నా దారి తీరు -130 ఎయిత్ వండర్

నా దారి తీరు -130

ఎయిత్ వండర్

  • ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి అన్ని కలిపి సుమారు రెండు లక్షల రూపాయలు ఖర్చయి౦ది .పుస్తకం లో చందాలు వేసి౦ది కాని, వసూలైనదికాని 30 వేల రూపాయలతో పనులు ప్రారంభించాం .తర్వాత వచ్చిన దబ్బు ఎప్పటికప్పుడు జమాఖర్చులు రాస్తూ ఖర్చు చేశాం .మిగిలితే బాంకులో వేశాం.వాగ్దానాలు చేసినవారు వార౦తకు వారే వచ్చి డబ్బులు ఇచ్చి వెడుతున్నారు .ఎవర్నీ పెద్దగా రెండు మూడు సార్లు అడగాల్సిన అవసరం రాలేదు .కనుకనే ముందుకు సాగగలిగాం .అయితే ఒక్కరు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నారు .ఆయన వందల ఎకరాల ఆసామీ.బ్యా౦కులనిండా డబ్బు మూలుగుతున్న ధనవంతుడు .ఎన్నెన్నో  ఫాక్టరీలలో  వేలాది షేర్లు ,మాఉయ్యూరు కేసిపిలో నూ వేలాది షేర్లు ఉన్న శ్రీ వల్లభనేని వీరభద్రరావు గారు .’’కాలువ అవతల వీరభద్రరావు గారు ‘’గా అందరికి పరిచయం .పుల్లేరుకాలువ అవతలి ఒడ్డున  మా బజారు కు సరిగ్గా ఎదురుగా ఆయనకు పెద్ద డాబా ,దాని చుట్టూ ఎన్నో ఎకరాల సుక్షేత్ర మాగాణి భూమి, నౌకర్లు పాలేళ్ళు బండీ ,ఎడ్లు గొడ్లు, పాలు  బాగా ఉన్నవారు .మా రేవు దగ్గర నుంచుంటే వారి వైభోగం అంతా కనిపించేది . మా చిన్నప్పుడు వారి నాన్నగారు గోపాలరావు గారు వాకిట్లో కుర్చీలో కూచుండగా చాలా సార్లు చూశాం .ఇంతటి సంపన్నుడు వీరభద్రరావు గారికి మా నాన్నగారు బాగా పరిచయమేకాక ఆయనంటే విపరీతమైన భక్తి భావం తో కనిపించేవారు .తెల్లమల్లు పంచె తెల్ల చొక్కా ,పైన తెల్ల ఉత్తరీయం తో పనసపండు రంగు భారీ శరీరం తో ఉండేవారు .చేతిలో ఇండియన్ ఎక్స్ప్రెస్ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ తప్పక ఉండేవి .ఇంట్లో కారు ఉన్నా సాధారణంగా కాలువ అవతలనుంచి పాత కర్రలవంతెన మీదనుంచి నడిచికాని ,లేక పాత సైకిల్ మీద కాని ఉయ్యూరు వచ్చి పనులు చూసుకొని వెళ్ళేవారు .ఎప్పుడన్నా బజారులో కనిపిస్తే నమస్కారం తో పలకరించుకొనే వారం .కాసేపు ఆగిమాట్లాడాల్సివస్తే మా నాన్నగారి విద్వత్ గురింఛీ తమ స్నేహం గురించి చెప్పేవారు .నాతొ పాటు ఊళ్ళో అందరు ‘’ఉయ్యూరును ఉన్నపళంగా అమ్మితే కొనగల సామర్ధ్యం వీరభద్రరావు గారికే ఉంది ‘’అనేఅభిప్రాయం .అంటే అంతటి సంపన్న గృహస్తు .కానీ పిల్లికి బిచ్చం పెట్టాడని అందరిమాట .భార్య ఉత్తమా ఇల్లాలు .ఇంటికి వెడితే ఆదరించి పంపేదని అనుకొనేవారు .

