నా దారి తీరు -123  అడ్డాడ లో పని చే  స్తుండగా ఆతర్వాతా  చేసిన వివిధ సాహితీ ,సాంస్కృతిక కార్యక్రమాలు

నా దారి తీరు -123

అడ్డాడ లో పని చే  స్తుండగా ఆతర్వాతా  చేసిన వివిధ సాహితీ ,సాంస్కృతిక కార్యక్రమాలు

సాహితీ మండలి

అడ్డాడ హై స్కూల్ లో  చేరటానికి ముందే 1987లో మాకు ఉయ్యూరు హైస్కూల్ లో గురువుగారు, నాకు ఎనిమిదవతరగతి క్లాస్ టీచర్ ,ఆతర్వాత నేను ఆ స్కూల్ లో పని చేసినప్పుడు నాతోపాటు సోషల్ మాస్టర్ గా, ఇంచార్జి హెడ్ మాస్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యాక పెన్షనర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి పెన్షనర్స్ కోసం ప్రత్యెక మాసపత్రిక నడిపిన  నేన౦టే అమిత ఆప్యాయత చూపించే  శ్రీ లంకా బసవాచారి మాస్టారు గారు ఎందుకు ఎలా ఆలోచించారో తెలీదుకాని ఒక రోజు మా ఇంటికి వచ్చి ‘’ప్రసాదూ !మనం ఒక సాహిత్య సంస్థ నడపాలి  నెలలో ప్రతి మూడవ ఆదివారం సాయంత్రం సభ జరపాలి .నీలాంటి వారి సాయం ఉంటె బాగుంటుంది ‘’అన్నారు .’’మంచి ఆలోచన మాస్టారూ !మీ నాయకత్వం లో కలిసి పని చేద్దాం.’’అన్నాను .ఆయనే ఊళ్ళో  అందరి ఇళ్ళకు వెళ్లి చెప్పటం ,అందరం మూడవ ఆదివారం సాయంత్రం 4గంటలకు ఉయ్యూరు విష్ణ్వాలయం లో ఆయన అధ్యక్షతన సమావేశం జరపటం మొదలు పెట్టాము .సభ అరిగే ఆదివారం ఉదయం మళ్ళీ ఆయనే అందరిళ్ళకు వెళ్లి గుర్తు చేసేవారు .అంత నిబద్ధత ఉండేది ఆయనలో .ఇంత సాహిత్యాభిలాష ఉందని అప్పటిదాకా తెలీదునాకు .అయితేనేమి ఒక సంస్థకు బీజం నాటారు .అప్పుడు నా సహాధ్యాయి మా గురువుగారబ్బాయి శ్రీ వేమూరి దుర్గయ్యనే దుర్గాప్రసాద్ ,నేనూ ,శ్రీ తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు ,శ్రీ పీసపాటి కోటేశ్వరరావు మేమందరం మునసబు గారుఅనిపిలిచే శ్రీ గూడపాటి కోటేశ్వరావు ,మా అన్నయ్యగారి అబ్బాయి   రామనాధబాబు ,శ్రీ అప్పలాచార్యులు ,విష్ణ్వాలయం పూజార్లు ,కెసీపి ఉద్యోగులు , శ్రీ సూరపనేని రాధాకృష్ణ ,వెంట్రప్రగడ సోదరులు ,ఆంధ్రాబాంక్ లో పని చేసిన ఆయన ,ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ శ్రీ దగ్గుబాటి శ్యామసు౦దరరావు  ప్రముఖ గాంధేయవాది స్వాతంత్ర్య సమరయోధుడు  శ్రీ మల్లాది శివ రామ శాస్త్రి ,అప్పలా చారి తండ్రిగారు ,మొదలైన సుమారు ఇరవై మంది దాకా హాజరయ్యేవాళ్ళం .కొన్ని నెలలు మా మాస్టారు అందరికీ బిస్కెట్లు తెచ్చి ఇచ్చేవారు .వీలయితే టీ కూడా .మొదట్లో ఎవరో ఒకరిని ఇష్టమైన విషయం మీద మాట్లాడమనే వారు   సంఘానికి రెండు మూడేళ్ళ  దాకా పేరు కాని ,సభ్యత్వ రుసుముకాని కార్యవర్గం కాని లేదు  .రుసుం వసూలు మాస్టారికి అసలు ఇష్టమే ఉండేదికాదు. దానివలన తగాదాలొస్తాయనేవారు .ఆయనమాట మాకు సుగ్రీవాజ్ఞ.ఒక కాగితం మీద సమావేశానికి హాజరైన సభ్యుల సంతకాలు తీసుకొనేవారు .అందరం అప్పటికి ఒకటి రెండుసార్లు మాట్లాడే ఉన్నాం .కనుక దీన్ని గాడిలో పెట్టాలనే ఆలోచన నాకు వచ్చింది .

