వివిధ రంగాలలో ప్రసిద్ధులైన పదిమంది ప్రముఖుల మరణానికి సరసభారతి శ్రద్ధాంజలి

వివిధ రంగాలలో ప్రసిద్ధులైన పదిమంది ప్రముఖుల మరణానికి సరసభారతి శ్రద్ధాంజలి

సుమారు  నెలన్నర  కాలం లో మరణించిన 10మంది ప్రముఖులకు  శ్రద్ధాంజలి గా

 సరసభారతి 143 వ కార్యక్రమ౦ స్థానిక శాఖా గ్రంధాలయం లో 27-7-19 శనివారం సాయంత్రం 5-30 గంటలకు  నా అధ్యక్షతన జరిగింది .డా దీవి చిన్మయ ,అమరవాణి హైస్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ పివి నాగరాజు ,విశ్రాంత తెలుగు లెక్చరర్ శ్రీ పి.విజయ సారధి ,లైబ్రేరియన్ శ్రీ కృష్ణారావు అతిధులుగా పాల్గొని దివంగత నాయకుల  గురించి ప్రసంగించారు  .ఆపది మంది ఫోటోలను కార్డ్ బోర్డ్ పై  అంటించి,పుష్పమాల వేసి ,అందరం శ్రద్ధాంజలిగా పూలు సమర్పణ చేశాము .అందరం లేచి నిలబడి రెండు నిమిషాలు మౌనం పాటించి వారి ఆత్మకు  శాంతికలగాలని ప్రార్ది౦చాం.కుమారి బిందు దత్తశ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారి ‘’తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా’’గీతాన్ని శ్రావ్యంగా ప్రార్ధన గీతంగా పాడింది .నేను మాట్లాడినదానిలో ముఖ్య విషయాలు తెలియ జేస్తున్నాను .చనిపోయిన వారి మరణ తేదీ ని బట్టి వారి గురించి రాస్తున్నాను .

 1-హాస్య ,కేరెక్టర్ పాత్రలలో తనదైన శైలి కనబరచిన రాళ్ళపల్లి

రాళ్ళపల్లి గా అందరూ పిలిచే రాళ్ళపల్లి వెంకట నరసింహారావు పశ్చిమగోదావరి జిల్లా రాచపల్లిలో 10-10-1945న జన్మించాడు 17-5-2019న73 వ ఏట హైదరాబాద్ లో మరణించాడు .1960నుంచి 74వరకు నాటకాలలో నటించాడు .గురజాడ కన్యా శుల్కం నాటకం లో కరటక శాస్త్రి శిష్యుడు మహేశం పాత్ర పదవ తరగతి చదువుతుండగా వేశాడు .డిగ్రీలో ‘’మారని సంసారం ‘’నాటకం రాసి నటించాడు .సినీ నటి భానుమతి చేతులమీదుగా ప్రైజ్ తీసుకొన్నాడు  .వర విక్రయం ,అనగా అనగా ఒక అమ్మాయి నాటకాలు 20 సార్లు ప్రదర్శించాడు .1966లో రాష్ట్ర  పతిరాధాకృష్ణన్ సమక్షం లో రాష్ట్రపతి భవన్ లో ‘’మృచ్చకటిక ‘’నాటకం ప్రదర్శించి మెప్పు పొందాడు . మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ లో పని చేశాడు .

 1974లో సినీ రంగప్రవేశం చేసి 850 సినిమాలో నటించాడు .మనిషి భాష యాస ,నడక మాటతీరు బానపొట్ట చూడగానే నవ్వు తన్నుకొస్తుంది .బాపు తీసిన ‘’తూర్పు వెళ్ళే రైలు ‘’లో మంచి పాత్ర లభించి ‘’ఇక నువ్వు ఉద్యోగం చెయ్యక్కర్లేదు .అదే నిన్ను వరించి వస్తుంది ‘’అన్న బాపుమాట నిజమై బిజీ ఆర్టిస్ట్ అయ్యాడు జంధ్యాల ,వంశీ లు బాగా ప్రోత్సహించి వేషాలిచ్చారు . ఊరు ఉమ్మడి బ్రతుకులు ‘’సినిమాలో నటించిన పాత్రకు జాతీయ పురస్కారం లభించింది .మణిరత్నం సినిమా ‘’బొంబాయి ‘’లో హిజ్రా వేషం వేసి నభూతో గా నటించాడు .

 రఘుపతి వెంకయ్య అవార్డ్ బంగారుపతకం పొందాడు రాళ్ళపల్లి . ఎన్టి. ఆర్ జాతీయ అవార్డ్ ,నాగి రెడ్డి-చక్రపాణి అవార్డ్ లు దక్కాయి .భార్య పేరిట ప్రతిఏడాది నాటకరంగ నటులకు అవార్డ్ లు ఇచ్చేవాడు .పోట్టిప్రసాద్ ,తనికెళ్ళ భరణి ,చలపతిరావు మొదలైన వారు ఈ అవార్డ్ అందుకొన్నారు .

  టివి లో ‘’జననీ జన్మ భూమిశ్చ ‘’టేలి ఫిలిం కు నంది అవార్డ్ వచ్చింది .చిలకమర్తి వారి ‘’గణపతి ‘’టేలి సీరియల్ లో మంచి పాత్ర పోషించాడు .1994లో పెద్దకూతురు రష్యా వెడుతూ విష జ్వరం తో మరణించి అతన్ని కుంగదీసింది .చిన్న కూతురు అమెరికాలో సెటిల్ అయింది .తనికెళ్ళ భరణి ని కొడుకుగా భావిస్తాడు .అతడు కూడా రాళ్ళపల్లి పై అమిత భక్టి గౌరవం  ఉన్నవాడు .ఇద్దరూ కలుసుకోని రోజు ఉండదు .ఎందరో వర్ధమాన నటులకు రాళ్లబండి తరిఫీదు ఇచ్చి , మెరికలుగా తీర్చి దిద్దాడు .ఈమధ్య ఎందరో  ప్రముఖ హాస్య నటులు మరణించారు .రాళ్ళపల్లి మరణం మళ్ళీ కొంత శూన్యాన్ని ఏర్పాటు చేసింది .

