నా దారి తీరు -122 అడ్డాడ హైస్కూల్ లో ఆడపిల్లల  ‘’జిల్లా లెవెల్ గ్రిగ్ మెమోరియల్ గేమ్స్’’ నిర్వహణ

నా దారి తీరు -122

అడ్డాడ హైస్కూల్ లో ఆడపిల్లల  ‘’జిల్లా లెవెల్ గ్రిగ్ మెమోరియల్ గేమ్స్’’ నిర్వహణ

 నిజంగా ఇదొకఅద్భుతం .అడ్డాడ హై స్కూల్ చరిత్రలో సువర్ణాధ్యాయం .అసలే ఎకనమికల్ గా ఎకడమికల్ గా బాగా వెనుకబడిన హైస్కూల్.ఎలాగో అలా తంటాలుపడి ,అందరి సహకారంతో జిల్లాలోనే మంచి పేరు పొందిన స్కూల్ గా తీర్చి దిద్దాము .మా డ్రిల్ మాస్టర్ శ్రీ  నాగేశ్వరరావు రెండుమూడేళ్ళనుంచి ‘’సార్!ఉపాధ్యాయులు  బాలబాలికలు ఆటలలో జిల్లా లెవెల్ లో ఎన్నో ప్రైజులు సంపాదించాం .అద్దాడ అంటే ఆటల్లో మేటి అని గుర్తింపు వచ్చింది మంచి గ్రౌండ్ ఉంది .సహకరించే స్టాఫ్ ఉంది .మనం జిల్లాస్థాయి ఆడపిల్లల ఆటల పోటీ నిర్వహణ తీసుకొందాం .దాన్ని అద్భుతంగా నిర్వహిద్దాం .అన్ని రకాల సహకారం మనకు లభిస్తుంది ‘’అని చెవిలో జోరీగలాగా రొద చేస్తూనే ఉన్నాడు .చూద్దాం చూద్దాం అని వాయిదా వేస్తున్నాను .సరిగ్గా నిర్వహించక పొతే ఇప్పుడు స్కూలు పొందిన కీర్తి వైభవం మట్టి కొట్టుకు పోతుందని బెరుకు .తర్వాత ఇందులో ఏదో మిగుల్చుకున్నారని లాభపడ్డారని నెపం వేసేవాళ్ళు ఎక్కువ .అప్పటికే చాలా స్కూళ్ళు ఆ అపవాదు తో తలదిన్చుకోలేని స్థితికలిగింది .కనుక ‘’అడుసు త్రోక్కనేల కాలు కడుగనేల ‘’?అని పించింది .డ్రిల్ మాస్టర్ తోపాటు స్పోర్ట్స్ మన్ అయిన స్టాఫ్ సెక్రెటరి శ్రీ డి వీరభద్రరావు  ,సైన్స్ మాస్టర్ శ్రీ వెంకటేశ్వరరావు ,లేడీ టీచర్స్ ,ఆడపిల్లలు కూడా ఒత్తిడి చేశారు .కనుక దీనిపై ఆలోచించాల్సిన సమయం వచ్చిందిఅని పించింది .ప్రాధమిక అడుగులు వేయాలని నిశ్చయించాను .

   స్టాఫ్ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ ప్రపోజల్ ను అందరి ముందు ఉంచాను .అందరూ తప్పకుండా మనం నిర్వహిద్దాం ఎలాంటి సహాయ  సహకారాలకైనా సిద్ధం అని ముక్తకంఠం తో చెప్పారు .స్కూల్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీ అడుసుమిల్లి రామబ్రహ్మం గారిని పిలిపించి విషయమ౦ చెప్పాం .’’మంచి ఆలోచన తప్పకుండా చేద్దా౦ నా వంతు కృషి నేను చేస్తాను ‘’అని హామీ ఇచ్చారు .తరువాత స్కూల్ అసెంబ్లీ లో విద్యార్ధులకు వివరించి చెప్పాను .వాళ్ళు అందరూ  ఏమాత్రం సందేహించకుండా ‘’చేసేద్దాం  చుట్టుప్రక్కల ఊళ్లకు వెళ్లి పెద్దవారందరినీ కలిసి  ఆర్ధిక సహాయం చేయమని మేమంతా అడుగుతాం  మీతో కలిసి నడుస్తాం’’అని భరోసా ఇచ్చారు .సరే వాతావరణం బాగానే ఉంది .కనుక డియివో కాన్ఫరెన్స్ లో ప్రపోజల్ పెట్టి ఔను అనిపించుకోవాలని నిర్ణయించాము .అయితే మా నాగేశ్వరరావు ‘’సార్!మనం ఎవరికీ పోటీ గా ఉండద్దు అందరూ  మనకే  ఇచ్చేట్లు తెరవెనుక నా ప్రయత్నం గా ఇతర డ్రిల్ మాస్టర్స్ తో నేను మాట్లాడుతాను  ‘’అన్నాడు సరే అన్నాను .బహుశా 1996లో జనవరి లో బాలికల ఆటలపోటీలు అడ్డాడ హైస్కూల్ నిర్వహిస్తుంది ‘’అని డియివో గారితో ప్రపోజల్ చేయించాం .శుభం భూయాత్ .

