గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 470-సంస్కృత, బౌద్ధ సన్యాసిని   కవయిత్రుల కవితా సమీక్ష -2(చివరిభాగం )

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

470-సంస్కృత, బౌద్ధ సన్యాసిని   కవయిత్రుల కవితా సమీక్ష -2(చివరిభాగం )

పైన చెప్పినట్లు ఇద్ద్దరి ధోరణిలో విభేదాలున్నా ,కొట్టొచ్చినట్లు కనిపించే ఒక మంచి పోలిక కనిపిస్తుంది .బౌద్ధ సన్యాసినుల౦దరో ముక్త కంఠం తో మానవ ప్రేమను ఖండించినా  ,సంస్కృత కవయిత్రులలాగా మగవారిని చులకన చేసి ఎక్కడా చెప్పలేదు .మగవారు క్రూరంగా ప్రవర్తించినా ,మౌనంగా ఉన్నారు లేక తమ తలరాతకు బాధ పడ్డారే తప్ప మగవాళ్ళను ని౦ది౦చలేదు .ఈ విషయం లో ‘’ఈసి దాసి’’ రాసిన  కవిత్వం లో ఆమె ముగ్గురు భర్తలు ఒకరితర్వాత ఒకరు ఆమె తప్పు ఏమీ లేకపోయినా క్రూరంగా ప్రవర్తించి దూరం చేసినా ,వారికి నిస్వార్ధమైన  సేవ చేసి,తన విధేయతను కాపాడుకొన్నది .గతం లో తాను చేసిన తప్పులను తానె ని౦దిచు కొన్నది కానీ , పూర్వపు భర్తలను ఏమీ అనకపోవటం గమనిస్తాం .వారు స్వయం నియంత్రణ పాటించక అధిగమిస్తే ,వాళ్ళ అతిని ఎత్తి చూపక ,వారిలోని మానసిక బలహీనతలను అంగీకరించింది .’’సీహా ‘’తన కామవా౦చలను నియంత్రించుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది.రాజాస్థానం లోని’’ విమల ‘’  తనగత దుస్చే స్టలను  ఒప్పుకున్నదికాని ఎవరినీ ని౦ది౦చలేదు .వారి తప్పేమీ లేకపోయినా మన్మదుడనే మారుడు తమను హింసించినా ,భౌతికసుఖం అనుభవం మొదలైన తమ బలహీనతలను తెలుసుకొని  వాటికి అతీతంగా ప్రవర్తించి మంచి దారిపట్టారు .’’సుభ జీవ కంబానిక ‘’దుస్ట యువకుడి కామ కబంధహస్తాలలో నలిగిపోయినా,దూషణగా ఒక్కమాటైనా అనకపోగా ,అందంగా ఆకర్షణగా ఉన్న తన రెండు కళ్ళవలెనే అనర్ధం జరుగుతోందని గ్రహించి రెండుకళ్ళనూ ఇంకెవరూ ఆకర్షించకుండా ఉండటానికి  తానె పీకేసుకోన్నది  .’’సుమేధ ‘’తాను తపస్సులో ఉండగా భంగం చేసిన ప్రియుడిపై కోపంతో ద్వేషం తో విరుచుకు పడి హడావిడి చేయకుండా అత్యంత ప్రశాంత చిత్తం తో సహనం తో అతడి ప్రవర్తనను మార్చింది .

  ఇంతటి విశాల హృదయం,సహనం క్షమా  ఉన్నవారు  కొద్దిమంది మాత్రమె కనిపిస్తారు .కాని మెజారిటీ బౌద్ధ సన్యాసినులు ఆడవారిపై అఘాయిత్యాలు ,పురుషులను లొంగ దీసుకొనే ప్రయత్నాలను దారితప్పిన మగవారికి ఈ బుద్ధులు పనికిరావని వాటిని వదులుకొని జీవించాలనే  బోధించారు .ఇలా రెండురకాలుగా ఉన్న గాథలలో స్త్రీలకూ పురుషులకు మధ్యఉన్న మౌలిక భేదాన్నిచాటి చెప్పి అన్ని వయసులలో ఉన్నస్త్రీల సహజాత లక్షణాలను రక్షించుకోవాలని చెప్పారు .సంస్కృత ,ప్రాకృత కవయిత్రులు ప్రేమను ప్రేమించారుకనుక  వారి విషయం లో అర్ధం చేసుకోవచ్చు .అలా ఎందుకు ఉండలేక పోతున్నారో కూడా రోహా శశిప్రభలు  చెప్పారుకూడా .కాని బౌద్ధ సన్యాసిని కవయిత్రులకు పురుషులనుండి  ఏమీ ఆశించలేదు కనుక వీరిమార్గం పూర్తిగా భిన్నమైనదే .పురుషులను దూరం చేసుకొంటేనే ముక్తి అని భావించారు కాని పురుషద్వేషం వారిలో లేదని తెలుస్తుంది .స్త్రీ సహజమైన వాత్సల్యం ,సహిష్ణుత,సహనం లకు  ఇంతకంటే గొప్ప ఉదాహరణలేముంటాయి ?   

