అష్టావధాని ,ప్రజ్ఞానిధి కవి బ్రహ్మ శ్రీ పూసపాటి నాగేశ్వరావు
గుంటూరు జిల్లా రావెల గ్రామం లో 27-6-1920న జన్మించిన శ్రీ పూసపాటి నాగేశ్వర రావు తలిదండ్రులు శ్రీమతి వెంకట నరసమ్మ ,,శ్రీ బ్రహ్మయ్య .రావెల గ్రామం కవి బ్రహ్మ తిక్కన సోమయాజి మనుమరాలు చిట్టా౦బిక మెట్టినిల్లు ,భర్త అల్లాడ మంత్రి .అల్లాడమంత్రిని గురించి ఆయనమనుమడు మడికి సింగన తన ‘’వాసిష్ట రామాయణం ‘’లో పేర్కొని ‘’కృష్ణానదీ దక్షిణ తటమున ధన్యలీల నలరు రావెల యను నగ్రహారము ‘’అని ఈ గ్రామ గురించి రాశాడు . బాలమేధావి అవటం తో మనకవి గారు మూడేళ్లకే అక్షరాలునేర్చి రామాయణం చదివి అందర్నీ ఆశ్చర్య పరచారు .స్వగ్రామం లోమేనేజిమెంట్ స్కూల్ లో ప్రాధమిక విద్య చదివి ,సత్తెనపల్లి లో ధర్డ్ ఫారం పూర్తి చేశారు .గుంటూరు మిషన్ స్కూల్ లో తొమ్మిది చదువుతూ కవిత్వా భినివేశం లో కూరుకుపోయి ఎస్సే సెల్సి. తప్పి తర్వాత పాసయ్యారు.7వ తరగతి నుంచి కవిత్వం అల్లటం వచ్చి,16వ ఏట27పద్యాల ‘’విశ్వకర్మ తారావళి ‘’రాశారు .చదువు ఆపి మళ్ళీ స్వంతవూరు, స్వంతస్కూల్ లో ఉపాధ్యాయుడిగా పని చేస్తూ శ్రీమతి ఈశ్వరమ్మను పెళ్ళాడి ,సంతానం పొంది ,స్వయం కృషితో ఆంద్ర ఆంగ్ల సంస్కృత భాషలలో పట్టు సాధించి ‘’శిల్ప సుందరి ‘’ఖండకావ్యం రాసి 1946లో నూజివీడు జమీందార్ కుమారరాజా కు అంకితమిచ్చారు .
రావెల బోర్డ్ హైస్కూల్ లో 1951లో గ్రేడ్ -2 తెలుగు పండిట్ గా చేరి ,ఒక ఏడాది చేసి ,పిడుగు రాళ్ళ దగ్గర పిల్లుట్ల లో అనాధ శరణాలయ హైస్కూల్ లో పని చేసి 1954లో రాజీనామా చేశారు .ఇక్కడే మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకట్రాం ఆయనకు సహ ఉపాధ్యాయుడు .తర్వాత ఫిరంగిపురం లో పని చేసి ,మంగళగిరిలో కనకయ్య హైస్కూల్ లో గ్రేడ్ వన్ పండిట్ అయ్యారు .ఇది హయ్యర్ సెకండరీ గా మారాక హైదరాబాద్ ఉస్మానియా యూని వర్సిటిలో షార్ట్ టర్మ్ కోర్స్ చేసి ,ప్రధాన తెలుగు పండిట్ గా ఉండి30-6-1976న రిటైరయ్యారు .
ఇప్పటికే అనేక ఖండకావ్యాలు రాసిన రావు ‘’శ్రీ వీర బ్రహ్మేంద్ర చరిత్ర ‘’ను చంపూ కావ్యంగా రాయటం ప్రారంభించి ,1973లో ముగించి ,తలిదండ్రులు శ్రీ పేరయ్య ,శ్రీమతి ఈశ్వరమ్మలకు అంకితమిచ్చి ముద్రించారు .21-11-1973న ,, ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవి ,కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ ,శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య ,శ్రీ పోకూరి కాశీపత్యవధానులు ,,శ్రీ జమ్మలమడక మాధవరామ శర్మ ,శ్రీ యర్రోజు మాధవాచార్యులు వంటి ఉద్దండ కవి పండితుల సమక్షం లో ఆవిష్కరణ జరిపించారు .
‘’సహజ కవి పంచానన ,కవి శేఖర ,అవధాని శిరోమణి,కవి బ్రహ్మ బిరుదాంకితులైన రావుగారు కవి గండర పెండార సన్మానితులు .
