నా దారి తీరు -129
శ్రీసువర్చలా౦జనేయ స్వామి దేవాలయ పునరుద్ధరణ
నా జీవితం లో భగవంతుని కరుణా కటాక్షాలతో చేసిన అతి ముఖ్యమైన పని ఉయ్యూరులో శ్రీసువర్చలా౦జనేయ స్వామి దేవాలయ పునరుద్ధరణ .ఇప్పుడైతే రంగరంగ వైభవంగా వర్ధిల్లుతో౦దికాని ,1960-70దశకం నాటికి ఆలయం పూర్తిగా జీర్ణస్థితికి చేరింది .ఈ దేవాలయ చరిత్ర కొంత తెలియ జేస్తాను .ఉయ్యూరు రావిచెట్టుబజారు లో ,పుల్లేరు కాలువకు ఇవతల ఉన్న శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం ‘’గబ్బిట’’వారి దేవాలయంగా ప్రసిద్ధమైంది .సుమారు 300 ఏళ్ళక్రితం మా నాన్నగారు గబ్బిట మృత్యుంజయ శాస్త్రిగారి మాతామహులు అంటే మా నాయనమ్మ నాగమ్మగారి తండ్రిగారు శ్రీ గుండు లక్ష్మీ నరసి౦హావధానులుగారు ఇప్పుడు ఆలయం ఉన్న చోట స్వంత స్థలం లో స్వంత ఖర్చులతో ఆలయాన్ని నిర్మించి ,ఉత్సవ మూర్తులనూ,ధ్వజస్తంభ ప్రతిష్ట చేసి ,ధూప దీప నైవేద్యాలకు కొరత లేకుండా ఏర్పాటు చేశారు .ప్రతి సంవత్సరం వైశాఖ బహుళ దశమి శ్రీ ఆ౦జ నేయస్వామి పుట్టినరోజు ‘’శ్రీ హనుమజ్జయంతి ‘’తో పాటు శ్రీ సువర్చలాన్జనేయస్వాముల శాంతికల్యాణాన్నీ ఘనంగా నిర్వహించేవారు .ఆలయం లోనే ఈశాన్యభాగాన రోడ్డుకు దగ్గరగా కళ్యాణ మంటపం ఉండేది .కోరిన రోరికలు తీర్చే దైవంగా అండా,దండా గా స్వామి సుప్రసిద్దుడయ్యాడు .అర్చకస్వాములు కూడా అత్య౦త భక్తీ శ్రద్ధలతో స్వామి కైంకర్యం చేసి పునీతులయేవారు .నరసి౦హావధానులుగారి మరణానంతరం ,మా తండ్రిగారు ఆలయ ధర్మకర్త గా ఉండి, అన్ని కార్యక్రమాలు యధావిధిగా జరిపించేవారు .ఐతే ఆలయంతూర్పు వైపుకు బాగా ముందుకు ఉండి,వెనుక పడమర వైపు ఎక్కువ ఖాళీ ఉండటం వలన ,ఎక్కువ మందికి దర్శన భాగ్యం కలిగేదికాదు. అయినా కల్యాణం ,హనుమజ్జయంతి ఘనంగానే జరిగేవి .ఈలోగా కాలక్రమంలో ఆలయానికి ముందున్న రోడ్డు ఎత్తు పెరగటం ,ఆలయం లోతుగా ఉండటం తో వర్షాకాలం లో నీరు అంతా ఆలయం లోనే ఉండిపోయి,లోపలి వెళ్లి దర్శనం చేయటం కూడా దుర్లభమైంది .నిజంగా చెప్పాలంటే ఆ బురద వాసన నీటిలో ఈదుతున్నట్లుగా బట్టలు పైకి మడిచి ,వెళ్ళాల్సి వచ్చేది .