ఇలాంటి వీరభద్రరావు గారిని మా గుడి నిర్మాణం కోసం చందా అడుగుదామని అనుకొన్నాం .’’ఆయనేమీ చేపడు,వృధా ప్రయాస .కాళ్లతీత చెప్పులు అరగటం తప్ప ఏమీ ఉండదు ‘’అని మమ్మల్ని తెలిసినవాళ్ళు చాలామంది నిరుత్సాహ పరచారు . ఆయన దగ్గరకు ఇంతవరకు ఎప్పుడూ  నేను కాని  వాళ్లిద్దరూకాని ఏనాడూ వెళ్ళలేదు .అ అవసరమూ రాలేదు .ఇది స్వామికార్యం కదా అయినా ప్రయత్నం చేద్దామని మేము ముగ్గురం వెళ్లాం .ఆయన భార్యగారు ,ఆయనా ,మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు .ఆమె కాఫీ ఇచ్చారు .తాగాం .కాసేపు కబుర్లు అయ్యాక వచ్చిన సంగతి చెప్పాం ‘’మంచి పని చేస్తున్నారు .నేను అటు వెడుతూ చూస్తున్నాను .గుడికి వైభవం వస్తుంది .నావంతు 2 వేల రూపాయలు చందా వేస్తున్నాను .ఇప్పుడు రెడీ కాష్ లేదు మళ్ళీ కనపడండి .ఇస్తాను ‘’అనగానే ‘’బూరాలు ఉబ్బినట్లు’’ ఉబ్బిపోయాం .ధన్యవాదాలు తెలియజేసి వచ్చేశాము .ఆ ఆతర్వాత కనీసం అరడజను సార్లు ఇంటికి వెళ్లి అడగటం ,ఆయన యధాప్రకారం వాయిదా వేయటం జరిగింది .రెండు వేలు ఆయన దగ్గర లేకపోవటం ఏమిటి ?ఆయనకుక్కను కొడితే రాలుస్తుంది అనుకొనే వాళ్ళం .ఈ విషయం ఊళ్ళో తెలిసి ‘’మేం ము౦దే చెప్పాం ‘’అని మమ్మల్ని తప్పుపట్టారు .ప్రతిష్ట ముహూర్తం పెట్టించి ,ఆహ్వానాలు  ముద్రించి  చివరిసారిగా మళ్ళీ ఆయన ఇంటికి వెళ్లాం .నేనే ఆయనతో ‘’వీరభద్రరావు గారూ !ప్రతిష్ట ఖర్చులన్నీ భారీగాఉంటాయి .మీరు వాగ్దానం చేసిన డబ్బు ఇస్తే సమయానికి ఉపయోగపడుతుంది .’’అన్నాను .ఆయన ‘’సారీ ప్రసాద్ గారూ !నేనూ మీకు సమయానికి డబ్బు అందజేద్దామనే ప్రయత్నం లోనే ఉన్నాను .మీరు ఎప్పుడువచ్చినా నా చేతిలో డబ్బు ఉండటం లేదు .నాకూ బాధగానే ఉంది ‘’అని పాతపాటే పాడారు .గుడ్ల నీరు కమ్ముకుంటున్న ఆయన భార్య గారు నిస్సహాయంగా ఉండిపోయారు  .ఆయన చేతిలో ఆహ్వాన పత్రం పెట్టి నేను ‘’అయ్యా!మా దేవుడు మీ మనసు లో ప్రవేశించలేదని అనుకొంటున్నాం .డబ్బు ఇవ్వలేదని ప్రతిస్టా మహోత్సవానికి రాకుండా ఉండకండి .ప్లాంట్ మేనేజర్ గారు, ఎంఎల్యే గారు వస్తున్నారు .మీరూ వచ్చి స్వామి కృపకు పాత్రులు కండి.రాకుండా మాత్రం ఉండవద్దు .మళ్ళీ ఎప్పుడూ వచ్చి ఈ డబ్బు విషయం లో ఇబ్బంది పెట్టం .మీ కోసం ఎదురు చూస్తాం .ఇదిగో మీ రెండు వేలరూపాయలు  అందినట్లు మా రసీదు .మాస్వామి ఎలాగో అలా మీ బాకీ వసూలు చేసుకొంటాడనే నమ్మకం మాకుంది ‘’అని చెప్పి అడ్వాన్స్ రసీదు చేతిలో పెట్టి ,వచ్చేశాం .అనుకొన్న ముహూర్తానికి వేలాది భక్తజన సందోహం మధ్యన అయిదు రోజుల  ప్రతిష్టా కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది .స్వామి వారి శాంతికల్యాణమహోత్సవం ,ఋత్విక్కులకు దక్షిణతాంబూలాలు అన్నీ యధా  విదిగా జరిపించారు శ్రీరామాచార్యులవారు .అందరూ ఎంతో ఆనందించారు .అభినందించారు .ఇదంతా స్వామి కృప అనుగ్రహం .మేము నిమిత్తమాత్రులం .మా చిరకాల సహాధ్యాయి శ్రీ పెద్దిభొట్ల ఆదినారాయణ ఆ అయిదురోజులు గుడిలోనే రాత్రి పూట ఉండిఅగ్నిహొత్రాన్ని జాగ్రత్తగా కాపాడాడు .కార్యక్రమం దిగ్విజయంగా జరిగిందుకు మా ఇంట్లో బంధువులూ అందరూ సంతోషించారు .ఐదు రోజులు ఏకభుక్తం కనుక కొంచెం నీరసం తప్ప ఏమీ లేదు . పాతగుడి కూల్చేముందు స్వామివారి కళలను ఒక ఇత్తడి బిందె పవిత్ర జలం లో ఆవాహనం చేయటం ,నూతన ఆలయ నిర్మాణమై ప్రతిష్టరోజున మళ్ళీ ఆకళలను స్వామిలో ఆవాహన చేయటం జరిగింది .మోలవిరాత్తూత్సవ విగ్రహాలకు జలాధివాసం దాన్యాధివాసం మొదలైనవి జరిపాం .

