ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు
39-పురాలిపి శాస్త్రవేత్త ,పరిశోధక శిఖామణి –శ్రీ మల్ల౦పల్లి సోమశేఖర శర్మ(శాసనాల శర్మ )
‘’డిగ్రీలు లేని పాడుకాలాన ‘’పుట్టావు అని విశ్వనాథ వారి సానుభూతి పొంది ఆయన కృతిని అంకితం పుచ్చుకొన్న శాసన పరిశోధకులు పురాలిపి శాస్త్రవేత్త విజ్ఞాన సర్వస్వం ద్వారా వెలుగులోకి వచ్చిన శ్రీ మల్లం పల్లి సోమశేఖర శర్మగారు పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం ‘’మినిమించిలి పాలెం ‘’లో డిసెంబరు 9 వ తేదిన శ్రీమతి నాగమ్మ, భద్రయ్య గార్లకు 1891 లో జన్మించారు. ఈయన గృహ నామమైన మల్లంపల్లి అనే గ్రామం తెలంగాణలోని “పాలకూరు”కి “బమ్మెర”కు సమీపమున నున్న గ్రామం .కాకతీయ పతనానంతరం శర్మ గారి పూర్వీకులు అక్కడ నుంచి గోదావరి మండలానికి తరలి వచ్చారని తెలుస్తుంది. సోమశేఖర శర్మ డిగ్రీలు లేని పండితుడే అయినా నాటికీ నేటికీ ఆంధ్ర చరిత్రకారుల్లో అగ్ర తాంబూలానికి అర్హత సాధించిన పరిశోధక శిఖామణి. సాహిత్యరంగంలోను, రాజకీయ రంగంలోను ప్రసిద్ధి గాంచాడు. బిపిన్ చంద్రపాల్ ప్రసంగాల ప్రభావం ఈయన మీద ఉండటం వల్ల రాజమహేంద్రవరంలో విద్యార్థులు వందేమాతర ఉద్యమం చేపట్టారు.అక్కడే ‘’దేశ మాత ‘’పత్రికలో చేరి చారిత్రక అంశాలపైఅభిరుచి పెంచుకొన్నారు .
.జీవిత విశేషాలు
అప్పటి సాంస్కృతిక కేంద్రమైన రాజమండ్రిలోమెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడై పాత్రికేయునిగా తన సారస్వత జీవితం ప్రారంభించారు. కథలు, నాటకాలు, నవలలు, పద్యాలు వివిధ పత్రికలలో ప్రచురించారు. తరువాత శర్మ కార్యాచరణ స్థానం అప్పటి రాష్ట్ర రాజధాని మద్రాసు నగరానికి మారింది. ఆరోజులలో చరిత్ర చతురాననుడుగా ప్రసిద్ధి చెందిన చిలుకూరి వీరభద్రరావుతో శర్మకు పరిచయమైంది. ఆయనకు సాయంగా ప్రాచీన కావ్యాలకు, శాసనాలకు ప్రతులు వ్రాశారు. చిలుకూరి వారి ‘’ఆంద్ర దేశ చరిత్ర ‘’చిత్తుప్రతికి శుద్ధప్రతి రాసిన ఘనత శర్మగారిది .తన అభిరుచికి తగ్గట్లు తనను తాను మలచుకొన్న కర్మిస్టి శర్మగారు. ‘’ఆంధ్రాభ్యుదయ గ్రంథమాల’’స్థాపించి ఆంధ్రవీరులు ,ప్రాచీన విద్యా పీఠాలు,ప్రాచీన ఆంద్ర నౌకాజీవనం మొదలైన పరిశోధన గ్రంథాలు రాసి ప్రచురించారు .ఆనాటి భారతి మాసపత్రిక శర్మగారి రచన లేకుండా వెలువడేది కాదు అంటే అతిశయోక్తికాదు .పత్రికకు, వారికి ఉన్న అనుబంధం అలాంటిది .వారి రచన అంటే పరమ ప్రమాణం అని యాజమాన్యం నమ్మి ప్రచురించేది .మద్రాస్ లోని ‘’ఓరియెంటల్ ఇన్ స్టి ట్యూట్ జర్నల్ ‘’లోనూ విలువైన తెలుగు ,ఇంగ్లిష్ వ్యాసాలు రాశారు .