దక్షిణ ప్రక్కన పందుల పెంపకం వాళ్ళు ఉండేవారు .కనుక ఆ పందులన్నీ ఆలయం లో బురద నీటిలో చేరి పిల్లాపాపలతో జుగుప్స కలిగించేవి .ఇదంతా భరిస్తూనే ఉన్నాం .పూజారులకు, మాకూ , భక్తులకు అందరికి చెప్పలేని అసౌకర్యం కలిగేది .స్వామి ఎలా భరించాడో ఆశ్చర్యమేస్తుంది .అయినా నిత్య ధూప దీప నైవేద్యాలు యధాప్రకారం జరిగేవి .గర్భాలయం ఇటుకలతో సున్నం తో కట్టబడి, శిఖర,విమానాలు ఉన్నాయి .ముందుభాగం చిన్న తారసరాయి డాబా .దానికే ఘంట .కూర్చోటానికి నాపరాళ్ళు .నిర్మించి చాలాకాలం అవటంతో ఆలయగోడల రాళ్ళు ఊడిపోవటం, సున్నం రాలిపోవటం, కళ్యాణమండపం కూడా దెబ్బతినిపోవటం ,తో ఆలయం ఎప్పుడు కూలిపోతుందో అనే భయం ఏర్పడింది .1961లో మా తండ్రిగారి నిర్యాణం తర్వాత నేను వంశపారంపర్య ధర్మకర్తగా బాధ్యతలు చేపట్టాను .జయంతి, కల్యాణం జరుపుతూనే ఉన్నాము .ఆలయం లోకి ప్రవేశించాలంటే భయపడే పరిస్థితి .రోజు రోజుకూ శిధిలమై పోవట౦ ,తాపీ మేస్త్రిని పెట్టి ఏదో బొక్కలు పూడ్పిస్తూ కాలక్షేపం చేశాము .అదొక రకమైన నిస్సహాయ స్థితి .మా కుటుంబం ఒక్కరివల్లా అయ్యేపనికాదని పించింది .ఒకసారి ఉయ్యూరు విష్ణ్వాలయం లో అందరినీ సమావేశ పరచి ఆలయ దుస్థితి వివరించి సహకారం కోసం అర్ధించాము .కాని స్వామి అనుగ్రహం కలగలేదు . ఒకరూపాయి, రెండు రూపాయలు మాత్రమె చందాలు ఇచ్చారు.ఒకరిద్దరు దాతలు వందరూపాయలు ఇచ్చారు .ఇదంతా సుమారు ఏడెనిమిది వందలు అయి ఉంటుంది .నాకు అత్యంత ఆప్తుడు ,ఎల్ ఐసి ,సేవింగ్స్ నిర్వహించే ,నిఖార్సైన ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త ,ధర్మానికి, న్యాయానికి, నిజాయితీకి నిలబడే మా బజారులోనే రాజాగారి కోటదగ్గర స్వంత డాబాలో చిల్లర కొట్టు నడిపే శ్రీ మండా వీరభద్రరావు నాకు పూర్తి సహాయకారి .మా ఇద్దరి జాయంట్ అకౌంట్ లో ఆ డబ్బును స్టేట్ బాంక్ లో జమ చేశాము .నిత్య ధూప దీప నైవేద్యాలు కొనసాగుతూనే ఉన్నాయి .అర్చకస్వాములు ఎప్పటికప్పుడు నన్ను కలిసి హెచ్చరిస్తూనే ఉన్నారు .స్వామిపై అచంచల విశ్వాసం భక్తులకు ఉండేది .తమ అనుభవాలను చెప్పుకొనేవారు కూడా .
