ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 37- శాసన లిపి పరిశోధన పరబ్రహ్మ –డా.పుచ్చా వాసు దేవ పరబ్రహ్మ శాస్త్రి

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 37- శాసన లిపి పరిశోధన పరబ్రహ్మ –డా.పుచ్చా వాసు దేవ పరబ్రహ్మ శాస్త్రి

 

ఆధునిక

37- శాసన లిపి పరిశోధన పరబ్రహ్మ  –డా.పుచ్చా వాసు దేవ పరబ్రహ్మ శాస్త్రి

పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి’ తెలుగువారు గర్వించదగిన ప్రఖ్యాత చారిత్రక, పురావస్తు పరిశోధకుడు. కాకతీయుల చరిత్రపై అనేక అధ్యయనాలు చేసి పలు గ్రంథాలను రచించారు. ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర – గ్రామీణజీవనం ఈయన వ్రాసిన గ్రంథమే.పివి పరబ్రహ్మ శాస్త్రిగా సుపరిచితులు .

జీవిత విశేషాలు

పీవీ పరబ్రహ్మ శాస్త్రి గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలో పుచ్చా వెంకటేశ్వర్లు, రుక్మిణమ్మ దంపతులకు 1921 జూన్‌లో జన్మించారు. 1938లో ఓల్డ్ మద్రాస్ ప్రెసిడెన్సీలో పాఠశాల విద్యను, 1948లో బీఎస్సీ డిగ్రీని పూర్తి చేశారు. పిఠాపురంలో వ్యాకరణ, తర్క, వేదాల్లో నిష్ణాతులైన వారణాసి సుబ్రమణ్యశాస్త్రి దగ్గర శిష్యరికం చేశారు. 1948లో పోలీస్ యాక్షన్ తర్వాత వరంగల్ జిల్లా జనగాంకు వచ్చి అక్కడ తెలుగు మీడియం హైస్కూల్‌లో హెడ్ మాస్టర్‌గా చేరారు. మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌కు వచ్చి కేశవ మెమోరియల్ హైస్కూల్‌లో గణితం, సైన్స్ ఉపాధ్యాయుడిగా సేవలందించారు. 1955లో బెనారస్ హిందూ యూనివర్శిటీ నుంచి సంస్కృతంలో డిగ్రీ పొందారు. 1959లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంలో ఎపిగ్రఫీ అసిస్టెంట్ ఉద్యోగంలో చేరారు. పురావస్తు శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్‌గా వివిధ హోదాలలో పనిచేసిన ఆయన 1981 పదవీ విరమణ పొందారు.[1]

ఆయన ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖలో 25 సంవత్సరాలపాటు సేవలందించారు. ఆయన 2 వేలకు పైగా శాసనాలను పరిష్కరించారు. శాసనగ్రంథాల రచనతోపాటు చరిత్ర రచన చేసిన ఆయన భారత చరిత్రకారులకు మార్గదర్శకుడిగా నిలిచారు. ఖమ్మంజిల్లా బయ్యారం చెరువు వద్ద లభించిన కాకతీయ శాసనాన్ని పరిష్కరించి, కాకతీయ చక్రవర్తుల వంశక్రమణికను పునర్నిర్మించారు. వరంగల్‌లో లభించిన శాసనం ఆధారంగా రాయగజకేసరి బిరుదు కాకతీయ చక్రవర్తులలో రాణీ రుద్రమదేవికే వర్తిస్తుందని తేల్చిచెప్పారు. గణపతి దేవుడు వేయించిన బయ్యారం చెరువు శాసనం కాకతీయ చరిత్రకు ఒక ముఖ్యమైన ఆధారం. కాకతీయులు ఎలా అవిర్భవించారు, పశ్చిమ చాళుక్యుల సామంతులుగా ఎలా హనుమకొండలో స్థిరపడ్డారనే విషయాన్ని ఈ శాసనం చెప్తుంది. వెయ్యిస్తంభాల గుడి శాసనంలో రెండో ప్రోలరాజు అతడి కుమారుడు రుద్రదేవునికి సంబంధించిన సమాచారాన్ని అంతకుముందు శాసన పరిశోధకులు సరిగా వ్యాఖ్యానించలేదని ఆయన భావించారు. పీవీ శాస్త్రి ఆ శాసనాన్ని పరిష్కరించి కాకతీయ రుద్రదేవుడు క్రీశ 1163లో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడానికి దారితీసిన పరిస్థితులను వివరించగలిగారు. పరబ్రహ్మశాస్త్రి తెలంగాణ చరిత్రకు ఇచ్చిన అత్యంత ముఖ్యమైన కానుక రుద్రమదేవి మరణానికి సంబంధించిన శాసనాన్ని పరిష్కరించడం. నల్గొండ జిల్లా చందుపట్ల శాసనాన్ని బట్టి రుద్రమదేవి క్రీ.శ.1290 నవంబరులో మరణించారని ప్రకటించారు. కాయస్త అంబదేవుని తిరుగుబాటును అణచడానికి స్వయంగా రుద్రమదేవి కదనరంగానికి వెళ్లింది. ఆ యుద్ధంలోనే 80 ఏళ్ల వయసులో ఆమె మరణించిందని చెప్పారు. కాకతీయులపై పరిశోధనకు కర్నాటకలోని ధార్వాడ్ వర్శిటీ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.