అనంతరం విజ్ఞాన సర్వస్వం కృషిలో కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, ఆచంట లక్ష్మీపతి, మరియు రాయప్రోలు సుబ్బారావు వంటివారులకు తోడు నిలచి ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం నిర్మాతలలో ఒకడైనారు. అప్పటికి ఆంధ్ర దేశంలో చరిత్ర పరిశోధన ప్రాథమిక దశలోనే ఉండేది. చరిత్ర రచనలకు మౌలిక ఆధారాలైన శాసనాలను రక్షించి, వెలుగులోకి తెచ్చి విశ్లేషించే బృహత్తర బాధ్యతను శర్మ తలకెత్తుకొన్నారు. ఒంటరిగాను, మిత్రుడు నేలటూరి వెంకట రమణయ్యతో కలిసీ నెల్లూరు జిల్లాలోను, రాయలసీమ ప్రాంతంలోనూ అన్వేషణా యాత్రలు సాగించారు. వీరిని ‘’ శాసనాల శర్మ ‘’అని ప్రజలు సాదరంగా గౌరవించేవారు. ఈ అన్వేషణ ఫలితంగా అశోకుని ఎర్ర గుడిపాడు శాసనం, పల్లవ, తెలుగు చోడ, రెడ్డి, విజయనగర రాజుల కాలంనాటి ఇతర శాసనాలు వెలుగులోకి వచ్చాయి.
తాము సేకరించిన శాసనాలను విశ్లేషించి వివిధ అంశాలను వివరిస్తూ ఎపిగ్రాఫియా ఇండియా, భారతి, శారద, ఆంధ్ర పత్రిక వంటి పత్రికలలో వ్యాసాలు వ్రాశారు. ఘంటసాల ప్రాకృత శాసనాల గురించి శర్మ వ్రాసిన వ్యాసం ఆయన మరణానంతరం ప్రచురితమయ్యింది. శాసనాల లిపిని పరిశోధించడంలోనూ అఖిలభారత పరిగణన పొందిన ఆంధ్ర చరిత్రకారుడు శర్మ గారు మాత్రమే అనవచ్చును. ఏ సమస్యనైనా భిన్న దృక్కోణాల నుండి పరిశిలించి సమన్వయ శాస్త్రీయ దృష్టితో చర్చించిన తరువాతనే నిర్ణయాలు వెల్లడించేవారు. అహదహనకర శాసనంలోని ఒక అక్షరాన్ని శర్మ “ఱ”గా గుర్తించగా వేటూరి ప్రభాకర శాస్త్రి దానిని “ష+జ” (‘ష’ క్రింద ‘జ’ వత్తు) అని అన్నారు. ఈ విషయమై వారిద్దరికీ ఆసక్తికరమైన వాదోపవాదాలు నడచాయి. అయితే ఎంతటి పాండిత్యమూ, పట్టుదలా ఉన్నా తన నిర్ణయాన్ని పునఃపరిశీలించి సరిదిద్దుకోవడానికీ, ఎదుటివారి సూచనలను గౌరవించడానికీ ఆయన సిద్ధంగా ఉండేవారు
శాసన పరిశోధనలు
లిపి శాస్త్రంలోనే గాక ఆంధ్ర వాస్తు శిల్ప స్వభావ నిరూపణలో, ప్రతిమా స్వరూప నిర్ణయంలో శర్మ నిష్ణాతులు. అమరావతీ స్తూపము అన్న ఆయన రచన ఇందుకు తార్కాణము. మొగల్రాజపురంలోని దుర్గ గుహలో మూలవిరాట్ స్థానంలో అస్పష్టంగా ఉన్న కుడ్య శిల్పాన్ని గుర్తించి అది అర్ధ నారీశ్వర మూర్తి అని సహేతుకంగా నిరూపించారు.