2- సాహిత్యమే ఊపిరిగా జీవించిన  రామ తీర్ధ

17-7-1960 న పలాసలో పుట్టిన యాబలూరు  సుందర రాం బాబు  రామతీర్దగా సాహితీలోకం లో సుపరిచితుడు.తెలుగు, ఇంగ్లిష్ ,బెంగాలి, ఒరియా, ఉర్దూ భాషా సాహిత్యాలను మధించాడు  .1961లో పారాదీప్ లో కార్మిక రక్షణ విభాగం  లో ఉద్యోగం చేసి ,శ్రీమతి కామేశ్వరిని పెళ్ళాడి ,విశాఖకు బదిలీ యై ఇక్కడే స్థిరపడి అనునిత్య సాహితీ సేవలో ధన్యుడయ్యాడు .తెల్ల మిరియం కవితా సంపుటి ,శతాబ్ది శ్రీశ్రీ ,జన స్వరాంజలి,టాగూర్ నాటిక పోస్టాఫీస్ కు అనువాదం ,కన్యాశుల్క కవితోత్సవం, డా రాచకొండ నరసింహ శర్మ  ఆంగ్ల కవితలకు అనువాదం ‘’అన్నపూర్ణాక్షరం ‘’  నిర్భయ  జ్యోతి మొదలైన రచనలతో ‘’సంఘటనాత్మక కవి ‘’గా సుప్రసిద్దుడయ్యాడు .ఎక్కడ అన్యాయం జరిగినా నిరసనగళం వెంటనే వినిపించిన చైతన్య మూర్తి .ఆయన ఆలోచన ,ఆవేశం  అక్షరాలలో దూరి కదిలిస్తాయి  మృగాడు, హీరోగి, శెనిమా ,రేప్ క్లాక్ వంటి పదాలను కాయినేజ్ చేశాడు . .గురజాడ ,వీరేశలింగం అంటే వీరాభిమాని .వీరి భావనా విలువలు సమాజంలోకి చొచ్చుకు పోయేందుకు శ్రమించాడు .2003లో సాహితీ బాంధవి జగద్దాత్రితో కలిసి మొజాయిక్ సాహితీ సంస్థ స్థాపించి , జాతీయ సదస్సులు ,సెమినార్లు, పుస్తకా విష్కరణలు, ఒరియా కవుల పరిచయాలు ,సమీక్షలు ,చర్చలు వంటి అనేక సాహిత్య కార్యక్రమాలు పబ్లిక్ లైబ్రరి వేదికగా నిర్వహించాడు .    అమెరికాలోని న్యూయార్క్ లో నల్లజాతి వారి నిరసన గళం వినిపించే సాహిత్య సంస్థ ‘’మొజాయిక్ ‘’ .ఆ పేరునే ఎంచుకోవటం లో రామ తీర్ధ ఆలోచన, ఆచరణ కనిపిస్తాయి .ఇదొక కళ కూడా. చిన్నచిన్న రంగుపలకలతో గోడలపై నగిషీలతో చిత్రాలను అద్దె కళ.అంటే భిన్నత్వం లో ఏకత్వానికి ప్రతీక అన్నమాట  ..’’మండే మొజాయిక్ ‘’పేర ప్రతి సోమవారం సాయంత్రం లైబ్రరీలో సాహితీ సందడి చేసేవాడు .మొజాయిక్ పత్రికతోపాటు  వాం వారం వెబ్ మాగజైన్ ప్రచురించాడు .మొజాయిక్ తరఫున 10 వేల రూపాయల పారితోషికం ఏర్పాటు చేసి మొదటగా 2019 శ్రీ ఉపాధ్యాయుల నరసింహం గారికి అందజేశాడు .మొజాయిక్ సాహిత్య సురభి ,రిత్విక్ ఫౌండేషన్ కలిసి ‘’అక్షర గోదావరి ‘’పురస్కారాలు అందించాడు .చలం కథలను పాత్రాభినయం  చేశాడు .విశాఖ రేడియో కేంద్రం నుంచి ఉత్తరాంధ్ర ప్రాముఖ్యతను ‘’సాహితీ సమీరాలు ‘’గా తెలియ జేశాడు .ప్రముఖ ఆంగ్లకవి టి.ఎస్.ఇలియట్ ‘’వేస్ట్ లాండ్ ‘’ను ‘’వృధా ధాత్రి ‘’ గా అనువదించటమేకాక ‘సత్యవతీ చరిత్ర’’ను ఆంగ్లీకరింఛిన అనువాద ఘటికుడు అనిపించాడు .కన్యా శుల్క నాటకాన్ని డా. వెల్చేరు నారాయణరావు ఆంగ్లం లోకి అనువది౦చి నపుడు అందులోని దోషాలను చేటలతో చెరిగిపారేసిన ఆంగ్లభాషా నిష్ణాతుడు ,జ్ఞాని రామతీర్ధ .  రాష్ట్ర ప్రభుత్వం నుంచి గురజాడ అవార్డ్ ,రావి శాస్త్రి అవార్డ్ ,మునిపల్లె రాజు అవార్డ్ అందుకొన్న సాహితీ మూర్తి రామతీర్ధ ..కందుకూరి శతవర్ధంతిని అన్ని సాహితీ సంస్థలను కలుపుకొని ఘనంగా చేశాడు .జూన్ 1న సమాపనోత్సవం కు భారీ ఏర్పాట్లు చేశాడు .కానీ 30-5-19న 59 ఏళ్ళవయసు లోనే రామతీర్ధ మరణింఛటం తో  నిరసన గళం మూగపోయింది  .

