ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు
35-తెలుగు –ఇంగ్లీష్ ,ఇంగ్లిష్- తెలుగు నిఘంటు నిర్మాత –పావులూరి శంకరనారాయణ
నలభై ఏభై ఏళ్ళక్రితం శంకరనారాయణ డిక్షనరీ లేని ఇల్లు ఆంద్ర దేశం లో ఉండేదికాదు .విద్యార్ధులకు కల్పవృక్షంగా ఉండేది .దీని నిర్మాత శంకరనారాయణ అని అందరికీ తెలుసుకాని ,ఆయన ప్రముఖ గణిత శాస్త్రవేత్త ,తొలి తెలుగు గణితశాస్త్ర గ్రంధ రచయిత పావులూరి మల్లన్న వంశీయుడని చాలా మందికి తెలియదు .1860లో పావులూరి శంకరనారాయణ గోదావరి జిల్లాలో జన్మించారు .గణిత శాస్త్రం లో ఎం. ఏ .పాసై ,కొంతకాలం శ్రీకాకుళం లో లెక్కల మేస్టారుగా ఉన్నారు .తర్వాతమద్రాస్ చేరి ,సాహిత్యం పై అభి రుచితో M.R.A.S. డిగ్రీ పొందిన తొలి తెలుగు వాడుగా రికార్డ్ సృష్టించారు .మద్రాస్ ప ప్రెసిడెన్సికాలేజిలో లెక్కల లెక్చరర్ గా ,మద్రాస్ యూనివర్సిటీలో పరీక్షాదికారిగా ఉద్యోగించారు .ఈకాలం లోనే తెలుగు –ఇంగ్లిష్ నిఘంటువును తయారు చేసి వెలువరించారు .తమిళభాషలోనూ అపార పాండిత్యం ఉండటం చేత తమిళ –ఇంగ్లిష్ ,ఇంగ్లిష్ –తమిళ డిక్షనరీ కూర్చారు .
పాథశాల బాలబాలికలకోసం ప్రణాలికా బద్ధం గా తయారు చేసుకొన్న తెలుగు –ఇంగ్లిష్ పదాల సంపుటి ఒక బృహత్ నిఘంటు అవతారం దాల్చి 1897లో ప్రచురణ పొందింది. వెంటనే ఇంగ్లిష్ –తెలుగు నిఘంటువు కూడా రూపొందించి అచ్చు వేశారు .ఈ రెండు నిఘంటువులు చాలాసార్లు పునర్ముద్రణ భాగ్యానికి నోచుకొన్నాయి ,కాలక్రమం లో శరీర శాస్స్త్ర ,సామాన్య శాస్త్రాలకు చెందిన పదాలను కూడా చేర్చి అనుబంధంగా ప్రచురించారు .బ్రౌన్ నిఘంటువులతర్వాత శంకరనారాయణ డిక్షనరీలకే అత్యధిక ప్రాచుర్యం లభించింది .
ఇంగ్లీష్ భాషలో చెప్పే భావాలన్నిటినీ తెలుగులో కూడా తప్పకుండా చెప్పవచ్చు అని నిరూపించిన తొలి నైఘంటికుడు’’ పాలూరి శంకరనారాయణ’.’తాను పావులూరి మల్లన వంశస్తుడనని చెప్పుకోవటం వలన పాలూరి కాస్తా పావులూరిగా మారి ఆయనకు ఒక విశేషణం అయింది .భారత స్వాతంత్ర్య పోరాటం లో తెలుగు ప్రజ కూడా ఇంగ్లిష్ లో ఆలోచించి ఇంగ్లిష్ లోనే తమభావాలను ప్రకటించాల్సి వచ్చేది .భావావేశం కార్యదీక్ష స్పూర్తి ,ప్రేరణ మొదలైన అంశాలతో నిమిత్తం లేని ఆంగ్లపదాలకు తెలుగు భావార్ధాల అవసరం ఎక్కువైంది .అదే సమయంలో సిపి బ్రౌన్ తెలుగు భాషను నేర్చుకో వాలనుకొన్న ఆంగ్లేయులకు తెలుగు నిఘంటువు కూర్చాడు .తర్వాత కొంత రూపా౦తరాలు చెంది శంకరనారాయణగారి నిఘంటువులు వచ్చి అందరికోరికా తీర్ఛి కరతలామలకాలని పించుకొన్నాయి .
ఒకరకంగా చెప్పాలంటే సంస్కృతానికి పాణిని ,గ్రీకు భాషకు డయోనిసియస్,,లాటిన్ కు డోనాటనస్ ఆరబిక్ కు ఆల్ ఖలీల్ చేసిన సేవలు యెంత గొప్పవో శంకరనారాయణ గారు ఇంగ్లిష్, తెలుగు లకు అంతటి ఉత్కృష్ట సేవలు చేశారని విజ్ఞుల అభిప్రాయం .ఈయనకు ఖగోళ శాస్త్రం లోనూ లోతైన అవగాహన ఉన్నది .ఏది ఏమైనా శంకరనారాయణ గారు తెలుగు వారికి చిర స్మరణీయులు.
