కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -2
బందరులో అప్పన్న శాస్త్రి ఇంట్లో కొంతకాలం గడిపి తర్వాత వారాలు చేసుకొంటూ ,ఇంగువ రామస్వామి శాస్త్రి అనే మంత్రశాస్త్రవేత్త వద్ద మంత్రగ్రంథాలు అధ్యయనం చేసి ,మద్రాస్ ప్రయాణం మానుకోమని అందరూ కోరగా మానేసి ,ఈయన ప్రతిభ అందరికీ తెలిసి వఠెంఅద్వైత పరబ్రహ్మ శాస్త్రి తనతో వాక్యార్ధ చర్చ చేసి గెలిస్తే వివాహం కోసం వందరూపాయలు ఇస్తాననగా వాక్యార్ధం చేసి ,ఆయన వాద౦ జటిలం అని గ్రహించి సమర్ధించక ,ఒక అంశం లో ఏకీ భావం కుదరక మానేస్తే ఆయన ఇస్తానన్న డబ్బు ఇవ్వలేదు .శాస్త్రిగారి మిత్రులు ఆయనకు నచ్చ చెప్పినా వినక ఆయన వాదం దుర్బలం అని చెప్పారు .కాని వఠెంవారే తర్వాత వచ్చి వంద రూపాయలు ముట్టజెప్పారు .ఈ డబ్బుతో స్వగృహానికి బయల్దేరి దారిలో అమలాపురం లో గొడవర్తి నాగేశ్వరావదానులుగారు శాస్త్రిగారి ప్రతిభ తెలిసి తనకుమార్తె నిచ్చి వివాహం చేస్తాననగా ,తలిదండ్రుల అనుమతి పొంది చెబుతానని నడవపల్లికి వెళ్ళారు .ఈయన ప్రతిభకు సంతోషించిన వారితో పాటు అసూయపడిన వారూ ఉన్నారు అక్కడ .శాస్త్రిగారిని అత్యవసరంగా అవధానం చేయమని అసూయా గ్రస్తులు కోరగా తాను చెప్పే పద్యాలు రాసుకొనే వారు కావాలి అనగా ,67మంది ఆకులతో ఘంటాలతో వచ్చారు .దేవాలయం లో సమావేశమై శాస్త్రి గారు ఒక్కొక్కరికి ఒక్కొక్కపాదం చెబుతూ,సూర్యాస్తమయానికి 107పద్యాలు చెప్పగా ‘’ఇంకా చెప్పగలరా ?’’అని ప్రశ్నిస్తే ‘’ఈతకు లోతేమిటి ?’’అని అనగా ఆశ్చర్యపడి అప్పటికప్పుడు నలభై రూపాయలు అందజేశారు .అప్పటికి శాస్త్రి గారు మధ్యాహ్న భోజనం కూడా చేయనే లేదు .మరికొంత డబ్బు సంపాదించి గొడవర్తి వారమ్మాయిని పెళ్లి చేసుకొన్నారు .