ప్రతిష్ట కు ఇల్లంతా సున్నాలు ,రంగులు ర౦గవల్లులు , మామిడి తోరణాలు ,వాకిట్లో తాటాకు పందిళ్ళు బంధుగణం తో  పెళ్లి ఇల్లుగా ఉంది .ప్రతిష్ట అయిన మర్నాడు ఉదయం యధాప్రకారం లేచి స్నాన సంధ్యా పూజాదికాలు నిర్వర్తిస్తుండగా ‘’ఎవరో మీకోసం వచ్చారు ‘’అని చెప్పగా కుర్చీవేసి కూర్చోపెట్టి కాఫీ టిఫిన్లు ఇవ్వమని చెప్పాను .మా వాళ్ళు అలాగే చేశారు .పట్టుబట్ట తోనే నేను వాకిలి వసారాలోకి వెళ్లాను .నా కోసం వచ్చింది వల్లభనేని వీరభద్రరావు గారు అని చూడగానే ఆశ్చర్యపోయాను .నమస్కరించి కుశలప్రశ్నలు వేసి పలకరించాను .ఆయన ముఖం చాలా చిన్నబుచ్చుకొన్నట్లు కనిపించింది ;ఆయనే ‘’దుర్గా ప్రసాద్ గారూ !నిన్నటి ప్రతిస్టా కార్యక్రమం కన్నుల పండుగగా జరిగినట్లు అటు వైపు వెడుతూ చూశాను .అతిపెద్దపనిని బాగా చేశారు .నేను ఇవ్వాల్సిన డబ్బు ఒక వారం లో మీకు అందిస్తాను .నేనే కబురు చేస్తాను వచ్చి తీసుకు వెళ్ళండి .’’అన్నారు ‘’సార్! ఈ చిన్న విషయం చెప్పటానికి మీరు మాఇంటికి పనిగట్టుకొని వచ్చి చెప్పాలా ?మీకు వీలున్నప్పుడు ఇవ్వండి .అయినా మాస్వామి మహిమగలాడు .ఆయనే చూసుకొంటాడు ‘’అని చెప్పా .ఆయనా ఇక మాట్లాడకుండా వెళ్ళిపోయారు . తర్వాత ఎప్పుడో మూడు నెలలకు ఆయన మాకు కబురు చేయటం ,మేము వెళ్ళటం ,ఆ రెండువేలరూపాయలు ఇవ్వటం జరిగింది .ఆయనకు ఈ డబ్బు యెంత ?ఎందుకు చేశారో ఈ తాత్సారం అర్ధంకాలేదు .ఏమైనా మొండి బాకీ వచ్చింది అని, డబ్బును శ్రీ హనుమజ్జయంతికి సున్నాలు రంగులు వేయటానికి ఖర్చు చేశాం .

