తమిళనాడు తొలి సూపర్ స్టార్- త్యాగరాజ భాగవతార్
మాయవరం కృష్ణస్వామి త్యాగ రాజ భాగవతార్ అంటే తమిళనాడు తొలితరం వెండి తెర వేలుపు .అందరూ గౌరవంగా , ఆప్యాయంగా M.K.T.అని పిలిచేవారు .నటుడు నిర్మాత ,కర్నాటక సంగీత గాయకుడు గా మహా వితరణ శీలిగా ,అనన్యమైన కీర్తి సాధించి ఘనతకెక్కాడు త్యాగరాజ భాగవతార్ .
తమిళనాడు తంజావూర్ జిల్లా మాయిల్ల దుత్తూర్ లో 1-3-1910లో విశ్వబ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు భాగవతార్ .తండ్రి కృష్ణ స్వామి ఆచారి .కొంతకాలానికి కుటుంబం తిరుచునాపల్లికి చేరింది .బాల్యం లోనే చదువుమీద శ్రద్ధ చూపక గాయకుడు కావాలని కలలు కన్నాడు .కాని తలిదండ్రులు అది గౌరవమైన వృత్తి కాదని ప్రోత్సహించలేదు .కాని ఒకసారి ఆంద్ర దేశం లోని కడపలో కొడుకు వందలాది అభిమానుల సమక్షం లో పాటలు పాడుతూ ప్రశంసలు పొందటం చూసి తండ్రి సంగీతానికి ప్రోత్సహించాడు . తర్వాత భజనలు భక్తి గీతాలు పాడి జనాలను అలరించాడు .
తిరుచ్చి లో’’ రసిక రంజన సభ ‘’అనే ఔత్సాహిక సంస్థ నిర్వాహకుడు ఎఫ్.జి .నటేశ అయ్యర్ భాగవతార్ లో ఉన్న ‘’ఫైర్’’ గమనించి మొదటిసారి స్టేజిపై పాడే అవకాశం కలిగించాడు.తర్వాత తండ్రిని ఒప్పించి తన నాటకం హరిశ్చ౦ద్రలో ‘’లోహితాస్య ‘’పాత్రనిచ్చి నటి౦పజేశాడు .పది ఏళ్ళు మాత్రమె ఉన్న భాగవతార్ గొప్పగా నటించి అందరి అభిమానం పొందాడు .అక్కడి అనుభవమున్న నటులు ,దర్శకుల వద్ద శిక్షణ పొందాడు ,కర్నాటక సంగీతాన్ని మదురై పొన్ను అయ్యంగార్ అనే గొప్ప వయోలిన్ విద్వాంసుని వద్ద ఆరేళ్ళు కఠోరశ్రమ చేసి అభ్యసింఛి నిష్ణాతుడయ్యాడు .
1934లో వ్యాపార వేత్తలు లక్షణ చెట్టియార్ ,అలగప్ప చెట్టియార్ ,సినీ దర్శకుడు కే సుబ్రహ్మణ్యం లు భాగవతార్ అర్జునుడుగా నటించిన ‘’పావలక్కోడి ‘’పౌరాణిక నాటకం చూడటం జరిగింది .అతని నటనకు ముగ్ధుడై చెట్టియార్ ,భాగవతార్ ను అదే కధాంశం కల సినిమాలో హీరో పాత్రకు ఎంపిక చేసి మద్రాస్ అడయార్ లో చిత్రించి ,విడుదల చేయగా గొప్ప విజయం సాధించింది .దర్శకుడు సుబ్రహ్మణ్యం .భాగవతార్ రెండవ సినిమా ఆ డై రెక్టర్ 1935లో తీసిన నవీన సారంగధర .మూడవ సినిమా భాగవతార్ స్వయంగా’’ట్రిచి త్యాగరాజ ఫిలిమ్స్ ‘’బానర్ పై 1936లో నటించి ,సమర్పించిన ‘’సత్య శీలం ‘’..ఇందులో మొదటిసారిగా ద్విపాత్రాభినయం కూడా చేసి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు .అంటే సత్య శీలన్ పాత్రతో పాటు ,రాజ దర్బార్ లో ఆస్థాన గాయకపాత్ర కూడా ధరించాడు అన్నమాట .ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు .వరుసగా చిత్రాలు వచ్చి వరించాయి .