సోమశేఖర శర్మ తన అధ్యయనాన్ని ఎక్కువగా మధ్య ఆంధ్ర యుగ చరిత్రపై సాగించారు. సమస్యా భూయిష్టమైన వేంగి చాళుక్యుల కాల నిర్ణయంపై కూలంకషంగా కృషిచేశారు. కాకతీయులు అన్నా, తెలంగాణమన్నా శర్మకు ప్రత్యేక అభిమానం. ఆ ప్రాంతం రాజవంశాలకు సంబంధించి 80కి పైగా శాసనాలను లఘు వ్యాఖ్యలతో ప్రచురించారు. తన మిత్రుడు నేలటూరు వెంకటరమణయ్యతో కలిసి ఆచార్య యజ్దానీ సంపాదకత్వంలో వెలువడిన ‘Early History of Deccan’లో సమగ్రమైన కాకతీయుల చరిత్రను వ్రాశారు. కాకతీయుల తరువాత సాగిన అంధకార యుగం అనుకొనే సమయం గురించి పరిశోధించారు. క్రీ.శ. 1323-1336 కాలంలో ముసునూరు కాపయ నాయకుడు, ముసునూరు ప్రోలయ నాయకుడు తురుష్క పాలకులతో స్వాతంత్ర్య పోరాటం సాగించడం, కాపయ నాయకుడు ఓరుగల్లును ఆక్రమించడం గురించి శర్మ తన Forgotten Chapter of Andhra Historyలో వివరించారు. ఈ “ముసునూరు యుగం” రాజకీయంగా సువర్ణ ఘట్టమని శర్మ గారు నిరూపించారు.[1]
అయితే సోమశేఖర శర్మ పరిశోధనలలో అగ్రస్థానం వహించే రచన The History of Reddi Kingdom and Kondaveedu and Rajahmundry. అసంఖ్యాకమైన శాసనాలనూ, కవుల కావ్యాలనూ, ముస్లిం చరిత్రకారుల రచనలనూ పరిశోధించి, నమ్మదగిన సమాచారాన్ని నిగ్గుదేల్చి తయారు చేసిన ఉత్తమ రచన ఇది. ఆంధ్ర దేశానికి చెందిన విజయనగర, వెలమ, బహమనీ, ముసునూరు రాజ్యాల చరిత్రనూ, ఆ రాజ్యాల మధ్య సంబంధాలనూ వివరించే ఆంధ్ర చరిత్ర ఇది.
శాసనములను ప్రకటించుటలో , ముఖ్యముగ వారి నిదానము, పాఠనిర్ణయము, సంపూర్ణమైన చక్కని వ్యాఖ్య ప్రతి శాసన పరిశోధకుడును నేర్వవలసి ఉంది. తొందరపాటు అనున ఎరుగరు . పాఠ నిర్ణయమున అక్షర విషయమున చిన్న మార్పును సుచించినవారినైనా పెద్దగా ప్రశంసించుట వారికలవాటు. కేవలము ”’భారతి”’ లో వారు ప్రకటించిన శాసనములు సుమారు 30; ఎపిగ్రాఫియా ఇండికాలోనివి 4-ఆంధ్రపత్రిక రజితోత్సవ సంపుటములు, తెలంగాణా శాసనములు ప్రకటించియున్నారు. ఆంధ్ర దేశమునకు సంబందించిన ముఖ్య శాసనములు కొన్ని ఆంగ్లములో ఇత్రరత్రా ప్రకటించినప్పుడు వాటిని ఆయా వ్యాసకర్తల పేరనే మరల భారతిలో చక్కగా సంస్కరించి ఆంధ్రావని కంద జేయుచుండెడివారు. శాసన పరిశోధనలో ప్రకటించిన శాసనముల సంఖ్య ముఖ్యముకాదు; వానిపాఠనిర్ణయము, వ్యాఖ్య ముఖ్యముగ గమనించదగినవి. శర్మ గారు వ్యాఖ్యలే అందుకు నిదర్శనాలు .
ఆంధ్ర దేశములోని మౌర్య అశోకుని బ్రాహ్మీశిలా శాసనము మొదలుకొని ఇకక్ష్వాక, శాలంకాయన, విష్ణుకుండిన, పల్లవ, తూర్పు చాళుక్య, గాంగవంశ, కాకతీయ, మునుసూరి, రెడ్ది, విజయనగర రాజుల శాసనలిపులన్నింటినీ వారు చక్కగా చదివి పరిష్కరించారు . భారతిలో ప్రకటించిన అశోకుని రాయలసీమ, శాలంకాయన నందివర్మ పెదవేగి, వినయాదిత్యుని కర్నూలు, అరికేసరి కొల్లిపర్రు, దేవేంద్రవర్మకంబికాయ, హస్తివర్మ నర్సింగపల్లి, ముసునూరి ప్రోలనాయకుని విలస శాసనములు ఆయా రాజవంశముల చరిత్రకు చాలా ముఖ్యమైనవి.ఈ శాసనముల ఆధారంగా వారనేక చక్కని చారిత్రక లఘువ్యాసములు భారతిలో రచించారు . అందు కడపటి పల్లనుల కాల నిర్ణయము, వేంగి చాళుక్యులు, వాతాపిచాళుక్యులు, కళింగకదంబులు, త్రిలోచన పల్లవుడు, వడ్డవారము, బౌద్దమత పరిణామము, పాల్కురికి రికి సోమన, జక్కన కవుల కాల నిర్ణయము, కులములుకుల సంఖ్య, చారిత్రక శతకములు, తంజావూరి మహారాష్ట్ర భూపతులు-ఆంధ్ర సాహిత్యము, యూరోపియనులు-ఆంధ్రభాషా చరిత్రసేవ మున్నగువానిలో ఆంధ్రదేశ సంస్కృతికి సంబందించిన వివిధ రంగములలోని విజ్ఞాన విశేషములు కరతలామలకము గావించారు .యూనివర్సిటీ డిగ్రీలకు మించిన యోగ్యతా పత్రాలను అందుకొన్న విజ్ఞానఖని సోమశేఖర శర్మగారు .ఆంద్ర విశ్వ విద్యాలయం లో దశాబ్ద కాలం హిస్టరీ లెక్చరర్ గా చరిత్ర ,శాసన పరిశోధనలపై విద్యార్ధులకు బోధించి అవగాహన కల్పించారు .రెండవసారి కూడా ఆంధ్రా యూని వర్సిటీ లో 1957-63కాలం లో పనిచేసి విద్యార్ధులను చరిత్ర పరిశోధకులుగా తీర్చిదిద్దారు .
