నా దారి తీరు -125 తీర్ధ యాత్ర

నా దారి తీరు -125

            తీర్ధ యాత్ర

కృష్ణా పుష్కరాలు

గురుడు కన్యారాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణానదికి పుష్కరాలు వస్తాయి .కృష్ణానదికి  1992లో పుష్కరాలు వచ్చినప్పుడు  అడ్డాడలో పని చేస్తున్నాను .ఆదివార౦ నాడు  ఉదయమే ఉయ్యూరులో 4గంటలకే లేచి స్నానం సంధ్య ,పూజ పూర్తి చేసి  ,రెండు రౌండ్లు కాఫీ తాగి ,ఇంట్లో తయారు చేసుకొన్నా టిఫిన్ బాక్స్ లో  పెట్టుకొని  మంచినీళ్ళతో సహా మేమిద్దరం బస్ ఎక్కి నాగాయలంక లో రేవులో ,పెదకళ్ళేపల్లి ,శ్రీకాకుళం ,అవతలి ఒడ్డున గుంటూరు జిల్లాలోనిచిలుమూరు  రేవు లలో పవిత్ర పుష్కర స్నానం చేసి,దేవాలయ దర్శన౦ చేసి ,వీలున్నప్పుడు తెచ్చుకొన్నది తిని, లేక పళ్ళు తిని సాయంకాలందాకా ఇలా గడిపి రాత్రికి ఇంటికి చేరేవాళ్ళం .మరో రోజు ముక్త్యాల వెళ్లి స్నాన దర్శనాలు చేశాం .ఒక రోజు బెజవాడ కృష్ణాస్నానం చేశాం .  ఇలా ఆ 12 రోజుల్లో వీలైనన్ని రోజులు కృష్ణా పుష్కరస్నానం చేశాం .రాత్రి ఇంటికి వచ్చే వండుకొని భోజనం చేయటం. పగలెక్కడా హోటల్ లో భోజనం కాని టిఫిన్ కానీ చేసేవాళ్ళం కాదు.1980 కృష్ణా పుష్కరాలకు మాకు దగ్గరలో ఉన్న  తోట్లవల్ల్లూరు  ఐలూరు వెళ్లి పుష్కర స్నానాలు చేశాం. మా చిన్నక్క శ్రీమతి దుర్గ , బావ శ్రీ వివేకాన౦ద్ గారు హైదరాబాద్ నుంచి వస్తే వల్లూరులో అందరం కలిసి పుష్కర శ్రాద్ధం కూడా పెట్టాం అప్పుడు మా ఇంటి పురోహితులు శ్రీ కోట కృష్ణ మూర్తిగారు .ఈ పుష్కరం లోనే బెజవాడ లో శ్రీ చిట్టిబాబు వీణకచేరీ చూశాం ఆయనతో మాట్లాడాం .ఆయన కచేరీ ‘’రసపుష్కరం లో వోలలాడినట్లుంది’’అని బస్ టికెట్ వెనకాల ఎవరినో పెన్ను అడిగి రాసి ,సభాధ్యక్షులు శ్రీ నూకల చిన సత్యనారాయణ గారికిస్తే  ఆయన చదవలేక ‘’ఈ మేష్టారు ఏదో గొప్పగా రాశారు ఆయనే వేదికపైకి వచ్చి చదివితే బాగుంటుంది ‘’అని నన్ను ఆహ్వానిస్తే  ఆమాటతోపాటు మరికొన్ని మాటలు కూడా చెప్పగా చిట్టిబాబుగారు రెండు చేతులూ ఎత్తి నమస్కరించారు .అదే మొదటిసారి చివరి సారీ ఆయన్ను చూడటం  . ,శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి హరికథా గానం కూడా మధ్యాహ్నం జరిగితే విన్నాం .అలాగే శ్రీబాలమురళిగారి మేనల్లుడు  పారుపూడిరంగనాథ్ ? అన్నమయ్య కీర్తనలూ విన్నాం .ఆయన తానె నాకు బాలమురళి మేనల్లుడిని అని చెప్పి బాగా మాట్లాడారు .అక్కడే తిరుమల దేవస్థానం వారు నిర్మించిన శ్రీవారిఆలయాన్నీ స్వామినీ దర్శించాం .2016పుష్కరాలు ప్రారంభానికి ముందు ఎవరో స్వామీజీ పుష్కరఘడియలు రావాల్సిన ఆగస్ట్ 12కంటే ముందే వచ్చాయని  కృష్ణా పుష్కర స్నానం చేశారని పేపర్లో చదివి మా అమ్మాయి వాళ్ళ అమెరికా ప్రయాణం సరిగ్గా12వ తేదీ నే అవటంతో ఆగస్ట్ 8న కారులో ఉయ్యూరులో ఉదయమే బయల్దేరి  ముక్త్యాల వెళ్లి కృష్ణా పుష్కరస్నానం   మా అమ్మాయి విజ్జి  మనవళ్ళు శ్రీకేత్ ఆశుతోష్ ,పీయూష్  నేనూ చేసి మా శ్రీమతి అప్పటికి కంటి ఆపరేషన్ చేయించుకోవటం వలన పుష్కర పవిత్ర జలం చల్లి స్నానమంత్రాలన్నీ నేనే చెప్పి పుష్కర కృష్ణా నీటిని బాటిల్స్ లో పట్టుకొని  శ్రీ ముక్తేశ్వర స్వామి ని దర్శించి తెచ్చుకొన్న టిఫిన్ తిని ,కోటిలింగాల క్షేత్ర దర్శనం చేసి ,దారిలో తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి దర్శనమూ చేసి ,పరిటాల శ్రీ బృహత్ ఆంజనేయ దర్శనం చేసి ఫెర్రి వెళ్లి గోదావరి కృష్ణా  సంగమ క్షేత్రం చూసి మొదటి సారి చూసి చంద్రబాబు అకు౦ఠిత దీక్ష కు జేజేలు పలికి ,సంగమ జలాలు పట్టుకొని రాత్రికి ఇంటికి చేరాం  .10 ఉదయం అందరం కారులో హైదరాబాద్ వెళ్లి ,12ఫ్లైట్ కు మా అమ్మాయి వాళ్ళను  అమెరికాకు పంపించాము .