పరిశోధన

కాకతీయుల గురించి, శాతవాహనుల గురించి లోతైన, నికార్సయిన అధ్యయనం చేసిన ఏకైక పరిశోధకుడు పరబ్రహ్మశాస్త్రి. వెలుగుచూడని కాకతీయ వైభవానికి సంబంధించి కొన్ని అంశాలను గుర్తించి అజ్ఞాతంగా ఉన్న శాసనాలను వెలికితీసి ప్రామాణిక గ్రంథాలను రచించారు. తెలంగాణకు గర్వకారణంగా ఉన్న చరిత్రను విశ్వవిఖ్యాతం చేసిన పండితులలో ఈయన అగ్రగణ్యుడు. గ్రామాలకు వెళ్లి అసలు చరిత్ర ప్రజల జీవనవిధానంలోనే ఉందని గుర్తించి అదే తపనతో ఆ సమాచారాన్ని ఒడిసిపట్టుకుని ఏ హంగులూ లేని కాలంలో అద్భుతమైన యజ్ఞం చేశారు. శాసనాలు అన్నీ చదవగలిగిన ఏకైక వ్యక్తి ఈయన ఒక్కరేనని అనేకమందితో గుర్తింపబడ్డారు. చరిత్రనే గాక, లిపి పరిణామాన్ని కూడా వివరించి పండితులను మెప్పించిన మేధావి పరబ్రహ్మ శాస్త్రి.

శాతవాహన వంశ పాలన గురించి కాలక్రమణిక ను నిర్ధారించిన ఘనత పరబ్రహ్మ శాస్త్రి గారిదే . ఈసందర్భం గా ఆయన ‘’I fully claim credit for it .A smal token –trade lisence with ana inskription of the picture and the period of Roman King Tibarious onone side and ofSatavahana ruler Hku Sri on the other clinched the issue ..Icould establish the period of Siri Satavahana ,Satakarni 1,Simukha and the others there on ‘’అని విజయగర్వంగా చెప్పారు .

బ్రాహ్మి ,సంస్కృతం ,తెలుగు కన్నడ శాసనలిపులను పరిష్కరించిన సంస్కృత పిహెచ్ డి ,చరిత్ర డాక్టరేట్ శాస్త్రి గారు .12వ శతాబ్దం వరకు తెలుగు ,కన్నడాలకు ఒకే లిపి ని పరిశోధించారు .గుంటూరు జిల్లా భట్టిప్రోలు లో భద్రపరచిన బుద్ధుని అవశేషాలున్న ‘’క్రిస్టల్ కేస్కేట్స్’’పై ఉన్న లిపిని కూడా పరిశోధించి ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి తెచ్చారు .బాహ్మి లిపి నుంచి తెలుగు లిపి పరిణామం చెందిన విధానాన్ని విపులంగా వివరించారు .హైదరాబాద్ లోని చైతన్యపురి ప్రాంతం లో విష్ణు కుండినుల పాలన నాటి శాసనాలను వెలుగులోకి తెచ్చిన ఘనాపాఠీ పరబ్రహ్మ శాస్త్రి గారు

సన్మానము

2007లో రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారమందించి గౌరవించి సత్కరించింది .

