నా దారి తీరు -127
ప్రధానోపాధ్యాయునిగా పదవీ విరమణ
ప్రధానోపాధ్యాయునిగా 11సంవత్సరాలు పని చేసిన నేను 7ఏళ్ళు ఆడ్డాడలోనే పనిచేశాను .మిగిలిన నాలుగేళ్ళలో మొదటి సారిగా ప్రమోషన్ పొందిన వత్సవాయి ,తర్వాత మంగళాపురం ,చిలుకూరివారి గూడెం ,మేడూరులలో పని చేశాను .కనుక లా౦గెస్ట్ ఇన్నింగ్స్ అడ్డాడలోనే నన్నమాట .కావాలనే మేడూరు నుంచి అడ్డాడ మ్యూచువల్ ట్రాన్స్ ఫర్ పై వచ్చాను .నేను చేరేనాటికి స్కూల్ లో కరెంట్ లేదు ,చేరిన మర్నాడే వచ్చిన స్వాతంత్ర్య దినోత్సవానికి ఎగరెయ్యటానికి జాతీయ జెండా కూడా లేదు .అలాంటి స్కూల్ ను అన్ని విధాలా ఏ రకంగా అభి వృద్ధి చేసిందీ 107వ ఎపిసోడ్ నుంచి ప్రొద్దున రాసిన 126వ ఎపిసోడ్ వరకు 20 ఎపిసోడ్ లలో రాశాను .అంత రాయాల్సి వచ్చింది అన్నమాట .21వ ఎపిసోడ్ అయిన ఈ 127ఎపిసోడ్ లో నా పదవీ విరమణ విశేషాలు రాస్తున్నాను .
ఆకస్మికంగా వచ్చి సమసిపోయిన సంక్షోభం
అది1998 మార్చి నెల మొదటివారం అని గుర్తు .మార్చి 21నుంచి పదవతరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమౌతాయి .మార్చి మొదటివారం లో ఒక రోజు నేను ఉదయం 9-30కు స్కూల్ కు వచ్చేసరికి విద్యార్ధినీ విద్యార్ధులంతా స్కూలు బయట రోడ్డు మీద గుమికూడి ఉన్నారు .నేను మామూలుగా నా రూమ్ లోకి ప్రవేశించి అటెండర్ గురవయ్యను విషయం ఏమిటి అని అడిగాను .అతడు ‘’అయ్యగారూ !మొన్న మీరున్నప్పుడు ఆడపిల్లలకు ఇద్దరు టెన్త్ క్లాస్ కుర్రాళ్ళు లవ్ లెటర్ రాశారని ఆపిల్లలు మీకు కంప్లైంట్ ఇస్తే మీరు డ్రిల్ మాస్టారుగారినీ ,వీరభద్రరావు గారినీ ఎంక్వైరీ చేయమని చెప్పారు .వాళ్ళు విచారణ చేసి వాళ్ళు తప్పు చేసినట్లు నిర్ధారించి మీకు చెబితే వాళ్ళతో క్షమాపణ పత్రం రాయించుకొని జాగ్రత్త చేశారు .కాని నిన్న సాయంత్రం నుంచి స్టూడెంట్స్ అంతా గుసగుసలాడుకొని స్కూల్ బాయ్ కాట్ చేయాలని నిర్ణ యించుకోన్నారని అందుకే ఎవరూ లోపలి రాలేదని తెలిసింది ‘’అన్నాడు .
అప్పుడు నేను సెకండ్ బెల్ కూడా కొట్టించి గేటు బయటికి వెళ్లి స్కూల్ ప్రారంభమౌతుంది ,అసెంబ్లీ జరపాలి లోపలి రమ్మని చెప్పాను .మొహాలు మొహాలు చూసుకున్నారుకాని ఎవరూ లోపలి వచ్చే సూచన కనిపించలేదు .ఆడపిల్లలతో మీకేమీ భయం లేదు నేనున్నాను ధైర్యంగా లోపలి రండి అని చెప్పగా వచ్చారు .అసెంబ్లీ పూర్తి చేసి యధా ప్రకారం స్కూల్ ప్రారంభించి టీచర్స్ ను క్లాసులకు పంపించా .అటెండెన్స్ ను హాజరు పట్టీలోకాకుండా కాగితం మీద తీసుకోమని చెప్పా .అలాగే చేశారు వాళ్ళు . డ్రిల్ మాస్టర్ , వీరభద్రరావు లను నా రూమ్ కు పిలిపించి మాట్లాడి విషయం అడిగా .వాళ్ళు చెప్పారు .లవ్ లెటర్ రాసిన ఇద్దర్నీ కొట్టామని చెప్పారు .అందుకే బాయ్ కాట్ చేస్తున్నారని చెప్పారు .