  మా అబ్బాయి శర్మ కోడలు ఇందిరా మనవడు హర్ష మనవరాలుహర్షిత  ఒక ఆదివారం  వాళ్ళకారులో సుమారు 150కిలోమీటర్ల దూరం లోఉన్న బీచుపల్లి వెళ్లి గలగలపారే  కృష్ణా నదిలో పుష్కర స్నానం చేసి నేనే పోరోహిత్యం వహించి  శ్రీ బీచుపల్లి ఆంజనేయ స్వామిని దర్శించి ,భోజనం చేసి మధ్యాహ్నం అలంపురం లో శ్రీ జోగులా౦బ  దర్శించి రాత్రి 9కి మా వాళ్ళు ఉండే బాచుపల్లి చేరి పుష్కర స్నాన ఫలితం తెలంగాణా లో పొందాం .ఏర్పాట్లు ఏవీ సరిగ్గలేవు .ఉచిత భోజనాలులేవు ఆంధ్రాలోలాగా. రోడ్లు కనాకష్టం. టోల్స్ తీసేస్తానన్న కేసి ఆర్ మాట నిలబెట్టుకోలేదు  బాదుడేబాదుడు. ఇలా ‘’బాచుపల్లి టు బీచుపల్లి ‘’యాత్ర చేశాం .