నూతన ఆలయ నిర్మాణం
భక్తరామ దాసు సినిమాలో మహా భక్తురాలు పోకల దమ్మక్క ‘’మన సీతారామ స్వామికి మంచి గడియలు వచ్చేశాయి . ‘’అని పాడినట్లు ,మా ఆలయానికీ మంచి రోజులకోసం ఎదురు చూస్తున్నాం .పదేళ్ళ తర్వాత ఆలయానికి ముందున్న రోడ్డుకు దక్షిణాన పుల్లేరుకాలువ పై వంతెన నిర్మించారు .అప్పుడు నాకూ మా కుటుంబ సభ్యులకు ,శ్రేయోభిలాషులకు ,గ్రామస్తులకు బలీయమైన ఆలోచనకలిగి ,స్వామి అనుగ్రహం తోడై ,ఒక కమిటీ ఏర్పడి నూతన ఆలయం నిర్మించాలన్న దృఢ మైన సంకల్పం కలిగింది .ఈ సారి స్వామి అందరి మనసులలో స్థిరంగా కూర్చున్నాడేమో ఇప్పుడు ఎవరిని అడిగినా 1,116రూపాయలు కు తక్కువ చందా ఇవ్వలేదు. అప్పుడు మా మనసు కుదుట బడింది .నాకూ వీరభద్రరావు కు ఉయ్యూరు ఎలేక్త్రిసిటి డిపార్ట్మెంట్ లో లైన్ మాన్ చేసిన మహా హనుమ భక్తుడు శ్రీలంకా సంజీవరావుగారి సహకారం లభించింది ..
మహా భారతం లో అర్జునుని ధర్మ సంకటం లో నేను
రసీదు పుస్తకాలు అచ్చు వేయించాము .డబ్బు ఇచ్చినవారికి రసీదులిస్తున్నాము .మేముముగ్గురం కాలికి బలపం కట్టుకొని నేను లూనామీద ,వాళ్ళిద్దరూ వీరభద్రరావు టివిఎస్ మీద ఉయ్యూరులో చుట్టుప్రక్కల గ్రామాలలో కరపత్రాలు పంచుతూ ,ఇచ్చినడబ్బుకు రసీదులిస్తూ సమకూరిన ధనాన్ని స్టేట్ బాంక్ లో మళ్ళీ నాపేర వీరభద్రరావు పేరా ఇద్దరి జాయింట్ అకౌంట్ లో జమ చేస్తున్నాము .కొంతవరకు ఆశా జనకంగా పనులు మొదలు పెట్టటానికి తగిన ధనం చేకూరింది .మా కుటుంబం తరఫున 10 వేల రూపాయలు అందజేశాను .
నూతన ఆలయం నిర్మించాలి అంటే పాతఆలయాన్ని కూల్చాలి .ఆస్వామిని వేరొక చోట తాత్కాలికంగా పెట్టి నిత్యదూప దీప నైవేద్యాలు కలిగించాలి అని పూజారులు చెప్పారు .సరే అని పూజారి శ్రీ వేదాంతం వాసుదేవాచార్యులు గారి సలహాతో మేము నలుగురం బందరు వెళ్లి ఆలయ శాస్త్రంలో ఘనాపాటి ,ఆయుర్వేద వైద్యం లో మేటి ,ఇంట్లో శ్రీ హయగ్రీవ ఉపాసనతో ఎందరెందరికో జబ్బులు నయం చేసిన జ్యోతిష్ శాస్త్రవేత్త ,పంచాంగ కర్త శ్రీమాన్ వేదాంతం అనంత పద్మనాభాచార్యులవారిని దర్శించి మంచి ముహూర్తం పెట్టమని కోరాం.వారు మేము చెప్పినదంతా ఆలకించి ,తాము ఒకసారి ఆలయం సందర్శించి వచ్చి ముహూర్తం పెడతానన్నారు .సరే అని వారికి కారు ఏర్పాటు చేసి రప్పించి ఆలయం అంతా చూపించాం .వారు కొలతలుకొలుచుకొని వెళ్లి ,పాత ఆలయం తీసేయటానికి ,నైరుతిపెరగకుండా నూతన ఆలయ నిర్మాణానికి సుమూహుర్తం పెట్టారు వారిని యధాశక్తి సత్కరించి ముహూర్త పత్రాలు తెచ్చుకోన్నాము .