నేను కొందరు మగపిల్లలను లోపలకు రమ్మనమని అటెండర్ తో కబురు చేయించా .వాళ్ళు వచ్చారు .వాళ్ళ నోటితోనే విషయం రాబట్టాను . ఆ ఇద్దరు మేస్టార్లు తమకు అపాలజీ చెబితేనే స్కూల్ లో అడుగు పెడతాం అన్నారు .నేను టీచర్స్ తో ఆపని చేయించలేను చేయించనుకూడా.ఇది డిసిప్లిన్ కు సంబంధించిన విషయం .ఇప్పటిదాకా ఇన్నేళ్ళు మిమ్మల్ని ఎలా చూశామో ఏమేమి చేశామో మీకోసం మీకు తెలుసు .పబ్లిక్ పరీక్షలు దగ్గరకొస్తున్నాయి .మీకు నంబర్లు హాల్ టికెట్స్ ఇస్తేనే పరీక్షకు కూర్చోగలరు లేకపోతె ఇంతే సంగతులు .ఒకవేళ మీరు పరీక్ష ఏదోరకంగా రాసినా టిసిలు ఇచ్చేటప్పుడు కాండక్ట్ సర్టిఫికెట్లు ఇచ్చేటప్పుడు ఈ ఉదంతం తో ఏదైనా చెడ్డగా నేను రాస్తే మీకు కాలేజిలో ఎవరూసీట్ ఇవ్వరు. ఉద్యోగాలలో చేర్చుకోరు .ఇప్పటి దాకా స్కూల్ వాతావరణం చాలాబాగుంది .ఇప్పుడు దాన్ని చెడగొట్టి కలుషితం చెయ్యవద్దు.కావాలంటే మీ పెద్దవాళ్ళను తీసుకు రండి మాట్లాడతాను ‘’అని అనునయంగా చెప్పాను .కొంత మనసు మారిందని పించినా కాకమీదున్నారు కనుక ‘’లేదు సార్! ఆ ఇద్దరు టీచర్లు మాకు క్షమాపణ చెప్పాల్సిందే ‘’అన్నారు .నేను మొండిగా ‘’వాళ్ళతో అపాలజీ చెప్పించే సమస్యే లేదు. కావాలంటే నేనే వాళ్ళతరఫున క్షమాపణ చెబుతా .లేదు కాదు కూడదు అంటే ఈక్షణ౦ లోనే నేను రాజీనామా చేసి వెళ్లి పోతా .మీ ఇష్టం అయినా మీ పెద్దలకోసం కబురు పంపాను వాళ్ళ సమక్షం లో నే తేలుస్తా ‘’అన్నాను ‘’సార్!మీరు మాకు దేవుడు లాంటివారు .మిమ్మల్నిఅపాలజి చెప్పమని అంటే మా మూర్ఖత్వం .మీరు కొడతారు తిడతారు అంతకంటే చాలా ఎక్కువగా మా బాగు కోరి చదువు చెబుతారు .మీరు రిజైన్ చేస్తే ,మేమూ ఈ స్కూల్ లో చదవం కూడా ‘’అన్నారు .