        నిర్వహణ

  ఆడపిల్లల జిల్లాస్థాయి ఆటలపోటీలు ను ‘’గర్ల్స్ మీట్’’అంటారు .ఇవి గ్రిగ్ మెమోరియల్ పోటీలు .ప్రతి ఏడాది జరుగుతాయి .మగపిల్లలకు వివిధ జోన్ లలో అంటే పటమట జోన్ ఆకునూర్ జోన్ గుడివాడ కైకలూర్ నాగాయలంక ఉయ్యూరు నందిగామ ,జగ్గయ్యపేట బందరు  మైలవరం తిరువూరు  మొదలైన  చోట్ల  బాయ్స్ కు ఉపాధ్యాయులకూ జరుగుతాయి .ఫైనల్స్ మాత్రం సెంట్రల్ జోన్ లో బాయ్స్ కు టీచర్స్ కు జరుగుతాయి స్పోర్ట్స్ కూడా సెంట్రల్ జోన్ లోనే .

  కానీ ఆడపిల్లలకు జిల్లా అంతా ఒకే యూనిట్ .అంటే ఒకే ఒక్క చోట మూడురోజులు జరుగుతాయి .బాడ్మింటన్ త్రోబాల్  సాఫ్ట్ బాల్  ,టేన్నికాయిట్అనే రింగు ఆట , షటిల్,కబాడీ ఖోఖో మొదలైన వాటిల్లో పోటీలు ఉంటాయి .జిల్లాలోని వివిధస్కూల్స్ నుంచి పాల్గొనే జట్లకు వసతి  టిఫిన్ భోజన సదుపాయాలూ ఉచితంగా సమకూర్చాలి .ప్రైజ్ లు,జ్ఞాపికలు  అందేయాలి  .సహాయపడిన డ్రిల్ మాస్టర్లకు కూడా ఇవన్నీ సమకూర్చాలి .కోర్ట్ లు వేయాలి .బాల్స్ నెట్ లు ,రింగులు ,ఖోఖో పోల్స్ ,సున్నం తాళ్ళు వాలంటీర్లు వీరందరికీ పైవారికి లాగానే భోజనాలు మధ్యమధ్యలో టీ కాఫీలు  సాయం వేళ స్నాక్స్ అందించటం  మంచి నీటి సౌకర్యం టాయిలెట్స్ సమకూర్చటం అన్నీ సక్రమంగా చేస్తేనే సక్సెస్ లేకపోతె బండబూతులు తినాలి .ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేయాలి .టిఫిన్లు భోజనాలలో ఏమాత్రం కక్కుర్తి పనికి రాదు ఏ క్లాస్ గా అన్నీ ఉండాలి అని నా ,మా అభిప్రాయం .మూడు రోజులకు  కనీసం ఖర్చు 30వేలరూపాయలు అని అంచనా వేశాం .ఇంతడబ్బు సమకూర్చుకొని రంగం లోకి దిగాలి .ఇవన్నీ ఎప్పటికప్పుడు చిన్న కమిటీ వేసుకొని అందరం కలిసిఆలోచించాం .అందరం ఇక వెనక అడుగు ప్రశ్నే లేదు ము౦దుకు దూకటమే అనుకొన్నాము .

