క్షత్ర బంధూపాఖ్యానం-2(చివరిభాగం )
మూడు ఆఖ్యానాలతో విలసిల్లిన ఆసూరి మఱింగంటి నరసింహా చార్యుల వారి ‘’ క్షత్ర బంధూపాఖ్యానం-‘’కావ్యం ,క్షీణ యుగానికి చెందినా ,కొంతవరకు ప్రబంధ లక్షణాలను కాపాడుకొన్నది .కవి ఉత్తమ కోవకు చెందినవారు,సంస్క్తృత ,ఆంధ్రాలలో విశేష పాండిత్యం ఉన్నవారుకనుక స్థాయిలోనే కవిత్వం ఉంది నిజాం వాసన గుబాళించింది .కవిత్వం లో గుణం కోరుకొనే కవి కనుక దానికి పూర్తి న్యాయం చేశారు .వృద్ధ దొమ్మరిసాని వర్ణనలో –
‘’ప్రత్యక్ష పాంచాల ,బాహానటనల –ప్రాస యతి చ్ఛేక పాకశయ్య
దేవ భాషా గ్రామ్య దేశ్యప భ్రంశల –తత్సమానా౦ ద్రోక్తుల దప్పకుండ
నవరసాలంకార నానార్ధ శబ్దముల్ –వగలయ క్రియలు నగుపడంగ
గూడార్ధ భావముల్ రూఢిగా దెల్పుచు-బర తత్వ సిద్ధాంత పటిమ నెరయ
బహు చమత్కార యుక్త వాచా ప్రగల్భ్య –స్పుట నిరాఘాట పద గు౦ఫ పటిమ యొదవు’’
అని చెప్పిన దాన్ని బట్టి అవన్నీ ఆయనకవిత్వం లో రాశీ భూతమైనాయి .
సంప్రదాయ విధానం లో శ్రీకారం తో పద్య రచన ఆరంభించి ,ఇష్టదేవత స్తుతి ,శేష గరుడ విశ్వక్సేనాదుల వర్ణన ,పూర్వకవి స్తుతి కుకవినింద ,కృతిపతి ఐన నల్లగొండ జిల్లా పెద్దవూరమండలంచిన్న గూడెం దగ్గర గుహలో వెలసిన తమ కులదైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రశంసా చేసి షష్ట్యంతాలు చెప్పారు .తమకావ్యాన్ని మహా ప్రబంధంగా పేర్కొన్న కవిగారు గురు సేవ మోక్షప్రసాది కనుక ఆచార్య ప్రాశస్త్యాన్ని తెలియజేసి శ్రీహరి చిద్రూప ధారాకృతి తో ప్రజలను దీమంతులను చేయటానికి ‘’దేశికాకృతి’’దాలుస్తాడని ఒక పద్యం చెప్పారు –
‘’ఆరున్మూడును ,రెండు నేడు,నొకటిన్నజ్ఞాన సంబందమై –జేరం గన్గొని,చిత్తగించి ,,హరియుం జిద్రూప ధారా కృతిం
గారుణ్యంబున ,దేశికాకృతి యు నై,గన్పట్టె నీ ధాత్రిలో –దీరోదారత చేత నౌఘములనున్ దీమంతులుం జేయగా ‘
’ క్షాత్ర వంశం లో పుట్టినా క్షాత్ర ధర్మానికి దూరమై ,మహాపాపియై ‘’క్షత్రబందు ‘’అనే చెడ్డపేరు తో ఉపనయనం అయినా తీరుమారక కొడుకుకు చెప్పలేక తండ్రి వానప్ర స్థాశ్రమం తీసుకోగా ,ఏక చత్రాది పత్యంగా పాలిస్తూ మరింత పాపియై స్త్రీ హింస కూడా చేయించాడు . ధర్మ భ్రస్టత సహించని వ్యాసమహర్షి వచ్చి హితోపదేశం చేసినా మారలేదు .కోపంతో ఆయన రాక్షసుడివి కావలసినదని శపించాడు .కాళ్ళమీద పడితే 12ఏళ్ళు రాక్షసుడి వై జీవించి ‘’దుర్జన సహవాసముచే –నిర్జన ప్రధమా౦గ మున ను ,నెగడుచు ధరణీ
నిర్జరు సహవాసముచే –నర్జర రిపు రూపు వదలు నీకు నృపాలా “’అని శాప విముక్తి అనుగ్రహించాడు.