వీర భద్ర రావు గారు చందా డబ్బు ఇచ్చారాని అందరికీ చెప్పాం .అందరూ నోళ్ళు వెళ్ళబెట్టి ‘’ఎనిమిదో వింత ఇది మను ఉయ్యూరుకు ‘’అని బోల్డు ఆశర్యపోయారు .ఒకసారి మాటల సందర్భం లో  ఉయ్యూరు  సర్పంచ్  శ్రీ గెల్లి నాగమల్లికార్జునరావు కుమేము  చెబితే .’’నాకూ ఆశ్చర్యంగానే ఉంది .బహుశా వంతెన నిర్మాణం  కాంట్రాక్ట్ లో మిగిలిన డబ్బు ఇచ్చి ఉంటాడు’’ అని రహస్యం బయట పెట్టాడు  .మా గుడిబజారులో పుల్లెరుపై కెసీపి ,ఆయనా కలిసి కట్టిన వంతెన కాంట్రాక్ట్ ఆయనకే ఇచ్చి కట్టమని చెప్పారని ,అందులో మిగిలిన డబ్బే మా దేవాలయానికి చ౦దా గా ఇచ్చారని తెలిసింది .ఏ డబ్బైతేనేమి చేరింది స్వామి సన్నిధి కేగా అని సంతృప్తి చెందాం ..ఇంతవరకు ఆయన చేసిన డబ్బు వాగ్దానం ఎప్పుడూ  తీర్చలేదు కనుక  ఇది ‘’ఎయిత్ వండర్ ‘’అని మేము నవ్వుకొంటూ చాలాకాలం జ్ఞాపకం చేసుకొనేవాళ్ళం .            నిర్మాణ సమయం లో పదనిసలు

,ఊళ్ళో ఇంతమంది షావుకార్లను కాదని ‘’ ఒక బేపనోడు  ఒక ఠికాణా లేని కోమటి’’తో కలిసి ఆలయ నిర్మాణ కమిటీ వేసి ఇంత పెద్దకార్యక్రమం చేయటమా ? అని మా ఊళ్ళో కొందరికి మా మీద గుర్రుగా ఉండేది .చందాలకు వెడితే ముఖం చాటేసేవారు .ఇందులో నా బాల్యస్నేహితులు ఇద్దరు బడా వ్యాపారస్తులు కూడా ఉన్నారు .’’మొత్తలావు అని చూసి వాళ్ళ చేతుల్లో ఇరుక్కొంటే అంతే పని ‘’అని నేను మొదట్నించీ ఆలోచించి మండా వీరభద్రరావు మీదనే ఎక్కువ ఆధార పడ్డాను .డబ్బు ఉంటె చాలదు .త్యాగగుణ౦  నిజాయితీ ధర్మగుణం  అంకితభావం ఉండాలి  అవి వీరభద్రరావు లో పుష్కలం .అందుకే నేను ఎవరికీ భయపడలేదు .మా పద్ధతిలో మేము సాగిపోయాం .ప్రజలలో వచ్చిన అనూహ్య  స్పందన కు వాళ్ళకే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయి దారిలోకి వచ్చి  వాళ్ళంతట వాళ్ళే డబ్బు ఇచ్చారు .అందులో ఒకడైన నా స్నేహితుడు ఇనుపకొట్టు వాడు వాళ్ళనాన్న మా నాన్నగారి శిష్యుడు .ఇంటికి ఏ సామానుకావాలన్నా నాన్నగారు ఆకోట్లోనే తెచ్చేవారు .ఆయన తర్వాత నేనూ కొనసాగించా .అతడే ఒకసారి ప్రతిస్ట అయిన కొంతకాలానికి నా దగ్గరకువచ్చి ‘’ప్రసాద్ గారూ !మా వాళ్ళు చాలా మూర్ఖంగా ప్రవర్తించారు .నేనూ తప్పని సరి అయి వాళ్ళతో కలిసి చిన్ననాటి స్నేహితులైన మీకు దూరమయ్యాను .మన దేవుడు మహా మహిమాన్వితుడు .’’ఆ పవర్ ‘’ముందు మా ‘’ఉడత ఊపులు ‘’పని చెయ్యలేదని గ్రహించాం .మా నిమిత్తం లేకున్నా పనులన్నీ దిగ్విజయంగా జరుగుతాయని మాకు అర్ధమైంది . మేము సహకరించినా సహకరించాకపోయినా కార్యక్రమమం యదా ప్రకారం సాగిపోతుంది  త్వరలోనే వాళ్ళూ లైన్ లోకి వస్తారు ‘చాలాబాగా చేశారు ప్రతిష్టా మహోత్సవం ‘’అని అభినందించి, అసలు విషయం చెప్పాడు  .