ఇంతవరకు బాగానే ఉంది .పనులలో నేను పాల్గొంటున్నాకాని ,మనసులో ఏదో బాధగా ఉంది .పాత ఆలయం కూల్చే ముహూర్తానికి సుమారు రెండు నెలలక్రితమే మా అన్నయ్యగారి అబ్బాయి చి.రామనాధ బాబు కు మద్రాస్ లో ఉండేమా పెద్దక్కయ్య బావలు శ్రీమతి గాడేపల్లి లోపాముద్ర శ్రీ కృపానిధి దంపతుల రెండవకుమార్తె చి.ల.సౌ .జయలక్ష్మి నిచ్చి ఉయ్యూరులోనే వివాహం జరిపించాం.మా అన్నగారు రామనాథ్ నెలపిల్లాడప్పుడే నేచనిపోవటం చేత ,మా అమ్మానాన్న ఆకుటుంబాన్ని వాడినీ వాడి అక్క శ్రీమతి వేదవల్లిని పెంచి పెద్ద చేశారు .అంతా ఉమ్మడి కుటుంబమే.కనుక మానాన్నగారు మరణించారుకనుక వేదవల్లి పెళ్లి ,వీడి పెళ్లి మా దంపతులు పీటలమీద కూర్చుని వివాహం చేశాం .కనుక నాకు ఒక ధర్మ సందేహం పీడిస్తోంది .పెళ్లి జరిగి కనీసం ఆరునెలలు కాలేదు ఇప్పుడు ఆలయం కూల్చటం బాగుంటుందా ?మనసుకు సమాధానం చెప్పుకోలేక పోతున్నాను .గుంజాటన పడ్డాను .ముహూర్తం పెట్టించుకొచ్చిన మర్నాడు ఉదయమే వీరభద్రరావు దగ్గరకు వెళ్లి పాత ఆలయం కూల్చటానికి మనసు ఒప్పటంలేదని ,కొత్త ఆలయం నిర్మాణం మనవల్లకాదని కనుక ఇంతటితో పనులు ఆపేద్దాం అని అర్జున విషాద యోగం చూపించాను .అతడు చాలా తాపీగా నాకు అన్ని విధాలా నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు .అయినా నా మొండి పట్టు వదలలేదు .చివరికి ‘’మాస్టారూ !మీ కుటుంబం లో మీరు తప్ప ఇంకెవరూ ఈ పనికి పూనుకోరు .పూనుకోలేరు .మీ వల్లనే కొత్తాలయ నిర్మాణం సాధ్యం .స్వామి మనకు మంచి దారి చూపించాడు .ముహూర్తం కూడా పెట్టించుకొని వచ్చి ఇప్పుడు ఇలా కాడి పారెయ్యకండి .మేమంతా మీ వెనుక ఉంటాం .కష్ట నష్టాలు భరిద్దాం .మంచి అవకాశం ,ఇక వెంక అడుగు వేయకండి .’’అని చెప్పాక మనసుకుదుటబడి పొంగినహనుమ లాగా సంతోషంతో ఆలయ నిర్మాణ పూనిక నిశ్చయంతో ఇంటికి తిరిగి వచ్చాను . అంతే మళ్ళీ వెనకడుగు వేయనే లేదు అన్నీ యధాప్రకారం స్వామి అనుగ్రహంతో చకచకా పనులు జరిగిపోయాయి .
ఆలయ నిర్మాణ పర్యవేక్షణ భావన నిర్మాణం లో అనుభవమున్న ,భక్తులు శ్రీ కొల్లి సుబ్బారావు గారికి అప్పగించాం .తమాషా ఏమిటి అంటే తాపీ మేస్త్రి ముస్లిం .అతడే మిగిలినవారి తోడ్పాటుతో కూలీలతో పాత ఆలయాన్ని తీసేశాడు .కొత్తదికట్టాడు . స్వామిని విష్ణ్వాలయం లో పంచపట్టాభి రామస్వామి సన్నిధిలో ఉంచి ,అర్చకస్వామి వేదాంతం రామా చార్యులవారికి ధూప దీప నైవేద్యాల బాధ్యత అప్పగించాం .ఆయన అంతేశ్రద్ధగా నిర్వహించారు .ఆలయ ప్లాన్ కూడా సుబ్బారావు గారిదే .కొందరు జియ్యర్ స్వామిని ,మరికొందరు వేరొక స్వామీజీ ని తీసుకొచ్చి చూపిస్తే మంచిది అని సలహా ఇచ్చారు .