క్షత్ర బంధూపాఖ్యానం

క్షత్ర బంధూపాఖ్యానం

ఈ పేరే మనకు కొత్తగా  అని పిస్తుంది .దీన్ని రచించిన  కవి ఇంటిపేరు కూడా మరీ కొత్తగా ఉంటుంది .ఈ కావ్యం ,కవి వివరాలుపై శ్రీ సర్వా సీతారామ చిదంబర శాస్త్రి గారు పరిశోధన చేసి పిహెచ్ డి అందుకొని2019 ఏప్రిల్ లో  ముద్రించి , అభిమానం తో నాకు పంపించారు .అందులోని అపూర్వ విషయాలు క్లుప్తంగా మీకు అందజేస్తున్నాను .

ఈ ఉపాఖ్యాన కర్త ఆసూరి  నరసింహా చార్యులు . భగవద్రామానుజుల వారి  గృహనామమే ఇది .ఆసూరి ఇంటిపేరుకు కవిగారి పూర్వీకులు ‘’భట్టర్ ‘’చేర్చి ‘’ఆసూరి భట్టరు ‘’వారయ్యారు .కొంత కాలానికి ‘’మఱిం గంటి ‘’పదం కూడా చేర్చుకొని ‘’ఆసూరి భట్టరు మఱిం గంటి ‘’అయ్యారు .తర్వాత ఎందుకో భట్టరు వదిలేసి ‘’ఆసూరి మఱిం గంటి ‘’ని ఇంటిపేరుగా ఖాయం చేసుకొన్నారు .కనుక మనకవి గారి పేరు ఆసూరి మఱిం గంటి నరసింహ చార్యులు .అసలు ఈ మఱిం గంటి పదం ఎందుకు ఎలా వచ్చి దూరింది ?అనే దానిపై తలొకమాటా చెప్పినా చివరికి ఒకదాన్ని అందరూ అంగీకరించారు .వీరి పూర్వులైన లక్ష్మణ దేశికులవారు 12 వేలమంది త్రిదండి సన్యాసులు ,7 వేలమంది జనవరులు ,74పేర్లున్న గురువులు ,ఒక లక్ష తిరునామ ధారులతో కలిసి దిగ్విజయ యాత్ర చేస్తూ, భక్తులను అనుగ్రహిస్తూ ,దుస్ట శిక్షణ శిస్ట రక్షణ గావిస్తూ శ్రీ రంగనాధ స్వామి దర్శనార్ధం శ్రీరంగం వెళ్ళారు .అప్పటికే రామానుజా చర్యులవారు ,కొందరు సాదు భట్టారకులు ,కూర నాయకులు ,ముదలి యా౦డాన్ తో కలిసి అక్కడ ఉన్నారు .శ్రీ రంగనాధుడు రామానుజులవారితో ‘’మిమ్ములను గంటిని ,మీ వెంట వచ్చిన ఈ ఘనుల ‘’మఱిం గంటిని ‘’అన్నాడు .అప్పటి నుంచి ఆసూరి వారి గృహనామంలో ‘’మఱిం గంటి ‘’చేరింది . ఈవిషయాన్ని మఱింగంటి సింగరాచార్యులు తనకావ్యాలన్నిటిలో రాశారు .

‘’క౦టిన్ లక్షణమునివరు –గంటిన్ గూరేశ దేశిక స్వామి –‘’మఱిం

గంటి’’ వీరెవ్వరన  ‘’మఱిం –గంటి మహాన్వయము దనరె  గణ్య౦బగుచున్   ‘’అని రాశారు .క్షత్ర బందూపాఖ్యానం లో నరసింహా చార్యులుకూడా –

‘’భాష్య కారుల వెంట బనివిని  శ్రీరంగ –ధాముని సేవించ దలచ దయ దలిర్ప

గంటి కంటి ‘’మఱిం గంటి ‘’ వీరెవ్వరు –ననెడు శ్రీ సూక్తియే నన్వయముగ’’అని రాశారు .రంగనాధుడు తెలుగులో ఈ మాట అన్నాడా ?అనే కుశంక అక్కరలేదు .మనకవులకు దేవుళ్ళు కలలో కనపడి తెలుగులోనే కావ్యాలు రాయమని ఆనతిచ్చిన సంగతి మర్చి పోరాదు .’’యదన్నా వై మానవాః-‘’తదన్నావై దేవతాః ‘’అంటారుకదా అలాగే ‘’ యద్భాషావై మానవాః తద్భాషావై దేవతాః’’అవకూడదా?అని నా చిన్నబుర్రకు తోచింది .

మన కవి కాలం క్రీశ -1710-1770గా సర్వా వారు సర్వే రాయిపాతినట్లు ఖచ్చితంగా తేల్చారు.తెలంగాణలో ‘’కనగల్లు ‘’లో ఉండి,తర్వాత మిర్యాలగూడెం తాలూకా ‘’అనుముల ‘’గ్రామం చేరారు .వీరిది మౌద్గల్యస గోత్రం . ఈ గోత్రజుడు ఆది శేషుని అవతారంగా భావించే మాధవాచార్యులు జన్మించి అరణ్యాలలో ఏనుగులను ,పులులను బాధిస్తున్నబ్రహ్మ రాక్షసుని చేత సపర్యలు చేయి౦చుకొంటూ సూర్యసమాన తేజస్సుతో విరాజిల్లుతూ అనేక దాన ధర్మాలు చేసేవారు అని ఈ ఉపాఖ్యానం లో రాశారు .ఈయన పుత్రులు  తిరుమలాచార్యులు ,భట్టరు ,సింగరాచార్యులు  .భట్టార్ గారికొడుకు తిరువెంగళ ,.ఈయనకు తిరుమల ,భట్టరు కొడుకులు .తిరుమలాచార్యులకు తిరు వెంగళాచార్యులు ,నరసింహా చార్యులు ,అనంతాచార్యులు ,సింగరాచార్యులు అనే నలుగురు కొడుకులు .వీరిలో సంపన్నుడైన వెంగళాచార్యులు’’యాత వాకిళ్ళ ‘’గ్రామంలో వేణుగోపాలస్వామి గుడి మండపం  గోపురం కట్టించాడు .ఇలా వీరి వంశం అభి వృద్ధి చెంది వెంకటార్య ,రంగామాంబ దంపతులకు   మనకవి నరసింహా చార్యులు జన్మించారు .

