నా దారి తీరు -126
పెన్షన్ పేపర్లు తయారు చేసి సమర్పించటం
1998 జూన్ 30కి నాకు 58 ఏళ్ళు నిండుతాయి కనుక జూన్ నెలాఖరుకు నా రిటైర్ మెంట్ .అప్పటికే నా కంటే జూనియర్స్ నాకంటే ఎక్కువ జీతః తీసుకొంటున్నట్లు తెలిసి ,ఆ వివరాలుసేకరించి కంపారటివ్ స్టేట్మెంట్ తయారు చేయించి వాళ్ళుపొందుతున్న జీతాల ఆర్డర్ కాపీలు సంపాదించి వాటినకళ్ళు జత చేసి జిల్లాపరిషత్ కు పంపాను .దీనికంతకూ మంచి సహకారం అందించాడు జూనియర్ అసిస్టెంట్ బాబు .అతనే బందరు వెళ్లి చెయ్యాల్సిన పని అంతా చేసి సాంక్షన్ చేయించాడు .ఈ తేడా లకోసం బిల్ చేయటానికి నేను పని చేసిన ఇతర స్కూళ్ళ నుండి నాన్ డ్రాయల్ సర్టిఫికెట్లు పొందాలి .ఆ స్కూళ్ళ హెడ్ మాస్టార్లకు అఫీషియల్ గా లెటర్స్ పంపించి తెప్పించి బిల్స్ చేసి జిల్లాపరిషత్ కు పంపి సాంక్షన్ చేయించాము .పెంజేండ్ర హెడ్మాస్టర్ శ్రీ వి రఘురాములు అంతకు ముందు పామర్రులో మేమిద్దరం అసిస్టెంట్స్ గా పని చేసినప్పటినుంచి పరిచయం . ఇప్పుడు నాకంటే ఎక్కువ జీతం డ్రా చేస్తున్నట్లు మాటల సందర్భంగా చెప్పాడు .తనదగ్గరున్నసాంక్షన్ ఆర్డర్స్ నాకు పంపటం తో ఇదంతా అమలు జరగటానికి వీలైంది .
అలాగే కుటుంబ నియంత్రణ ఇన్సెంటివ్ లకోసమూ పని చేసిన అన్ని స్కూళ్ళ నుండి నా డ్రాయల్స్ తెప్పించాలి ఆయా స్కూల్స్ హెడ్ మాస్టర్స్ సౌజన్యం వలన అవీ సకాలం లో రావటం బిల్స్ చేసి సాంక్షన్ చేయించుకోవటం జరిగింది .22ఏళ్ళ ఆటోమాటిక్ ఇంక్రిమెంట్ ,హెడ్ మాస్టర్స్ స్కేల్ ఫిక్సేషన్ ,ఈ స్కేల్ లో రావాల్సిన చివరి ఇంక్రిమెంట్ కూడా పరిషత్ విద్యాశాఖాదికారి గారితో సకాలం లో మంజూరు చేయించాము .ఇక పెన్షన్ పేపర్స్ తయారు చేసి జిల్లాపరిషత్ కు ,డి.యి .వో .గారికి పంపాలి .దీనికీ మా గుమాస్తా చకచకా ఫారాలు పూర్తీ చేయించి పంపించేశాడు .అప్పటిదాకా పెన్షన్ ఫిక్సేషన్ చివరి పదినెలల ఆవరేజ్ పే మీద లెక్కించి ఇవ్వటం ఉన్నది. అలాగే పేపర్స్ తయారు చేసి సబ్మిట్ చేశాం .పంపిన తర్వాత ప్రభుత్వం తో ఉద్యోగ సంఘాల నిరంతర పోరాటం వలన పెన్షన్ ను చివరినెల లో తీసుకొన్నబేసిక్ పే పైనే ఫిక్స్ చేయాలి అని ఆర్డర్ వచ్చింది .మా గుమాస్తా బాబు అత్యంత వేగంగా డియివో ఆఫీస్ కు వెడితే ,నా పెన్షన్ పేపర్స్ హైదరాబాద్ పంపకుండా అక్కడే ఉన్నట్లు తెలుసుకొని ,వాటిని తీసుకొచ్చి టెన్ మంత్స్ ఆవరేజ్ ను ,లాస్ట్ మంత్ పే ఆధారంగా మార్చి మళ్ళీ డియివోఆఫీసులో సబ్మిట్ చేసి వాళ్ళ చేతిలో మామూళ్ళు పెట్టి ఇక ఆలస్యం కాకుండా హైదరాబాద్ పంపేట్లు చేశాడు .అతడు ఇంత స్పీడ్ గా పని చేయటం వలననే నాకు పెన్షన్ లాస్ట్ మంత్ పే మీద ఫిక్స్ అయి వచ్చింది .ఇలా చేయనివారికి మామూలుగా టెన్ మంత్ ఆవరేజ్ పే మీద పెన్షన్ సాంక్షన్ అయింది .నామిత్రుడు శ్రీ పి.ఆంజనేయ శాస్త్రి గారికిఇలా జరిగి ,ఈమధ్యనే అందరికీలాస్ట్ మంత్ పే మీదనే ఇవ్వాలని జి వో ఇస్తే ఇప్పుడు ఎరియర్స్ తో సహా పొందారు .నాకుమాత్రం నేను రిటైర్ అయిన రోజునుంచే అమలైంది .ఇదంతా ఒక పెద్ద ప్రహసనం ,ప్రాసెస్ .పెన్షన్ పేపర్స్ తయారు చేయటానికి డియివో ఆఫీసులోఒకరిద్దరు బెజవాడ బందరు గుడివాడ ఉయ్యూరు మొదలైన చోట్ల కొందరు అనుభవజ్ఞులు ఉంటారు వీరి చేతిలో రెండు వందలుపెట్టి ఇన్ఫర్మేషన్ అంతాఇస్తే , ఇకమనం సంతకాలు పెట్టటం తప్ప మరే పనీ ఉండదు .చలామంది ఇలాంటి వారి తోనే చేయిస్తారు .వీళ్ళు చేస్తే డియివోఆఫీస్ లోకూడా ‘’కొర్రీలు’’ పడవు .వెంటనే సాంక్షన్ కోసం పైకి పంపేస్తారు .లేకపోతె ‘’వర్రీస్’’ తప్పవు .కనకవల్లి వాసి ,ఉయ్యూరు ,పెనమకూరు లలో నాతొ పని చేసిన తెలుగుమేస్టారు శ్రీ వెంపటి శర్మగారికి చాలాకాలం పెన్షన్ సాంక్షన్ కాకపొతే ఉపాయం చెబితే ,మొదట్లో భీష్మి౦చినవాడు తర్వాత దారికొచ్చి పెన్షన్ పొందగలిగాడు .