          ముందుగాస్టాఫ్ మెంబర్లు అందరూ జీతం లో కట్ చేసుకొనే విధం గా తలొక వెయ్యి రూపాయలు విరాళంగా అందజేశారు .రసీదు పుస్తకాలు ప్రింట్ చేయించి రసీదులిచ్చాం .రామబ్రహ్మ౦గారు ,కమిటీ మెంబర్లు కూడా డబ్బు ఇచ్చారు .డా శ్రీ అప్పారావు గారు అడ్డాడ వారే పామర్రులో హాస్పిటల్ నడుపుతున్నారు మంచి వితరణ శీలి ఆయనా  విరాళం ఇచ్చి  అక్కడ కలవాల్సినవారి పేర్లు మాకు చెప్పి కలవమన్నారు అలాగే కలిశాం. అందరూ ఉడతాభక్తి సాయంచేశారు .స్కూల్ విద్యార్దులంతా తలొక పది రూపాయలు వసూలు చేసి లీడర్ల ద్వారా అందించారు .ప్రతిరోజూ సాయంత్రం మూడున్నరకు నలుగురైదుగురు మేస్టార్లు నేను, విద్యార్ధి విద్యార్ధినీ నాయకులు సైకిళ్ళమీద చుట్టుప్రక్కల  పెంజేండ్ర,కొమరవోలు ఐనంపూడి రిమ్మనపూడి .గొల్వేపల్లి ,మొదలైన గ్రామాలకు వెళ్లి పెద్దలనుకలిసి కరపత్రాలు ఇచ్చి విషయం చెప్పటం వారు వెంటనే స్పందించి డబ్బు ఇవ్వటం, లేక మర్నాడు విద్యార్ధులతో పంపించటం చేశారు .అప్పుడు చదువుతో పాటు అన్ని యాక్టివిటీస్ లో నంబర్ వన్,ఆడపిల్లల లీడర్ మాత్రమేకాక స్కూల్ లీడర్ కూడా అయిన కె.పావని ఇచ్చిన సహకారం చేసిన సేవ మరుపురానివి .ఇప్పుడా అమ్మాయి అమెరికాలో ఉంటోంది భర్త ఇద్దరుపిల్లలతో. 2017లో అమెరికాలో ఉన్నప్పుడు  తరచుగా ఫోన్ లో మాట్లాడేది .గొప్ప సంస్కారం ఉన్నామ్మాయి .అలాగే చీలి నాగలక్ష్మి  సోషల్ మాస్టర్  శ్రీ వెంకటేశ్వరరావుగారమ్మాయి . ఆటా పాటా చదువు అన్నిట్లోనూ దూసుకుపోయేది  .మగపిల్లల పేర్లు పెద్దగా గుర్తులేవు ఒకరేమిటి అందరూ గొప్పగా కృషి చేశారు సేవలు అందించి తాము చదుకున్న చదువుకొంటున్న విద్యా సంస్థ ఋణం తీర్చుకొన్నారు .అడ్డాడ కు చెందినహార్ట్ స్పెషలిస్ట్ వియవాడ లో ఉన్నారని తెలిసి స్టాఫ్ముగ్గురం వెళ్లి  కలిసి చెప్పాం .వారూ గొప్పగా స్పందించారు .అడ్డాడ  డాక్టర్ గారు ఖమ్మం లో ఉంటె లెటర్ రాస్తే డబ్బు పంపారు ఆయన ప్రతిఎదాడీ స్కాలర్షిప్ లు ఇస్తారుకూడా .   రైస్ మిల్ యజమానులు డబ్బెకాకుండా నాణ్యమైన బియ్యం ఇచ్చారు .కూరాగాయలు వచ్చాయి .పాడి పంటకు కొదవేలేదు. నాణ్యమైన నెయ్యి కూడా వచ్చింది  .చేతిలో డబ్బు కు ఇబ్బంది లేకపోవటం తో అన్ని పనుల్లోనూ అత్యున్నతమైన నాణ్యతే లక్ష్యంగా పనిచేశాము .

