విత్తన స్వేచ్చ, ఆహార సార్వభౌమాదికారాల కోసం ఉవ్వెత్తున ఉద్యమించిన -వందనా శివ-(వ్యాసం ) గబ్బిట దుర్గా ప్రసాద్
1952నవంబర్ 5న డెహ్రాడూన్ లో అరణ్య సంరక్షకుడైన తండ్రికి ,ప్రకృతిపైప్రేమతో రైతుఅయిన తల్లికి వందనా శివ జన్మించింది .నైనిటాల్ లో సెయింట్ మేరీస్ కాన్వెంట్ హైస్కూల్ ,డెహ్రాడూన్ లోని కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ లలో విద్యనేర్చింది .చండీఘర్ లోని పంజాబ్ యూని వర్సిటిలో చదివి ఫిజిక్స్ లో 1972లో బిఎస్ సి.డిగ్రీ పొందింది .కొద్దికాలం భాభా అటామిక్ సెంటర్ లో పనిచేసి కెనడా వెళ్లి గ్లూఫ్ యూని వర్సిటి లో చదివి ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ 1977లో అందుకొన్నది .’’చేంజెస్ ఇన్ ది పీరియాడిసిటి ఆఫ్ లైట్ ‘’పై పరిశోధన వ్యాసం రాసి 1978లో పశ్చిమ ఒంటారియో యూని వర్సిటి నుండి ఫిలాసఫీ ఆఫ్ ఫిజిక్స్ ను కేంద్రంగా చేసుకొని ఫిలాసఫీలో పిహెచ్ డి పొందింది .’హిడెన్ వేరియబుల్స్ అండ్ లోకాలిటి ఇన్ క్వాంటం థీరీ’’అని ఆమె రాసి పరిశోధన గ్రంథం మంచి పేరు తెచ్చింది .బెల్ సిద్ధాంతానికి బాహ్య విషయంగా గణితం ఫిలాసఫీ లలోని నిగూడార్ధాలపై కేంద్రీకరించి రాసిన డెజేర్టే షన్ ఇది.తర్వాత బెంగళూరు వచ్చి ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ , ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లలో సైన్స్ , టెక్నాలజీ , పర్యావరణ విధానాల అంతర్ సంబంధాలపై తీవ్రమైన పరిశోధన చేసింది .
వ్యవసాయం- ఆహారం –మేధోహక్కు లపై ప్రత్యేక దృక్పధం:
వందనా శివ వ్యవసాయం ఆహారం లలో వచ్చిన ఆధునీకరణ అభి వృద్ధి లపై విస్తృతంగా రాసిందీ ప్రసంగించింది .’’మేధోహక్కు ,జీవ వైవిధ్యం ,జీవనీతి ,జెనెటిక్ ఇంజినీరింగ్ మొదలైన ముఖ్యవిషయాలపై వందనా శివ క్రియాశీలకంగా పోరాటం జరిపింది .ఆఫ్రికా ఆసియా ,లాటిన్ అమెరికా ,ఐస్లాండ్ స్విట్జెర్లాండ్ ఆస్ట్రేలియా దేశాలలోని లోని ‘’గ్రీన్ మువ్ మెంట్ ‘’ఉద్యమానికి సహకరించింది .జెనెటిక్ ఇంజినీరింగ్ ద్వారా వ్యవసాభి వృద్ధి జరగరాదని ఈ సంస్థ ముఖ్యపోరాటం .
పరిశోధన సంస్థ స్థాపన – నవ ధాన్య సృష్టి –బీజ విద్యాపీఠ్:
1982లో సైన్స్ ,టెక్నాలజీ ,జీవావరణం లకోసం ఒక రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ ను నెలకొల్పింది దీనితో 1991’’నవ ధాన్య ‘’సృష్టి చేసింది .దీన్ని ఒక ఉద్యమంగా చేబట్టి జీవ వైవిధ్యం ,సమగ్ర సంపూర్ణత ,స్థానిక విత్తనాభి వృద్ధి ,సేంద్రియ వ్యవసాభి వృద్ధి ,న్యాయమైన వాణిజ్యం ల కోసం అహరహం శ్రమించింది .’’నవధాన్య ‘’ అంటే కొత్త ధాన్యం అనికాదు ‘’తొమ్మిది రకాల విత్తనాలు’’లేక నూతన బహుమతి అని అర్ధం చెప్పింది వందనా శివ .తన రిసెర్చ్ సంస్థకు రైతులను ఆహ్వానించి వీటిపై అవగాహన తరగతులు నిర్వహించి వారు అమలు చేయటానికి ప్రోత్సహించింది .మొదటి సారిగా దేశం మొత్త౦ మీద 40విత్తన బ్యాంకులను నెలకొల్పి ప్రాంతీయ విభాగాలలో అందుబాటుకు తెచ్చి వైవిధ్య వ్యవసాయానికి దారి చూపించింది .డెహ్రాడూన్ వాలీ లో 2004లో ఇంగ్లాండ్ లోని షుమేకర్ కాలేజి తో కలిసి ‘’బీజ విద్యా పీఠ్’’అనే అ౦తర్జాతీయ కాలేజీని ఏర్పాటు చేసింది .