కాసేపటికి తలిదండ్రులు ఒకపాతికమంది వచ్చారు .మొదట్లో వాళ్ళూ చాలా ఉద్రేకంగా మా టీచర్స్ పై మాట్లాడారు .వాళ్ళు క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు .నేను ము౦దు గాస్వరం తగ్గించి మాట్లాడి విషయం చెప్పి మా టీచర్స్ క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదు ఇది స్కూల్ డిగ్నిటీకి ,టీచర్ ప్రొఫెషన్ కు .సంబందిన్చినవిషయం ఇందులో రాజీ లేదు .కావాలంటే వాళ్ళతరఫున నేను అపాలజీ చెబుతా .అదీ మీకు నచ్చకపోతే ఈ క్షణం లో రాజీనామా చేసి వెళ్ళిపోతా ‘’అన్నాను .వాళ్ళు అందరూ ముక్త కంఠం గా ‘’హెడ్ మాస్టారూ!మీరు ఎంతకస్టపడి పని చేస్తున్నారో ఎన్నెన్ని కార్యక్రమాలు చేస్తున్నారో మాకూ తెలుసు .ప్రతి విషయం లోనూ మా సలహా కోరుతున్నారు .మేమూ ఉడతాభక్తి స్కూల్ అభి వృద్ధికి మా వంతు కృషి చేస్తున్నాం .మీరు మా పిల్లల బాగు కోరేవారు .మీరు మా పిల్లల్ని తిట్టండి కొట్టండి నరికి చంపండి .మిమ్మల్ని ఏమీ అనం .మీరంటే మాకు అంత గౌరవం .కాని ఆ టీచర్స్ అపాలజీ చెప్పాల్సిందే ‘’అని మళ్ళీ మొదటికే వచ్చారు .అప్పుడు బీరువా తీయించి ఆ ఇద్దరు కుర్రాళ్ళ మీద ఇదివరకున్న కంప్లైంట్లు నేను ఇచ్చిన వార్ని౦గులు ,డిసిప్లిన్ కమిటీలో ఆ ఇద్దరు టీచర్లు ఉండటం వారిచ్చిన రిపోర్ట్ లు నేను ఆ పిల్లలతో రాయించితీసుకొని భద్రంగాఉంచిన అపాలజీ లెటర్స్ అన్నీ ఉన్న ఫైల్ తీసి అన్నీ చదివి వినిపింఛి ‘’ఇప్పుడు చెప్పండి .మేము క్షమాపణ చెప్పాలా ?’’అన్నాను .అందులో ఉన్న సంజీవరావు గారనే స్కూల్ కమిటీ మెంబర్ పిల్లలతో ‘’దొంగ నాకొడుకుల్లారా బాగా చదువుకోమని స్కూల్ కు పంపుతుంటే ఈ లత్తుకోరు వేషా లేన్ట్రా .చీల్చి పారేస్తాను ‘’అని ఆ ఇద్దరుకుర్రాళ్ళను అందరి ఎదుటా నాలుగు పీకి ‘’సార్!మా వాళ్ళదే తప్పు .మేము సిగ్గుపడుతున్నాం ఇలాంటి దొంగనాకోడుకుల్ని కన్న౦దు కు .మళ్ళీ ఇలా జరక్కుండా మేము జాగ్రత్త పడతాం. మీకు ,స్కూల్ కు ఏ చెడుపేరు రాకుండా చూస్తాం ‘’అన్నారు .హమ్మయ్య అనుకోని తీవ్రంగా పట్టిన మబ్బు యిట్టె విడిపోయినందుకు అందరం సంతోషించాం .ఒక గంటతర్వాత అందరూ స్కూల్ లోకి వచ్చారు. యధాప్రకారం స్కూల్ నడిచింది .ఇక ఎవరిపైనా ఎవరికీ కోపం ద్వేషం లేవు. అందరం కలిసి పని చేశాం. స్టాఫ్ మీటింగ్ పెట్టాను .అంతానన్ను సపోర్ట్ చేసి ఇన్ ష్టి ట్యూషన్ గౌరవం టీచర్ల మర్యాదా కాపాడినందుకు ప్రత్యేకంగా అభినందనలు చెప్పారు .ఎవ్వరిమీదా ఏ రకమైన కక్ష సాధింపు చర్యలూ మేము తీసుకోలేదు .మర్నాటి నుంచి విద్యార్ధులంతా మా టీచర్స్ తోనూ చాలా గౌరవంగా ఉన్నారు .హెడ్ మాస్టర్ గా నా వ్యక్తిత్వం ఇంతటి సంక్షోభం నుండి బయట పడేసినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకొన్నాను .ఇలా బయటపడకపోతే రచ్చరచ్చ అయి స్కూల్ పరువు మాపరువు ఇప్పటిదాకా మేమంతా కస్టపడి సాధించిన పేరు ఒక్క దెబ్బతో తుడిచి పెట్టుకు పోయేవి .