మేము వాటిని పెడ చేవినపెట్టి సుబ్బారావుగారికే పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఆలయ నిర్మాణం చేయించాం . మరికొంతమంది కొత్తగుడి కడుతున్నారుకదా స్వామి విగ్రహం కూడా కొత్తది చేయించి పెడితే బాగుంటుంది అన్నారు .నేను ససేమిరా అని ‘’ఈ స్వామి పై మనకు అపారమైన విశ్వాసం ఉంది .ఆయన మనలో ప్రవేశించకపోతే ఇంతటి పని మనవల్ల అయ్యేదికాదు .కనుక ఆస్వామినే పునః ప్రతిస్టిద్దాం.రెండోమాటలేదు ‘’అని తెగేసి చెప్పిఅలానే పూర్వపు అడుగున్నర నల్లరాతి ఆంజనేయ స్వామి విగ్రహాన్నే పునః ప్రతిష్టించే ఏర్పాటు చేశాము .తెనాలి వెళ్లి విగ్రహ నిర్మాణ నిపుణులైన శ్రీ అక్కల కోటయ్య గారిని కలిసి ఉత్సవ విగ్రహాలకు కిరీటాలకు ఆర్డర్ ఇచ్చి తయారు చేయించాం .కనుక కల్యాణానికీ ఇబ్బంది లేదు .ముందుజాగ్రత్తగా ఆలయాన్ని రోడ్డులెవెల్ కన్నా దాదాపు మూడు గజాల ఎత్తున నిర్మించాం .గర్భాలయం తో పాటు అంతరాలయమూ ఏర్పాటు చేసి ,దానితర్వాత కూర్చోవటానికి హాలు నిర్మించాము. దీనికి గ్రిల్ ను మా అమ్మగారి బాల్య స్నేహితురాలు శ్రీమతి చోడవరపు అమ్మన్నగారిపేరిట కుమారులు ఏర్పాటు చేయించారు .
స్వస్తిశ్రీ చాంద్రమాన సంవత్సర నిజ జ్యేష్ట నవమి గురువారం హస్తా నక్షత్ర యుక్త కర్కాటక లగ్న పుష్కరా౦శ యందు 23-6-1988 న శ్రీ సువర్చలాన్జనేయస్వామి వారల పునః ప్రతిష్ట కార్యక్రమం వైఖానస ఆగమ విధానం లో ఆలయ నిర్మాణ ప్రతిస్టాదికాలలో నిష్ణాతులు శ్రీమాన్ వేదాంతం శ్రీ రామాచార్యుల వారి ఆధ్వర్యం లో నేనూ ,నా ధర్మపత్ని శ్రీమతి ప్రభావతి శ్రీ స్వామివారి విగ్రహ ప్రతిష్ట చేశాము .ఆ నాటి కెసీపి ప్లాంట్ మేనేజర్ ,మహా భక్తులు సౌజన్య శీలి శ్రీ ఇంజేటి జగన్నాధరావు గారు ,శాసన సభ్యులు శ్రీ అన్నే బాబూ రాగారు ముఖ్యులుగా విచ్చేసి కార్యక్రమానికి ఘనత చేకూర్చారు .ఆలయ నిర్మాణం లో అన్ని రకాల సహకారాలు అందించిన కెసీపి వారి వదాన్యత ,ఉయ్యూరు ,పరిసర గ్రామస్తుల దాతృత్వం ,సహాయ సహకారాలు మర్చిపోలేనివి . ఉయ్యూరులోని ఊర ,పువ్వాడ ,వెంట్రప్రగడ ,మండా ,వాగిచర్ల ,చోడవరపు మొదలైన కుటుంబాలవారు ,వారూ వీరూ అని ఏమిటి సమస్తజనం ఇది తమ ఇంటి శుభాకార్యంగా భావించి,పెద్దమనసుతో ఈ పవిత్ర భగవత్ కార్యానికి అండగా నిలిచి చేయూత నిచ్చారు .ఉత్స విగ్రహాలతో ఆలయం శోభాయమానం అయింది . లారీతో ఇసుక ఉచితంగా కొందరుభక్తులు తోలిస్తే ,కొందరు సిమెంట్ బస్తాలు అందజేశారు .స్వామిపై ఉన్న అచంచల విశ్వాసమే భక్తీ తాత్పర్యాలే మా అందరి చేత ఇంతటి బృహత్కార్యక్రమాన్ని చేయించింది .మా కుటుంబ సభ్యులు ధనంతో ,సేవలతో సహకరించారు .
