ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు
38-ప్రామాణిక చరిత్ర పరిశోధకులు –భారత చరిత్ర భాస్కర శ్రీ కోట వెంకటా చలం
చరిత్ర అంటే బ్రిటిష్ వారు చెప్పింది, రాసిందే చరిత్ర అని చాలా కాలం మనం నమ్మాం.చదివాం గుడ్డిగా .కాని అసలైన చరిత్ర అదికాదు అనిఖండి౦చి ,సహేతుకంగా రుజూవు చేసి ,పాశ్చాత్య చరిత్ర పరిశోధకులనూ మెప్పించి అనేక చరిత్ర గ్రంథాలు రాసి ప్రచురించి ఒకరకంగా చరిత్ర రచన లో విప్లవం సృష్టించిన వారు శ్రీ కోట వెంకటాచలం గారు .కృష్ణా జిల్లా మేడూరు దగ్గర మధునాపురం అగ్రహారం లో 21-4-1885న శ్రీ కోట వెంకటాచలం గారు జన్మించారు .బందరు నోబుల్ కాలేజిలో చదివి స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొన్నారు . బందరు లో జాతీయ కళాశాల స్థాపనకు ,అభి వృద్ధికి విశేష కృషి చేశారు .
1924లో బెజవాడలో స్థిర నివాసం ఏర్పరచుకొని జీవితమంతా యదార్ధ భారతదేశ, ఆంద్ర దేశ చరిత్ర రచనకు అంకితభావం తో కృషి చేశారు .ప్రాచీన హిందూ వైజ్ఞానిక సామాజిక శాస్తాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు .నలభై ఏళ్ళు ఇలా చరిత్ర పరిశోధనలో నిమగ్నమై అసలు సిసలు దేశీయ చరిత్ర, ఆంధ్రుల చరిత్ర రాసి కళ్ళు తిరిగే యదార్దాలను బయట పెట్టి చారిత్రిక పరిశోధకులకు మైండ్ బ్లాంక్ చేశారు .1947లో ‘’ఆర్ష విజ్ఞాన గ్రంథమాల ‘’స్థాపించి ,పదేళ్ళ కాలం లో 12అద్భుత గ్రంథాలు రాసి ప్రచురించారు .అందులో ముఖ్యమైనవి –మానవ సృష్టి విజ్ఞానం ,బ్రహ్మాండ సృష్టి విజ్ఞానం ,ఆంధ్రులెవరు?జంబూద్వీపం ,కలి శక విజ్ఞానం మొదలైనవితెలుగు లో రచించారు .దేశమంతా తిరిగి ఉపన్యాసాలిచ్చి చారిత్రిక సత్యాలకు పట్టాభి షేకం జరిపించారు .1951లో రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగిన ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సభలో కోటవారు ‘’ Xandrames, Sandrocottus and Sandrocyptus’’లపై సాధికార పరిశోధన పత్రం రాసిసంర్పింఛి బ్రహ్మాండమైన ప్రసంగం చేసి ప్రశంసలు పొందారు .1956లో ఏర్పడిన మొదటి సంస్కృత కమిషన్ కు రెస్పాండర్ గా ఉన్నారు.
ఆంగ్లం లో1- ‘’The history of Vikramaditya and Shalivahana 2-The plot of Indian Chronology ,3-Chronology of Kasmir History 4-Chronology of Nepal history 5-Abe of Buddha 5-Milinda yuga Purana 6-Indian Eras మొదలైన ఆధేన్టిక్ గ్రంధాలురాశారు . ఆంద్ర ,ఆంగ్లాలలో 23గ్రంథాలు రాశారు .సృష్టి క్రమాన్ని ఆదినుంచి రాసిన చరిత్ర ఘనాపాఠీ కోటవారు .ప్రతి రచనా తులనాత్మకంగా .పరి శీలించి పరిశొధి౦చి పాశ్చాత్యుల అభూతకల్పనలను చీల్చి చెండాడిన చరిత్ర భార్గవ రాముడాయన .చరిత్ర గర్భం లో మరుగు పడిపోయిన అనేక అంశాలను తనకలం ‘’కోల’’తో పైకెత్తి తీసి ఉద్ధరించిన అపర అతారమూర్తి శ్రీ వెంకటాచలం గారు .ఆయన చరిత్ర అధ్యయన పరిశోధన ,పరిశీలనాలకు తలలుపండిన చారిత్రకపరిశోధకులు కాదనలేక తలలు వంచి ఉండి పోయారు . పాశ్చాత్య చరిత్రకారులతో ఆంగ్లం లో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి తనభావాలను వివరించేవారు .హేతుబద్ధమైన ప్రణాళికా బద్ధమైన రచనలే చేశారుకాని తానుపట్టిన కుందేలుకు మూడుకాళ్ళేఅన్నట్లు ఎప్పుడూ ప్రవర్తించలేదు .అందుకే ఆయన చెప్పింది వేదవాక్కుగా శిరో దార్యమై ‘’భారత చరిత్ర భాస్కర ‘’విమర్శకాగ్రేసర ‘’పాకయాజి ‘’బిరుదులు సార్ధకమైనాయి . ‘’Indian History in general and ‘’Andhra History in particular even very recently hve been subject to many manipulations .The entire Chronlogy in fact may be off .But Pandit Venkatachalam was the only voice decrying the propaganda that was being sowed during colonial rule .Kavi samrat Vishvanadha also raised his hands to support him .’’ అని అందుకే అన్నారు .విశ్వనాధ కోటవారి పుస్తకాలకు ముందుమాటలు రాసి విలువ పెంచారు .
