ఉగ్రవాదం పై గాంధీ ధోరణి
మహాత్మాగాంధీ ఉగ్రవాదాన్ని ఈషణ్మాత్రం కూడా సహించలేదు .హింస పై ఏనాడూ రాజీ పడలేదు .ఉగ్రవాదులు గా చిత్రి౦పబడిన సర్దార్ భగత్ సింగ్ వంటి వారిని కాపాడటానికి విశ్వప్రయత్నమే చేశాడు .అలా ఎందుకు చేశాడు ?అనేది పెద్ద ప్రశ్న .తాను చెప్పేదానికీ, అనుసరించేదానికి తేడా ఉందా ?ఆయన వివాదాల ,వైరుధ్యాల పుట్టా ?అసలు ఉగ్రవాదాన్ని ఊహించగలమా ?ఉగ్రవాదానికి ఒక సిద్ధాంతం ఉన్నదా ?
గాంధీజీ హింస ,ఉగ్రవాదాల మధ్య ఇప్పుడు మనం జీవిస్తున్నట్లే జీవించాడు .ఆయన 1915లో దక్షిణాఫ్రికా నుంచి ఇండియా వచ్చే నాటికే దేశం లో హింస ఉద్ధృతంగా ఉన్నది .ఇండియాకు రాకముందే అక్కడ దక్షిణాఫ్రికాలో హింస కు తీవ్రంగా బాధ పడ్డాడు .కాని హింసకు హింస ప్రతీకారం అని ఆయన భావించలేదు .హింసను అహింసా సిద్ధాంత ఆయుధం తోనే ఎదుర్కొని నిలిచి విజయం సాధించాడు .హింస పై ఆయన భావాలను పరిశీలిస్తే ,హింస అరుదుగానే విజయం సాధించింది .జార్గంస్ మేయర్ రాసిన ‘’గాంధీ వర్సెస్ టెర్రరిజం ‘’లో ఉన్న కొన్ని విషయాలను పరిశీలిద్దాం .’’1915లో గాంధీ దక్షిణాఫ్రికా నుంచి ఇండియా వచ్చేసరికి దేశం బ్రిటిష్ వ్యతిరేకతతో ,ఘర్షణలతో హింస అంచున ఉంది.భారత స్వాతంత్ర ఉద్యమం తెలిసి ,అక్కడ ఆయన లాయర్ గా ఉంటూ అక్కడి వలస భారతీయుల సాంఘిక సమానత కోసం చేస్తున్న పోరాటం ఆయన్ను ఇండియాకు రప్పించింది .అప్పుడు దక్షిణాఫ్రికాలో ,ఇండియాలో బ్రిటిష్ వారి మిలిటరీ బలం అత్యధిక శక్తి వంతంగా ఉండి,దాన్నిపూర్తిగా ఉపయోగించటానికి ఏమాత్రం భయపడని స్థితి లో ఉన్నది .1919లో పంజాబ్ లోని అమృత సర్ లో ప్రశాంతంగా నిరసన తెలియ జేయటానికి జలియన్ వాలాబాగ్ కు చేరిన 400మంది భారతీయులను విచక్షణా రహితంగా ,కోపోద్రిక్తుడైన నరరూప రాక్షస బ్రిటిష్ బ్రిగేడియర్ జనరల్ డయ్యర్ ఎటు వంటి ముందు హెచ్చరికలు లేకుండానే కాల్పులు జరిపి , ఊచకోత కోసి ,నరమేధం సృష్టించాడు .
దీనికి ప్రతీకారంగా జాతీయవాదులుతమకు తామే ఎవరి ప్రేరేపణా లేకుండానే దేశం లో చాలా చోట్ల హింసతో బదులు చెప్పారు .బెంగాల్ లో సుభాష్ చంద్ర బోస్ ‘’ఇండియన్ నేషనల్ ఆర్మీ ‘’నిర్వహించాడు .పంజాబ్ లో ఘదర్ ఉద్యమకారులు అమెరికాలోని కాలిఫోర్నియాకు లో ఉన్న పంజాబీ వలస దారుల మద్దతు తో ఒక బోటు నిండా ఆయుధాలను అమెరికా నుండి దిగుమతి చేసుకొని హింసా విప్లవానికి పధకం రచించారు .. అరాచకవాదులు అని ముద్రపడిన ఈ భారతీయులు బ్రిటిష్ దౌష్ట్యాన్ని యెదిర్చి , వారి అధికారాన్ని అంతమొందించి భారత దేశం స్వాతంత్ర్యం పొందటానికి హింస ఒక్కటే పరిష్కార మార్గం అని గాఢంగా నమ్మారు . ఒక బ్రిటిష్ అధికారిపై భారతీయ కార్యకర్తలు చేసిన హింసాత్మక దాడి వలన, గాంధీజీ హింస పై తనకున్న అభిప్రాయాలకు పదును పెట్టాడు .ఈ సంఘటన దక్షిణాఫ్రికా భారతీయుల తరఫున బ్రిటిష్ ప్రభుత్వం తో లాబీయింగ్ చేయటానికి- అంటే మధ్యవర్తిత్వం వహించటానికి 1909లో గాంధీ లండన్ లో కాలుపెట్ట టానికి కొన్ని రోజులు ముందు జరిగింది .లండన్ లోని ఒక భారతీయుడు మదన్ లాల్ ధింగ్రే,బ్రిటిష్ ఇండియన్ ఆఫీస్ లో బ్రిటిష్ అధికారి సర్ విలియం హెచ్ కర్జన్ వైలీ పై, ఇండియాపై కాలనీ ప్రభుత్వ పాలనకు ,నియంత్రణ కు తీవ్ర నిరసన గా దాడి చేశాడు .సాధారణ వేడుకలో ధింగ్రే అకస్మాత్తుగా గన్ తీసి ,అతి దగ్గరగా అధికారి ముఖం పై అయిదు షాట్లు కాల్చేశాడు .అతడు అక్కడికక్కడే కిక్కురుమనకుండా చచ్చాడు .అప్రమత్తమైన పోలీసులు వెంటనే ధింగ్రే ను నిర్బంధం లోకి తీసుకొనగా బయట ప్రజలు ‘’హంతకుడు హంతకుడు ‘’అని అరుస్తుంటే అతడుమాత్రం ‘’నేను భారత స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నాను ‘’అన్నాడు గంభీరంగా .