 రామ తీర్ధ నాకు మంచి సాహితీ మిత్రుడు .కృష్ణా జిల్లా రచయితల  సంఘం  సభలలో కలిసేవాళ్ళం .శ్రీమతి జగద్ధాత్రి ని చూస్తె నుదుట పెద్ద కుంకుమ బొట్టు ,ఒళ్ళంతా కప్పుకొన్న నేత చీర తో అచ్చం అమ్మవారి అవతారం లాగా ఉండేది .చేతులెత్తినమస్కరించ బుద్ధి పుట్టేది .ఎంతో సంస్కారం ఉన్న మహిళ. బహుభాషా కోవిదురాలు .గొప్ప రచయిత్రి .విజయ వాడ లో రెండవ ప్రపంచ తెలుగు మహా సభలలో ‘’వజ్రాయుధం’’ ఫేం శ్రీ ఆవంత్స సోమసుందర్ గారి వెబ్ సైట్ ను ఆవిష్కరించే కార్యక్రమం రామ తీర్ధ తీసుకొన్నాడు .నన్నూ ,జగద్ధాత్రి గారిని అందులో భాగాస్వామ్యులను చేశాడు .నా గురించి పరిచయస్తులతో గొప్పగా చెప్పేవాడు .శ్రీ కుక్కల నాగేశ్వరరావు కృష్ణా జిల్లాపరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు యెన్ ఆర్ ఐ లతో బెజవాడలో ఒక కార్యక్రమం రామ తీర్ధ ఆధ్వర్యం లో  నిర్వహించి  జిల్లా అభి వృద్ధికి సూచనలు చేయించి ప్రవాసుల సహాయం అపేక్షించారు .రామతీర్ధ నాకు కృష్ణా జిల్లా విద్యా విషయం అప్పగించి పేపర్ తయారు చేయమని చెప్పి సభలో ప్రసంగింప జేశాడు .ఆ సందర్భంగా చాలా సార్లు విశాఖ నుంచి ఫోన్ చేసి మాట్లాడేవాడు .నేనంటే ప్రత్యెక అభిమానం ఉండేది ‘’మీరు మా విశాఖ వచ్చి మా  సభలలో మాట్లాడాలి ‘’ అనేవాడు కాని అది జరగలేదు  చాలా కాలం ఫోన్ లో పలకరించుకోనేవాళ్ళం  ..మొజాయిక్ పత్రిక నాకు పంపేవాడు .

3-  మానవ హితైషి – మహా స్వప్న

కవిత్వాన్ని శాసించిన దిగంబర కవులలో ఒకడైన  మహాస్వప్నఅనబడే  కమ్మి శెట్టి ఈశ్వరరావు  రైతుగా జీవిస్తూ సాహితీ సేద్యం చేశాడు. ప్రకాశం జిల్లా లింగ సముద్ర గ్రామం లో జన్మించి , నెల్లూరు లో ఇంటర్ చదివి హైదరాబాద్ వివేకవర్ధనికాలేజి లో బి.ఎ.లో చేరి ,అభ్యుదయ ప్రగతి శీల సాహిత్యంతో పరిచయం ఏర్పరచుకొన్నాడు   .నార్ల చిరంజీవి సాయంతో 18వ ఏట ‘’చందమామ ‘’అనే బాలకవితా సంపుటి వెలువరించాడు .1964లో ‘’అగ్ని శిఖలు ‘’మంచు జడులు ‘’స్వర్ణదూళి’’కవితా సంపుటలు ప్రచురించాడు .తెలుగు కవితా స్వరూప స్వభావాలను సమూలంగా మార్చేయాలన్న ఆలోచన మనసంతా నిండిపోయింది .ఇదే ఆలోచన ఉన్న  కవులు ‘’చెరబండ రాజు ‘’, ‘’నగ్నముని ‘’   , ‘’జ్వాలాముఖి ‘’ ’’భైరవయ్య ‘’ ’మానసిక దిగంబరత్వం కోసం ’’దిగంబర కవులు ‘’అయ్యారు .నిత్య సచేతన ఆత్మ స్పూర్తితో జీవి౦చటమే తమ ఆశయం అన్నారు .మనసు పొరల్లో దాక్కున్న ఆరాటం అసంతోషం విసుగు లను అక్షరాలలో వ్యక్తీకరించి ,ప్రతి వ్యక్తిలో నూతన విశ్వాసం ,ఆశ కలిగించాలని ఆరాట పడ్డారు .జడత్వం తో బండబారిపోయిన సమాజానికి షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చి చేతనకలిగి౦ చాలనుకొన్నారు .కనుక పరుష పదజాలమే తగిన మందు అని ఎంచుకొన్నారు .వీరు ప్రచురించిన కవితా సంకలనం లో పేర్లు ఉండేవికావు .

   వీరిలో మహాస్వప్న శైలి ,మహా గొప్పగా మిగిలినవారి కంటే భిన్నంగా ఉండేది .చెరబండరాజు ,జ్వాలాముఖి చనిపోగా మహాస్వప్న హైదరాబాద్ లో పత్రికా సంపాదకునిగా ,బ్యాంక్ ఉద్యోగిగా పనిచేసి,స్వగ్రామం లింగ సముద్రం వెళ్లి  సేద్యం ,కవితా సేద్యం చేస్తూ అక్కడే ఉండి పోయాడు  మహాస్వప్న సాహిత్యం లో కొత్త అధ్యాయం తెచ్చాడు  ‘’కిటికీకి రెక్కల్లేవు-కళ్ళకు రెప్పల్లేవు –గిటార్ మీద దిక్కుల్ని మీటే –దిగంబరుడి చేతికి వేళ్ళులేవు ‘’అన్న ఆయన కవిత చాలా పేరుపొందింది ,’’గ్లానిర్భవతి భారత ‘’, నటసామ్రాట్,’’మొదలైన ఆరుకవితలు మాత్రమే రాశాడు ‘’.విజ్ఞానం విరజిమ్ముతున్న   విష వనాల్లో-వేదికలు వెదజల్లుతున్న చీకటి పొగల్లో –నాగరికత మత్తు ఇంజెక్షన్ లో  సమాజం జీవచ్చవమైనప్పుడు –దిగంబరకవి అవతరిస్తున్నాడు ‘’అంటాడు .’’మేం మనుషులం కాదు –ఇంకేదో పేరుంది మాకు ‘’శీర్షిక ‘’కోటబుల్ కోట్ ‘’అయింది .సమకాలీన వాస్తవతకు అద్దం పట్టే కవిత ‘’ఇంకమోయలేను ఈ దేవుళ్ళనీ –ఉద్గ్రంథాల్నీ –ఇకమోయలేను ఈ జైళ్ళనీ – సంకెళ్ళనీ ‘-శాసనాల్నీ –బీట లెత్తిన చరిత్రనీ ‘’.పరిపూర్ణ మానవుడుగా పరిణతి చెంది ,ఆచరణలో అద్వితీయుడిగా నిలిచి ,కవి కంటే మనిషి ముఖ్యం  అని  ఎలుగెత్తి చాటి,’’మహా అకవి’’ అనిపించుకొన్న  దిగంబర కవి మహాస్వప్న ‘’పుడుతున్నా పుడుతున్నా –కడుపు రగిలి పుడమి పగిలి –నవ ప్రపంచ వీధుల్లో నగ్నంగా ‘’అంటూ79 వ ఏట 25-6-19న  అంబరానికి వెళ్ళిపోయాడు.’