ఒక సారి సమావేశం లో నేనే ‘’ఎవరు ఏ విషయం మాట్లాడాలో ముందే తెలియజేయాలి అప్పుడు ప్రిపరేషన్ కు సమయం బాగా ఉంటుంది . గంట గంటన్నర లో కార్యక్రమం పూర్తవ్వాలి .ప్రతినెలా మనలో ఒకరం అందరికీ ఆతిధ్యమివ్వాలి .ఇక్కడ జరిగే  కార్యక్రమాలు  నమోదు చేయటానికి మినిట్స్ పుస్తకం ఉండాలి .మాస్టారికి వయసు మీద పడుతోంది ఆయనకు శ్రమ ఇవ్వకుండా  ఎవరు ఏ విషయంపై మాట్లాడేది మొదలైన కార్యక్రమవివరాలు కార్డ్ పై రాసి అందరికి పోస్ట్ లో పంపాలి .సంస్థకు ఒక పేరు పెట్టాలి .ఉత్సాహవంతులు అధ్యక్షులుగా  కార్యదర్శిగా ఉండాలి .మాస్టారు మనకు సుప్రీం కనుక ఆయన కన్వీనర్ గా ఉండిమనకు మార్గ దర్శనం చేయాలి ‘’అని చెప్పాను .అందరు బాగుందిబాగుంది తక్షణం అమలు చేద్దాం అన్నారు .సంస్థకు అనేక పేర్లు ఆలోచనలోకి వచ్చినా ‘’సాహితీ మండలి ‘’పేరును ఖాయం చేశాం .బహుశా ఈ ఆలోచనా నాదేనని గుర్తు .మొదటి అధ్యక్షుడిగా దుర్గయ్య ను కార్యదర్శిగా పీసపాటి ని ఎన్నుకొని షురూ చేశాము .నేనే సుమారు 50కార్డులు కొని ఇచ్చి పని ప్రారంభి౦పచేశా .

మరికొ౦తకాలం తర్వాత నాకే ఆలోచన వచ్చి ‘’ఏదో డ్రైగా కార్యక్రమాలు జరుగుతున్నాయి క ,పాత సాహిత్యమేపెత్తనం చేస్తోంది కనుక మార్పు రావాలి ‘’అని చెప్పి శ్రీ శ్రీ ఆరుద్ర ,తిలక్ మొదలైన వారి కవిత్వాలపైనా కరుణశ్రీ ,జాషువా ,దేవులపల్లి మొదలైన వారి కవిత్వం పైనా మాట్లాడే ఏర్పాట్లు చేశాం .రామకృష్ణమాచార్యులు ఆముక్తమాల్యద, మను, వసు చరిత్రలపై అధారిటీ. ఆయన మాట్లాడుతుంటే కొత్త లోకం లో విహరిస్తున్నట్లు  ఉండేది  .ఆయన నా అభిమాన సాహితీవేత్త  .మా తలిదంద్రుల పేరిటమొదటిపురస్కారం ఆయనకే అందించాను పీసపాటి నీతి శతకాలలో దిట్ట .గూడపాటి క్షేత్రయ్యపై లోతైన అవగాహన ఉన్నవాడు ,రాధాకృష్ణ పద్యనాటకాలపై బాగా మాట్లాడేవాడు .మల్లాది వారు తాము చేసిన అవధానాలు బెజవాడ కనకడుర్గమ్మపై  రాసిన సుప్రభాతం విని పించేవారు .డా శ్యాం సుందర్ ఆరోగ్య విషయాలపై మంచి అవగాహన కల్పించేవారు .ఆంధ్రాబాంక్ ఆయన విశ్వనాథకు అంతేవాసి .కల్పవృక్షం పై ప్రసంగించేవారు ఇలా అన్ని రకాల సాహిత్యం పరవళ్ళు తొక్కింది .ప్రతినెలా మూడవ ఆదివారం కార్యక్రమాలు చాల ఉత్సాహవంతంగా జరుగుతున్నాయి .ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం

మళ్ళీ నాకే ఆలోచనవచ్చి ‘’సంక్రాంతికి ,ఉగాదికి కవి సమ్మేళనం ‘’నిర్వ హిద్దాం యువకవులకు అవకాశం కలిగిద్దాం ‘’అని చెప్పాను .అలాగే కవి సమ్మేళనాలు జరిపాం మొదటి ఉగాది కవి సమ్మేళనం మా పాత పెంకు టింట్లోనే హాలు అంతా నిండిపోయిన కవులతో జరిగింది .హైస్కూల్లో నాకు హెడ్ మాస్టర్ ,నేను సైన్స్ మాస్టర్ అయినప్పుడుకూడా హెడ్ మాస్టర్ అయిన శ్రీ కేవిఎస్ ఎల్ నరసింహారావు ,టెలిఫోన్ ఎక్చెంజిలోపని చేసిన ఒక ఆయన కుమార్తె ,కెసీపి లో కెమిస్ట్ శ్రీ టివి సత్యనారాయణ మొదలైనవారంతా విచ్చేసి కవిత్వం చదివి అందరికి ఆనందం పంచారు .బొబ్బట్లు పులిహోర టీ  లతో నేను ఆతిధ్యమిచ్చాను .ఇలా సాహితీమండలి జైత్రయాత్ర జరుగుతోంది .మళ్ళీ నేనే ‘’ఒక వ్రాత పత్రిక ను అందరి రచనలతో తెస్తేబాగుంటుంది ‘’అని సూచించాను .ఆబాధ్యత  ఆచార్యులు పీసపాటి గార్లకు అప్పగించిన జ్ఞాపకం .బాగానే తయారైంది .తర్వాత మా గురువుగారు ,మా మాస్టారు మా సారధి సచివులు శ్రీ బసవా చారి గారు గుండె జబ్బుతో మరణించారు. మాకు ఆశనిపాతం అయింది .ఆయన దినవారాలయ్యాక వారి స్మృతి నివాళిగా ఒక వ్రాత ప్రతి తెచ్చే బాధ్యత నాకు అప్పగించారు .దాదాపు 70పేజీల పుస్తకంగా ఫోటోలు నివాళి గీతాలు వ్యాసాలూ తో  సహా మంచి పుస్తకం రూపొందించాను .దీనికి ఆచార్యులు పీసపాటి గొప్ప సహకారం అందించారు .సాహితీ మండలి కార్యక్రమం లో ఎవరు ఏ విషయం పై ప్రసంగిస్తారో ముందే తెలుస్తోందికనుక నేను ప్రతి విషయం పైనా కొత్తకోణాలలో ఆధునిక విశ్లేషకుల అభిప్రాయాలను సేకరించి కనీసం అరగంట అయినా ప్రధాన వక్త తర్వాత మాట్లాడేవాడిని .ఇదంతా నోట్స్ గా నాదగ్గర ఉండేది .మంచి వ్యాసాలూ రాయటానికి ముడి సరుకుగా ఉపయోగపడేది .అంతేకాదు ఆనేలలో అప్పటిదాకా జరిగిన ముఖ్య సాహితీ విశేషాలు రచయితల పుట్టినరోజులు  మరనిన్చినవిషయాలు వారిప్రతిభా నూతన పుస్తకావిష్కరణలు అన్నీ నోట్ చేసుకొని చెప్పేవాడిని కనుక రొటీన్ కు భిన్నంగా నావేల్టి గా ఉండేది .మండలి లో ప్రసంగించిన ప్రతివిషయం పైనా నా దగ్గర నా నోట్స్ ఉండేది .అంత కృషి చేసేవాడిని నూతనత్వం ఉండాలని నా తపన .

