శ్రీ కృష్ణుడు అమ్మవారిని అర్చి౦చేవాడా ?
‘’భగవాన్ శ్రీ కృష్ణ దేవిని అర్చించే వాడని మార్కండేయ పురాణా౦తర్గత మైన దుర్గా సప్తశతి లో ఉన్నది .అందులోని అర్గళ స్తోత్రం లో ‘’రూపందేహి ,జయం దేహి ,యశో దేహి ,ద్విషో జాహి ‘’అని ఉంది.దీన్ని పఠించినవారికి అది కవచంగా రక్షణ కల్పిస్తుందనీ చెప్పబడింది .’’కృష్ణేన సంస్తుతయ దేవీ శశ్వద్ భక్త్యా తథాంబికే-రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజాహి ‘’దీని భావం ‘’అమ్మా పరాదేవీ !నిన్నుఅచంచల భక్తి విశ్వాసాలతో కృష్ణభగవానుడు ఆరాధించాడు .మాకు చక్కని రూపం ,అన్నిటా విజయం ,అ౦తులేనికీర్తి కలిగించి మా అజ్ఞానాన్ని కోరికలను సంహరించు’’ .
శ్రీదేవి నిజంగా కృష్ణుడిని రక్షించిందని భాగవత పురాణం చెబుతోంది కదా దేవకీ ఏడవగర్భం ను విష్ణుమూర్తి తనమాయతో రోహిణి గర్భంలో ప్రవేశపెట్టగా బలరాముడు జన్మించాడు ..ఎనిమిదవగర్భంగా కృష్ణుడు ,పరాశక్తి ఇద్దరూ అష్టమినాడే జన్మించారు .ఆరోజే శిశువైన కృష్ణుని తండ్రి వసుదేవుడు నందవ్రజం లోని యశోద దగ్గరకు చేర్చాడు .కంసుడు ఆ రోజునే ఆమెను చేతిలోపట్టుకొని పైకేగరేసి ఖడ్గం తో నరుకుదామనుకొన్నాడు కాని వాడి చేతులకు చిక్కకుండా మాయమైంది .
ఇక్కడ కంసుడు లోని ఆహ౦కారానికి,కృష్ణుడు ఆనందానికి ,దుర్గాదేవి అధ్యాశక్తికి ప్రతీకలు ,.ఆహ౦కారం చేతనను (దేవి ) ఆన౦దాన్ని (కృష్ణుడు )చేజిక్కి౦చు కోలేదు అని అర్ధమౌతోంది .పరాశక్తి ఐన దేవి కంసుని అహంకారం అణగ గొట్టేవాడు అప్పటికే పుట్టాడని త్వరలోనే రాబోతున్నాడని సూచనప్రాయంగా భవిష్యత్తు చెప్పేసింది .ఆహ౦కారానికి విరుగుడు ఆనందమే .కంసుడనే ఆహ౦కారాన్నిశ్రీ కృష్ణుడు అనే ఆనందమే జయిస్తుందని భావం .
జీవితం లో సంపూర్ణ ఆనందం నిండితే అహంకారానికి తావు అనేది ఉండదు .ఆన౦ద యోగికి ఆహ౦కార౦ ఆమడ దూరం .మనసులో అహంకారం రాజ్యం చేసేటప్పుడు తానూ బాధపడి లోకాన్ని బాధపెట్టి భయంకరుడౌతాడు .వాడి మనసు అనుక్షణ క్షోభ తో ,తనను ని౦ది౦చు కొంటూ అనవసరంగా ఇతరులను నిందిస్తూ ఉంటాడు .అయినా వాడి ఆహ౦కారం చేతనను నాశనం చేయలేదు .కారణం చేతన శాశ్వతమైనది కనుక .
విశ్వం లో చేతన శక్తిని తగ్గించేది కాని నాశనం చేసేది కాని లేదని గ్రహించాలి .అది నిరంతరం ఉండే శాశ్వత శక్తి .సైన్స్ తెలిసినవారికి ఈ విషయం బాగా అర్ధం అవుతుంది .శక్తి నిత్యత్వ సూత్రం ప్రకారం శక్తి సృస్టింపబడదు , నాశనం కాబడదు .రూపాంతరం చెందుతుంది .అలాగే చేతనకూడా సృష్టింప బడదు ,నాశనం చెందదు.దానిని సృష్టించే ప్రయత్నం నాశనం చేసే ప్రయత్నం నిష్పల మౌతుంది .చేతనమాత్రమే శాశ్వతం’’అని గురు శ్రీ రవిశంకర్ తెలియ జేశారు . .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-8-19-ఉయ్యూరు
—