సుమారు 40ఏళ్ళక్రితం మా ఇంటిప్రక్కన ఉన్న మా పెంకుటింట్లో కాపురమున్న శ్రీ మల్లాది రామకృష్ణయ్యగారు ఉయ్యూరు సమితిలో ఎలిమెంటరి స్కూల్ మేస్టర్ గా పని చేస్తూ కాపురమున్నారు.చాలా అభిమానవంతులు .నలుగురు మగపిల్లలు .వారందర్నీ బాగా చదివించారు. జీతాలకోసం డి.యే .కోసం స్ట్రైక్ లు జరిగితే ,ఆయన పరిస్థితి గమనించి అందరం సాయం చేసి మేము బియ్యం డబ్బూ కూడా ఇచ్చి పస్తులు ఉంచకుండా చూశాము .దీనికి ఆకుటుంబం ఎంతోకృతజ్ఞతాభావం తో ఉండేవారు .అద్దె కూడా ఇచ్చినప్పుడే తీసుకోనమనేది మా అమ్మగారు . ఆ తర్వాత ఆయన రిటైర్ అవటం పెద్దబ్బాయి శాస్త్రి ఎ .జి.ఆఫీస్ లో ఆఫీసర్ అవటం మిగతావారంతా కూడా హైదరాబాద్ లో మంచి ఉద్యోగాలలో సెటిల్ అవటం జరిగింది .ఇప్పటికీ వాళ్ళ ఇళ్ళకు మేము వెళ్ళటం ,వాళ్ళు మా ఇంటికి రావటం జరుగుతోంది. ఫోన్ లో మాట్లాడుకోవటమూ ఉంది .మల్లాదిమేస్టారు ముందుగా ,తర్వాత భార్య శ్రీమతి వెంకట లక్ష్మి గారు కూడా చనిపోయారు .వాళ్ళ రెండో అబ్బాయి రామకృష్ణ శాస్త్రిని మేమంతా ‘’ఎంఆర్కే’’అంటాం రెండు నెలలక్రితం హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు . తర్వాత వాడు సత్యం .చివరివాడు వెంకటేశ్వర్లు .తరచుగా ఫోన్ చేసి మాట్లాడుతాడు .ఇటువైపువస్తే ఉయ్యూరువచ్చి చూసి వెడతాడు .
మల్లాది మేస్టారి పెద్దబ్బాయి శాస్త్రి ఏజీ ఆఫీసు లో ఆఫీసర్ గా ఉండటం, అతని దృష్టికి నా పెన్షన్ పేపర్ల సంగతి తీసుకు రావటం తో కానీ ఖర్చు లేకుండా ఏజీ ఆఫీసులో నా పెన్షన్ సాంక్షన్ అయి అక్టోబర్ నుండి చేతికి వచ్చింది .కృతజ్ఞతా భావాలకు ఇవన్నీ పరాకాష్ట లు .మనుషులమధ్య డబ్బు సంబంధంకంటే మానవీయ విలువల సంబంధం ఉంటె ఎన్ని అద్భుతాలైనా జరుగుతాయి .కొన్ని దశాబ్దాల క్రితం మా ఇంట్లో నెలకు 6 రూపాయలకు అద్దెకున్న కుటుంబం లో అందరూ కస్టపడి పైకొచ్చి అందరికీ ఆదర్శంగా ఉన్నారు .లేమిలోంచి కలిమిలోకి ఎదగటం అందునా హైదరాబాద్ లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపారు .మా అమ్మగారన్నా, మేమన్నా ఆకుటుంబానికి ఆరాధనా భావం .మాకు వారంటే విపరీతమైన అభిమానం .వారి సౌజన్యం మాకు ఆకర్షణ .మల్లాది వారి వంటి కుటుంబాలు అత్యంత అరుదుగా ఉంటాయి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-6-19-ఉయ్యూరు
—