తెలంగాణ ప్రభుత్వ సారథ్యంలో 2014 అక్టోబరు 21 మంగళవారం ఈయనకు కిన్నెర ఆర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాదు లోని రవీంద్రభారతిలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామమోహన్ రావు చేతులమీదుగా ఘన సన్మానం జరిగింది.నిరంతర అన్వేషి, నిత్య శ్రామికుడు, విజ్ఞానఖని డాక్టర్ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్ర్తి అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామమోహనరావు పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన రామమోహనరావు మాట్లాడుతూ పరబ్రహ్మశాస్త్రి విజ్ఞానానికి ప్రతీక అన్నారు. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ప్రధాన స్రవంతిలో ఉంటూ శాస్ర్తియ పరిశోధన చేయడం అంత తేలిక కాదని, ప్రామాణికంగా నలుగురూ ఒప్పుకునే స్థితిలో పరిశోధనలు చేయడం, ఇంకా నిత్యాభ్యాసాన్ని కొనసాగించడం గొప్ప లక్షణమని అన్నారు. చరిత్ర కాలగర్భంలో కలిసిపోకుండా వెల్లడించి రాబోయే తరాలకు జ్ఞానాన్ని క్రోడీకరించి అందించడం తెలుగుజాతి గర్వించదగ్గ విషయమని అన్నారు. చరిత్రపై పరిశోధనలు అంత తేలికైన విషయం కాదని, ఎంతో నిబద్ధత, జ్ఞానం ఉండాలని చెప్పారు. ఎంతో ఉన్నతమైన విలువలున్న వారు చాలా మంది సమాజంలో ఉన్నారని, అలాంటి వారిలో ప్రముఖుడైన పరబ్రహ్మశాస్త్రిని సత్కరించడం తెలంగాణ ప్రభుత్వం చేసిన మహత్తర కార్యమని న్యాయమూర్తి ప్రశంసించారు. ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల వ్యవధిలోనే సమాజానికి సేవ చేసిన వారికి ఈ చిరుసత్కారం ఏర్పాటు చేయడం ఎంతో ఔచిత్యంగా ఉందని అన్నారు[2]. వీరు తన జీవిత కాలమంతా శాసన పరిశోధనలో గడిపి ఆంధ్ర చరిత్ర రచనకు ఆకరాలు అందించిన పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి గారికి జయనామ సంవత్సర బ్రౌన్ పురస్కారాన్ని ప్రకటించారు. శాసనాధారాలతో కాకతీయ వంశానుక్రమణిక, నాణాల పరిశీలనతో శాతవాహన శక కాల నిర్ణయం చేసి పరిశోధకుల మెప్పు పొందారు. సంస్కృతం మీద గల పట్టుతో ఎన్నో బ్రాహ్మీ లిపి శాసనాలను అవలీలగా పరిష్కరించారు. పన్నెండు గ్రంథాలు రచించారు. ఇటీవల వచ్చిన, శాసనాల్లో ఉన్న అన్నమాచార్యుల కీర్తనల పుస్తకానికి సహా సంపాదకత్వం వహించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వము ఈయనకు లక్ష రూపాయల చెక్కును బహూకరించింది. శాసన లిపి పరబ్రహ్మ  పరబ్రహ్మ శాస్త్రి గారిపై  కేంద్ర ప్రభుత్వం  చిన్న చూపే చూసింది .తగిన గౌరవ పురస్కారాల౦ దించక పోవటం పెద్ద తప్పిదమే  .అనంతరం తనకు జరిగిన సత్కారానికి కృతజ్ఞతలు చెబుతూ పరబ్రహ్మ శాస్త్రి మాట్లాడారు. హైదరాబాద్ చరిత్రకు కుతుబ్‌షాహీలను ఆధారంగా తీసుకుంటామని, వాస్తవానికి అంతకంటే ముందే విష్ణుకుండినుల మూలపురుషుడు మాధవ వర్మకు సంబంధించిన శాసనాలు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. మాధవవర్మకు సంబంధించిన శాసనాలను ఆధారంగా తీసుకుని హైదరాబాద్ చరిత్ర చెప్పే ప్రయత్నం నేటి పరిశోధకులు చేయాలని సూచించారు. శాసనాలు రాజకీయ చరిత్రకు సంబంధించి మాత్రమే కాకుండా అనేక ఆచారాలు, వ్యవహారాలకు కూడా ఆధారాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. వరంగల్ జిల్లా కొండపర్తి గ్రామంలో లభించిన శాసనంలో తమలపాకులు పుచ్చుకోవడం అనే ప్రస్తావన ఉందని, ఎలాంటి న్యాయవ్యవస్థలు లేని సమాజంలో తమలపాకులు పుచ్చుకోవడమే కట్టుబాటుగా ఉండేదని ఈ శాసనం రుజువు చేసిందని అన్నారు.

వీరు పన్నెండు గ్రంథాలు రచించారు. ఇటీవల వచ్చిన, శాసనాల్లో ఉన్న అన్నమాచార్యుల కీర్తనల పుస్తకానికి సహా సంపాదకత్వం వహించారు. సంస్కృతం, తెలుగు భాషల్లో సమాన ప్రతిభా సంపత్తులను సొంతం చేసుకున్న ఆయన ఎన్నో శాసనాలను, నాణాలను పరిశీలించి తెలంగాణ చరిత్రపై కొత్త వెలుగులు ప్రసరింపజేశారు. ఆయన రాసిన కాకతీయాస్ ఆఫ్ వరంగల్ గ్రంథం ఓరుగల్లు పాలకుల చరిత్రకు ప్రామాణికంగా నిలిచింది.

వ్యక్తిగత జీవితం

శాస్త్రి గారి  భార్య పుచ్చా మహాలక్ష్మి, కుమారుడు పీవీ రామ్, ముగ్గురు కుమార్తెలు జయలక్ష్మి, సరస్వతి, మీనా ఉన్నారు. బ్రెయిన్ హెమరేజ్‌కు గురై హాస్పిటల్ లో చికిత్స పొందుతూ-95 ఏళ్ళ వయసులోశాసనలిపి పరిశోధన పరబ్రహ్మశ్రీ పుచ్చా వాసుదేవ  పర బ్రహ్మశాస్త్రి గారు  2016, జూలై 27 సాయంత్రం 5.30 గంటలకు తుదిశ్వాస విడిచి పరబ్రహ్మం లో ఐక్యమయ్యారు .

ఆధారం –తెలుగు వీకీ పీడియా మరియు శ్రీ వాసవ్య  రచన ‘’ఆంద్ర శాస్త్ర వేత్తలు

సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -5-7-19-ఉయ్యూరు

image.png

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.