     గోదావరి పుష్కరాలు

గురుడు సింహ రాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కర శోభ వస్తుంది .2003 కు వచ్చిన పుష్కరాలకు మాత్రం మేమిద్దరం హనుమకొండలో మా పెద్దబ్బాయి శాస్త్రి అత్తారింటికి వెళ్లి మా రెండవ మనవడు భువన్ ను చూసి మేమిద్దరం ,మా వియ్యపురాలు శ్రీమతి ఆదిలక్ష్మి గారు ఒకరోజు బస్ లో ఉదయమే 5గంటలకు  దక్షినకాషి లేక రెండవ కాశి కాళేశ్వరం వెళ్లి గోదావరి ,ప్రాణహిత నదుల సంగమం లో  పుష్కరస్నానం  అక్కడి శ్రీ కాళేశ్వరస్వామిని దర్శింఛి సాయంత్రానికి తిరిగివచ్చాం .మర్నాడు మేము ముగ్గురం అలాగే బస్ లో ధర్మపురి వెళ్లి గోదావరీ పుష్కరస్నానం చేసి  శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి ,రాత్రికి ఇంటికి చేరాం ,విపరీతమైన జనసమ్మర్దం బస్సులు సమయానికి లేకపోవటం తో ప్రయాణాలు విసుగెత్తాయి .ఒకసారి మా బామ్మర్ది ఏలూరులో ఉన్నప్పుడు అందరం కొవ్వూరు వెళ్లి పుష్కరస్నానం చెఇ రాజమండ్రి చూసి ఇంటికి చేరాం .

            2015గోదావరి పుష్కరానికి మేమిద్దరం, మా మూడోకోడలు శ్రీమతి రాణి ,మనవడు చరణ్ ,మనవరాలు రమ్య కారులో ఉదయం 5గంటలకే బయల్దేరి మొదట రావులపాలెం దగ్గర గౌతమీ నదీ స్నానం చేసి ,వసిష్ట నదీ దర్శనమూ చేసి, వెంట తెచ్చుకొన్న టిఫిన్ తిని కాఫీ తాగి ,సరాసరి కోటిపల్లి వెళ్లి అక్కడా గోదావరిలో మధ్యాహ్నం 12-30 కు దేవతలంతా నదిలో కొలువై ఉంటారన్న నమ్మకం తో పుష్కర స్నానం చేసి ,రద్దీ ఎక్కువగా ఉండటం తో శ్రీ సోమేశ్వరస్వామిని దర్శించకుండానే కొంతదూరం ప్రయాణం చేసి ఒకరి పాక ముందున్న అరుగులపై మేము తెచ్చుకొన్న భోజనం ఆరగించి డ్రైవర్ కూ మాతోపాటే అన్నీ పెట్టి ,ద్రాక్షారామ౦ ,పాలకొల్లు లలో  లో స్వామి దర్శనం చేసుకొని ,రాత్రికి ఇంటికి చేరాం