వాడు అలాగే 12ఏళ్ళు భ్రస్ట జీవితం గడిపి ,తర్వాత ఒక రోజు పుండరీక ముని ఆదారిలో వస్తూ దుర్వాసన గమనించి ఆ ఆవాసం వాడిదే అని గ్రహించి వెళ్లగా వాడు చంపి తింటాను అని బెదిరించాడు .కానీ ఆయన వాడిని పట్టుకొని మంచిమాటలు చెప్పి ,గౌతమీ స్నానం చేయించి తిరుపు౦డ్రాదులు ధరింపజేసి శిష్యుడిని చేసుకొని ,శాప విముక్తుడిని చేసి ,విష్ణు గాధలు బోధించి తనతో తీసుకు వెడతాడు .
చివరి భాగం లో తిరుమంత్ర ప్రభావం వలన క్షత్ర బంధు దీనుల హీనులను సేవించి భానుమతిని పెళ్ళాడి సుమిత్రుడు అనే పుత్రుని పొంది ,సర్వ సౌఖ్యాలు పొందాడు .దొమ్మరులకు కూడా తిరుమంత్రార్ధం బోధించి పునీతుల్ని చేస్తాడు .ఇలా కథను క్లిష్టత లేకుండా రసబందురంగా సులభరీతిలో రాశారు కవి
ప్రబంథం కనుక అష్టాదశ వర్ణనలు ఉన్నాయి .కరువును వర్ణిస్తూ అది ‘నిఖిల నరశుష్క కాంతార వ్రాతంబు దహించే వహ్ని ‘’ఆని ,’’లేమి గాదిది మనుజ హామిక శైలాలి పాటనం బనరించు పవి యనంగ ‘’క్షామం కాదు ఇది ‘’ప్రాణుల విలయం చేసే హాలాహలం ‘’అని వర్ణించారు .వసంతం ను వర్ణించే ఆరుపద్యాలు రసగుళికలే –
‘’అంత,నిశాంత కాంతిశిశిరాంత దినా౦తమునన్ ,దిగంతులన్ –వింతగ ,నంతతంటను వేడ్క దలిర్ప నుద్భవిల్లె,శ్రీ
మంతము ,సద్విజ ప్రకర మానస రంజిత నవ్య సౌరభా –క్రాంతము ,నామిళింద వరగాన సుమంతము నా వసంతమున్ ‘’
రాక్ష రూపం పొందిన క్షత్ర బంధు ను ‘’సురపొన్నలతోసారి తూగే తల పర్వత శిఖరంగా ,తామరతూడులవంటి బాహువులు ఏనుగు తొండాలు ,సింహమధ్యమం అయిన నడుము పటువైన గోలెం లాగా అరటి బోదెలవంటి తొడలు గానుగ దూలాలులాగా ,మేఘమండలం దాకా పెరిగిన శరీరం ,కందెన నూనె వంటి రంగు గాడిద వొండ్రలాంటి స్వర తో పెనుభూతంగా మారాడు .కవి సారాలంకారం తోపాటు అన్ని అలంకారాలు వాడాడు .సామెతలు జాతీయాలు గుదిగ్రుచ్చారు .నాటకీయత తో రక్తికట్టించారు .విశిష్టాద్వైత సంప్రదాయాన్ని పరిపోషించి కథకు గొప్ప న్యాయం చేకూర్చారు .బహుముఖీన పాండిత్యం తో దారాశుద్ధికవిత్వం తో సంప్రదాయానుసరణంగా ఈ మహా ప్రబంధాన్ని శ్రీ నరసింహా చార్యులవారు తీర్చి దిద్దారు .ఇంటిపేరు లోఉన్న ‘’ఆ సూరి ‘’లోని ‘’సూరి ‘’పదానికి సార్ధకత చేకూర్చారు.
ఇన్ని విషయాలను తన సిద్ధాంత గ్రంథం లో పొందుపరచిన డా .సర్వా సీతారామ చిదంబర శాస్త్రిగారు అభినందనీయులు .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-8-19-ఉయ్యూరు