విజయవాడ లబ్బీ పేట లో పిన్నమనేని పోలీ క్లినిక్ విశేషమైన ఖ్యాతి నార్జించింది .రోగులపాలిటి స్వర్గ ధామం అనిపించి ఎన్నో ఏళ్ళు నడిచింది .అందులో పని చేయటానికి ఎక్కడెక్కడి నుంచో డాక్టర్లు వచ్చి చేరి తమబాధ్యత సక్రమంగా నిర్వహించి వైద్యాలయం కీర్తిని ఇనుమడింప జేశారు దీని స్థాపకులు డా .పిన్నమనేని వెంకటేశ్వరరావు .వారికుమార్తెలు కూడా డాక్టర్లు గా సేవలందించారు .
1967కాలం లో కంచి పరమాచార్యులపై వ్యాసాలూ వారి అనుగ్రహ భాషణలు ఆంధ్ర ప్రభలో వచ్చేవి .డాక్టర్ గారి కుటుంబం వాటిని అతి శ్రద్ధగా చదివి మననం చేసుకొనేవారు .ఆ కాలం లో వారి కుమార్తె మరణించటం ,వారి రెండవ కుమారునికి తీవ్ర అనారోగ్యం చేయటం వలన కుటుంబం లో మనశాంతి లేకుండా పోయింది .కొడుకు జబ్బు ఏమిటో తెలుసుకోవటానికి వారు దేశం లో తిరగని హాస్పిటల్ లేదు .కానీ ఎవరూ రోగ నిర్ణయం చేయలేకపోయారు .చివరికి ఢిల్లీ వెళ్లి ఆలిండియా ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చూపించి డయాగ్నైజ్ చేయించాలనుకొన్నారు .
ఢిల్లీ వెళ్ళే ముందు పరమాచార్యులను దర్శించాలనుకొని నరసరావు పేట లో దర్శించారు .సుమారు 45 నిమిషాలు శ్రీవారితో గడిపారు .ఢిల్లీ వెడుతున్నామని చెప్పగానే ,కురుక్షేత్రం లో దేవుని దర్శించి ఢిల్లీ వెళ్ళమని ఆదేశించారు .అలాగే కురుక్షేత్ర వెళ్లి స్వామి దర్శనం చేసుకొని ఢిల్లీ వెళ్లి మెడికల్ సైన్సెస్ ఇన్ స్టి ట్యూట్ లో కుమారుని చేర్పించి ,పరీక్ష చేయించారు .అన్ని పరీక్షలు చేశాక వారి అబ్బాయికి ఏ రకమైన జబ్బు లేదని డాక్టర్లు ధృవీకరించారు .అప్పటిదాకా మనసు లో ఉన్న అశాంతి ఒక్క సారిగా మటుమాయమై కుటుంబానికి శాంతి లభించింది . ఆరోజు నుంచి ఆ కుమారుడికి ఏ రకమైన జబ్బూ లేకుండా మంచి ఆరోగ్యంగా ఉన్నాడు .
పిన్నమనేని వారికి జీవితం లో ఏ సమస్యలు వచ్చినా శ్రీ వారి దర్శనం చేస్తారు. అవి వెంటనే పరిష్కారమవుతాయి .శ్రీ వారి దర్శనం తో తమకు కలిగే ఆనందాను భూతులు మాటలలో వర్ణించలేమని అంటారు డా వెంకటేశ్వరరావు .ఉదయం, రాత్రి శ్రీవారిని స్మరించకుండా వారు రోజు గడపరు .అంతే కాదు అప్పటినుంచి తాను ఏ రోగికి శస్త్ర చికిత్స చేసినా ,స్వామిని స్మరించిమాత్రమే చేస్తాను అని చెప్పారు డా .పిన్నమ నేని .ఈ విషయాన్ని ‘’స్వామిని స్మరించి శస్త్ర చికిత్స ‘’వ్యాసం రాశారు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-7-19 –ఉయ్యూరు