కంచి పరమాచార్యుల ఔదార్యాన్ని పొందిన ప్రముఖులు-శ్రీ మాగంటి సూర్యనారాయణ పంతులుగారు
కంచి కామకోటి పీఠాధిపతులు ‘’మానుష రూపేణ చర ద్డైవం .శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రులు సాక్షాత్తు మరొక ఆది శంకరులే .వారి తపస్సు దీక్ష సంకల్పం ,అమోఘం .దర్శనం తోనే అనుగ్రహ వర్షం కురిసే కాలమేఘం .మనసులోని కోరిక ముందే గ్రహించి అనుగ్రహించటం వారి ప్రత్యేకత .వారి ఔదార్యాన్ని అనుభవించిన వారెందరెందరో ఉన్నారు .ఒక్కొక్కరిది ఒక్కో దివ్యానుభవం .అలాంట వారిలో విజయవాడ లో ఇప్పడు బెంజ్ సర్కిల్ అని పిలువబడే చోట దాదాపు యాభై ఏళ్ళక్రితం ‘’బెజవాడ మోటార్స్’’అధినేత ,వితరణ శీలి బెజవాడలో వైదిక మహా సభలు పెద్ద ఎత్తున నిర్వహించి అందరి చేతా ‘’పంతులు గారు ‘’అని గౌరవంగా పిలువబడే బ్రహ్మశ్రీ మాగంటి సూర్యనారాయణ గారొకరు . వీరికి రామవరప్పాడులో గొప్ప ఎస్టేట్ ఉండేది . మాగంటి వారు శ్రీవారిని 1962లో ఇలత్తాన్ గుడిలో మొదటి సారిగా దర్శించుకొన్నారు .అప్పుడు మాగంటివారి అల్లుడు పసుమర్తి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు మూర్ఛ వ్యాదివలన బాగా బాధపడ్డారు .డాక్టర్ల నందర్నీ సంప్రదించి మందులు వాడారు .గుణం కనపడ లేదు .పూజ్యులు ,పండితులు ,శ్రీవారికి పరమ భక్తులు బ్రహ్మశ్రీ మండలీక వేంకట శాస్త్రి గారి సలహాపై శ్రీవారిని దర్శించారు .వ్యాధి విషయం గ్రహించి తొమ్మిది ఆదివారాలు వేదోక్తంగా ‘’పంచగవ్యాలు ‘’ఇప్పించమని ఆదేశించారు .అలాగే చేశారు మాగంటివారు .తొమ్మిది ఆదివారాలు అవగానే మాగంటి వారి అల్లుడికి మూర్ఛ రోగం మటుమాయమైంది .
అప్పటికే సూర్యనారాయణగారు మోటారు కార్ల విక్రయం చేస్తున్నారు .పోటీ ఎక్కువగా ఉండటం తో అమ్మకాలు తగ్గాయి వర్కర్లు మానేసి వెళ్ళిపోయారు .దిక్కు తోచని పరిస్థితి లో పడ్డారు .అన్నిటికీ పరమాచార్య పైనే భారం వేసి ,కుటుంబం తో కాంచీపురం వెళ్లి మఠం లో భిక్ష చేశారు .భిక్ష అవగానే పరమాచార్యస్వామి ఆశీర్వదిస్తూ ‘’నీకు లక్ష్మీ కటాక్షం ఉంటుంది ‘’ అని ఆశీర్వదించారు .
అప్పటిదాకా మాగంటివారు మోటారుకారు వ్యాపారం మీద నెలకు మూడు వేలరూపాయలు అమ్మకం పన్ను చెల్లించేవారు .స్వామి వారి ఆశీర్వాదం తర్వాత స్వామి అనుగ్రహం తో నెలకు లక్షరూపాయ;ల పన్ను చెల్లించారు .అప్పుడు ఆయనవద్ద ఒకే ఒక పని వాడు అంటి పెట్టుకొని నమ్మకం తో ఉండేవాడు . బయటకు వెళ్లి ఆర్డర్లు తెచ్చేవారు లేకపోయారు .కాని స్వామి వారి అనుగ్రహం తో , ఆశీర్వాద బలం తో నాలుగైదుజిల్లాల నుండి తెలిగ్రాములద్వారా ఆర్డర్లు వచ్చేవి .కంపెనీ వారికి ఈ విషయం తెలిసి మరింత ఆశ్చర్యపోయారు .ఇదంతా పరమా చార్యుల ప్రభావం కాక వేరొకటి కానే కాదు అని పంతులుగారు మనస్పూర్తిగా నమ్మారు .స్వామి సాక్షాత్తు భగవంతుడే తప్ప మానవ మాత్రుడు కాదు అని విశ్వసి౦చారు .ఈ విషయాలన్నీ మాగంటి సూర్యనారాయణ పంతులుగారు ‘’నీకు లక్ష్మీ కటాక్షం ఉంటుంది ‘’అనే వ్యాసం లో రాశారు .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-7-19-ఉయ్యూరు