మాస్టారుగారి మృతికి ముందే శ్యామసు౦దరరావు గారు కారం చేడు వెళ్ళిపోవటం మిగిలినవారు ట్రాన్స్ ఫర్ అవటం తో నెలవారీ సమావేశాలకు హాజరు పలచబడింది .మరోరెండు స్పెషల్ వ్రాతప్రతులు తెచ్చిన గుర్తు .ఒకటి బీరువాల రెడ్డిగారు అని పిలువబడే ,మంచి సాహిత్యాభి రుచి వేలకొలది పుస్తకాల స్వంత గ్రంధాలయం ఉన్న శ్రీ కట్టుకోలు సుబ్బారెడ్డి రూపొందించారు .ప్రతి ఏడాది మార్చిలో శ్రీ బసవాచారి గారి స్మారక ఉపన్యాసం ఏర్పాటు చేయాలని చెప్పినా ఎవరి చెవికీ ఎక్కలేదు .హాజరు పెంచటానికి కృషీ జరుగలేదు . సభావేదిక కూడా విష్ణ్వాలయం నుంచి కొంతకాలం మా శ్రీ సువర్చలాన్జనేయసామి గుడికి అక్కడినుంచి ఉయ్యూరు హై స్కూల్ కు ,ఆతర్వాత కాలేజీ గ్రౌండ్ కు చివరికి ఎసి లైబ్రరీకి మారింది .హైస్కూల్ లో సభలు జరిపేటప్పుడు హెడ్మాస్టర్ శ్రీ పి.వెంకటేశ్వరరావు ,కాలేజీలో ప్రిన్సిపాల్ శ్రీరాయుడుగారు మంచి సపోర్ట్ ఇచ్చారు .మా శిష్యుడు ,మా గురువుగారు డ్రాయింగ్ మాస్టారు శ్రీ శేషగిరిరావు గారబ్బాయి ఫణి చేత గణిత అష్టావధానంఅరంగేట్రం చేయించి  మంచి పేరుపొందాం .దీనికి టివి, రెడ్డిగార్లు స్పాన్సర్లు .శాసనసభ్యులు శ్రీ అన్నే బాబూరావుగారి సమక్షం లో సర్వభాషా కవి సమ్మేళనం నిర్వహించాము .సాహితీ మండలి అధ్యక్షులుగా ఆచార్యులుగారు, గూడపాటి,రాదాకృష్ణ  ,ఏ సాహిత్య పరిజ్ఞానమూ లేని కాటూరు నివాసి మైనర్ గారు అనబడే శ్రీ వేమూరి కోటేశ్వరావు చాలాకాలం అధ్యక్షులయ్యారు ..  2008లో మూడవసారి అమెరికా వెళ్ళినప్పుడు శ్రీ మైనేని గోపాలకృష్ణగారి బావగారు డా రాచకొండ నరసింహ శర్మగారు అమెరికాలో ఉన్నారు .తరచూ మాట్లాడేవారు. సరసభారతికి 10వేల రూపాయల చెక్కు నాకు అందజేశారు .రాగానేఆంధ్రాబాంక్ లో అకౌంట్ తెరచి డిపాజిట్ చేశాను  .నేను కన్వీనర్ గా శ్రీ కాట్రగడ్డ వెంకటేశ్వరరావు కార్యదర్శిగా చాలామంచి కార్యక్రమాలు నిర్వహించాం .సాహితీమండలి 100వ సమావేశాన్ని అత్యంత వైభవోపేతంగాజరిపాం .గుడివాడ కాలేజి సంస్కృత శాఖాధ్యక్షులు శ్రీ చిలకమర్తి దుర్గాప్రసాదరావు గారిని ఆహ్వానించి సన్మానించి విశ్వనాధపై మహత్తర ప్రసంగం చేయించాం .2008 డిసెంబర్ లో ఉయ్యూరు వాస్తవ్యులు  ప్రముఖ అంతర్జాతీయ ఆర్ధిక శాస్త్రవేత్త శ్రీ ఆరిగపూడి ప్రేమ్ చ౦ద్ గారిని ఆహ్వానించి  పట్టుబట్టలు పెట్టిఘన సన్మానం చేశాం .దీనిఖర్చు అంతా మా శ్రీ మైనేని గోపాలకృష్ణ గారిదే .ఇందులో మిగిలినడబ్బు 20వేలరూపాయలు మచిలీపట్నం లో కొత్తగా ఏర్పాటైన కృష్ణా విశ్వ విద్యాలయం తెలుగు శాఖ కు శ్రీమైనేని గారి పేరిట విరాళం అంద జేశాం .కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు స్పాన్సర్ చేసిన శ్రీ విహారి గారి ‘’సుందరకాండ ‘’ఆవిష్కరణ సభ నిర్వహించాం .డా మాదిరాజు రామలింగేశ్వరరావు గారు ,డా గుమ్మా సాంబశివరావు ,డా జివి పూర్ణచంద్ వంటి వారిని ఆహ్వానించి ఆపుస్తకం పై ప్రసంగాలు చేయించాము .ఆహ్వాని౦పబబడిన  ప్రాసంగీకులైన  అతిధులకు మా తలిదంద్రులపేరర పురస్కారం నగదుకానుక నూతనవస్త్రాలు అందజేశాను  ఇలా పురాస్కార౦  అందుకొన్నవారిలో శ్రీమతి వి శ్రీ ఉమామహేశ్వరి ,శ్రీ గంధం వెంకాస్వామి శర్మ ,శ్రీ యాజ్ఞావల్క్యశర్మ ,శ్రీమతి బెల్లంకొండ శివకుమారి డా మడక సత్యనారాయణ మొదలైనవారెందరో ఉన్నారు