మేధో హక్కులపోరాటం –వేపను కాపాడిన శివకు వందనం:
మేధోహక్కులను కాపాడటానికి ,జీవవైవిధ్యానికి ఆమె రిసెర్చ్ సంస్థ తీవ్రంగా కృషి చేసింది.వేప, బాస్మతి బియ్యం, గోధుమలపై జరుగుతున్న ‘’బయో పైరసీ’’ని చాలెంజ్ చేసి ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళి వాటిపై మనకున్న హక్కులను కాపాడింది .బయో డైవర్సిటి,ఐపిఆర్ లేజిస్లేషన్ ప్రభుత్వ సంస్థలలో పని చేసి సహకరించి సాధించింది .
రచనాశివం:
.1984లోనే పంజాబ్ లో హింసాత్మక సంఘటనలు ,భోపాల్ లో గాస్ లీక్ తో జన నష్టం లను చూసి ఆమె వ్యవసాయం పై కృషి ప్రారంభించింది . యుఎన్ యూని వర్సిటీలో చదువుతూనే ‘’ది వయోలెన్స్ ఆఫ్ ది గ్రీన్ రివల్యూషన్ ‘’పుస్తకం రాసింది .రసాయనిక ఎరువులు అతిగావాడి సస్యాభి వృద్ధి సాధిస్తే జీవావరణ పర్యావరణాలు దెబ్బతిని మనుషుల ఆరోగ్యమూ పాడైపొతుందని ,సుమారు 1400రకాల క్రిమిసంహారక పురుగు మందులుప్రపంచం మొత్త౦ మీద మనఆహారాలలో చేరి హాని కలిగిస్తున్నాయనీ కారణం స్ప్రే ద్వారా చల్లే మందులో 1శాతం మాత్రమే క్రిములను సంహరిస్తుందనీ మిగిలినదంతా ఆహార పదార్ధాలలో చేరుతుందనీ ,వీటివల్ల కిడ్నీ సమస్య, కేన్సర్, గుండెపోటు సహజమైపోతాయని హెచ్చరించింది .ఇన్ని వైవిధ్య విషయాలపై తీవ్రంగా పోరాడుతూ కృషి చేస్తున్నాకూడా వందనా శివ తన అభిప్రాయాలు ప్రజలకు చేరువ అవటానికి పుస్తకాలు రాసింది .1969లో మొదటిపుస్తకం ‘’ స్టేయింగ్ అలైవ్’’లో మూడవ ప్రపంచ ౦ పై మహిళలకు గొప్ప అవగాహనకలిగించింది .1990లో ‘’వుమెన్ అండ్ అగ్రికల్చర్ ‘’అనే రిపోర్ట్ ను ఎఫ్ .ఏ.ఓ .కోసం రాసి అందులో ‘’ఇండియాలో ఎక్కువమంది వ్యవసాయదారులు స్త్రీలే ‘’అని చెప్పింది .
ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్న వందనా శివ వేదిక్ ఈకాలజి ,అనదర్ స్టోరి ఆఫ్ ప్రోగ్రెస్ ,క్రియేటింగ్ ఫ్రీడం ,పావర్టి ది ట్రు కాస్ట్,చిప్కో ,ఈకో ఫెమినిజం సీడ్స్ ఆఫ్ డెత్ ,మొదలైన 20కి పైగా విలువైన పుస్తకాలు రాసింది .
పదవీ వందనం:
ఖాట్మండులో లో ఏర్పాటైన ‘’మౌంటేన్ డెవలప్ మెంట్ ఇంటర్నేషనల్ సెంటర్’’ లో స్త్రీలకూ ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయించింది .’’వుమెన్స్ ఎన్విరాన్ మెంటల్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ ‘’బోర్డ్ లో ఆమె సభ్యురాలు .2010లో వందనాశివకు ‘’సిడ్నీ పీస్ ప్రైజ్ ‘’అందజేసినప్పుడు ఆమె చేసిన’’మేకింగ్ పీస్ విత్ ఎర్త్ ‘’ ఉపన్యాసం పుస్తకంగా వెలువడింది .ఇందులో జీవవైవిధ్యాన్ని ,జాతులకు, ప్రకృతికిఉన్న సంబంధాన్నీ చర్చించింది .ఇది భారత దేశాన్ని గూర్చి రాయబడినా,ప్రపంచం లోని అన్ని ప్రాంతాలవారికీ వర్తించే విషయం .