  గాథలలో మరో ముఖ్యవిషయం గా ఉన్న స్త్రీత్వం ఎక్కడైనా ఒకటే అనిపిస్తుంది .మనసులోని అంతర్గత కోరికలు మంచి గృహిణిగా ఉండటానికే ఇస్టపడుతాయికాని ,గుహలలో బంధింపబడి ఒంటరిగా పవిత్ర కార్యాలకు పరిమితం కారాదని పిస్తుంది .గృహం లో గృహిణి పొందే ఆనందం సంతృప్తి ఇంకెక్కడా లభించవు .దీన్నివదిలి ఇంకేదో ఉన్నతమైనదాని దానికోసం ఆరాటపడదు.

   గాథలలో కొన్ని ‘’నిర్హేతుక వైరాగ్యం ‘’అంటే సహజ వైరాగ్యం  బోధించాయి .దీనికి ఉదాహరణ ‘’ధమ్మా ‘’  .ఈమె తగినవరుని పెళ్లాడినా ,ప్రాపంచిక సుఖాలపై ఏవగింపుకలిగి ,భర్త అనుమతిపొందలేక , అతని మరణానంతరం సన్యాసి అయింది .’’అనోపమ’’సుందరమైనదీ ,అందరి ప్రేమకు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ వివాహం చేసుకోరాదని నిర్ణయి౦చు కొన్నది .అలాగే ‘’గుత్తా ‘’ రోహిణి’’లు ధనిక స్త్రీలైనా పెండ్లికి విముఖత చూపారు .’’సుమేధ ‘’రాజకన్య తనను పెండ్లి చేసుకోవాలనుకొన్న రాజును కాదని బౌద్ధ సన్యాసినిగా మారిపోయింది .ఇవన్నీ నిర్హేతుక వైరాగ్యానికి ఉదాహరణలు .

 ఇప్పుడు ‘’సహేతుక వైరాగ్యం’’ గురించి తెలుసుకొందాం .ఈ వైరాగ్యం కోరికలు తీరనప్పుడు ,జీవితం లో అలసిపోయినప్పుడు ,కొంపలో విపరీతమైన చాకిరీ ,దా౦పత్య సౌఖ్యం , ఇంటి సుఖం లేకపోవటం ,కుటుంబంలో మరణాలవల్లకలిగే దుఖం ,దరిద్రం మొదలైన దుర  దృష్టాలవలన జీవితం పై విరక్తికలిగి సన్యాసం తీసుకోవటమే ‘’సహేతుక వైరాగ్యం’’ .దీనికి మంచి ఉదాహరణ ‘’ఈసి దాసి’’.మూడుసార్లు పెళ్ళాడి, ముగ్గురుభర్తలు దూరం చేస్తే ప్రపంచం మీద విరక్తితో ఆశాభంగం ,ఏవగింపు లతో ప్రపంచాన్ని వదిలేసింది .గూని వాడి భార్య ‘’ముత్తా,,పెళ్ళికి ముందే వరుని మృతికి తల్లడిల్లిన ‘’నందా ‘’, క్రూరుడైన భర్తకు  భార్య  ,ఇంటిచాకిరితో విసిగి వేసారిన’’సుమంగళ తల్లి ‘’,స్నేహితురాలి మరణంతో శొకమూర్తి ఐన ‘’సామా ‘’,ఒకే ఒక కూతురు చావుతో దుఖం ఆపుకోలేక   ‘’ఉబ్బిరి ‘’ ,భర్త ,సంతానం,సోదరులు , తలిదండ్రులను కోల్పోయిన ‘’పటకార ‘’,పిల్లలు ,స్నేహితులు లేని బీద విధవరాలు ‘’చందా ‘’,కొడుకును కోల్పోయిన ‘’వైసిత్తి’’,భర్త ,కొడుకు మరణం పాలైన ‘’కీస గోతమి ‘’,స్వీయ భద్రతాభావం తో భర్తను చంపిన ‘’భద్దా కుండలకేశ’’,విధి వైపరీత్యం వల్ల అల్లుడినే పెళ్ళాడిన ‘’ఉప్పలవన్నా ‘’,మొదలైనవారు .గృహ సౌఖ్యం బాగా ఉండిఉంటె ,ప్రపంచాన్ని వదిలి శాంతికోసం నిర్వాణ మార్గం పట్టే వాళ్ళు కాదని చెప్పటానికి ఆధారాలు లేవు .