నేనుము౦దునుంచి చాలా జాగ్రత్తగా ఉంటూ ,మా వార్డ్ మెంబర్ ,నోరుకలవాడు పలుకుబడిఉన్నవాడు, మాకు బంధువు  నేనంటే వాత్సల్యమున్నవాడు  డేరింగ్ అండ్ డాషింగ్ అయిన చలపతి అనే శ్రీ కొలచల వెంకటాచలపతికి ఎప్పటికప్పుడు వాళ్ళ గూడు పుఠాణీ తెలియ జేశాను ‘’నువ్వేమీ కంగారు పడకు నేను అన్నీ గమనిస్తున్నా .ఎవడిని ఎక్కడ నోక్కలోఅక్కడ నొక్కి కిక్కురు మన కుండా, పనికి అడ్డం రాకుండా చూసే బాధ్యత నాది ‘’అని కొండంత ధైర్యమిచ్చి మాట నిలబెట్టుకొన్నాడు  .అతని నోటికీ ఆలోచనలకు ఝడిసి పైకి మాత్రం ‘’వాహినీ వారి పెద్దమనుషులు’’ లాగా ఉన్నారుకానీ లోపల బాధగానే ఉన్నారు .ప్రతిష్ట విజయానికి అందరికీ మనసులు మారి విశాల హృదయులై పాతవన్నీ మర్చిపోయి మళ్ళీ  జీవన స్రవంతిలో కలసిపోయారు .అందరం ఒక్కటే అన్న సమైక్యత  మాలో వెల్లివిరిసింది .ఇదంతా ‘’టీ కప్పులో తుఫాన్ ‘’అయి రిలీఫ్ ఇచ్చింది .