 4- అనుభవాల ఛాయా మార్గ గామి  అబ్బూరి  ఛాయాదేవి

  తన ఇంట్లోనూ, చుట్టూ ఉన్న ఆడవారి తీరును గమనించి చక్కని కథలు రాసిన శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి పముఖ జర్నలిస్ట్,  పద్యకవి, అధికారా భాషా సంఘం అధ్యక్షులు  శ్రీ అబ్బూరి వరద రాజేశ్వరరావు భార్య,శ్రీ శ్రీ ఆరుద్ర లకు గురువైన ఆంధ్రా యూని వర్సిటి లైబ్రేరియన్ ,అబ్బూరి రామకృష్ణారావు గారి కోడలు .సమాజం నుంచి ఎదుర్కొన్న ఆంక్షలే ఆమె రచనకు తొలి ప్రేరణ .అనేకానేక మహిళా సమస్యలకు ఆమె కధలు కేంద్ర బిందువులు .పురుషాధిక్యాన్ని ధిక్కరించి ,స్త్రీ స్వేచ్చకోరిన రచయిత్రి .మానవ సంబంధాల అనుబంధానికి కట్టిన గోపురం .సృజన శీలి .ఎందరికో ప్రేరణ .తెలుగు వెలుగు సాహితీజిలుగు ఆమె .పరదీనతను చెండాడిన కలం ఆమెది .స్త్రీవాదం అంటే హక్కులు అవకాశాలు అందరికీ ఉండాలని నిర్వచించింది .తనకు వచ్చిన కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డ్ స్త్రీల౦దరిదీ అన్న విశాలహృదయ .స్త్రీవాదం కంటే మానవతకు ఎక్కువ  విలువనిచ్చింది .

  ఆమెకు లభించిన  అవార్డులు లెక్కలేనన్ని .రంగనాయకమ్మ సాహితీ పురస్కారం సుశీలా నారాయణ రెడ్డి  అవార్డ్, ‘’మృత్యుంజయ’’ నవలకు తెలుగు విశ్వ విద్యాలయం నుంచి రచయిత్రి ఉత్తమ రచనాపురస్కారం,అజో -విభో ,సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ అవార్డ్ వంటివి  అనేకం .ధైర్యంగా ముందుకు అడుగేస్తే మహిళ సాధించలేనిది లేదు అని బోధించింది .13-10-1933న  రాజమండ్రిలో జన్మించిన చాయాదేవి రచనకంటే మిన్నగా జీవించింది .పొలిటికల్ సైన్స్ లో ఎం. ఏ .కొత్తఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రు యూని వర్సిటిలో లైబ్రేరియన్ గా చేసింది .చాయా దేవికథలు ,తనమార్గం కథా సంకలనం ,వ్యాస చిత్రాలు,ట్రావేలోగ్ గా చైనాలో చాయా చిత్రాలు మొదలైనవి రాసింది .వరద స్మృతితి ,కవిత ,వనితా మోడరన్ తెలుగు పోయెట్రి లకు సంపాదకత్వం వహించింది .1993లో భర్త ‘’వరద ‘’చనిపోయినతర్వాత ‘’అబ్బూరి ట్రస్ట్‘’స్థాపించి ‘’వరద స్మృతి’’అనే ఉద్గ్రంధాన్ని  అబ్బూరి చాటువులు ,మంగళసూత్రం వగైరా ప్రచురించింది .28-6-19న 86వ ఏట తెలుగు మహిళా వెలుగు అబ్బూరి చాయాదేవి మరణించింది.

 5-జ్ఞానపీఠ పురస్కారం పొందిన  నటుడు దర్శకుడు ,పత్రికా స్వేచ్చ ప్రియుడు పద్మభూషణ్ –గిరీష్ కర్నాడ్   Rhodes Scholorఐన గిరీష్ కర్నాడ్ 19-5-1938 న మహారాష్ట్ర లోని మదేరాలో  జన్మించి ,10-6-2019 న  బెంగళూరు లో 81 వ ఏట మరణించాడు . విద్యాభ్యాసం కర్ణాటకలోని శిరసిలో ,దార్వాడలో జరిగింది .రోడ్స్ స్కాలర్షిప్ పొంది ఇంగ్లాండ్ వెళ్లి ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి లో చదివాడు అక్కడి ఆక్స్ ఫర్డ్ డిబేట్ క్లబ్ కు అధ్యక్షుడై ఆసియాలోనే మొదటి అధ్యక్షుడి రికార్డ్ సృష్టించాడు .అమెరికా చికాగో యూని వర్సిటి విజిటింగ్ లెక్చరర్ గా ఉన్నాడు .ఇంగ్లాండ్ నెహ్రు సెంటర్ కు డైరెక్టర్ గా  పని చేశాడు

తుగ్లక్ ,హయవదన ,వెడ్డింగ్ ఆల్బం ,యయాతి  నాగమండల ,బాలి ,అగ్నిమత్తు మాలే,ఓడకలు బింబ ,అన్జుమల్లిగే,మా నిషాద ,టిప్పు విన కనసుగలు (టిప్పు సుల్తాన్ కలలు)తలెదండ ,హిట్టిన హుంజ  నాటక రచనల తో   గొప్ప కన్నడ నాటక రచయితగా గుర్తింపు పొందాడు .తన రచనలను తానె ఇంగ్లీష్ లోకి అనువాదం చేసుకొన్న ద్విభాషా పండితుడు . అప్పటిదాకా కర్నాటక సాహిత్యం పై ఇంగ్లీష్ ప్రభావం ఉండేది .దీన్ని తొలగించి నేటివ్ సాహిత్యాన్ని అందలం ఎక్కించాడు .బెంగాల్ లో బాదల్ సర్కార్ ,మరాఠీ లో విజయ్ టెండూల్కర్ ,హిందీలో మోహన్ రాకేశ్ లు యెంత స్థాయి రచయితలో గిరీష్ కర్నాడ్ కన్నడం లో అంతే స్థాయి రచయిత .చరిత్ర ,పౌరాణికాలను కలిపి  ఆధునికత దట్టించి రాసిన రచనలు ఆయనవి .ఆయన నాటకాలను ప్రముఖ దర్శకులు ఇబ్రహీం హల్కాజి ,బి.వి.కార౦త్ ,సత్యదేవ్ దూబే మొదలైనవారు ఇతరభాషలలోకి అనువదించి డైరెక్ట్ చేశారు .