రావు గారి ‘’శిల్ప సుందరి ‘’ఖండకావ్యం లో విగ్రహ నిర్మాణం, దేవాలయ నిర్మాణం , యజ్నవేది నిర్మాణం మొదలైన వన్నీ శిల్పానికి చెందినవే అని ,శిల్పం అభివృద్ధి ,సుభిక్షతకు సంకేతమని చెప్పారు .’’ఆదర్శ పద్మిని ‘’కావ్యం చిత్తూర్ రాణి పద్మిని కథ.ఇది విశ్వ విద్యాలయం లో పాఠ్య గ్రంథమైంది .మహాకావ్యమైన ‘’శ్రీ వీర బ్రహ్మేంద్ర చరిత్ర ‘’విరాట్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారి దివ్య చరితమే .శ్రీ వాసవీ కన్యకా చరిత్ర పెనుగొండ వాసవీ అమ్మవారి చరిత్ర .రావు గారు పద్యంలోనే కాదు వచనం లోనూ మేటి. సవ్యసాచి .’’గుర్రం వీర గోపాల కృష్ణారెడ్ల చరిత్ర ‘’వచనం లో రాశారు .రావు గారుఅనేక గ్రంథాలకు పరిచయం రాసి రచయితలను ప్రోత్సహించారు .
పూసపాటి వారికి కవిత్వం నల్లేరు పై బండి .క౦దాలను అందంగా చెక్కారు .పద్య రహస్యం తెలిసిన శిల్పి. అందుకే ఆయనపద్యం కమ్మచ్చు తీర్చినట్లు ఉంటుంది .పండిత ,పామరులను అలరిస్తుంది .ఛందో వైవిధ్యం చూపారు .’’చంపకమాలికా బంధం’’ తో పద్యానికి పరిమళం అద్దారు . సామాజిక స్పృహ కోల్పోని కవి,అవధాని .
కవి గారు గొప్ప అవధాని .డా .ఇలపావులూరి పాండురంగారావు ,మహీధర రామమోహనరావు ల ప్రశంసలు పొందారు .1975లో మంగళగిరి లో ప్రారంభమైన అవధాన యాత్ర చివరిదాకా కొనసాగింది .ఉద్యోగ విరమణ తర్వాత అష్టావదానాలు బాగా ఊపు అందుకొన్నాయి .సమస్యలను బహు చమత్కారంగా పూరి౦చేవారు . అనేక పట్టణాలలో ఘన సన్మానాలు అందుకొన్నారు .గండ పెండార సమయం లో వినయంగా పూసపాటి వారు చెప్పినపద్యం –
‘’కవి గండ పెండరం బిది –యవునేనియు సుకవి పండితాభి నవాశీః
ప్రవచన పవిత్ర రక్షా –కవచముగ ధరింతు నేను గయి మోడ్పుతోన్’’అని చెప్పిన నిగర్వి.
‘’నా కేలా వెనుకంజ ! బ్రహ్మగురు రాణ్మందార మారంద ధా-రా కారుణ్యము ,విశ్వనాథ కవి సమ్రాణ్మంగళాశీ స్సుధా
వాకో వాక్యము ,మాధవాభయకర ప్రాబల్య ముత్సాహ రే-ఖా కల్పంబగు,హేమ నూపుర ,ఝణ త్కారంబు తోరంబుగన్ ‘’అని విశ్వనాథకు మాధవాచార్యులకు వినయ కుసుమాంజలి ఘటించిన వినయ శీలి .
‘’అంబుధి గంభీరాశయు –డంబేద్కరు శాత జయంతి యనగా ,వినగా
సంబరమగు హృదయంబున –కంబర మున కెగయు మానవాభ్యుదయ రుచుల్ ‘’అని బాబాసాహెబ్ హృదయాన్ని ఆవిష్కరించారు .
‘’శంకరు డుగ్ర రూపమున జంపె ,విభీషణు,రావణానుజున్ ‘’అని ఇచ్చిన సమస్యకు పూసపాటి అవధానిగారి పూరణం రసరమ్యంగా ఉంది –
‘’సా౦కవ గంధి యైన యమ సంగతి జేర్పగ నున్నయట్టిమీ-నా౦ కుని , దేవదేవుడు హిమాచల మందుననేమి సేసె?ని
శ్శంకత రామ చంద్రు ని ప్రసన్నకటాక్షమె వాని నేలెనో- ’శంకరు డుగ్ర రూపమున జంపె ,విభీషణు,రావణానుజున్.
ఉమాదేవికి దగ్గర చేద్దామని ప్రయత్నించిన మన్మధుడిని శివుడు చంపాడు .సహాయం కోరిన రావణు తమ్ముడు విభీషణుడిని అనుమానం లేకుండా శ్రీ రాముడు రక్షించాడు అని భావం .
కొత్త ధిల్లీ పూసా లో భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ లో శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన 25-8-1978న పూసపాటి వారి అష్టావధాన కార్యక్రమం జరిగింది .యూనియన్ పబిక్ సర్వీస్ సభ్యులు డా ఇలపావులూరి పాండురంగారావు సభాధక్షులు ,అప్పుడు అవధాని
‘’శ్రీ కృష్ణ జన్మ దినమున –నాకును సమకూడె హస్తినాపురి నవదా
నైకోద్యమంబు ,కవి బుధ –లోకోత్సవ మగుత ,మా తెలుగు తల్లి దయన్ ‘’అని కైమోడ్పు ఘటించారు .అవధానం దిగ్విజమైంది . సభను అలంకరించిన డా మహీధర రామమోహనరావు ‘’పూసపాటి వారి అవధానం తిరుపతికవుల అవధానానం కోవలో ఉంది ‘’అని మెచ్చారు .