‘’ తెలుగు విజ్ఞాన సర్వస్వం ‘’ లో మల్లమపల్లివారు ‘’తెలుగు సంస్కృతి’’ సంపుటానికి సంపాదకత్వం వహించి ,తానూ అమూల్యమైన వ్యాసాలూ రాశారు.
“భారతీయ లిపి శాస్త్రము”, “ఆంధ్రదేశమున మాండలికుల పరిపాలన” అను రెండు గ్రంధములు శర్మగారి రచించాలని అనుకొన్నారు , కాని మల్లంపల్లి సోమశేఖర శర్మ 1963 జనవరి 7వ తేది 72వ ఏట విశాఖ పట్నం లో మరణించారు. అందువల్ల ఆంధ్రులకు అవిలభించె అదృష్టము పోయి౦ది.
సోమశేఖర శర్మ రచనలు
· అమరావతి స్థూపము, ఇతర వ్యాసములు – 1932
· కొన్ని చారిత్రిక వ్యాసాలు ‘ఆంధ్రభారతి’ వెబ్సైటులో చూడవచ్చును
· నా నెల్లూరు జిల్లా పర్యటన – శాసనాన్వేషణా యాత్రలలో ఎదుర్కొన్న సమస్యలు, కష్ట నష్టాలు, ప్రజల నమ్మకాలు గురించి.
· Corpus of inscriptions in the Telangana District part IV (Archaeological series) – ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణ (1973)
· సోమశేఖర శర్మ విరచితము – ఆంధ్రవీరులు – 1920
· రాగతరంగిణి – విచారకరమైన చిన్న కథ – 1916 – మనోరమ ప్రెస్
· విజయ తోరణము – రేడియో నాటికలు
· ఆంధ్ర సంస్కృతి తరంగిణి (Archaeological series) – 1976 – ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణ
· ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహము – ప్రచురణ: ఆధునిక వాఙ్మయ కుటీరము, 22 దివాన్ రామ్ అయ్యంగార్ రోడ్డు, మద్రాసు-7, 1948, 128 పేజీలు – వెల రూ.1-8 [1]
· రెడ్డి రాజ్యాల చరిత్ర (‘హిస్టరీ ఆఫ్ రెడ్డీ కింగ్డమ్స్’ ఆంగ్ల రచనకు ఆర్.వెంకటేశ్వరరావు తెలుగు అనువాదం) [2]
· బౌద్ధ యుగము అంశంపై ఆయన రాసిన వ్యాసాలను చారిత్రకవ్యాసములు[2] పుస్తకం రూపంలో 1944లో ప్రచురించారు.
] శర్మగారి పరిశోధనా వ్యాసాలు అత్య౦త విలువను సంతరించుకొన్నాయి .ఇంతటి మహోన్నత మూర్తికి డిగ్రీలు లేకపోవటంవిశేషం . ,ఏ పురస్కారాలు లేకపోవటం శోచనీయం నేను 1963-64లో రాజమండ్రి ట్రెయినింగ్ కాలేజిలో బిఎడ్.చేస్తుండగా శర్మగారి మేనకోడళ్ళు శ్రీమతి ఇవటూరి వరలక్ష్మి ,శ్రీమతి ఇవటూరి శివ లక్ష్మి నాకు క్లాస్ మేట్లు.. శర్మగారు చనిపోయి కొన్ని నెలలే అయినందున ఆ సోదరీమణులు మేనమామగారిని పదే పదే గుర్తు చేసుకొని దుఖి౦చేవారు .వారిద్దరి సౌజన్యం మరువరానిది గా ఉండేది .
ఆధారం –తెలుగు వీకీ పీడియా మరియు శ్రీ వాసవ్య రచన ‘’ఆంద్ర శాస్త్రవేత్తలు ‘’. .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -6-7-19-ఉయ్యూరు
image.png
—
—