కన్నడ రచయిత యు ఆర్ అనంతమూర్తి రాసిన నవలను ‘’సంస్కార ‘’సినిమాగా తీశాడు .దీనికి డైరెక్టర్ ‘’పఠాభి’’అని అందరూ పిలిచే తిక్కవరపు పట్టాభి రామరెడ్డి .దీనికి ‘’ప్రెసిడెంట్ గోల్డెన్ లోటస్ ‘’అవార్డ్ వచ్చింది .1971లో ఎస్.ఎల్ భైరప్ప కన్నడ రచన ను ‘’వంశ వృక్ష ‘’తీసి డైరెక్ట్ చేశాడు .డైరెక్షన్ కు ఫిలిం ఫేర్ అవార్డ్ వచ్చింది .గోధూళి ,ఉత్సవ్ సినిమాలకు దర్శకత్వం వహించి గొప్ప డైరెక్టర్ గా రుజువు చేసుకొన్నాడు .ఒకరకంగా ఆర్ట్ ఫిలిం డైరెక్టర్ .అతని ‘’ఒందానొందు కాలదల్లి ‘’చెలువి ,కాడు సినిమాలు హృదయాలకు చేరువయ్యాయి .కన్నడ రచయిత కు .వెంపు నవల ఆధారంగా ‘’హెగ్గదతి’’డైరెక్ట్ చేశాడు .నిశాంత్ మంథన్,స్వామి ,పుకార్ చిత్రాలు గొప్ప చిత్రాలుగా పేరుపొందాయి .మొత్తం మీద నాలుగు ఫిలిం ఫేం అవార్డ్ లు అందుకొన్నాడు .కన్నడ సాహిత్యానికి అందులోనూ నాటక సాహిత్యానికి చేసిన సేవకు మొట్టమొదటి జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నాడు  ఆ అవార్డ్ తనకన్నా మరాఠీ నాటక రచయిత విజయ్ టెండూల్కర్ కు ఇచ్చి వుంటే బాగుండేది అన్న వినయ శీలి ఇద్దరు కన్నడ జ్ఞాన పీఠ అవార్డీ ల రచనలను తెరకెక్కించిన ఘనత కూడా ఆయనదే .

 దూర దర్శన్ లో ‘’టర్నింగ్ పాయింట్ ‘’ అనే సైన్స్ మేగజైన్ ను 1991లో నిర్వహించాడు .ప్రముఖ రచయిత ఆర్ కే నారాయణ్  రాసిన’’ మాల్గుడి డేస్’’టెలి సీరియల్ లో  కుర్రాడు స్వామి కి తండ్రిగా నటించాడు .కన్నడ భక్తకవులైన కనకదాసు పురందరదాసు లపై ఇంగ్లీష్ లో ‘’కనక-పురందర ‘’డాక్యుమెంటరి తీసిన మట్టిమనిషి కర్నాడ్ .

 కర్నాటక స్టేట్ అవార్డ్ ,గుబ్బి వీరన్న అవార్డ్ ,కేంద్రనాటక సంగీత అవార్డ్ ,పద్మశ్రీ ,పద్మభూషణ్ పురస్కారాలు పొందాడు .2008-09 సంవత్సరం లో  లో జీవన సాఫల్య పురస్కారం అయిన పుట్టన్న అవార్డ్ ఇచ్చినా , తిరస్కరించాడు .

  తెలుగు లో కూడా  ధర్మ చక్రం ,శంకర్ దాదా ,ఆనందభైరవి ,ప్రేమికుడు ,రక్షకుడు సినిమాలలో నటించాడు .  వ్యక్తి స్వేచ్చకు, పత్రికా స్వేచకు ఎక్కడ భంగం వాటిల్లినా అక్కడ ప్రత్యక్షం అయ్యేవాడు. నిరశన గళం విని పించేవాడు .ఆరోగ్యంసహకరించకపోయినా ,శ్వాస ఇబ్బందితో బాధపడుతున్నా ,వీపున ఆక్సిజన్ సిలిండర్ తో ప్రత్యక్షమై సంఘీభావం ప్రకటించే స్వేచ్చా ప్రియుడు   రక్షకుడు గిరీష్ కర్నాడ్ .

 సుమారు పాతిక ఏళ్ళక్రితం మా ఉయ్యూరు స్టేట్ బాంక్ లో పని చేసిన సుబ్రహ్మణ్యం అనే అతను, స్నేహితులు కలిసి ఫిలిం క్లబ్ స్థాపించి  నెలకు ఒకటి రెండు ఆర్ట్ సినిమాలు ప్రదర్శించేవారు .సంవత్సరానికి ఇంటికి రెండువందల రూపాయలు  మెంబర్ షిప్ .ఇంట్లోని వారు అందరూ  వెళ్లి చూడచ్చు .అప్పుడు  గిరీష్ కర్నాడ్  సినిమాలు ,సత్యజిత్ రే  కళాఖండాలు , హిందీ  తెలుగు తమిళ పంజాబీ ఆర్ట్ సినిమాలు  చూసే అదృష్టం నాకు కలిగింది .ఇది మరచిపోలేని అనుభవం .

6- గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం పొందిన మహిళా దర్శకురాలు –విజయ నిర్మల

రామారావు తీసిన పాండురంగ మహాత్మ్యం లో బాలనటిగా రంగప్రవేశం చేసి కృష్ణుడి వేషం తో మెప్పించి ‘’పెద్దాయన ‘’తో కృష్ణా అని పిలిపించుకొని బిఎన్ రెడ్డి రంగుల రాట్రం చిత్రం లో చంద్రమోహన్  చెల్లెలుగా నటించి అతనిచే ‘’నాకు తోడబుట్టని చెల్లి ‘’అని పించుకొన్న నటి  డేరింగ్ ,డాషింగ్ దర్శకురాలు ,అందరికి’’ మేడం ‘’ తనకు పెళ్లి అయి పిల్లాడు ఉన్నా ,కృష్ణకూ అలాగే సంతానం ఉన్నా అతన్ని పెళ్ళాడి ,ఇరువైపులా వారిని రెండు కళ్ళుగా  చూసుకొంటూ ,పొరపొచ్చాలు లేకుండా సుమారు యాభై ఏళ్ళు ఆదర్శ దంపతులుగా జీవించిన విజయ నిర్మల జీవితం చారిత్రాత్మకం .ధన్యం స్పూర్తిదాయకం .

  20-6-1946న జన్మించిన విజయ నిర్మల 73 వ ఏట 27-6-2019 న మరణించింది .నిడదవోలు ఇంటిపేరున్న బ్రాహ్మణ కుటుంబం లో పుట్టింది. ప్రముఖ పరిశోధకుడు నిడదవోలు వెంకటరావుగారు పెదతండ్రి .వెంకటరావు గారిమనవరాలు నటి జయసుధ .ప్రఖ్యాత గాయకురాలుశ్రీమతి  బాలసరస్వతి విజయనిర్మల తండ్రికి సోదరి కనుక వదిన అవుతుంది . తెలుగు తమిళ మళయాళ సినిమాలలో  ప్రముఖ నటులందరితో నటించి,ఎవరిదగ్గరా అసిస్టెంట్ గా పని చేయకుండానే సూటిగా దర్శకురాలైంది .

  చాలా చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్ చేసింది .మళయాళ సినిమా ‘’కవిత ‘’కు 1973లో దర్శకురాలు .అప్పుడే తెలుగులో ‘’మీనా ‘’సినిమాకు డైరెక్టర్ .మొత్తం 44 సినిమాలకు దర్శకత్వం వహించి ,27 సినిమాలకు మాత్రమె డైరెక్టర్ అయిన  ఇటలీ దర్శకురాలి ని మించి, గిన్నిస్ బుకాఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం పొందింది .భర్త కృష్ణ  నటించిన 30 సినిమాల డైరెక్టర్ ఆమె .ఆయనతో 51సినిమాలు చేసింది .భానుమతి తర్వాత రెండవ మహిళా దర్శకురాలు విజయ నిర్మల .2008లో రఘుపతి వెంకయ్య అవార్డ్ మాత్రమె పొందింది .కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమె ప్రతిభను గుర్తించకపోవటం శోచనీయం .వ్యవసాయం చాలా ఇష్టం పండించటం ,పెంచటం ,పంచటం ఆమె హాబీ .హోటల్ మేనేజిమెంట్ లో నిపుణురాలు ‘’నవీన్ ఇంటర్నేషనల్ ‘’అనే త్రీ స్టార్ హోటల్ యజమాని .విజయ కృష్ణ డబ్బింగ్ దియేటర్ నిర్వహించింది .ప్లానెట్ 10పేరుతొ ఫామిలీ క్లబ్ స్థాపించి నడిపింది .విద్యాలయాలు నెలకొల్పింది .బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందింది .

  ఈ జంటతీసిన  ఆమె డైరెక్ట్ చేసిన ‘’దేవదాసు ‘’కలర్ సినిమా మంచి ప్రమాణాలతో ఉన్నా ,అక్కినేని అక్కసుతో తన దేవదాసును అదే సమయం లో విడుదలచేసి దెబ్బ తీశాడని సినీ ప్రపంచం గగ్గోలు పెట్టింది .’’ఇక డైరెక్షన్ జోలికి వెళ్ళను ‘’అని తీర్మాని౦చు కొన్న ఆమె మనసుమార్చి జయాపజయాలకు భయపడరాదని ధైర్యం చెప్పి కృష్ణ  మళ్ళీ  మెగాఫోన్ పట్టేట్లు చేశాడు .అల్లూరి సీతారామ రాజు డైరెక్టర్ వి .రామచంద్రరావు సగం సినిమా తీసి  అకస్మాత్తుగా చనిపోతే విజయనిర్మలే మిగతా సినిమాకు దర్శకత్వం చేసిందని కృష్ణ చెప్పాడు అంతటి సమర్ధురాలు .గొప్పగా నటించేది నటి౦ప జేసేది .అన్నీ సక్సేస్ సాధించిన సినిమాలే ఆమెవి .పద్మ పురస్కారం రాకపోవటం విచారకరం .

7-సీమసాహిత్యాన్ని సుసంపన్నం చేసిన డా యెన్ .రామ చంద్రరావు

ప్రముఖ రచయితా,రాయల సీమ సాహితీ మండలి అధ్యక్షుడు గా చాలా సాహిత్య సభలు నిర్వహించిన డా యెన్ .రామ చంద్రరావు రాయల సీమ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన రచయిత కార్యశీలి .’’తెలుగుభాష ప్రాచీన హోదా తక్షణ కర్తవ్యమ్ ‘’పై నిర్వహించిన పోటీలో, జాతీయ స్థాయి కధానికా పోటీలలో సోమేపల్లి వారి పురస్కారం అందుకొన్న సమర్ధుడు.పురస్కార ప్రదానోత్సవానికి రావాల్సి ఉండగా వయసు, అనారోగ్యం వలన రాలేక పోయారు .జూన్ 29న మరణించారు  .ఇంతకంటే వివరాలు తెలియదు .