1937లో దర్శకుడు వై వి రావు తీసిన ‘’చింతామణి ‘’సినిమాలో’’ బిల్వమంగళుడు’’గా నటించాడు .ఈ సినిమా అత్యద్భుత విజయం సాధించి ఒక ఏడాది నాన్ స్టాప్ గా ప్రదర్శింప బడి కనక వర్షం కురిపించి తమిళలో తొలి రికార్డ్ బ్రేక్ సినిమా అయింది .సినిమాలో భాగవతార్ పాడిన పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి .ఆ గానామృతానికి జేజేలు పలికారు ప్రేక్షక జనం .అందులోని ’’మాయాప్రపంచత్తి’’ పాటను ప్రతి గృహిణి ఇంట్లో కాఫీ చేస్తూ పాడేది ,భర్త ‘’రాధే ఉనక్కు కోబం’’అనే పాటపాడేవాడు అని తమిళ రచయిత కల్కి కృష్ణ మూర్తి రాశాడు ,అంటే భాగవతార్ సినిమా అంతటి ప్రభావం చూపిందన్నమాట .అయితే ఈ పాటలను సరస్వతి స్టోర్స్ వాళ్ళు గ్రామ ఫోన్ రికార్డ్ లు తెచ్చినా దురదృష్ట వశాత్తు వ్యాపార రహస్యాలు తెలియని భాగవతార్ పాడలేదు .ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్ లు రాయల్ టాకీస్ వారు సినిమాపై వచ్చిన డబ్బుతో మదురై లో సినిమా హాల్ కట్టి ‘’చింతామణి ‘’పేరు పెట్టారు .
అమెరికా దర్శకుడు ఎల్లిస్ ఆర్ డంకన్ భాగవతార్ నటుడుగా తీసిన ‘’అంబికా పతి ‘’సినిమా కూడా సక్సేస్ సాధించి రెండవ భారీ విజయం ఆయనఖాతాలో జమ చేసి,చింతామణి రికార్డ్ బ్రద్దలు చేసింది .1938లో శైవ మహాభక్తుడు శివ నీలకంఠ నయనార్ పాత్రను ‘’తిరు నీల కంఠార్ ‘’చిత్రం లో ధరించాడు .ఇలా 1937నుంచి 1944వరకు 7 ఏళ్ళు తమిళ సినీ రంగాన్ని ఏలాడు భాగవతార్ .విలాసవంతమైన భవనం నౌకర్లు చాకర్లు దానాలు ధర్మాలు తో ఇల్లు ఎప్పుడూ నిత్య కల్యాణం పచ్చ తోరణంగా ఉండేదని ,గుప్తదానాలు ఎన్నో చేశాడని ఎందరెందరికో సాయపడ్డాడని ,’’రోజూ పన్నీరు తో మాత్రమె స్నానం చేసేవాడని’’ ప్రముఖ సినీ విశ్లేషకుడు శ్రీ ఇమంది రామారావు చెప్పారు .అదొక స్వర్ణయుగం .
గాయకుడుగా ఆయన భక్తి సంగీతానికే అధిక ప్రముఖ్యమిచ్చాడు .పాపనాశం శివన్ తో కలిసి ‘’ఉనయ్ అలై’’,నీలకంఠ,అంబా మనం కన్నిదు,జ్ఞానకాన్,సత్వ గుణ బోధన,రాజన్ మహారాజన్ ,కృష్ణా ముకుందా మురారి ,రాదే ఉనక్కు కొబం ఆగాదది,వసంత ఋతు వంటి ఎన్నో పాటలు రాసి పాడాడు .మొత్తం 14 సినిమాలలో నటిస్తే దాదాపు అన్నీ రికార్డ్ బ్రేకర్స్ అయ్యాయి .అందుకే తమిళ తొలి సూపర్ స్టార్ అయ్యాడు త్యాగరాజ భాగవతార్ .1944లో విడుదలైన ఆయన సినిమా ‘’హరిదాస్ ‘’మద్రాస్ బ్రాడ్వే దియేటర్ లో మూడేళ్ళు ప్రదర్శింప బడి అన్ని రికార్డ్ లను బద్దలు చేసింది .తమిళ సినీ రంగం లో తొలిద్విపాత్రాభినయనం చేసిన వారిలో మొదటివాడు భాగవతార్ కాగా, రెండవవాడు చెన్నప్ప గా రికార్డ్ సృష్టించారు .