ఆలయ నిర్మాణ సమయం లో నేను జగ్గయ్యపేట దగ్గర వత్సవాయి హైస్కూల్ హెడ్ మాస్టర్ గా ప్రమోషన్ పొంది పని చేస్తున్నాను .ప్రతివారం ఉయ్యూరు రావటం నిర్మాణ వ్యవహారాలను చూడటం ,అవసరమైన డబ్బు బాంక్ నుంచి తీసి ఇవ్వటం బండీలమీద మేముముగ్గురం చందాలకు తిరిగి పోగు చేయటం మళ్ళీ సోమవారం ఉదయం డ్యూటీకి వత్సవాయి వెళ్ళటం జరిగేది .నేను ఇక్కడ లేకపోయినాపూర్తిబాధ్యత తీసుకొని స్వర్గీయమండా వీరభద్రరావు స్వర్గీయ లంకా సంజీవరావు గారు పనులన్నీ సక్రమంగా జరిగేట్లు చేశారు .ఆలయ నిర్మాణానికి సుమారు సంవత్సర కాలం పట్టింది . భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది .స్వామిపై విశ్వాసం పది రెట్లు పెరిగింది .శ్రీ వాగి చర్ల నాగేశ్వరరావు గారు గర్భాలయం లో ఖరీదైన మంచి టైల్స్ వేయించారు .బయట హాలులో మార్బుల్స్ పరిపించారుశ్రీ బూరగడ్డ కృష్ణమోహన్ .శ్రీ ఊర మోహనరావు స్వామికి వెండి తొడుగు చేయించారు .తర్వాత అర్చకులు శ్రీ వేదాంతం లక్ష్మణ దీక్షితుల సహాయం తో ఉస్ట్ర వాహనాన్ని తెనాలి అక్కలవారితో చేయించి తెచ్చాం .తమకోరికలు నేరవేరుస్తున్నందుకు స్వామివార్లకు ఏదో ఓకే రకమైన ఆభారణమో,అవసరమైన స్టీలు ,వెండి సామగ్రియో సమకూరుస్తున్నారు .ఎస్ టి వో ఆఫీస్ లో పని చేసే ఒక అటెండర్ పంచ పట్టాభి రామ స్వాముల సిమెంట్ విగ్రహాలు కొని తెచ్చి సమర్పించాడు .దీనితో శ్రీరామనవమినాడు సీతారామ కల్యాణం కూడా చేసే వీలుకలిగింది .ఇవి కొంత దెబ్బతింటే బిటెక్ చదివి ,ఉద్యోగిస్తున్న అప్పటికుమారి ఇప్పటి శ్రీమతి గుర్రాల శ్రీదేవి నాలు గేళ్ళక్రితం కొత్త విగ్రహాలు కొని అందించింది .శ్రీ కోనేరు చంద్ర శేఖరరావు గారు ,ఆయన కుమారుడు కళ్యాణ్ కుటుంబం చిన్న వెండి ఆంజనేయస్వామిని తయారు చేయించి సమర్పించారు .కుమారి బిందు దత్తశ్రీ ప్రయాగలో భగవద్గీతా పఠనం లో పాల్గొని సేవ చేసినందుకుశ్రీ గణపతి సచ్చిదాన౦ద స్వామి అనుగ్రహం తో బహూకరించిన వెండి శ్రీ కృష్ణ విగ్రహాన్ని తలిదండ్రులు శ్రీమాదిరాజు శ్రీనివాస శర్మ, శ్రీమతి శివ లక్ష్మి దంపతులు మన ఆలయానికి భక్తితో సమర్పించారు .ఇలా ఎందరో భక్తులు తమకానుకలతోస్వామి అనుగ్రహం పొందుతున్నారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-8-19-ఉయ్యూరు