8-మొదటి మాంటిస్సొరి స్కూల్ స్థాపకురాలు ,రచయిత్రి సాంఘిక సేవా తత్పరురాలు పద్మశ్రీ శ్రీమతి వి .కోటేశ్వరమ్మ

5-3-1925న కృష్ణాజిల్లా గోసాలలో జన్మించిన శ్రీమతి కోటేశ్వరమ్మ 1-7-2019న 93వ ఏట మరణించింది ..కాకినాడలో చదివి ,తెలుగు ఏం ఎచేసి ,1979-80లో నాగార్జున యూని వర్సిటి నుంచి పిహెచ్ డి పొందింది .బెజవాడ నెల్లూరులలో కొంతకాలం సైన్స్ టీచర్ గా పని చేసింది .1955లో విజయవాడలో చిల్డ్రన్స్ మాంటిస్సొరి స్కూల్ ను ఇంటింటికి తిరిగి తలిదండ్రులను ఒప్పించి 10మంది పిల్లలతో స్థాపించింది .అది దినదిన ప్రవర్ధమానమై అప్పర్ ప్రైమరీ ,హైస్కూల్ ,ఇంటర్ ,డిగ్రీ ,పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి సాధించి ,ఇంజనీరింగ్ ,కాలేజీ నీ ఏర్పాటు చేసి ,ఫార్మసి ,ఏం బి ఏ ,ఏం సి ఏ ఫిజియో దేరపి కోర్సులకు నిలయమైన విద్యా కల్ప వృక్షం గా మారింది ‘.ప్రాచీన కళారూపాలపై శిక్షణ నిచ్చింది .

మంచి రచయితకూడా అయిన కోటేశ్వరమ్మ ‘’భారత దేశం లో స్త్రీలు,నేటి మహిళాప్రపంచం ,జాతి జ్యోతులు వంటి ఉపయుక్తమైన 37పుస్తకాలు రాసింది  .మహిళా చైతన్యం కోసం శ్రమించింది .తెలుగు సాహిత్యం పై చాలా జాతీయ సదస్సులు నిర్వహించింది .1945 లో బెజవాడలో గ్రాడ్యుయేట్ అయిన తొలిమహిళగారికార్డ్ స్థాపించింది .ఎన్నో అవార్డ్ లు రివార్డ్ లు ఆమె సొంతం అయ్యాయి 92వ ఏట ఆమెకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చి గౌరవించింది .2015లో ‘’విద్యా సాంఘిక సేవలకు ‘’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ‘’లో స్థానం లభించింది .

  కోటేశ్వరమ్మగారి భర్త విజయవాడ లయోలా కాలేజి ఫిజిక్స్ హెడ్ .ఆయన ఇంటర్ డిగ్రీలకు ఫిజిక్స్ బుక్స్, గైడ్స్ రాసేవాడు .మంచి బోధకుడుగా గుర్తింపు పొందారు .

9-15 ఏళ్ళు ధిల్లీ ని పాలి౦చిన ముఖ్యమంత్రి- శ్రీమతి షీలా దీక్షిత్

పంజాబ్ లో షీలా కౌర్ గా 31-3-1938లో జన్మించి,ఉత్తరప్రదేశ్ కు చెందిన ఉమాశంకర్ దీక్షిత్ అనే కాంగ్రెస్ నాయకడు,కోశాధికారి కొడుకు వినోద్ దీక్షిత్ ను పెళ్ళాడి షీలా దీక్షిత్ అయి ,నాలుగుసార్లు ధిల్లీ ముఖ్యమంత్రిగా చేసి 20-7-2019న 81ఏళ్ళ వయసులో మరణించింది .

 షీలా దీక్షిత్ ఢిల్లీ యూని వర్సిటి హిస్టరీ పోస్ట్ గ్రాడ్యుయేట్ .మూడుసార్లు కాంగ్రెస్  పార్టీని గెలిపించి ఢిల్లీ పీఠం కట్టబెట్టిన యోద్ధ .అలుపెరుగని కార్యశీలి .ప్రధాని రాజీవ్ గాంధీ మంత్రివర్గం లో కేంద్రమంత్రిగా 1984లోపని చేసింది .ఉత్తరప్రదేశ్ కన్నోజ్ నుంచి పార్లమెంట్ కు ఎన్నికైంది .2014లో కేరళ గవర్నర్  అయింది  .యునైటెడ్ నేషన్స్ లో ‘’కమిషన్ ఆఫ్ స్టేటస్ ఫర్ వుమెన్ ‘’కు రిప్ర రెంటటివ్’’గా ఉన్నది .ఉత్తరప్రదేశ్ లో స్త్రీలపై జరిగిన దౌర్జన్యాలను నిరసనగా82మంది మహళలతోకలిసి 23రోజులు నిరసన దీక్ష నిర్వహించి ప్రభుత్వాన్ని లొంగ దీసింది  . తెగువకల మహిళా నాయకురాలిగా ఎందరికో స్పూర్తిగా షీలాదీక్షిత్ .మార్గదర్శనం చేసింది .

10-రచయిత,విమర్శకుడు సంస్కృతాంధ్ర భాషావేత్త ,పత్రికాసంపాదకుడు , ఆకాశవాణి   అసిస్టెంట్ డైరెక్టర్ –శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ

తూ .గో.జి. రామ చంద్రాపురం లో శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ 29-5-1944 న జన్మించి 25-7-2019న హైదరాబాద్ లో 75వ ఏట మరణించాడు .తండ్రి హనుమచ్చాస్త్రి పేరుమోసిన కవి పండితుడు .భార్య జానకీబాల నవలా కదా రచయిత్రి విమర్శకురాలు .కొడుకు మోహన కృష్ణ ‘’అష్టా చెమ్మా ‘’సినిమాతో పాటు  ,అనేక హిట్ చిత్రాల దర్శకుడుగా ప్రసిద్ధుడు .అంటే శర్మ తండ్రికి తగ్గ కొడుకు .భార్య భర్తకు తగిన భార్య. కొడుకు మళ్ళీ తండ్రికి తగిన తనయుడు అన్నమాట .

