భువి నుంచి దివికి పాకిన ‘’జూకామల్లి
ఎత్తైన విగ్రహం ,అంతే ఎత్తైన సాహితీ మూర్తిమత్వం ,నల్లని పలుచని శరీరం ,చిన్న కళ్ళు అయినా కాటుక రేఖలతో పొందిన కాంతిమత్వం ,చేతులకు గాజులు ,తలలో పూలు ,నుదుట బొట్టు ,ముదురు రంగు పట్టు చీర ,దానికి తగిన జాకెట్టు ,కోలముఖం ,నవ్వు తూ ఉండే పలువరస ,సాంప్రదాయ భారతీయత ఉట్టిపడే చీరకట్టు ,ముఖం లో సౌమ్యత ,పలకరింపు లో ఆప్యాయత ,సౌజన్యం ,మాట తీరు లో మల్లెల సౌరు ,ఆకర్షణలో జూకామల్లె తీరు ,చూడగానే రెండు చేతులు ఎత్తి నమస్కరించ బుద్ధి అయ్యే స్పురద్రూపం ,ప్రసంగం లో’’విపుల ‘’ విద్యా వైదుష్యం ,చర్చలలో’’ చతుర ‘’సంభాషణా ,పదునైన ఆలోచనా ధోరణి ,నడిచి వచ్చే వాణీ స్వరూపమా అనిపించే ఆ సాహితీ సరస్వతి వేరెవరోకాదు, కే.బి.లక్ష్మిగా అందరూ పిలిచే డా .కొల్లూరు భాగ్య లక్ష్మి .
కేబి లక్ష్మి గారిని మొట్ట మొదట సారిగా హైదరాబాద్ త్యాగరాజ గాన సభలో అమెరికా చిట్టెన్ రాజు గారు ప్రపంచ తెలుగు సభలు ,బాపు –రమణల స్నేహ షష్టి పూర్తీ కలిపి నిర్వహించినపుడు మొదటి రోజు ఉదయం భోజన విరామ సమయానికి ముందు, ఆమె కిచ్చిన 10 నిమిషాల సమయంలో కరుణశ్రీ గారి ‘’విజయశ్రీ ‘’గురించి అద్భుతంగా మాట్లాడి ,భోజన సమయం లో బయటకు వచ్చినప్పుడు దగ్గరకు వెళ్లి అభినందించాను .అదే మొదటిసారి చూడటం ,మాట్లాడటం .అప్పటిదాకా ఆమె ఎవరో నాకు తెలీనే తెలీదు .నా అభినందనకు కారణం కూడా ఉంది .ఎవరు మాట్లాడినా కరుణశ్రీ రాసిన ఉదయశ్రీ గురించే చెబుతారుకాని నాకు అత్యంత ఇష్టమైన ‘’విజయశ్రీ ‘’గురించి మాట్లాడకపోవటం ,ఆమె దానికి నూటికి వెయ్యి శాతం న్యాయం చేయటం ,పద్యాలను అలవోకగా చదవటం ఆశ్చర్యం కలిగించి ఆమె పై అభిమానం కలిగింది . ఆ సభలో శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారు కూడా ఉన్నట్లు జ్ఞాపకం .విజయశ్రీ లో కరుణశ్రీ కవితా వీర విహారం చేశాడు .అందులోని మొత్తం పద్యాలు నాకు కంఠతా వచ్చు .అంతేకాదు ఉయ్యూరు సాహితీ మండలి సమావేశం లో ఒకసారి అందులోని పాత్రలకు ఆ పద్యాలు రాసి ఇచ్చి చిన్న ప్రదర్శనగా చేయించి అందరి మెప్పూ పొందాను . విజయశ్రీ పై అంతటి వీరాభిమానం నాకు .