  పైన చర్చి౦చిన అనేక విషయాలను బట్టి  ప్రాచీనభారత దేశ స్త్రీలు అంటే వేద ఋషీమణులు బౌద్ధ సన్యాసినులు ప్రాకృత కవయిత్రులు సంస్కృత సాహిత్యానికి చేసిన సేవ అపూర్వమైనది.  సన్యాసినులైనా ఊహాలోకంలో విహరించకుండా ,సాహిత్యం లో ఇతర రంగాలలో అంటే  నాటకం ,చరిత్ర స్మృతి తంత్ర ,వేదాంతం వైద్యం ఖగోళశాస్త్రం గణితం మొదలైన రంగాలలో లోకూడా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించారు .ప్రతిరంగాన్ని అంతర్ దృష్టితో వీక్షించి  సహేతుకంగా నిర్దుష్టంగా నిష్పక్షపాతంగా అద్భుత వివరణలతో  రాసి పరిపూర్ణత చేకూర్చారు .ప్రపంచం లో ఏ దేశం లోనూభారత దేశం లో లాగా  మహిళల చేత  ప్రాచీన సాహిత్యం వర్దిల్లలేదు అన్నది నిర్వివాదమైన  అంశం.దీనికి మనం గర్వపడాలి .మనలాగాసంపూర్ణ సంస్కృతి మహిళల చేత ఉత్తుంగ శృంగంగా పోషి౦ప బడిన  దేశం ప్రపంచం లో లేనే లేదు .ఇంతటి ఉన్నత సంస్కృతిని మన మహిళామణులు మనకు వారసత్వంగా అందించినందుకు మనం ఏమిచ్చి వారి ఋణం తీర్చుకోగలం ?వాటిని అనుసరించి ఆచరించి  భద్రపరచి వారసులమని రుజువు చేసుకొని గర్వపడాలి .

  ఇటీవలికాలం లో భారత దేశంలోనూ బయట ప్రపంచం లోనూ ఆనాటి భారతీయ మహిళా గౌరవం అతితక్కువ ,బూజుపట్టింది అనే అభిప్రాయం ఉంది .ఇంట్లోను సమాజం లోను వారి స్థానం ఎప్పుడూ ఉన్నతమైనదే .బాగా విద్యావంతులేకాక గొప్ప సృజన శీలురు .వారిమేధ అద్వితీయంమాత్రమేకాదు ఉత్తమ కళా సృజన చేసిన మహిళామణులు కూడా ..ఇంతటి ఉన్నత ఉత్తమ సృజన తో సమాజానికి మార్గ దర్శకులై ధృవతారలుగా నిలిచారు వారు. ‘’ఉత్త జమానా సరుకు ‘’కాదని గ్రహించాలి .పుతులతో సమానంగా  కూతుళ్ళనూ  చదివించి తీర్చి దిద్దిన విదుషీమణులు వారు  .సోదరులులాగే సోదరిలుకూడా ప్రతిభా విశేషాలతో  వన్నెకేక్కారు .భర్తలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించి ఉత్తమ గృహిణులు అనిపించారు .చదువు సమస్కారాలతో పిల్లలను తీర్చి దిద్ది ఆదర్శ మాతృమూర్తులు ,గురువులు అయ్యారు .ప్రజాసేవలో పునీతులయ్యారు .దక్షత ఉన్న ద్రష్టలయ్యారు .విద్యావేత్తలై సంఘం లో నైతికవిలువలకు మూలస్తంభాలయ్యారు .నిత్య సమాజోన్నతికి బద్ధ కంకణ ధారులై మార్గ నిర్దేశం చేశారు  .వారి కృషి ,అంకితభావం మహత్తరం .మహిళాభ్యున్నతిలేని సమాజం,దేశం ఏ విధంగానూ అభి వృద్ధి చెందదు అని అందరం గుర్తించాలి గ్రహించాలి  .భారతజాతి ధార్మిక పునరుజ్జేవనానికి పురుషునితోపాటు స్త్రీలకూ సమాన హక్కులు బాధ్యతలు ఉండాలి .అప్పుడు వారు సాధించలేనిది ఏమీ ఉండదు ..’’ఆడాళ్ళూ మీకు జోహార్లు ‘’

  సంస్కృత ప్రాకృత వేద బౌద్ధ సన్యాసినుల కవిత్వ పరిశీలన సమాప్తం .

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-6-19-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.