  తెలుగు ఎం .ఏ.డిగ్రీ పాసైన శర్మ విద్యార్ధి దశలోనే రచనలో అడుగుపెట్టాడు .ఆంధ్రజ్యోతి వారపత్రికలో సబ్ ఎడిటర్ గా 1969-76 మధ్య పని చేసి ఎందరో రచయితలకు కవులకు ప్రోత్సాహమిచ్చాడు .అభ్యుదయవాదిగా ప్రసిద్ధి పొందాడు .1976లో విజయవాడ ఆకాశవాణి లో అసిస్టెంట్ ఎడిటర్ (స్క్రిప్ట్స్ )చేరి ఉషశ్రీకి సహాయకుడిగా ఉన్నాడు .సంస్కృతం లో మంచి పట్టు ఉన్న శర్మ  సంస్కృత కార్యక్రమాల రూపకల్పనకు ప్రసారానికి ఇతోధిక కృషి చేశాడు .ఎన్నో సంస్కృత నాటకాలు అతనికాలం లోరూపుదాల్చి ప్రసారమై రెడియోకేంద్రానికి జాతీయస్థాయిలో అవార్డ్ లు  వచ్చాయి  .అప్పుడు స్టేషన్ డైరెక్టర్ శ్రీ రజనీ కాంతారావు గారు ఉండటం  ,ఈ ముగ్గురు ఉన్న ఆకాలం స్వర్ణయుగం అనిపించింది .

    శ్రీకాంత శర్మ కవితలు విమర్శలు నాటికలు ,పాటలు నవలలు రాసిన సాహితీ మూర్తి .అనేక  డాక్యు మెంటరీలు ,సంగీత రూపకాలు రచించాడు.1994లో నిజామాబాద్ రేడియో కేంద్రం ప్రోగ్రాం ఎక్సి క్యూటివ్ గా వెళ్లి 1995 వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక ఎడిటర్ గా చేరాడు .కొన్ని సినిమాలకు పాటలు రాశాడు అందులో బాపు గారి కృష్ణావతారం   జంధ్యాల నెలవంక ,రావు –గోపాలరావు మొదలైనవి లైనవి ఉన్నాయి మొత్తం 30పాటలే రాసినా ఆణిముత్యాలనిపించాయి .నెలవంక కు అన్నిపాటలూ రాయించాడు జంధ్యాల .అనేక అవార్డ్ లు రివార్డ్ లు అందుకొన్నాడు .74 వ ఏట అంటే ఏడాది క్రితం కొడుకు మోహన  కృష్ణ  సినిమా ‘’సమ్మోహనం ‘’కు  సమ్మోహ పరచే పాట రాశాడు .

  శర్మ రెడియోకోసం రాసిన గీతం ‘’తేనెల తేటల మాటలతో మనదేశ మాతనే కొలిచెదము ‘’అనే పాట విస్తృత ప్రచారమై ,ప్రతి ఇంటా మారుమోగి తెలుగు వారికి జాతీయగీతమైంది .’’ఇంటిపేరు ఇంద్రగంటి ‘’అనే ఆత్మకథ రాసుకొన్నాడు .’ఆతను రాసిన ‘’హరహర మహా దేవ నాటిక ‘’అనేక ప్రదర్శనలు పొందింది .ఇందులో నటించిన శర్మ, పాండురంగ ,కోట శంకరరావు లకు అవార్డుల వర్షమే కురిసింది .’’అప్పు సత్యాగ్రహం ‘’అనే నాటిక ఇటీవలే బెజవాడ రెడియోకేంద్రం నుంచి ప్రసారమైంది .

  ఉయ్యూరు హైస్కూల్ లో నేనూ  ప్రముకః సాహితీ విమర్స్ఝాకుడు విశ్లేషకుడు  శ్రీ శ్రీ పై అధారిటి  ఉన్న టి.ఎల్ .కాంతారావు సైన్స్ మేస్టర్లుగా పని చేసినప్పుడు మాసైన్స్ రూమ్ సాహితీ కేంద్రం గా అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించాం .మేమందరం కలిసి ‘’వేమన త్రిశతి జయంతి ‘’ఘనంగా జరిపి ,ఇంద్రగంటి శీకాంత శర్మను అధ్యక్షుడిగా ,ఈ తరం ఇంటలెక్ట్ డా జి వి కృష్ణారావు గారిని ముఖ్య అతిధిగా ఆహ్వానించి ఆయన ప్రసంగం ఏర్పాటు చేసి , ఘనంగా సత్కరించాం .శ్రీఅద్దేపల్లి రామమోహనరావుగారినీ ఆహ్వానించి మాట్లాడి౦ చాం  .ఆరోజు అంతా శ్రీ కాంత శర్మగారు మాతోనే ఉండి  మా ఇంట్లో అందరం భోజనం చేశాం. రాత్రి కూడా మా ఇంట్లోనే పడుకున్నారు నేనూ కాంతారావు అద్దేపల్లి ,పసుమర్తి ఆ౦జనేయ శాస్త్రి శర్మతో కబుర్లు చెబుతూ ఆయన చెప్పినవి వింటూ  తెల్లవార్లూ గడిపిన మధుర క్షణాలు మర్చి పోలేనివి .ఆది అంతా ఆయన సౌజన్యమే .సుమారు పదేళ్ళ క్రితం హైదరాబాద్ లో  అమెరికా చిట్టెన్ రాజు గారు ‘’బాపు రమణ ల స్నేహ షష్టి మహోత్సవం’’ తెలుగు మహాసభలు కలిపి త్యాగరాజ గాన సభలో నిర్వహించినపుడు ఇంద్రగంటిని కలిసి  నా పేరు చెప్పగానే ఉయ్యూరు అనుభవం అంతా గుర్తు చేసుకొన్నాడు .ఆతర్వాత ఎపుడు సభలో కలిసినా పేరు పెట్టి పిలిచి యోగ క్షేఆలు అడిగేవాడు .ఇలాంటి సహృదయుల పరిచయం అవటం నా అదృష్టంగా భావిస్తాను .

  దశావతారాలని పించే పై ప్రముఖులకు మరొక సారి అక్షర నివాళి అర్పిస్తూ ,  ఇంతమంది ప్రసిద్ధులకు ఒకే వేదికపై నివాళి అర్పించే అవకాశ౦  ఆంద్ర దేశం లో ఏ సాహితీ సంస్థకురాలేదని,  ఏ సంస్థా చేయని పని సరసభారతికి దక్కిందని విషాదంగా నే అంగీకరిస్తూ  వారి స్పూర్తి మనలను చిరకాలం మార్గ దర్శన౦ చేయాలని  సవినయంగా మనవి చేస్తున్నాను .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-7-19-ఉయ్యూరు


About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.