ఆధారం –శ్రీ వాసవ్య రచన ‘’ఆంద్ర శాస్త్ర వేత్తలు ‘’
36-మహోన్నత భాషా శాస్త్రవేత్త –డా కోరాడ మహాదేవ శాస్రి
కృష్ణా జిల్లా మచిలీపట్నం లో 29-12-1921న జన్మించిన కోరాడ మహాదేవ శాస్త్రి ,మద్రాస్ పచ్చయప్పకాలేజి లో బి.ఎ .ఆనర్స్ చదివి ,సిమ్లా యూనివర్సిటి రిసెర్చ్ సెంటర్ లో 1944నుండి రెండేళ్ళు పనిచేశారు .ఢిల్లీ లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చేమ్బర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రి లో ఎకనామిక్స్ రిసెర్చ్ అసిస్టెంట్ గా చేరి ‘’ఇండస్ట్రియల్ ప్రాఫిట్స్ ఆఫ్ ఇండియా ‘’గ్రంథం రాశారు.
భాషా శాస్త్రం పై మక్కువ ఉన్న శాస్త్రిగారు ‘’హిస్టారికల్ గ్రామర్ ఆఫ్ తెలుగు ‘’అనే అంశం పై పరిశోధించి పి.హెచ్. డి.పొంది,డిలిట్ కూడా అయ్యారు .1965-68కాలం లో అనంతపురం పిజి సెంటర్ హెడ్ గా ,స్పెషలాఫీసర్ గా ఉన్నారు .తెలుగు భాషా స్వరూపాన్ని వివరిస్తూ విదేశీయులకోసం ‘’డిస్క్రిప్టివ్ గ్రామర్ అండ్ హ్యాండ్ బుక్ ఆఫ్ మోడరన్ తెలుగు ‘’రాసి మహోపకారం చేశారు .బాలప్రౌఢ వ్యాకరణ దీపిక ,ఆంద్ర వాజ్మయ పరిచయం మున్నగు ప్రసిద్ధ గ్రంధాలు రచించారు .’’తెలుగుకు సరైన భాషా చరిత్ర లేదు’’ అని వాపోయేవారు .2005లో ‘’దేశీయ పద వ్యుత్పత్తి నిఘంటువు ‘’రూపొందించగా ద్రావిడ విశ్వవిద్యాలయం ప్రచురించింది .జర్మనీలో తెలుగు నేర్చుకోనేవారికి శిక్షణ ఇచ్చిన భాషా శాస్త్రవేత్త కోరాడవారు .
అనంతపురం లోని శ్రీ కృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయం లో తెలుగు ప్రొఫెసర్ గా సేవలందించి పదవీ విరమణ చేశారు .సునీతి కుమార్ చటర్జీ ,మీనాక్షి సుందరం పిళ్లే,క్షితీష్ చంద్ర చటర్జీ వంటి ఉద్దండులవద్ద శిక్షణ పొందిన మహాదేవ శాస్త్రిగారు అంతటి వారుగా ఎదిగారు .1971లో ద్రవిడియన్ లింగ్విస్టిక్స్ అసోసియేషన్ ఏర్పడటానికి తీవ్ర కృషి చేసిన ముగ్గురిలో శాస్త్రిగారు ప్రధములు .ఎకనామిక్స్, కంపారటివ్ ఫైలాలజి ,తెలుగు లలో 3పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు పొందారు శాస్త్రిగారు .1976-78కాలంలో శాస్త్రిగారు జర్మనీలోని కోల్న్ లో ఇన్ స్టి ట్యూ ట్ ఆఫ్ ఇండాలజీ లో విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్నారు .శాస్త్రిగారు అనేక జాతీయ అంతర్జాతీయ మేగజైన్లలో చాలా విషయాలపై విపులమైన పరిశోధన వ్యాసాలూ రాశారు . బ్రౌన్ పురస్కారం అందుకొన్నారు
శాస్త్రిగారి భార్య శ్రీమతి సరస్వతి సుగుణ వివేక వినయాలు మూర్తీభవించిన ఆదర్శ భారత గృహిణి –ఈ దంపతులకు ముగ్గురుకుమారులు ఒకకుమార్తె .11-10-2016న 96 ఏళ్ళ వయసులో నడిచే సరస్వతి స్వరూపం శ్రీ కోరాడ మహాదేవ శాస్త్రిగారు శివమహాదేవ సన్నిధి చేరారు .
ఆధారం –శ్రీ వాసవ్య రచన ‘’ఆంద్ర శాస్త్ర వేత్తలు ‘’మరియు ద్రవిడియన్ లింగ్విస్టిక్స్ అసోసియేషన్ వారి 2016నవంబర్ సంచిక
సశేషం
మీ గబ్బిట దుర్గాప్రసాద్ -5-7-19-ఉయ్యూరు
—
—
—