రిటైర్ మెంట్
1998 ఏప్రిల్ మే నెలలో వేసవి సెలవలలో మేము కేదార్ బద్రీ మొదలైన యాత్రలు చేసి వచ్చామని ము౦దేరాశాను. జూన్ 27నా పుట్టినరోజు కనక రిటైర్ మెంట్ డేట్ కూడా అప్పుడే అవ్వాలి .కొన్నేళ్ళ క్రితం అందరికీ రిటైర్ మెంట్ డేట్ ఆనెలలచివరి రోజునే అనే జివో రావటం వలన ఆనెల జీతం పూర్తిగా ఇచ్చి చివరి రోజున సాగనంపటం జరుగుతోంది .వేసవి సెలవలతర్వాత జూన్ 13స్కూల్ రిఓపెనింగ్ జరిగింది .అప్పటికే రికార్డ్ లన్నీ సిద్ధం చేయటం ,కాష్ లెక్కలన్నీ తయారు చేసి పాస్ బుక్స్ అప్ డేట్ చేయటం ,లెక్కలు ,సైన్స్ లైబ్రరి ,డ్రిల్ మాస్టార్ ల వద్ద ఉన్న స్టాక్ అంతా అప్ డేట్ స్టాక్ రిజిస్టర్ల లో వాళ్ళు సంతకాలు చేశాక నేను కొంతర్ సైన్ చేయటం జరిగిపోయాయి .స్కూల్ స్టాఫ్ ఒక రోజు నాకు వీడ్కోలు పార్టీ ఇచ్చారు నేను మరో రోజు వాళ్లకు పార్టీ ఇచ్చాను .
జూన్ 30న లాంచనంగా స్టాఫ్ విద్యార్ధుల సమక్షం లో రిటైర్ మెంట్ జరిగింది .కమిటీ ప్రెసిడెంట్ శ్రీ రామబ్రహ్మంగారు ,కృష్ణా జిల్లా హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ నుంచి శ్రీరాజుగారుశ్రీ ఆదినారాయణ గుడివాడి ఉపవిద్యా శాఖాధికారి శ్రీ టి శ్రీరామ మూర్తిగారు ఆహ్వానితులుగా విచ్చేశారు .హైదరాబాద్ నుంచి మా పెద్దమేనల్లుడు ఛి వేలూరి అశోక్,ఉయ్యూరులోని మా అన్నయ్యగారబ్బాయి రామనాద్ మా పెద్ద, రెండవ రెండవ అబ్బాయిలు శాస్త్రి శర్మలు కోడళ్ళు సమత ,ఇందిర,మామూడు నాలుగుఅబ్బాయిలు మూర్తి రమణ ఉయ్యూరును౦చి కార్లలో అడ్డాడ వెళ్లాం .కామన్ హాల్ లో మీటింగ్ .స్టాఫ్ తరఫున నూతనవస్త్రాలు పూలదండ శాలువా కప్పారు .మా మేనల్లుడు నాకు బట్టలుపెట్టాడు .ఆదినారాయణ రాజుగార్లు శాలువాలు కప్పారు .స్టాఫ్ అంతా చాలా బాగా మాట్లాడారు .విద్యార్ధినీ విద్యార్ధులూ తమ అనుభవాలను బాగా పంచుకొన్నారు .డి.వై .యి. వో గారు నాకు రావాల్సిన ప్రావిడెంట్ ఫండ్ 60 వేల రూపాయల చెక్కు నాకు అందించి నాగురించి మంచిమాటలు చెప్పారు .ఒకా ఆత్మీయ సమావేశంగా కార్యక్రమ౦ దాదాపు రెండు గంటలు జరిగింది .మా తలి దండ్రుల పేరిట ఏటా టెన్త్ లో స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్ధికి 500రూపాయలు ఇస్తానని రిజల్ట్స్ రాగానే నాకు కార్డ్ రాస్తే పంపిస్తాననీ చెప్పి ఆ ఏడు 1998 మార్చిలో స్కూల్ ఫస్ట్ గా ,అన్నిట్లోనూ అద్భుత ప్రావీణ్యం చూపిన మా స్కూల్ లోనేను పని చేస్తున్నప్పుడు 6వ క్లాస్ లోచేరి పదవక్లాసు దాకా చదివి పాసై ఇంటర్ లో చేరిన మా అందరికి అత్యంత ఇష్టమైన ఆల్ రౌండర్ కుమారి చీలి నాగ లక్ష్మికి మొదటి సారిగా అయిదువందల రూపాయల నగదు పారితోషికం ఉపవిద్యాశాఖాదికారి గారి చేతులమీదుగా ఆఅమ్మాయి తండ్రిగారు శ్రీ వెంకటేశ్వరరావు(రిటైర్డ్ సోషల్ మాస్టర్ ) గారి సమక్షం లో ఇప్పించాను .