  కేదార్ నాథ్ బదరీనాథ్ యాత్ర

ఇదీ అడ్డాడలో పని చేసినప్పుడే జరగటం తమాషా .చాలసార్లుమా  చిన్నక్కయ్యా,బావా కేదార్ నాథ  బదరీనాథ యాత్రలకు వెడదామనటం ఆలాగే అనటం  తో సరిపోయింది .1998జూన్ నెలాఖరికి నా రిటైర్ మెంట్ .కనుక అందరం వేసవి లో తప్పక  వెళ్ళాలనుకొన్నాం. మేమిద్దరం వాళ్ళిద్దరూ. మా బావే అన్నీ కనుక్కోవటం బుక్ చేయటం చేశారు’’ రావు ట్రావెల్స్’’వాళ్ళు బాగా చూపిస్తారని ఆయన తెలుసుకొని దానికి బుక్ చేశారు హైదరాబాద్ నుంచి ఢిల్లీ మనం చేరితే పికప్ చే సుకోవటం దగ్గర్నుంచి అన్నీ చూపించి మళ్ళీ ట్రెయిన్ ఎక్కి0చేదాకా వాళ్ళదే బాధ్యత .యాత్ర మే నెల మొదటివారం లో ప్రారంభమౌతుంది .కనుక మేము హైదరాబాద్ కు ముందే ఆ అబ్బాయి శర్మా వాళ్ళింటికి చేరాం .కావలసినవన్నీ తీసుకొన్నాం చలిను౦చి  రక్షణకు ఏర్పాట్లు చేసుకోన్నాం  ఆంధ్ర ప్రదేశ్ ఎక్స్ ప్రెస్ లో బయల్దేరాం .దారిలో తినటానికి తిఫిన్లకు అన్నీ సిద్ధంగా ఉన్నాము .వేసవికాలం కూలింగ్ వాటర్ కోసం మిల్టన్ వాటర్ పాట్ ఉంచుకోన్నాం .ఢిల్లీ చేరగానే రావు ట్రావెల్స్ వాళ్ళు స్టేషన్ కొచ్చి పికప్ చేసుకొని ఒక బెంగాలీ డార్మేటరిలో  ఉంచారు .భోజనం కొన్నాం కాని చేపలకంపు ఉప్పుడుబియ్యం అవటం తో లోపలి పోలేదు .చపాతీ ఇస్తే తిన్నాం .రాత్రి 9 గంటలకు  రావు ట్రావెల్స్ వాళ్ళ వాన్ వచ్చింది ఇందులోనే మా ప్రయాణం .వంట వడ్డన ఏర్పాట్లన్నీ ఉన్నాయి .రావుగారు  మిలిటరిలో పని చేసి రిటైరయ్యాక టూరిజం లో ప్రవేశించి ఇలా టూర్స్ నడుపుతున్నారు .తెలుగువాడే మాతో చాలామర్యాదగా మంచి తెలుగులో మాట్లాడారు .రాత్రి 10గంటలకు కొబ్బరికాయకొట్టి మా అందరికి స్వీట్లు పెట్టి హాపీ జర్నీ చెప్పి మమ్మల్ని పంపారు .ప్రయాణీకులం 13మందే ఉన్నాం .అన్ని రకాల భాషలవాళ్ళు ఉన్నారు తెల్లారేసరికి రుషీ కేశ్ చేరాం  అక్కడగంగ ఒడ్డు ఆపి ,  టిఫిన్ కాఫీ తయారు చేసి ఇచ్చారు గంగాస్నానం చేసి దేవాలయాలు   నాకు చాలా ఇష్టమైన స్వామి శివానంద ఆశ్రమం చూసి ,మధ్యాహ్నభోజనం పెడితే తిని సాయంత్రం ప్రయాణం సాగించి ,రాత్రికి ఒక చోట డార్మేటరిలో బస చేసి మళ్ళీ ఉదయమే అయిదింటికి బయల్దేరి దారిలో పెట్టిన కాఫీ టిఫిన్లు లాగిస్తూ ,అలక్ నందా  భాగీరధీ నదుల సంగమ స్థానం  దేవప్రయాగ ,దాటి  దారిలో మాకు పూజలు చేయించే పండిట్ ను ఎక్కించుకొని గౌరీ కుండ్ చేరి పోనీలను 600రూపాయలకు మాట్లాడుకొని మంచు దారిలో ఇనుప సీటుపై ముడ్డి మంట ఎత్తుతుంటే,ఒరిగిపదడిపోతామనే భయంతో, గుర్రాల జీన్లుపట్టుకొని నడుస్తూకాలినడకన వాటి యజమానులు  చల్ చల్ మంటూ అదిలిస్తూ 14కిలోమీటర్లు ప్రయాణం చేసి కేదార్ నాథ్ చేరాం. రాత్రి ఒక హోటల్ లో మకాం .చలికి వణికి పోతున్నాం .వెళ్ళగానే కమ్మని కాఫీ ఇచ్చారు చాలాబాగుంది. తాగితే కొంత అలసట తగ్గింది .వెంటనే మంచు దిబ్బలదారి లో కేదారనాధుని దర్శించి అక్కడ గుడిలో నేను రెండుగంటలు మహాన్యాసం నమక చమకాలు ఉపనిషత్తులు చదువుతూ దేవుడి ఎదురుగా కూర్చున్నా. జనం బాగానే ఉన్నారు .హోటల్ రూమ్ కు వచ్చి పడుకొన్నాను.  రజాయిలు అన్నీ ఉన్నాయి కరెంట్ ఇంకా సరిగ్గా లేదు చీకటి . పళ్ళు అదిరిపోతున్నాయి చలికి .మాతోపాటే  పండిట్ కూడా  ఉన్నాడు  .నిద్రలేదు .నాలు గింటికే లేచివేన్నీళ్ళు లేకపోతె ఆ చన్నీరే చల్లుకొని స్నానం అయి౦దని పించాం .పండిట్ వచ్చి అందరికీ దర్శనానికి పూజకు డబ్బులు కట్టించుకొని దర్శనం అభిషేకం చేయించి ప్రసాదం ఇచ్చి ,మళ్ళీ మాతో బయల్దేరాడు.పోనీలవాళ్ళు మమ్మల్ని గుర్తుపెట్టుకొని  వాళ్ళ పోనీలపై కూర్చోపెట్టుకొని మధ్యాహ్నం 12కు గౌరీరీకుండ్ చేర్చారు .బస్సులు వాన్లు చాలాదూరం లో పార్క్ చేసి ఉంచుతారు .అక్కడికి చేరి ఎక్కాము   వెళ్ళేటప్పుడు గౌరీకుండ్ లోనే తినటానికి అన్నీ కట్టించి ఇచ్చాడు కుక్.కానే దేన్నీ తినలేదు మేముమాత్రం  .మా బావ గారుపోనీ ఎక్కకుండా నడిచి ఎక్కి నడిచి దిగారు .గౌరీకుండ్ లో హిమాలయ సౌందర్యం అద్భుతం .ప్రవరుడు హిమాలయం వచ్చినప్పుడు పెద్దనగారు రాసిన ‘’అటజనికాంచె భూమిసురుడు ‘’పద్యం కళ్ళకు కడుతుంది. అత్యున్నత హిమ శృంగాలు జలపాతాలు సెలయేళ్ళు మంచు దారులు  మనతోపాటే ప్రవహిస్తూ వచ్చే గంగానది పర్వత సానువులపై గోదుమపంట ,అనేక రకాల వృక్షజాతులు ఫల పుష్పజాతులు కనువిందు చేస్తాయి . దేవ భూమి అనే నమ్మకం నిశ్చయంగా కలుగుతుంది .ఆకలి దాహమూ ఉండవు .ఇక్కదిగాలి చాలు అనిపిస్తుంది .అందుకే మహర్షులు ఇక్కడ తపస్సు చేసేవారు .

