ఆలోచనా లోచనం –ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ఈ రోజు 6-8-19మంగళవారం ఉదయం 7-15 కు ప్రసారమైన నా ప్రసంగం
—
ఉదార గుణమే ఉన్నతాశయం
‘.’శ్రేయో భూయాత్ సకల జనానాం
అయం నిజః, పరో వేది ,గణనా లఘు చేతసాం
ఉదార చరితానాం తు పురుషాణా౦
వసుధైక కుటుంబకం ‘’అని సూక్తి ఉంది .
వీళ్ళు నావాళ్ళు , వాళ్ళు పరాయి వాళ్ళు అనే భావాన్ని సంకుచిత మనస్కులు కలిగి ఉంటారు .ఉదార స్వభావులకు ఈ జగమంతా ఒకే కుటుంబంగా గోచరిస్తుంది అని తాత్పర్యం .కర్తవ్య దృష్టి ఉంటేనే ఇహపర సాధనం .
బాగా డబ్బున్న లోభికంటే ,ఉదార గుణం ఉన్న పేదవాడు గొప్ప అన్నాడు 17-18 శతాబ్దాలకు చెందిన గువ్వల చెన్న శతకకర్త –
‘’కలిమి గల లోభికన్నను –విలసితముగ పేద మేలు వితరిణి యైనన్
చలి చెలమ మేలు గాదా –కుల నిధి యంబోధి కన్న ,గువ్వల చెన్నా ‘’
సముద్రం లో ఎంతనీరున్నా ,దాహమైతే గుక్కెడు నీళ్ళు కూడా తాగటానికి పనికి రాదు. .అందులో నిధి నిక్షేపాలు ఎన్నో ఉన్నా, తాగటానికి పనికి రాని ఉప్పునీరే ఉంటుంది .చలి చలమలో నీళ్ళు తక్కువగా ఉన్నా ,ఆ నీటిని తాగితే , చల్లగా ,మధురంగాఉండి దాహ శా౦తినిచ్చి ,ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్త నీరు ఊరుతూ, ఎందరెందరికో ఉపయోగపడుతుంది .కనుక కలిమి ఉన్న లోభి కంటే, ఉదారగుణం ఉన్న పేద వాడు శ్రేష్టుడు అని కవి వివరించాడు .. .. నిత్యజీవితం లో డబ్బు అవసరమే, కాని ధనమే జీవితం కాకూడదు .డబ్బు సంపాదన పై శ్రద్ధ ఉండాలి కాని ,ఆర్జనే అర్ధానికి మూలం కారాదు .సంపాదించిన డబ్బు ఖర్చు చేసేటప్పుడు మనిషి విజ్ఞత చూపాలి .ఆర్జన ,వినియోగం మనిషి స్వభావానికి ,ఔన్నత్యానికి ,సార్ధక్యానికి అద్దం పడతాయి .వ్యక్తికి ఈ రెండిటిపై గొప్ప అవగాహన ఉండాలి .
ధనాన్ని సక్రమ మార్గం లోనే సంపాదించాలి .అప్పుడే మనశ్శాంతి , సౌఖ్యం ,పేరు ప్రతిష్టలు కలుగుతాయి .లేకపోతే ఆ ధనమే శీలహానికి, అపకీర్తికి, పాపానికి, మానసిక క్షోభకు కారణమౌతుంది .ఆర్జనతోపాటు అనుభవ యోగమూ ఉంటేనే పరమార్ధం .అంటే తనకు, తన కుటుంబానికి ఖర్చుచేస్తే చాలదు .తోటివారికి, బాధలలో ఉన్నవారికీ సాయపడి వాళ్ళ ముఖాలలో చిరునవ్వులు పూయించాలి .అప్పుడే ఆ ధనం సార్ధకమై ,మానసిక ఆనందాన్నిస్తుంది .
అంతమాత్రం చేత, ఎవడికి పడితే వాడికి డబ్బు ఇచ్చి, అపాత్ర దానం చేసి ,అనర్ధాన్ని తెచ్చుకోకూడదు .దానం వెనుక ఉన్న మనసు చాలా ముఖ్యం .దానం లో గర్వం ఉంటే ,పతన హేతు వౌతుంది . .వ్యక్తికి సాయం చేసే అదృష్టం కలిగింది అని భావిస్తే ,ఆ దానం పవిత్రమై ఆనందాన్నిస్తుంది .ఆత్మీయత ,అనురాగం, మనసు పంచుకోవటం వలన ఐహిక ఆనందం కలుగుతుంది .ఇదే లేకపోతే ,జీవితం రసహీనమై నిరర్ధకమని పిస్తుంది .కర్మ, జ్ఞాన, భక్తులు ఆముష్మికానికి యెంత అవసరమో ,ఆర్జన, అనుభవం ,ఆనందం, ఐహికానికి అంత ముఖ్యం. రైల్వే లో పనిచేసే పాముల నరసయ్యగారు ఒక్క గారుడీ మంత్రం తో ,ఒకే ఒక్క ఫోన్ కాల్ తో , పాముకాటుకు గురైన వేలాది మంది జనాలకు ప్రాణదానం చేసి, ప్రాణదాత అయ్యారు .దీనికి ప్రతిఫలం గా ఆయన ఏమీ ఆశించలేదు .నిస్వార్ధ సేవ చేసి చరితార్దులై ఉదాత్త పురుషులయ్యారు ..’’మనం ఇతరులకు మన స్పూర్తిగా సాయం చేయాలనుకొన్నప్పుడు ,సహాయం చేస్తున్నప్పుడు మన మనస్సు ,బుద్ధీ పరిశుద్ధమౌతాయి .ఈ ప్రతిఫల౦ ఒక్కటే చాలు చేసే సాయానికి ‘’అంటారు కంచి పరమాచార్యులు శ్రీ చంద్ర శేఖర యతీంద్రులు . ‘’ఎప్పుడూ నీటిలోనే ఉండే చేప దుర్గంధంతో నిండిన నీచును దూరం చేసుకోలేనట్లే మనిషి, సుగంధాలు పులుముకొని రోజూ రెండు, మూడుసార్లు స్నానం చేసినా ,మనసులోని మాలిన్యాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయడని భక్త కబీరు చెప్పాడు. కబీర్ సూక్తులే తనకు ఆదర్శం అన్నాడు మహాత్మాగాంధీ .
మనం వీటిని అన్నిటిని సమన్వయ పరచుకొంటూ ,ఉన్నంతలో ఒక చలి చలమ లాగా ఆర్తులకు ఉపయోగ పడుతూ జీవితం గడిపితేనే ,జీవితానికి నిండుదనం, శోభ ,సార్ధకత కలుగుతాయి అని గువ్వల చెన్న ‘’ చెన్నా’’ అంటే బాగా చెప్పాడు .,అంతే కాదు తెలుగు పద్యం శాశ్వతత్వాన్ని కూడా ఇలా చెప్పాడు .
గుడి కూలును, నుయి పూడును
వడి నీళ్ళన్ చెరువు తెగును,, వనమును ఖిలమౌ
చెడనిది పద్యం బొకటియె
కుడి యెడమల కీర్తి గన్న, గువ్వల చెన్నా
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -6-8-19 -ఉయ్యూరు