1944లో భాగవతార్ ,కోయంబత్తూర్ స్టూడియోయజమాని శ్రీరాములు నాయుడు లపై లక్ష్మీ కాంతన్ హత్య కేసు విషయం లో అభి యోగం మోపబడి,అరెస్ట్ అయి , ప్రీవీ కౌన్సిల్ దాకా వెళ్లి మూడేళ్ళ తర్వాత 1947 ఏప్రిల్ లో భాగవతార్ విడుదలయ్యాడు .తర్వాత నటించిన సినిమాలుఅపజయం పాలైనాయి .ఆ నాటి ముఖ్యమంత్రి అన్నాదురై ,భాగవతార్ ను D.M.K. పార్టీలో చేరమని ఎన్ని ఒత్తిళ్ళు తెచ్చినా జీవితాంతం భక్తుడుగానే ఉండిపోయాడు .భాగవతార్ సినిమాలకు కచేరీలకు దూరమైనకాలం అన్నాదురైకి బాగా కలిసొచ్చి తనపార్టీ ని విపరీతంగా పెంచుకొనే అవకాశం వచ్చింది .
జీవిత చరమాంకం లో దేవుడు ,గుళ్ళు పై ఆసక్తికలిగి దేశవ్యాప్తంగా తీర్ధయాత్రలు చేసి జీవితం సార్ధకం చేసుకొన్నాడు .డబ్బుపైనా కీర్తిపైనా వ్యామోహం వదుల్చుకొని అసలైన భాగవతార్ అని పించుకొన్నాడు .డయాబెటిస్ వ్యాధికి గురై ,ఇన్సులిన్ తప్పని సరి చివరి రోజులు గడిపాడు .దీనికి బ్లడ్ ప్రెజర్ కూడా తోడైంది .చనిపోవటానికి 10రోజుల ముందు పోల్లాచిలో కచేరి చేశాడు .అక్కడున్న ఒకాయన డయాబెటిస్ కు ఆయుర్వేద మందు ఇస్తే వేసుకోగా ,తగ్గక పోగా వికటించి ప్రాణాపాయం రాగా ,మద్రాస్ తీసుకు వెళ్లి జనరల్ హాస్పిటల్ లో 1959అక్టోబర్ 22న చేర్ఛి చికిత్స చేయించారు .ఒక వారం గడిచింది .అకస్మాత్తుగా నవంబర్ 1 సాయంత్రం 6-20 కి త్యాగరాజ భాగవతార్ 59వ ఏట మరణింఛి త్యాగరాజ శివ సన్నిధి చేరుకొన్నాడు .
సహాయం చేయటం లో ముందు ఉండే భాగవతార్ బంధువుల ఇళ్ళల్లో వివాహాలకు ఉచితంగా సంగీత కచేరి చేసేవాడు .సహాయ నిధులకు ప్రతిఫలం ఆశించకుండా కచేరీ చేసేవాడు .రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు భాగవతార్ ను నాటకాలు ప్రదర్శించి వచ్చిన డబ్బును రెడ్ క్రాస్ సంఘానికి ఇమ్మని బ్రిటిష్ ప్రభుత్వం కోరగా వెంటనే స్పందించి ,నాటకాలు ఆడి వచ్చిన డబ్బును రెడ్ క్రాస్ కు అందించాడు .యుద్ధ సమయం లో మద్రాస్ గవర్నర్ ఆర్ధర్ ఆస్వాల్డ్ జేమ్స్ హోప్ యుద్ధ నిధికి సహకరించమని కోరగా కచేరీలు చేసి నాటకాలు ప్రదర్శించి వసూలైన ధనాన్ని యుద్ధ నిదిగా ప్రభుత్వానికి అందజేశాడు .యుద్ధం అయిపోయాక ప్రభుత్వం కృతజ్ఞతగా ఆయనకు ‘’దివాన్ బహదూర్ ‘’బిరుదు ప్రదానం చేయాలని భావించి తెలియబరచగా తాను మానవత్వ కార్యానికి సాయం చేశానే కాని అవార్డ్ కోసం కాదని సున్నితంగా తిరస్కరించిన త్యాగ ధనుడు . తన పేరు త్యాగరాజును ,భాగవాతార్ ను సార్ధకం చేసుకొన్నా మహానుభావుడు త్యాగరాజ భాగవతార్ .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-7-19 –ఉయ్యూరు
—
—