ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు
2-‘’హెమ’’వర్జీనియా పొగాకు వంగడ రూపకర్త-డా .వెలువలి వెంకట రమణారావు
తూర్పు గోదావరి జగన్నాధ పురం లో 13-10-1935 న జన్మించిన వెలువలి వెంకట రమణారావు ఆంధ్రా యూనివర్సిటి నుంచి వృక్షశాస్త్ర పట్టభద్రులు .1973లో గుజరాత్ లో ‘’ప్లాంట్ బ్రీడింగ్ ‘’పై ప్రత్యెక పరిశోధన చేసి ,ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అందుకొన్నారు .
రాజమండ్రి లోని సెంట్రల్ టొబాకో రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ లో ,టెక్నికల్ శాఖలో అసిస్టెంట్ సైంటిస్ట్ గా 1955లో చేరారు .పనిచేసిన 41 సంవత్సరాలలో 7 సార్లు పదోన్నతి పొంది ప్రిన్సిపల్ సైంటిస్ట్ గా ,శాఖాధిపతి గా ఎదిగారు .పొగాకు రంగం లో అవిశ్రాంత కృషి చేసి 1996 అక్టోబర్ లో పదవీ విరమణ చేశారు .తర్వాత గుజరాత్ అగ్రికల్చరల్ యూని వర్సిటి లో ఇన్విజి లేటర్ గా ,జాతీయ అంతర్జాతీయ వైజ్ఞానిక పత్రికా సంపాదకులుగా ఉన్నారు .
రమణారావు గారు 1968లో రాజమండ్రి నుంచి ,మేలురకం వర్జీనియా పొగాకు విత్తనాలను కర్ణాటకలోని ‘’బైలె కుప్పె’’గ్రామానికి తీసుకు వెళ్లి సాగు చేసి నాణ్యత పెంచారు.దీనితో కర్నాటక రైతులు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మేలురకపు సిగరెట్ పొగాకు ఉత్పత్తిలో అగ్రగాములై మనదేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని అత్యధికంగా సాధించి పెట్టారు .పొగాకుకు వచ్చే బూడిద రంగు తెగులు నివారణకు జపాన్ నుంచి తెప్పించిన రెండు జన్యువులను మన పొగాకులో ప్రవేశ పెట్టి విజయం సాధించారు .అలాగే’’ సీతాఫలం’’ తెగులు నివారణకు ‘’వేమర్ -50’’అనే విత్తనం లోని జన్యువును ప్రయోగించి ,అనేక మేలుజాతి వంగడాలను రూపొందించారు .
1969లో మనరాష్ట్రం తరఫున ఒరిస్సా వెళ్లి అక్కడ వర్జీనియా పొగాకు సాగు కు శ్రీకారం చుట్టారు .అక్కడి రైతులు ఈ పొగాకు ను అత్యధికంగా పండించి ఇబ్బడిముబ్బడి లాభాలు పొందారు .మన రాష్ట్రానికీ ,కర్ణాటక రాష్ట్రానికీ కలిపి 10 రకాల మేలు జాతి వంగడాలు రూపొందించిన ఘనత వెలువలి వారిదే .వీరు జాతీయ అంతర్జాతీయ సైన్స్ మేగజైన్ లలో 32పరిశోధనా పత్రాలు రాసి ప్రచురించారు .2005మార్చిలో రష్యాలోని అజార్ బైజాన్ సందర్శించి , వర్జీనియా పొగాకు ఉత్పత్తి పెంపుదలకు ,మార్కెటింగ్ కు అవకాశాలను విశ్లేషించారు .
రమణారావు గారి ప్రతిభకు తగిన గౌరవ పురస్కారాలు లభించాయి .రాజమండ్రి లోని ‘’ది ఇండియన్ సొసైటీ ఆఫ్ టుబాకో సైన్స్ ‘’1955లో ఫెలోషిప్ ఇచ్చి గౌరవించింది . ఈ సంస్థ కార్య దర్శిగా ఉన్న1990- 1993కాలం లో రాజమండ్రిలో పొగాకు సదస్సు నిర్వహించారు .వేప చెట్టు గుణాలు ,విశేష ప్రయోజనాలు తెలియ జేయటానికి బెంగుళూరు లో ‘’వరల్డ్ నీమ్ కాన్ఫరెన్స్ ‘’నిర్వహించారు .1976నుంచి ‘’ఇండియన్ సొసైటీ ఆఫ్ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ ‘’సంస్థలో సభ్యులుగా ఉన్నారు .
వ్యవసాయ సైన్స్ తో పాటు రావు గారికి చిత్రలేఖనం పైనా విశేష అభిరుచి ఉంది .ఇందులో చేసిన కృషికి దామెర్ల రామారావు ఆర్ట్ స్కూల్ వారు వెండిపతకం బహూకరించారు .లలిత సంగీతం లోనూ ప్రావీణ్యం ఉన్న వీరికి ఆంధ్రా యూని వర్సిటి వెండికప్పు ,వెండిపతకం అందజేశారు .ఢిల్లీ లోని కృషి అను సంధాన పరిషత్ వారు స్కాలర్ షిప్ ఇచ్చారు .1971లో గుజరాత్ లోని ఆనంద్ అగ్రికల్చరల్ కాలేజి లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్ధుల వక్తృత్వ పోటీలో మొదటి బహుమతి పొందారు .’’హెమ’’అనే మేలురకం వర్జీనియా పొగాకు వంగడం రూప కల్పన చేసినందుకు ‘’డా.జి.ఎస్.మూర్తి అవార్డ్ ను రావుగారు 1992లో అందుకొన్నారు .పొగాకు వ్యవసాయం లో ఇంతటి అద్భుత కృషి చేసిన వెంకటరమణారావు గారి గురించి మనకెవ్వరికీ పెద్దగా తెలియకపోవటం ఆశ్చర్యమే .
సశేషం