   సాయంత్రం బయల్దేరి పండిట్గారింట్లో  బస చేసి మాబస్సువాళ్ళు  పెట్టిన భోజనం  తినాలనిలేకపోయినా కుక్కుకొని ,పడుకొని ఉదయాన్నే లేచి వాన్ ఎక్కి దేవప్రయాగ చేరి అలకనంద భాగీరధి సంగమ స్నానం చేసి , నేనూ మాబావా ప్రక్కనే చిన్నగ గుట్టమీదా అగస్త్యమహర్షి ప్రతిష్టించిన అగస్త్యేశ్వరస్వామికి అభిషేకం చేసుకొని ,టిఫిన్ తిని ,కాఫీ తాగి  మళ్ళీ బయల్దేరి సాయంత్రానికి బద్రీ నాథ్ చేరి అక్కడ కర్నాటక సత్రం లో దిగి ‘’ఉష్ణ కుండం ‘’కు నడిచివెళ్ళి అక్కడ స్నానం తో వొంటి నొప్పులన్నీ మటుమాయంకాగా ,నారద ప్రతిష్టిత శ్రీబద్రీ నాథ స్వామిని కనులారా దర్శించి రూమ్ కు చేరుకోగా నేనుమాత్రం వాన్ లోనే కూర్చొని ఎదురుగా కళ్ళముందు అద్భుతంగా కనిపించే  ‘’నీల కంఠ పర్వత’’ శోభను సాయం వేళ దర్శిస్తూ సాక్షాత్తు కైలాసమే చూస్తున్నానన్న అనుభూతిపొంది నాదగ్గరున్న ఉపనిషత్తులు స్తోత్రాలు మహాన్యాసం నమకచమకాలు చదువుతూ కూర్చుని రాత్రి 10గంటలకు రూమ్ కు   చేరి పడుకొన్నాను .మర్నాడు ఉదయం బ్రహ్మకపాలం లో నేనూ మాబావా పిండ ప్రదానం చేశాం .అక్కడి లకానంద నదిలో గడ్డకట్టే చలిలో స్నానం చేశాం అదొక దివ్యానుభూతి .మళ్ళీ బద్రీ విశాల్ దర్శనం చేసి రూమ్ కు చేరి అందరం భోజనం చేసి మధ్యాహ్నం వాన్ లో బయల్దేరి దారిలో హనుమాన్ ఘాట్ ,జ్యోతిర్మఠం దర్శించాము శ్రీ శంకర భగవత్పాదులు దేశం లో నాలుగు వైపులా ఏర్పాటు చేసిన పీతాలలో ఇది చాలాముఖ్యమైనది .ఈ ప్రాంతం అంటా బార్డర్  సెక్యూరిటీ ఫోర్స్ అధీనం లో ఉంటుంది. ప్రక్కనే చైనా  .ఇక్కడ హిందువులకు మఠం లేకపోతె వారిని ప్రక్కదేశాలవారు తమమతం లోకి మార్చవచ్చు .అందుకే  ఇది చాలా స్ట్రాటజిక్పాయింట్ .  రాత్రిఒక చోటాగి మరునాడు ఉదయం మళ్ళీ ప్రయాణం సాగించి సాయంకాలానికి గంగానది అప్పటిదాకా హిమాలయ పర్వతాలలో ప్రవహించి భూమికి చేరిన హరిద్వారం చేరాం .గంగా స్నానం చేయగానే అందరికి కమ్మటి పూరీలు బంగాళా దుంప కూర  తయారు చేసి వేడివేడిగా ఇచ్చాడు మా వెంటవచ్చిన మలయాళీ కుక్ .ఆరగా ఆరగా కడుపునిండా తిని కాఫీ త్రాగి దేవాలయ దర్శనం చేసి రోప్ వె లోపైకి  వెళ్లి ధ్రిల్ ఫీల్ అయి శ్రీ మానసాదేవి అమ్మవారిని దర్శించి ఆకాశం నుంచే హరిద్వార్ సౌందర్య వీక్షణ చేసి  కిందకువచ్చి గంగా హారతి చూసి, మేమూ ఇచ్చి , అనూరాధా పోద్వాల్ గంగాహారతి పాటలు విని పులకించి పోయాం    మళ్ళీ వాన్ లో బయల్దేరి మర్నాడు ఉదయం ఢిల్లీ చేరి రూమ్ లో ఉన్నాము .నేను తీసుకువెళ్ళిన హోమియో మందులను  తలతిరుగుడు  విరేచనాలు  జ్వరం  ఆకలి లేకపోవటం మలబద్ధకం దగ్గు జలుబు వచ్చిన వారికి ఇచ్చి ఉపశమనం కలిగించి తృప్తి చెందాను వాడినవారంతా  రిలీఫ్ ఫీల్ అయి ధాంక్స్ చెబుతుంటే మహదానందం కలిగేది .