   బిల్డింగ్ లకు వెనక  గాడిపొయ్యితవ్వించి కట్టెలు సేకరించి గాస్ పొయ్యి  గాస్ సిలెండర్లు కూడా ఏర్పాటు చేయించాం .మా క్రాఫ్ట్ మాస్టర్ శ్రీ కే మల్లికార్జునరావు వంటలో స్పెషలిస్ట్ . వంట వాళ్ళనుపిలి పించటం వడ్డించటం ,ఏ పూటకు ఆపూట వెరిటీ మార్చటం  ,స్వీట్లు హాట్లు ,గడ్డపెరుగు తాజాకూరలు అన్నీ అదుర్స్ గా ఏర్పాటు జరిగింది .వాలంటీర్లు జగ్గులు పట్టుకొని నిరంతరం క్రీడాకారులకు అతిధులకు మంచి నీళ్ళు అందిస్తూ  రిఫరీలకు  ఆరగాఆరగా కాఫీలు అందిస్తూ సేవ చేశారు .వివిధ స్కూల్స్ ను౦చి ఆటలలో పాల్గొనటానికి వచ్చినఆడపిల్లలకు మా స్కూల్ పై అంతస్తులో రూమ్ లు ఇచ్చాం .స్నానాలకు వేడినీరు సరఫరా చేశాం . ఏ ఇబ్బందీ లేకుండా చేశాం .అదనపు లెట్రిన్ సౌకర్యం కలుగ  జేశాం .ఎవ్వరూ ఏ ఇబ్బందీ పడరాదని మా అభి ప్రాయ౦ .అందరూ హోమ్లిగా ఫెల వ్వాలని ఆరాటం .లేడీ టీచర్స్ వంట పనీ ఆటలు ఆడే ఆడపిల్లల  విషయం లో శ్రద్ధ బాగా కనపరచారు .స్కూల్ అంతా ఒక యూనిట్ గా సమైక్యతత తో పని చేశాం .

  ఆటలపోటీలు ఇంకో నాలుగు గు రోజుల్లో ప్రారంభం అవుతాయనగా మా  డ్రిల్ మాస్టర్ నాగేశ్వరరావు  స్టాఫ్ సెక్రెటరి  వీరభద్రరావు నా దగ్గరకు వచ్చి ‘’సార్!మనం అనుకోన్నదానికన్నా డబ్బు బాగానే వచ్చింది .ఇంతవరకు ఏ జోన్ లోనూ పెట్టని విధంగా మనం అడేవారికి, అతిధులకు అందరికి ‘’నాన్ వెజ్ ‘’, ఉడికించిన కోడి గుడ్డు  కూడా పెడితే బాగుంటుందని పిస్తోంది .మీరు ఒకే అంటే ఏర్పాట్లు ప్రారంభిస్తాం ‘’అన్నారు .’’నేను తినక పోయినా ఇంతమందికి మీరు ఇలా పెడతామంటే నాకేమీఅభ్యంతరం లేదు .అందులో ఫ్రెష్ గా ఉన్నవాటిని తెప్పించి చేయించి వడ్డించండి .అడ్డాడ భోజనం అంటే ‘’అడ్డడ్డా’అదుర్స్’’అనిపించేట్లు జాగ్రత్త తీసుకోండి గో ఎహెడ్’’అన్నాను సంతోషంగా మూడు రోజులు  నాన్ వెజ్ తో మోతమోగించారు .నేనుమాత్రం ఉయ్యూరు నుంచి తెచ్చుకొన్న కారియర్ భోజనమే చేశా .బ్రతిమిలాడితే ఇక్కడ వంటలో చేసిన స్వీట్స్  లేక గారేలను రుచి చూశా  .

   డ్రిల్ మాస్టర్ ను  సైన్స్ వెంకటేశ్వరరావు ను బెజవాడ పంపించి మంచి నాణ్యమైన బహుమతులు కొని పించి తెప్పించాను .ఆటవస్తువులు నెట్లూ బాల్స్ అన్నీ నాణ్య   మైనవే తెచ్చారు .ఆడుతున్నప్పుడు ,బహుమతులు తీసుకొంటున్నప్పుడు పిల్లలలో ఆనందం సంతృప్తి కళ్ళల్లో మెరిసింది. అంతకంటే కావాల్సి౦దేమిటి ?