క్రమంగా కృష్ణా జిల్లా రచయితల సంఘం సమావేశాలకు వెళ్ళటం ,నాకూ వారు తగిన పాత్ర ఇచ్చి ప్రోత్సహించటం జరిగింది .వారి అన్ని ప్రచురణలలో నాతో విలువైన వ్యాసాలు రాయించారు శ్రీ పూర్ణచంద్.ఆ సభల్లో లక్ష్మిగారితో సాహితీ బంధం బలపడింది .ఒక సారి అకస్మాత్తుగా ఆమె ‘’నేను మీ ఫాన్ ను .మీ బ్లాగ్ చదవకుండా ఉండను .ప్రొద్దున్నే మేము పేపర్లు తిరగేయ్యాల్సిన పని లేకుండా ముఖ్యవిశేషాలు లు సాహిత్యం మీరు పోస్ట్ పెడుతున్నారు .అవి చదివి యెన్ లైటన్ అవుతున్నాను .మీ పోస్ట్ లన్నీ ఒక ఫైల్ లో ఉంచుతున్నాను ‘’అన్నప్పుడు ‘’ములగచెట్టు ఎక్కిస్తున్నారేమో ‘’?అని భయపడ్డాను .కాదని అవి ఆమె హృదయం లోతుల్లోంచి వచ్చిన మాటలే అని గ్రహించాను .మరో సారి ఆమె తమ్ముడు కూడా బెజవాడలో ఆమెతో పాటుకనిపించి తానూ సరసభారతి బ్లాగ్ ఫాలోయర్ అనటం మరింతగా ఆనందాన్నిచ్చింది .
లక్ష్మి గారికి బందరు చుట్టుప్రక్కల పొలాలు ఉండటం ,సుబ్బారావుగారు క్లాస్ మేట్ అవటం వారి కుటుంబాలు చాలాసఖ్యతతో ఉండటం వలన ఆమె ప్రతి ఏడాది బందరువచ్చి రైతులనుంచి పంట డబ్బులు వసూలు చేసుకొని వెళ్ళేవారు .ఒకసారి వేసవి లో ఆమె వస్తున్నట్లు నాకు తెలియజేసి ఏదైనా సాహిత్య కార్యక్రమ౦ ఏర్పాటు చేయగలరా అని సుబ్బారావు గారు ఫోన్ చేస్తే, వేసవిలో జనం రావటం కష్టమని చెప్పి, జులై లో ఫ్లోరా స్కూల్ లో సరసభారతి కార్యక్రమ౦ ఏర్పాటు చేసి సుబ్బారావు గారి అధ్యక్షతన ఆమెను మహిళాభ్యుదయం పై మాట్లాడించి చిరు సత్కారం చేశాం .
నేను రాసిన ప్రతి ఆర్టికల్ ఆమె చదివి స్పందించేవారు .సరసభారతి ప్రచురణలు ఆమెకు పోస్ట్ లో పంపేవాడిని .ఆమె తన ‘’జూకా మల్లి ‘’నాకు పంపారు . ఆపుస్తకానికి తగిన జూకామల్లి చిత్రం అచ్చు అవలేదని బాధపడి , నన్ను వెతికి పంపమని కోరితే, హైదరాబాద్ లోని దేవరాజు మహారాజుగారికి ఫోన్ చేసి ,దాని బొటానికల్ నేం సంపాదించి గూగుల్ లో ఆపూల ఫోటోలు వెతికి పట్టుకొని, ఆమెకు పంపితే పరమానందం పొంది ‘’మీకు చెబితే ఏదైనా సాధిస్తారు ‘’అని కితాబిచ్చారు . మరోసారి మా దొడ్లో ‘’శంకు పూలు ‘’ఫోటో పెడితే చూసి, ఆ విత్తనాలు కావాలని కోరితే పోస్ట్ లో పంపితే సంతోషించారు .మరొకసారి చినుకు మాసపత్రికలో ఆమె ‘’కవులైన కథకులు’’ శీర్షికలో ఎందేరెందరో మహానుభావులను గురించి ధారావాహికగా రాస్తూ ,ఎవరో కవి గురించి, ఆయన పుస్తకాలు గురించి వివరాలు కావాలని కోరితే హైదరాబాద్ అమీర్ పేట దగ్గర జైన దేవాలయం దగ్గర ఉన్న నాకు అత్యంత ఆప్తుడైన శ్యాం సుందర్ గారి ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్లి కలవమని చెప్పి ఆయనకూ ఫోన్ చేసి చెబితే , ఆమె వెళ్లి కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా ఆయననుంచి సంపాదించుకొన్నది . చాలాసార్లు ఎన్నో విషయాలపై నన్ను వివరాలు అడిగితె నాకు తెలిస్తే వెంటనే చెప్పటం, లేకపోతె తెలుసుకొని చెప్పటం జరిగేది.దానికే ఆన౦దించే అల్ప సంతోషి ఆమె . మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయ ,సరసభారతి,మా పెరటి చెట్ల వైభోగం ,ఉసిరి చెట్టుకింద కార్తీక వనభోజనాలు ,బంధువుల రాక ల ఫోటో లన్నీ చూసి ముచ్చట పడేవారు . వెంటనే స్పందించేవారు . లక్ష్మిగారు శ్రీ మతి పవని నిర్మల ప్రభావతి గారింటికి వెళ్లి చేసిన ఇంటవ్యు మా శ్రీమతికి చాలా ఇష్టం .ఈ ఇద్దరిపై ఆమెకున్న అభిమానం అది .