డా ఇలపావులూరి వారు అవధాని అవధాన సరళిని పద్యంలో కమ్మగా చెప్పి ప్రశంసించారు –
‘’తత గీతితోనోటితాకుగా సాగించె-నాశుదారలు సునాయాసముగను
శివలీల స్మరియించి ,చిన్న చిక్కులు దీర్చి –కోరిన వర్ణనల్ కూర్చి చెప్పె
‘’నాతి జాతికి కోతిమూతి ‘’నేర్చిన దత్త –పద విధి కధిక సంపద ను గూర్చె
ప్రత్యక్షర నిషేధ బాధల నవలీల –దాటి కందాల నందలము గూర్చె
మధ్యమధ్య పురాణ గాథలలోని-అర్ధ గంభీర్యంబు నదికి చెప్పె-
అప్రస్తుతము గూడ సుప్రసిద్ధము గాగ –సరస సంభాషణా సక్తిజూపె
నడుమ నెడనెడ మృడుని సవ్వడులు వోలె- జెవిని జేర్చి,గంటల లెక్క చెప్పజాలె
విందుగా నున్న దవదాన విద్యయనగ-బలికె నవధాని నాగేశ పండితుడు ‘’
ఉ-‘’నశ్వర భాగ్యములు ,నశ్యముతో జమకట్టి ,యీమహిన్ –శాశ్వత సాహితీ గరిమ సాధన చేసిన పూసపాటి నా
గేశ్వర సత్కవీశ్వరుని ,క్షీర సముద్ర వినిద్ర ముద్ర ,కా –మేశ్వరి సత్కరించుత,సమీర కుమారవచశ్చు చిస్మితిన్’’
అనగానే సభాప్రాంగణం కరతాళ ధ్వనులతో మారుమ్రోగి అవధాన సరస్వతీ జయజయ ధ్వానాలయ్యాయి . ఇది పూసపాటి వారి జీవితంలో మరపు రాని ఘట్టం .
వీర బ్రహ్మేశ్వర శతకం లో ఒక పద్యం –
‘’హితమాలి౦పనివారలే బధిరు లిస్సి !నీతి బోనాడి దు-ర్గతుల౦ గానని వారె యంధులు ,తగంగాసత్య మూహించి యున్
ప్రతి వాదోత్కటభీతి న్యాయము వచి౦ప౦ బోని వార్మూగ ,లా –రస్కారిజనంబె,వానరులు ,వీర బ్రహ్మ సర్వేశ్వరా ‘’
పూసపాటి కవి చంద్రులు నాగేశ్వరరావు గారు 74 వ ఏట లింగైక్యం పొందారు .
ఇంతటి గొప్ప కవి ,ప్రజ్ఞా శాలిని ఆంద్ర దేశం మర్చి పోయిందో లేక నేనే తెలుసుకోలేక పోయానో?
నాకు ఆప్తమిత్రుడు ,పామర్రు హైస్కూల్ సీనియర్ తెలుగుపందిట్ ,సాహితీ లోక రవి ,కన్నడ భాషా వేత్త శ్రీ నల్లూరి బసవలింగం గారు పూసపాటివారిపై రాసిన అనర్ఘ రత్నమైన
‘’మానికము రతనమనంగ మణి చెలంగు -నదియు సచ్చిద్రమైన పూసన దనర్చు ‘
కాని యచ్చిద్రమణియును ,కవియు నైన –మిమ్ములను పూసపాటిగా నమ్ము టెట్లు”?
పద్యాన్ని మెచ్చారు నాగార్జున విశ్వ విద్యాలయ విశ్రాంత రిజిస్ట్రార్ డా రావెల సాంబశివరావు .ఇందులో ఇద్దరిప్రతిభ జ్యోతకమౌతుంది .
ఆధారం-మిత్రుడు , కృష్ణాజిల్లాపరిషత్ లో ఫిజికల్ సైన్స్ టీచర్ ,పామర్రులో నాకు పరిచయం అయిన డా.శ్రీ పూసపాటి శంకరరావు ,వాలంటరి రిటైర్మెంట్ తీసుకొని ,హైదరాబాద్ లో స్థిరపడి ,తెలుగు ఎం. ఏ .చేసి , పి.హెచ్ .డి. కోసం పూసపాటి వారిపై పరిశోధన చేసి,పి.హెచ్ .డి. 2015లో పొంది , వెలువరించి, నాకు 14-7-19ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో త్యాగరాజ గాన సభలో అందజేసిన ‘’పూసపాటి నాగేశ్వర రావు బహు ముఖీన ప్రతిభ ‘’ ఉద్గ్రంథం.
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-7-19-ఉయ్యూరు