ఎసి లైబ్రరీ నిర్మాణం

ఉయ్యూరు  లైబ్రరీకి శ్రీ మైనేనిగారు ఇచ్చిన భూరి విరాళం తో నేను కన్వీనర్ గా   వారి అన్నగారు  శ్రీతాతయ్యగారు కోశాధికారిగా మా శిష్యుడు వైవిబి రాజేంద్రప్రసాద్ కోరగా పని చేసి దక్షిణభారతం లోనే మొట్టమొదటి ఎసి లైబ్రరీని కట్టించాము .2004 జులైలో దీని ప్రారంభోత్సవానికి మంత్రులు జిల్లాపరిషత్ చైర్మన్ ,శాసన సభ్యులు హాజరయ్యారు .దీనిఖర్చు అంతామైనేనిగారిదే .ఆయనా అమెరికానుంచి వచ్చారు .దాదాపు రెండులక్షల రూపాయల ఖరీడదుకల విలువైన పుస్తకాలు సిప్పింగ్ లో మైనేనిగారు మా ఇంటికి పంపారు .వీటిని జాగ్రత్త చేసి ప్రారంభోత్సవంనాడు లైబ్రరీకి అందజేశాను .

గ్రంధాలయ వారోత్సవాలు తోడ్పాటు

అప్పటినుంచి లైబ్రరీలో జరిగే ప్రతికార్యక్రమమాన్ని నా సహకారం తో మిర్వహించారు లేడీ లైబ్రేరియన్. శ్రీమతి సుజాతగారు రేడియో ఆర్టిస్ట్ శ్రీ ఎబి ఆనంద్ ,శ్రీ గుత్తికొండ శ్రీ పూర్ణచంద్ ,,శ్రీ సామల రమేష్ బాబు ,శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి ,శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రం మొదలైన వారిని ఆహ్వాని౦పజెసి  లైబ్రరీ వారోత్సవాలు ఘనంగా నిర్వహింప చేయించాను. ఆర్దికసాయమూ అందించాను .

కృష్ణాజిల్లా రచయితల సంఘం లో

కృష్ణా జిల్లా రచయితల సంఘం లో చురుకుగా పాల్గొన్నాను. వారు ప్రచురించిన అన్ని పుస్తకాలో నా చేత విలువైన ఆర్టికల్స్ రాయించారు శ్రీ పూర్ణచంద్ .అందులో ‘’కృష్ణా జిల్లా సంస్థానాలు సాహిత్య సేవ ‘’హై లైట్ .తర్వాత ‘’తెలుగు మణిదీపాలు ‘’లో ఘంటసాలపై రాసిన సుమారు ఇరవై పేజీల వ్యాసం ముఖ్యమైనది . జనం రావటం లేదుకనుక మండలి కార్యక్రమాలు  ఆపేద్దామని గూడపాటి చాలా సార్లు అంటే మంచి చర్యలు తీసుకోవాలికాని దుకాణం మూసేస్తే ఎలా ?అని వాదించేవాడిని .చాలా సార్లు చెప్పి చూశా .సాహిత్య గంధం లేని వాళ్ళు ప్రెసిడెంట్ సేక్రేటరిగా ఉంటె సంస్థ కు గౌరవంకాదని పిలిచిన అతిధికి కనీసం ఖర్చులకోసం కొంతనగదు ఇచ్చి శాలువాకప్పటం కనీస ధర్మమని పోరాడాను .ఒంటెత్తు పోకడలతో విసిగి వేసారి వెళ్ళటం క్రమగా తగ్గించి 2009నవంబర్ 24’’సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ ‘’ఏర్పాటు చేయటం ఆతర్వాత దాని ప్రగతి మీకు తెలిసిన విషయమే మరికొన్ని విషయాలు తర్వాత తెలుసుకొందాం .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-6-19-ఉయ్యూరు

 

 


 

 


About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.