పెత్తనం కోసం ఒత్తిడి

నూతన  ఆలయనిర్మాణం జరిగి యధాప్రకారం పూజాదికాలు జరుగుతూ ఉండటం ,విశేషంగా భక్తులు ఆలయానికి రావటం జరుగుతోంది .ఇది కొందరికి కన్ను కుట్టింది .ఆలయ నిర్వహణ పగ్గాలు మన చేతికొస్తే ,టికేట్లుపెట్టి ,డబ్బు బాగా వసూలు చేసి లాభాలు పొందుదాం అని ఒకరిద్దరికి భావన కలిగింది .అందులో  లక్ష్మీ టాకీస్ ఎదురుగా రోడ్డుమీద ఉన్న కాఫీ హోటల్ ఆయన ఒకరు .వాళ్ళ అబ్బాయి హైస్కూల్ లో నాకుక్లాస్ మేట్.ఈ హోటల్ రుచికి శుచికి పేరు .ఇక్కడికాఫీ మహత్తరం .ఆయన ఒకసారి నాదగ్గరకొచ్చి ‘’పంతులుగారూ !ఆంజనేయ దేవాలయ నిర్వహణ మీకు తెలియదు .వ్యాపారస్తులమైన మాకు అది కొట్టినపిండి .మీకు ఏంతో కొంత ముట్ట చెబుతాం .మీరు తప్పుకొని మాకు అప్పగించండి ‘’అని డైరెక్ట్ గానే అడిగాడు .’’ఎక్కడో మండిన’’ నేను ‘’ఇదుగో షావుకారూ !మళ్ళీ ఈ ప్రస్తావన తేవద్దు .మా గుడి అది. మా ఇష్టం వచ్చినట్లు నడుపుకొంటాం .గుడిని వ్యాపార కేంద్రంగా మార్చాలని మాకు లేదు. డబ్బు ఉంటె ఖర్చుపెదతాం .లేకుంటే ఉన్నదానితోనే నడిపిస్తాం ‘’అని తెగేసి చెప్పేశాను .అలాగే గుడి ఎదురుగా సత్రం గుమాస్తా కూడా పెత్తనానికి ప్రయత్నించి నాచేత చివాట్లు తిని ఆ ప్రయత్నం విరమించుకొన్నాడు .ఇలా పెత్తనానికి ఆరాట పడి,క్రమ౦గా  మా నిర్వహణ విధానం చూసి మనసుమార్చుకొని తర్వాత పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు  అందించారు .

జమాఖర్చులు

ఆలయ నిర్మాణం లో మాకు వచ్చిన ప్రతి రూపాయి ,ఖర్చు చేసిన ప్రతి రూపాయి కి మొదటినుంచీ నేనూ వీరభద్రరావు ఎవరికి వాళ్ళం జమాఖర్చులు రాశాం .డబ్బు జమాఖర్చులు రాయటం 1956లో బెజవాడలో ఇంటర్ చదువు తున్నప్పటి నుంచి అలవాటై ఈనాటికీ అవిచ్చిన్నంగా జరుగుతోంది .మా నాన్న గారికీ ఇదే అలవాటు.ఆయనే ఆదర్శం . ఆయన జమాఖర్చుపుస్తకాలు రిఫరెన్స్ గా దాచుకు న్నానుకూడా. వీరభద్రరావు కు అనేక వ్యాపకాల వలన ఫైనల్ రూపం ఇవ్వటం కొంత ఆలస్యమైంది .సంజీవరావుగారు మాపై ఒత్తిడి తెస్తున్నారు .ఊళ్ళో వాళ్ళు అనేక రకాలుగా అనుకొంటున్నారని భయపెట్టేవారు.డబ్బు మిస్ అప్రాప్రిఎట్ అయితే భయంకాని నిర్దుష్టంగా ఉంటె భయం దేనికి అనే వాళ్ళం మేమిద్దరం . మొత్తం  మీద ప్రతిష్ట అయిన రెండునెలలకు ఇద్దరం కూర్చుని ఫైనల్  జమార్చులు తయారు చేసి ఒకటికి రెండుసార్లు సరి చూసుకొని లిస్టు లు టైప్ చేయించి మేము ముగ్గురం సంతకాలు పెట్టి ,ఫలానా రోజున జమాఖర్చులు చెబుతామని గుడి మైక్ లో అనౌన్స్ చేయిస్తూ నోటీసుకూడా బోర్డ్ మీదా అంటించి ,అందరినీ రమ్మనికోరి మేము ముగ్గురం జమాఖర్చులు చదివి వినిపించాం. తండోపతండాలుగా వస్తారని ఎదురు చూశాం .ఇద్దరు ముగ్గురుతప్ప ఎవరూ రాలేదు .ఎవరొచ్చినా రాకున్నా కార్యక్రమం జరపాలి అని జరిపేసి  లిస్టు ను గుడిలో బోర్డ్  మీద అంటించి చేతులు దులుపుకోన్నాం .హాయిగా ఊపిరి పీల్చుకొన్నాం .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-8-19-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.