  కోర్టులు వేసిన డ్రిల్ మాస్టర్లకు అన్నీ దగ్గరుండి నిర్వహించిన వెంట్రప్రగడ యెన్. డి .ఎస్ .విష్ణు అని అందరి నోళ్ళలో నానే నిరంతర కృషీవలుడు డ్రిల్ మాస్టర్లలో పెద్దన్నగా భావింపబడే శ్రీ విష్ణు వర్ధనరావు సహకారం మరువలేనిది .అలాగే గుడివాడ పెంజే౦ డ్ర మొదలైన స్కూల్స్ నుంచి వచ్చిన ఆట రిఫరీలైన స్త్రీ పురుషులను  అత్యంత గౌరవంగా  చూశాం .చుట్టు ప్రక్కల ఉన్న హై స్కూల్స్ ప్రదానోపాధ్యాయుల సలహాలు సేవలు అందుకొని వారినీ యధాశక్తి గౌరవిన్చాం .ఆటలు చూడటానికి వచ్చినవారికీ సంతృప్తిగా భోజనాలు పెట్టాం  .మూడు రోజుల ఆటలు తో స్కూల్ పండుగ వాతావరణం నే తలపించింది .మూడు రోజులు  మూడు నిమిషాల్లాగా గడిచిపోయినట్లు అందరూ అనుకొన్నారు .చివరి రోజు డియివో శ్రీ హనుమంత రెడ్డిగారికి  పరిషత్ చైర్మన్ గారికీ ?ఘన సత్కారం చేశాం  ‘’ విష్ణు’’గారికి విశిష్ట సన్మానం చేయాలని మా డ్రిల్ మాస్టర్ తో చెప్పి డియివో గారి చేతులమీదుగా చేయించి మురిసిపోయాం ఆయన వద్దన్నా మేము వినలేదు .ఆయనకు నాపై అత్యంత గౌరవం .ఆయన స్పోర్త్మన్ స్పిరిట్ అంటే నాకు మహా ఇష్టం .ఎక్కడ ఆటలపోటీలు ఏరూపం లో జరిగినా విష్ణు గారి పాత్ర లేకుండా ఉండదు .విష్ణు ఉంటె ప్రతిదీ పకడ్బందీ గా జరుగుతుందని నమ్మకం .అదీ ఆయన స్పెషాలిటి .డియివో గారు నాకు కూడా సన్మానం చేసినట్లుగుర్టు .మాస్టాఫ్ అంతటికీ ప్రత్యేక అభిందనలు చెప్పాము. విద్యార్ధి వాలంటీర్ల సేవలను గుర్తించి ప్రోత్సాహకాలిచ్చినట్లున్నాం .ఇంతమంది సమస్టి కృషి తో జిల్లాస్థాయి బాలికల ఆటల పోటీలను రంగరంగ వైభవంగా నిర్వహించి ‘’నభూతో ‘’అనిపించి అడ్డాడ హై స్కూల్ కీర్తి కిరీటం లో అరుదైన మాణిక్యాన్ని చేర్చాం .

   మూడురోజుల ఆటలపండగ పూర్తి అవగానే దీనికోసం  ఏర్పాటు చేసిన కమిటీతో స్టాఫ్ మీటింగ్ రోజున లిఖితపూర్వకంగా లెక్కలను చెప్పించి ,జమా ఖర్చు వివరాలను అందరికీ వినిపించి  ,అందరూ ఆమోదించాక సర్క్యులేట్ కూడా చేయించి అందరి సంతకాలు తీసుకొన్నాను .దీనితోఆటలపోటీల  చాప్టర్ క్లోజ్ .సుమారు 36 వేలరూపాయలు రాబడి . ఖర్చులు సుమారు 32 వేలరూపాయలు అని,మిగిలిన 4వేలరూపాయలు కామన్ గుడ్ ఫండ్ లో జమ చేశామని జ్ఞాపకం .దీనితర్వాత  నా హయాం లో మరోమేజర్ కార్యక్రమం ఏదీ జరగలేదని గుర్తు .మళ్ళీ అడ్డాడ హైస్కూల్ లో ఇంతటి భారీ కార్యక్రమం కూడా ఎవ్వరూ చేబట్ట  లేదనే తెలిసింది .ఇదంతా అందరి కృషి సహకారం  సేవ ,అంకితభావ ఫలితమే .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-6-19-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.