సుమారు నాలుగైదు ఏళ్ళనుంచి ఆమె ఆరోగ్యం లో ఏదో మార్పు గమనించాం నేనూ మాశ్రీమతీ .ఆమె కనబడినప్పుడు అడిగితె నవ్వి ఊరుకొనేది .ఈ కాలం లోనే ఆమె నుంచి ఫోన్లు ,మెయిల్ తగ్గాయి .నేనూ సరసభారతి పుస్తకాలు పంపలేదు .సభలలో కలిసినప్పుడు ఇచ్చేవాడిని .శ్రీమతి చలసాని వసుమతి గారు విజయవాడలో పుస్తకం ఆవిష్కరణ సభలో లక్ష్మిగారికి ,శ్రీ విహారి గారికి వారి ఫౌండేషన్ తరఫున చెరి 10వేల రూపాయలు నగదు బహుమతి ఇచ్చి సత్కరించినపుడు మేమిద్దరం వెళ్లి అభినంది౦చా౦ . అప్పుడు వారి కుమారుడు,కుమార్తె లను కూడా చూశాం . మే 17న గుడివాడ లో పుట్టివారి పురస్కారం ‘’ఆమెకూ నాకు మరికొంతమందికి ఒకే వేదికపై జరగటం నాకు మహద్భాగ్యం .ఆమెకు ‘’కథా కల్పవల్లి ‘’బిరుదు నిచ్చారు .జులై 14ఆదివారం సాయంత్రం హైదరాబాద్ త్యాగరాజగాన సభలో గురు పౌర్ణమి సందర్భంగా నోరి చారిటబుల్ ట్రస్ట్ వారు నాకు గురు పురస్కారం గా ‘’కళా సుబ్బారావు అవార్డ్ ‘’అందజేసినపుడు కేబిలక్ష్మిగారు వేదికపై ఉన్న నా దగ్గరకు వచ్చి పలకరించి అభినందించి అక్కడి వారితో ‘’దుర్గాప్రసాద్ గారుమా గురువు గారు ‘’అని చెప్పటం ఇంకా చెవులలో మారు మోగుతూనే ఉంది .అంతటి సంస్కారం ఆమెది .పదిహేను రోజుల్లో ఆమె మనముందు నుంచి శాశ్వతంగా నిష్క్రమించారు అంటే ఊహించ లేకపోతున్నాము .ఇక బెజవాడలో ఆమె లేని సాహిత్య సభలను ఊహించటం కష్టం .కృష్ణా జిల్లా రచయితల సంఘ సారధులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు శ్రీ పూర్ణ చంద్ గార్లు ఆమె మరణం జీర్ణించుకోవటం కష్టమే .