గాంధీ లండన్ చేరుకొన్న కొన్ని వారాల తర్వాత లండన్ లోని బహిష్కృత ఇండియన్ జాతీయ వాదులు ఆయనను ,పై సంఘటనపై చర్చ జరగాలని కోరారు .అప్పుడు ఆయనకు ముఖ్య ప్రత్యర్ధి వినాయక్ సావర్కార్ . సావర్కార్ పై ,బ్రిటిష్ అధికారి హత్యకు ఆయుధాలు ,ఆయుధ సామగ్రి అందజేశాడని బలంగా అభియోగం మోపారు .విచారణలో ధింగ్రే ధైర్యంగా ‘’నేను చావటానికైనా సిద్ధం .నా బలిదానంతో అమరత్వం పొందుతాను ‘’అన్నాడు .
చర్చకు ముందు గాంధీజీ లండన్ లోని తన స్నేహితుని ఉత్తరం రాస్తూ ‘’ఇండియాకు స్వాతంత్ర్యం అహింస తో నే వస్తుంది అని నమ్మే ఒక్క భారతీయుడూ నాకు ఇక్కడ కనిపించలేదు ‘’అని బాధ పడ్డాడు . ‘’తీవ్రవాదుల పరి స్థితి సాధారణ విప్లవానికి ముందు ఉగ్రవాదం లాగా ఉంటుందని గాంధీ వర్ణించాడు .తీవ్రవాదులు ముందుగా కొందరు బ్రిటిష్ వారిని చంపి ,ఉగ్రవాదానికి పాల్పడతారు .తర్వాత ఒక గ్రూపుగా ఏర్పడి ఆయుధాలు పట్టుకొని బహిరంగం గానే పోరాటం చేస్తారు .చివరికి కష్ట నష్టాలు తప్ప తాము సాధించేది ఏమీ లేదని ,దాదాపు పావుమిలియన్ మంది ని పోగొట్టుకొంటామని గ్రహిస్తారు ‘’అన్నాడు మహాత్మూడు .కానీ దేశీయ జాతీయవాదులు మాత్రం ‘’గెరిల్లా యుద్ధం బ్రిటిష్ వారిని ఓడించి ,దేశానికి స్వాతంత్ర్యం తెస్తుంది ‘’అని నమ్మారు .
జరిగిన చర్చలో గాంధీ సాయుధ పోరాటాన్ని రాజకీయ వాస్తవికత ఆధారంగా ఆలోచించమని కోరాడు .అడపా దడపా చేసే ఉగ్రవాద ,గెరిల్లా దాడుల తో అత్యంత సైనిక సామర్ధ్యమున్న బ్రిటిష్ రాజ్యాన్ని ఓడిస్తామనుకోవటం అవివేకం .ఈ రకమైన హింసాత్మకత భారత జాతీయ ఉద్యమానికి భంగం కలిగిస్తుంది .అలాగే బ్రిటిష్ వారితో సాయుధ పోరాటం చేస్తే ,అదే భారతీయ జాతీయ స్వభావం అని భావించే ప్రమాదం ఉందని గాంధీ గట్టిగా హెచ్చరించాడు .
ఆధారం –అశుతోష్ పాండే సంకలించిన ‘’ రెలెవెన్స్ ఆఫ్ గాంధి ఇన్ 21స్ట్ సెంచరి ‘’పుస్తకం లో అనురాగ్ గార్గ్ వ్యాసం –‘’గాంధీ అండ్ టెర్రరిజం ‘’
సశేషం
మీ గబ్బిట దుర్గాప్రసాద్ -29-7-19-ఉయ్యూరు