబాలు .కవి సమ్మేళనం నిర్వహించే వారు ,పాల్గొనే కవులు తప్పక వీటిని చదివి స్పూర్తి పొందాలని కోరుతున్నాను ;కూర్పరి డా వసంత్ ను ,కవులందరినీ మనసారా అభినదిస్తున్నాను .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-6-19-ఉయ్యూరు
—