ఆసూరి మఱిం గంటి నరసింహా చార్యులు కావ్య ,భాణ,నాటకాలు16 రాసినట్లు చెప్పుకొన్నా11మాత్రమె లభ్యం .శ్రీనాధుని ‘’చిన్నారిపొన్నారి చిరుతకూకటినాడు ‘’పద్య౦ లో లాగా ఈకవీ –

‘’పదియేండ్ల  వాడనై,బహు చమత్కృతియైన –‘’శల్వ పింగ ళరాయ చరితమొకటి ‘’

వ్రాసితి పదియొక్క వత్సరంబున నేను –‘’నంద నందన శతానంద ‘’మొకటి

పది రెండు వర్షముల్ పరగ ‘’నలంకార కృష్ణ విలాసమున్ ‘’గృతియు నొకటి

యైదైదు మూడును హాయనంబులలో –‘’జనకరాయని బిడ్డ చరిత మొకటి ‘’అంటూ రాశారు కానీ పద్యం పూర్తిగా దొరకలేదు .పైన చెప్పినవికాక –విష్వక్సేన ప్రభాకరం ,శ్రీ రామానుజాభ్య్దయం , జాంబవతీ కుమారా శృంగార విలాసం ,శ్రీ కృష్ణ తులాభారం ,తారక బ్రహ్మ రాజీయం,పద్మినీ కన్యకాభ్యుదయం మొదలైనవిఉన్నాయి .  తన గ్రంథాలనన్నిటినితమ కులదైవమైన ‘సిరిసెన గండ్ల నరసింహ స్వామి కే అంకితమిచ్చారు .12 చాటువులు చెప్పినట్లున్నా, రెండుమాత్రమే లభ్యం.

‘’ క్షత్ర బందూపాఖ్యానం ‘’కు మాతృక భవిష్యోత్తర పురాణం అని కవి చెప్పుకొన్నా  ,సర్వా వారు ఎంతవెదికినా అది దొరకలేదట .అది అష్టాదశ పురాణాలలోనిదికాదు. 30 ఉపపురాణాలలో కూడా దాని పేరు లేదట . కవిగారికాలం లో ఉండి తర్వాతకాలం లో లుప్తమై ఉండచ్చు అంటారు సర్వాజీ .అయితే విప్రనారాయణాచార్యులు  రాసిన ‘’తిరుమాల ‘’లో ఒక పాశురం లో క్షత్రబందు గూర్చి ఉందని ,అతనికంటే పాపి భూమి మీద లేడని, కానీ గోవింద నామోచ్చరణతో   పరమగతి పొందాడని దాని తాత్పర్యం .బ్రాహ్మణులలో అధముడిని ‘’బ్రహ్మ బంధు ‘’అన్నట్లే క్షత్రియాధముడిని ‘’క్షత్ర బంధు’’అనటం ఉన్నది .ఇలాంటివారి పేరు వినిపిస్తే చెవులు మూసుకోనేవారట .

పద్మ పురాణం 97 అధ్యాయం లో దీని మూల కథ ఉంది .’’సూర్య వంశం లో విశ్వరదుడి కొడుకు క్షత్రబంధువు మహాపాపి .అడవులలో తిరుగుతూ ,జీవహి౦స తో పొట్టపోసుకోనేవాడు .ఒకరోజు బాగా అలసిపోయి, అటు వైపు వస్తూన మహామునికి సపర్యలు చేయాగా , అయన ‘’గోవింద ‘’నామం ఉచ్చరించమన్నాడు  .అలా స్మరించి తర్వాత జన్మలో బ్రాహ్మణుడుగా పుట్టి సంసారం వదిలేసి గోవింద పద ధ్యానం తో ముక్తిపొందాడు అనేది ముఖ్య కథ.

తెలుగుభారత౦  ఆనుశాసనికపర్వం లో 101అధ్యాయం లో 9పద్యాలలో క్షత్రబందుకథకొంచెం మార్పుతో  ఉంది. అతని దర్శనం తో ఒకమాలవాని శాపం పోయి బ్రాహ్మణత్వం పొందినట్లు ఉంది .బ్రాహ్మణుడికోస౦  క్షత్రబందు ప్రాణాలు విడవటం ‘’పూర్వ గాథాలహరి ‘’లో భారత కథగా ఉంది  . కాని పైకథలో ఈ విషయం లేదు .ఏతావాతా  తేలినదేమిటి అంటే యెంత పతితుడైనా సత్సంగత్వం తో ముక్తుడౌతాడు .పుండరీక ముని వలన క్షత్రబందు  భగవద్భక్తుడై ముక్తిపొం దాడని ఈ ఉపాఖ్యానం లో నరసింహా చార్యులవారు చక్కగా వివరించారని సర్వా శాస్త్రిగారు ఉవాచ .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-8-19-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.