తర్వాత నాలుగైదు సంవత్సరాలు స్కూల్ ఫస్ట్ కు నగదు బహుమతులు ఇచ్చాను .ఆతర్వాత నేనే చొరవ తీసుకొని ఉత్తరాలురాసి , ఫోన్లు చేసినా స్కూల్ నుంచి రెస్పాన్స్ రాకపోతే ఇవ్వటం ఆపేశాను .ఆతర్వాత నేను మేడూరు హెచ్ ఎంగా ఉన్నప్పుడు లేక్కలమేస్టార్ అయిన శ్రీ ప్రసాద్ హెడ్ మాస్టర్ అయి మా ఇంటికి వచ్చి ఆహ్వానిస్తే వెళ్లి అక్కడ స్కూల్ టాపర్ కి అయిదువందలు ఇచ్చి నాలుగేళ్ళు కంటిన్యు చేశాను .తర్వాత వాళ్ళూ నాకేమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవటం తో ఆగిపోయింది .అలాగే ముప్పాళ్ళ లోని ఓల్డ్ స్టూడెంట్ బాబ్జీ అనే బెజవాడ ఫిజిక్స్ లెక్చరర్ ప్రస్తుతం ప్రిన్సిపాల్ ఆగస్ట్ 15 జండా పండగ స్కూల్ లో తన బాచ్ విద్యార్ధులతో చేయిస్తూ నన్ను ఆహ్వానిస్తే వెళ్లి టెన్త్ టాపర్ కు అయిదువందల రూపాయలు ఇచ్చి నాలుగేళ్ళు ఆ హెడ్మాస్టర్ నాకు ఫోన్ చేసి చెప్పగానే బాబ్జీ తో డబ్బు పంపించి ఇప్పించాను .తర్వాత అదీ ఆగిపోయింది .
నా తర్వాత స్కూల్ లో సీనియర్ అయిన లెక్కలస్టారు శ్రీ యెన్ .సీతారామ రాజుగారికి బాధ్యతలు , స్కూల్ తాళాలు అప్పగించాను .అడ్డాడ విద్యార్ధులు అప్పుడప్పుడు బస్సుల్లో కనిపిస్తుంటారు .వాళ్ళంతా గొప్ప అభిమానం చూపిస్తారు .పాము సురేష్ ఫేస్ బుక్ లో పకరిస్తున్నాడు .మద్రాస్ లో ఉన్ననాగ లక్ష్మి మూడేళ్లక్రితం ఫోన్ చేసి మాట్లాడిని .అమెరికాలో ఉన్న కోడూరి పావని రేగ్యులరా ఫోన్ చేసే మాట్లాడేది నా సర్వీస్ లో బాగా కస్టపడి ,స్కూల్ కు నాకూ మంచి పేరు సాధించిన అడ్డాడ హైస్కూల్ ను మరవటం కష్టం .అందుకే దీనిపై అంతఇష్టంగా 21 ఎపిసోడ్ లు రాసి సంతృప్తి చెందాను .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-6-19-ఉయ్యూరు
—
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Gabbita Durga Prasad
Rtd. head Master Sivalayam Street
Vuyyuru 521165 Krishan District
Andhra Pradesh
India
Cell : 9989066375
8520805566
Land Line : 08676-232797
I’m protected online with Avast Free Antivirus. Get it here — it’s free forever. |
—
You received this message because you are subscribed to the Google Groups “SAhitibandhu” group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to sahitibandhu+unsubscribe@googlegroups.com.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/sahitibandhu/CAJfQ0z9aKX2qsKj5XTMU4rj7vqerKdV8yBdZuEpbxfpi9vVfyw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.
Anand mavayya vacchadu
Show quoted text