1957లో వెంకటాచలం గారు ‘’అభినవ విరూపాక్ష పీఠం’’కు పీఠాధిపతు లై ‘’అద్వయానంద శంకర భారతీ స్వామి ‘’గా ఆశ్రమ నామ దారి అయ్యారు
చల్లా సుబ్బారాయుడు గారు అసలుతండ్రి .కోట నిత్యానందం గారు పెంపుడు తండ్రి .పట్టువదలని రచనా విక్రమార్కులై జీవిత చరమాంకం లో కూడా ‘’మహాభారత యుద్ధకాలం ‘’,’’శంకర పీఠముల చరిత్ర ‘’ప్రామాణికంగా1958-60 కాలం లో రాశారు .15-11-1959న 74 ఏళ్ళవయసులో చరిత్ర భాస్కర శ్రీ కోట వెంకటాచలం గారు మరణించి చరిత్ర పురుషులయ్యారు.
కోటవారి చరిత్ర ప్రకారం బుద్ధునికాలం క్రీ పూ 1887కాగా పాశ్చాత్యులు క్రీపూ 6వ శతాబ్దం అన్నారు .క్రీపూ 1534కు చెందిన చంద్ర గుప్తమౌర్యునికాలాన్ని క్రీపూ 327కు మార్చారు .ఆదిశంకరాచార్యులకాలం క్రీపూ509ఐతే పాశ్చాత్యులు దాన్ని క్రీ పూ .788కి మార్చారు .క్రీపూ 327అయిన గుప్తుల యుగాన్ని క్రీస్తు తర్వాత యుగంగా తప్పుడు ఆలోచనలతో గామార్చారు .ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుడు ,శాలివాహనుడు ,అగ్ని వంశ రాజులను పాశ్చాత్యులు చరిత్రలో చేర్చలేదు .ఇన్ని తప్పులతడకలతో మనకు హిస్టరీ చెప్పారు ప్రశ్నించకుండా ఇంతదాకా మనం డూడూ బసవన్నలలాగా నేర్చుకొన్నాం .ఈచీకటికి వెలుగునిచ్చారు చరిత్ర భాస్కరులు వెంకటాచలంగారు .
ఆర్యుల దురాక్రమణ సిద్ధాంతాన్ని ఖండించి ‘’అవుట్ ఆఫ్ ఇండియా సిద్ధాంతం ‘’ప్రతిపాదింఛి మ్లేచ్చరాజులు అందులో ముఖ్యంగా యవన రాజులు వైదిక కర్మలను అడ్డుకొని అక్కడినుంచి భారత వర్షం లోని వాయవ్యభాగానికి తరిమేశారని అన్నారు .అదే ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ .అక్కడినుంచి పడమరకు వెళ్లి గ్రీసులోని తూర్పు ,దక్షిణప్రాంతాలను ఆక్రమించి ఉండిపోయారు .దీనినే ఇప్పుడు ‘’అయోనా ‘’అని అంటున్నారు .ఇది యవన శబ్దానికి అపభ్రంశమైన పదం .అలా భారత విజ్ఞానం తూర్పు దేశాలనుంచి పడమటి దేశాలకు వ్యాపించిందని నొక్కి వక్కాణించారు .దీనికి ఉదాహరణలుగా గ్రీకు ,భారతీయ విధానాలు నమ్మకాలు ఒకే లాగా ఉండటమే అన్నారు .
ప్రామాణిక భారతీయ చరిత్ర రచనకు కోట వారు ఋగ్వేదం, సూర్య సిద్ధాంతం ,బ్రహ్మాండ విష్ణు భవిష్యత్ ,భాగవత పురాణాలు ,కల్హణుని రాజతరంగిణి ,నేపాల్ రాజవంశావలి ,అనేకానేక బౌద్ధగ్రంథాలు అవలోడనం చేశారు .బాలగంగాధర తిలక్ రాసిన ‘’ఆర్కిటిక్ హోమ్’’ గ్రంథాన్ని కూడా సహేతుకంగా ఖండించారు కోటవారు.
ఇంత గొప్ప చరిత్ర పైశోధకుడైన ఆంధ్రతేజం చరిత్ర భాస్కర శ్రీ కోట వెంకటాచలం గారికి విజయవాడలో కనీసం ఒక శిలా విగ్రహమైనా స్థాపించాలని అనేకసార్లు నేను అందరికి విజ్ఞప్తి చేసినా ఎవ్వరికీ పట్టకపోవటం విచారకరం .వీరి కుమారులు డా కోట నిత్యానంద శాస్త్రి గారు 90ఏళ్ళకు పైబడినవారు నాకు చాలా ఆత్మీయులు ,విజయవాడలో ప్రముఖ వైద్యులు బహు ఆధ్యాత్మిక చారిత్రిక గ్రంథకర్త .వీరికి సరసభారతి రెండవ సమావేశం లోనే మా తలిదంద్రుల పేరిట సాహితీ పురస్కారం అందజేసి వారి జనకులు వెంకటాచలంగారిని సత్కరించినట్లుగా సంతృప్తి చెందాము . వీరితోపాటు అవధాన సరస్వతి డా పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారికికూడా పురస్కారం అందజేశాము .
చాలాకాలం తర్వాత ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ కోటవారి విలువైన సేవలు గుర్తించి సుమారు ఏడు లేక ఎనిమిది ఏళ్ళక్రితం హైదరాబాద్ లో సభ జరిపి కోటవారు చరిత్ర పరిశోధనకు చేసిన సేవలను ప్రస్తుతించి సావనీర్ ప్రచురించి వారి కుమారులు నిత్యానంద శాస్స్త్రిగారికి పురస్కారం అందించింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-7-19-ఉయ్యూరు