వందనా శివ సమర్ధతకు తగిన పదవులెన్నో అలంకరించింది .ఇంటర్నేషనల్ ఫోరం ఆన్ గ్లోబలైజేషన్ ,వుమెన్స్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ,థర్డ్ వరల్డ్ నెట్ వర్క్ మొదలలైన ప్రభుత్వ ,ప్రభుత్వేతర సంస్థలలో సభ్యురాలు సలహాదారు మెంబర్ ..ఇటలి లోని టస్కని రీజియన్ ఏర్పాటు చేసిన ‘’ఫ్యూచర్ ఆఫ్ ఫుడ్’’కమిషన్ కు చైర్మన్ .స్పెయిన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘’సైంటిఫిక్ కమిటీ ‘’సభ్యురాలు ..W.T.Oకు వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియన్ పీపుల్ కాంపైన్ స్టీరింగ్ కమిటీ మెంబర్ .’’వరల్డ్ ఫ్యూచర్ కౌన్సిల్ ‘’లో కౌన్సిలర్ .భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘’ఆర్గానిక్ ఫార్మింగ్ ‘’కమిటీ సభ్యురాలు .2007లో ‘’స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ విజన్స్ ‘’ప్రాజెక్ట్ పాల్గొని సలహాలిచ్చింది .
మరిరెండు ముఖ్య ఉద్యమాలు:
వందనా శివ అంటే అందరికి ముందు గుర్తుకు వచ్చేవి విత్తనాస్వేచ్చ మేధో హక్కుపరిరక్షణ .
విత్తన స్వేచ్చ -.విత్తనాలవిషయం లో కార్పోరేట్ పేటెంట్ లను ఒప్పుకోరాదని విత్తన స్వేచ్చ రైతులకే ఉండాలనీ ,ఇంటలెక్త్యువల్ ప్రాపర్టీ రైట్స్ తప్పక ఉండాలని ,బయోపైరసి ని అరికట్టాలని ఉద్యమించింది .అమెరికా లోని డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ తో 10సంవత్సరాలు ‘’వేప చెట్టు ‘’పైరసీ పై పోరాటం చేసి ఆహక్కు భారత దేశానిదే అని మెడలు వంచి ఒప్పించింది . గోల్డెన్ రైస్ –బయో సింతసైజ్ బీటా కేరొటీన్ అనే విటమిన్ ఎ ను నస్టపరచే జెనటిక్ ఇంజనీరింగ్ తో తయారైన గోల్డెన్ రైస్ ఆరోగ్యానికి హాని అని ప్రపంచవ్యాప్తంగా వేలాది బాలబాలికలకు కంటి జబ్బులువచ్చి బాధపడుతున్నారని ఆ బియ్యాన్ని బహిష్కరించాలని తీవ్రపోరాటం చేసింది .
రైతులు మొన్సాటో, కార్గిల్ అనే గుత్త సంస్థల విత్తనాలను అత్యదిక ధర పెట్టికొని ,అవి పండక అప్పులపాలౌతున్నారని వందనాశివ నెత్తీ నోరూ మొత్తుకొని చెప్పి ‘’ది.కార్పోరేట్ హైజాక్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా ‘’పుస్తకం రాసింది .జీవావరణ పర్యావరణ రక్షణకు స్త్రీలు బాగా ముందు ఉండాలని, ‘’ఈకో ఫెమినిజం ‘’అందుకే నేడు అవసరమని నొక్కి చెప్పి దాన్ని వ్యాప్తిచేసింది .
డాక్యుమెంటరీ వందనం:
వందనా శివ పై ఫ్రీడంఎహిడ్ ,రోష్ని ,ఈజ్ యువర్ ఫుడ్ సేఫ్ మొదలైన అనేక డాక్యుమెంటరి సినిమాలొచ్చాయి .నీటి స్వచ్ఛతపై ఆమెకున్న మమకారానికి ప్రతీకగా –గంగా ఫ్రం ది గ్రౌండ్ అప్ ,బ్లూ గోల్డ్ ,వరల్డ్ వాటర్ వార్స్,ఫ్లో ఫర్ లవ్ ఆఫ్ వాటర్ డాక్యుమెంటరీలు తీశారు .విత్తన స్వేచ్ఛ పై ‘’దివరల్డ్ అకార్డింగ్ టు మోన్సాంటో,ఫెడప్ వంటివి తీశారు .దలైలామా రినైసెన్స్ డాక్యుమెంటరి లో ఆమె ఒకపాత్ర ధరించింది .డిమైన్ వంటి ఫ్రెంచ్ సినిమాలలోనూ ఉన్నది .
పురస్కారవందనం:
వందనా శివ 1993లోపొందిన ‘’ రైట్ లైవ్లి హుడ్ అవార్డ్’’నోబెల్ ప్రైజ్ కు ప్రత్యామ్నాయం అని భావిస్తారు ,2003లో టైమ్స్ మేగజైన్ ఆమెను ‘’ఎన్విరాన్ మెంటల్ హీరో ‘’అని అభి వర్ణించింది . 2010సిడ్నీ పీస్ ప్రైజ్ ,2012లో మిరోడి అవార్డ్ ,2016లో ఫుకూకా ఏషియన్ కల్చర్ ప్రైజ్ లభించాయి .
-గబ్బిట దుర్గాప్రసాద్
—
వందన శివ గారి వివరాలు సేకరించి చాలా చక్కని వ్యాసంగా మలిచి షేర్ చేసినందుకు ధన్యవాదములు. మీ రచనా శైలి ఎప్పటిలానే మృదువుగా ఉంది 🙏
ok