విశాఖ జిల్లా అనకాపల్లిలో జన్మించిన కేబి లక్ష్మిగారు ఉస్మానియా విశ్వ విద్యాలయం లో తెలుగు ఎం .ఏ .చేసి ,ఆచార్య యెన్ గోపి పర్యవేక్షణలో ‘’అచ్యుతవల్లి కథలు ‘’పై పరిశోధన చేసి పిహెచ్.డి.పొందారు .విపుల, చతుర మాసపత్రికలలో మూడు దశాబ్దాలు పనిచేసి శ్రీ చలసాని ప్రసాద్ పదవీవిరమణ తర్వాత సంపాదక బాధ్యత వహించారు. ఆమె వేలకొద్దీ కథలను ఎడిట్ చేసి ఉంటారు .తన స్వీయ కథలను ‘’మనసున మనసై ‘’,జూకామల్లి ‘’అనే రెండు సంపుటాలు, కవితలను ‘’వీక్షణం ‘’,గమనం ‘’అనే రెండు సంపుటాలుగా ప్రచురించారు .ఇందులో ‘’గమనం ‘’ప్రముఖ సాహితీవేత్త శ్రీ సుధామ చేతి రాతతో వెలువడటం విశేషం .1967నుంచి ‘’యువభారతి ‘’లో వనితా విభాగ అధ్యక్షురాలు .సాహిత్యాభిమాని శ్రీ భీమాని కామేశ్వరరావు గారిని ప్రేమించి పెళ్ళాడి ,ప్రవీణ్ ,సమీర లను సంతానంగా పొందారు .అందరితో స్నేహం గా ఉండటం ఆమె సహజ లక్షణం కనుక ఇంటికి ‘’స్నేహ నికుంజ్ ‘’సార్ధకనామం పెట్టుకొన్నారు .
ఏ విషయం పైనైనా అనర్గళం గా ‘’విపులం ‘’గా ,’’చతురం ‘’గా మాట్లాడే నేర్పు లక్ష్మి గారిది .ఆమె ‘’గమనం ‘’లో ఆమె కున్న గమనించే లక్షణం ,ఆమె గమనమూ ,లోక గమనమూ కనిపిస్తాయి ,ఆమె ‘’వీక్షణం ‘’తీక్ష్ణ మైనది .నిశిత దృష్టి వీక్షించవచ్చు .ఆమె స్నేహం ‘’మనసునమనసై ‘’పరిమళిస్తుంది .మల్లెలు చాలా రకాలైనా ఆమెకు ‘’జూకామల్లె ‘’పై అభిమానం ఎక్కువ . ఆ పువ్వునే ’’ రాదా మనోహరం ‘’అంటారని మాశ్రీమతి ఉవాచ .కొంచెం నీలిరంగు తెల్లపువ్వే జూకా మల్లి .మనోహరమైన అందం ,మనసును పరవశపరచే పరిమళం దాని ప్రత్యేకత .లక్ష్మిగారికీ ఈ సుమ లక్షణాలు ఉండటం వలన అంత అభిమానం . ఈ కథలలో వాటిని పంచిపెట్టారు .’’దాంపత్య జీవిత సౌరభాన్ని వెదజల్లే ఆణి ముత్యాలు ఆమె కథలు ‘’అన్న సుధామ మాటలు అక్షర సత్యాలు .’
’జర చాయ్ తాగి పో’’కవితలో ఆమె కవితా విశ్వ రూపం కనిపిస్తుంది .తెలంగాణా యాస అక్షర రమణీయం గా ఉంది ,పరకాయ ప్రవేశం చేసి రాశారా అనిపిస్తుంది .ఎన్నెన్నో ఊసులు కలిపి మరగించిన చాయ్ నాకు మాత్రం మహా రుచిగా ఉంది .’’చారణా చాయ్ కు చాలీస్ రుపయా విలువ కలిగించి ఫిదా చేశారామే .ఆమెకు ఆత్యంత ఇష్టమైన ‘’జూకా మల్లి ‘’ని భువి నుండి దివికి పాకించిన నట్లుగా , సాహితీ మూర్తి కె.బి.లక్ష్మి గారు జులై 22 సోమవారం 70 వ ఏట అకాల మరణం చెంది సాహితీ లోకానికి తీవ్ర దిగ్భ్రమ కలిగించారు .ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నాను .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -31-7-19-ఉయ్యూరు