               జైపూర్ ఆగ్రా మధుర బృందావన్ సందర్శనం

 మర్నాడు రావు ట్రావెల్స్ వారితో కారు ఏర్పాటు చేయించుకొని ,రాజస్థాన్ రాజు జై సింగ్  1727లో కట్టిన  రాజధాని   పింక్ సిటీగా గుర్తింపుపొందిన జైపూర్ చేరి ,అక్కడి డైరెక్టర్ విశ్వనాథ్ ‘’సిరివెన్నెల’’ సినిమా తీసిన గోవింద్ దేవి దేవాలయం , జంతర్ మంతర్ సిటీ పాలెస్ ,హవామహల్  సరస్సులో ఉన్న రాజమహల్ మొదలైనవి చూసి హోటల్ భోజనం కక్కాలేక మి౦గా లేక కతికి,రాత్రి హోటల్ లో పడుకొని ఉదయమే కారులో ఆగ్రా వెళ్లి ఎన్నో ఏళ్ళనుంచి చూడాలని  కలగంటున్న  తాజ్ మహల్ చూసి ,ఆగ్రాఫోర్ట్ ,హిమాదుద్దౌలా ,అక్బర్ సమాధి ఫతేపూర్ సిక్రీ  కూడా చూసి ,తర్వాత సరాసరి శ్రీ కృష్ణ  జన్మ స్థానం  మధుర లో శ్రీ కృష్ణ పరమాత్మ దర్శనం చేసి ,బృందావన విహారమూ పూర్తిచేసి  మళ్ళీ ఢిల్లీ చేరి హోటల్ లో ఉన్నాము .మర్నాడు ఢిల్లీ లో రెడ్ ఫోర్ట్ ,కుతుబ్ మినార్ లోటస్ టెంపుల్ వగైరాలు చూసి మా బావగారి బంధువులఇంటికి వెళ్లి ,మర్నాడు కన్నాట్ సర్కస్ కు వెళ్లి  ఆంధ్రా భవన్ లో ఉయ్యూరు దుర్గా ఫోటో స్టూడియో చలంగారబ్బాయి అక్కడ కనిపిస్తే అక్కడి హోటల్ తన బావదే అని చెప్పి మాకు దగ్గరుండి భోజనం వడ్డించి కొసరి కొసరి తినిపించాడు .దాదాపు ఇరావై వెరైటీలు అన్నీరుచిగా శుచిగా ఉన్నాయి .కొని తింటే భోజనం 35 రూపాయలే .అక్కడున్న .అప్పటి లోక్ సభ మెంబర్ శ్రీ వద్దే శోభనాదీశ్వరరావు దగ్గరకు తీసుకు వెళ్లగా ఆయన మాకు హైస్కూల్ లో జూనియర్  మా బజారు లోనే ఉంటాడుకనుక బాగా పరిచయమూ ఉండటం  వలన  బాగా మాట్లాడి  ఏదైనాకావాలంటే చెప్పండి అన్నాడు మాకేమీ వద్దని చెప్పి ,రూమ్ కు చేరి మళ్ళీ ఎపి ఎక్స్ప్రెస్ ఎక్కి హైదరాబాద్ చేరి రెండుమూడు రోజులు ఉండి ఉయ్యూరు చేరాము .ఇంత స్పీడ్ గా ఊపిరి పీల్చకుండా   మాతో కలిసి యాత్రా సందర్శనం చేసిన మీ అందరికి ధన్యవాదాలు .ఈ స్పీడ్ కు కారణం ఈ యాత్రా విశేషాలన్నీ సుమారు 30అరఠావుతెల్లకాగితాలపై పూసగుచ్చినట్లు వివరించి రాసి అమెరికాలో ఉన్న మా అమ్మాయి విజయలక్ష్మి కి సుమారు 20 ఏళ్లక్రితమే పంపాను  .ఇక్కడ అందరికీ చదివి వినిపించాను .దీనినే నేనురాసిన, శ్రీ మైనేని గోపాలకృష్ణ శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా)స్పాన్సర్ చేయగా సరసభారతి ప్రచురించి మైనేనిగారి మెంటార్ తెనాలికి చెందిన అడ్వొకేట్ శ్రీ కోగంటి సుబ్బారావు గారికి అ౦కిత మిచ్చిన  ‘’దర్శనీయ క్షేత్రాలు ‘’పుస్తకం లో చివర ‘’యాత్రా సాహిత్యం ‘’గా ప్రచురించాము. చాలామంది చదివి ఇన్స్పైర్ అయి ఫోన్ చేసి జాబులు రాసి ,కలసినప్పుడుకూడా  నన్ను అభినందించారు .కనుక మళ్ళీ చెప్పి విసుగు తెప్పించటం ఇష్టం లేక అలాఅలా పైపైనే కథ నడిపించాను .

 సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-6-19 –ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.