ధన సంపాదన కోసం నిజాం వెడుతూ దారిలో బందరు వెళ్లి నోబుల్ హైస్కూల్ తెలుగుపండిట్,తనమిత్రుడు పసుమర్తి ఉమామహేశ్వర శాస్త్రిని కలుసుకోవటం ,ఆయన అప్పన్న శాస్త్రి గారి ప్రయత్నం తో ఆ స్కూల్ లో ఖాళీగాఉన్న తెలుగు పోస్ట్ లో నెలకు 7రూపాయల జీతం తో నియమి౦ప బడి మొదటి ఉద్యోగం లో చేరి క్రమక్రమంగా జీతం పెరిగి ఏకంగా 43 ఏళ్ళు నిరాఘాటంగా నోబుల్ హైస్కూల్ లో పని చేసి’’ నోబుల్ పండిట్ ‘’ అనిపించుకొన్నారు .అది కళాశాలగా మారినప్పుడు ప్రధాన ఆంద్ర పండితునిగా పని చేసి ,గ్రంథ రచన చేస్తూఅనేక సంస్కృత ఆంధ్ర గ్ర౦థాలు రాసి , జీవితం సద్వినియోం చేసుకొన్నారు .ఆయన నైష్టికతను ,సదాచారాన్ని మిషినరి యాజమాన్యం గౌరవించి ఆయనతో మాట్లాడేటప్పుడు కొంచెం దూరంగా ఉంటూనే మాట్లాడుతూ గౌరవం పాటించి తమ భక్తిప్రపత్తులు తెలియజేసేవారు .శాస్త్రిగారు ఆత్మాభిమానమున్న వ్యక్తి.ఒకసారి నోబుల్ దొరఎవరితోనో ఒకపద్యం పంపి దాని భావం చెప్పమని కోరితే శాస్త్రి గారు వివరించిపంపారు .ఇంకోరకంగా చెప్పకూడదా అని దొర మళ్ళీ పంపితే కుదరదు అని చెప్పగా ,నోబుల్ గారే వచ్చి అడిగితె ‘’తప్పు తప్పే మీరు వచ్చినంతమాత్రాన తప్పు ఒప్పుకాదు’’అని ఖచ్చితంగా చెప్పేసరికి అహం అడ్డమొచ్చి ,ఆయన్ను ఉద్యోగం లోంచి పీకేసే ప్రయత్నం చేస్తే దొరస్నేహితులు ‘’శాస్త్రిగారి పాండిత్యం అగాధం .మిమ్మల్ని ధిక్కరించాలని ఆయన అలాచెప్పలేదు .అంతటిపండితుడు మళ్ళీ మనకు దొరకరు ‘’అని చెప్పి శాంతింపజేశారు.
శాస్త్రిగారికి కీర్తి, కనకాలపై ఆసక్తి తక్కువ .ఏక సందాగ్రాహి ,విద్వానిత్య మొదలైన బిరుదులున్న మాడభూషివెంకటాచార్యులు శాస్త్రిగారు పనిచేస్తున్నకాలేజీలోని తనశిష్యులకు
‘’చి౦తకాయ ,కలేకాయ బీరకాయత మారికే-ఉచ్చి౦తకాయ వాక్యాయ సాధకాయ తమంజలిం ‘’మొదలైన శ్లోకాలు పంపి ‘’పండితుడు ఎవరైనా ఉంటె వీటి అర్ధం వ్రాసుకురండి ‘’అని పంపారు .వాటికి అనేక రకాల అర్ధాలు చెప్పి రాయించి తాము –
‘’కమల సమ శయానః పాద్వి రాడాశయానః –స్వభరణ యశ యావః ప్రోజ్జ్హితో సంశయానః
వరమధిక శయానః క్షత్ర పాత్రాశయానో-వ్యధి జలది శయానః పాతుపక్షీ శయానః ‘’అనే తమపూర్వుల శ్లోకం తోపాటు మరోశ్లోకాన్ని ఇచ్చి ఆచార్యులవారితో అర్ధం రాయించుకొని రమ్మని పంపగా వాటికి బదులే రాలేదు .శాస్త్రి గారికి శిష్టు వారికీ ఉన్నసాన్నిహిత్యం గొప్పది .తమ ‘’దేవీ విజయం ‘’కావ్యంలో వీరిని ఇంగువవారినీ స్తుతించారు .వీరిద్దరిశిష్యులై రాణి౦నట్లు విదుషీమణి ,కవితిలక ,కవితావిశారద శ్రీమతి కాంచనపల్లి కనకా౦బ గారు
‘’వర కోరాడ సుధా పయోధి నిదుడై –వాణీ పుమాకారమై –పరమేశ ప్రతిమానుడై జపతప –స్స్వాధ్యాయ లోలాత్ముడై –సురభాషా కవి చంద్రుడై సకలుడై –సుశ్లోకుడై మించె సు-స్థిరుడై యచ్యుతరామ పూజ్యుడగుచున్ –శ్రీరామ చంద్రు౦ డహో’’అని కీర్తించారు .
శాస్త్రిగారి ఉపజ్నకు దీటుగా ‘’మంజరీ మాధుకరీయం ‘’నాటికను 1860లో రచించారు .అప్పటికి ఎలకూచి బాలసరస్వతి ‘’రంగ కౌముది ‘’మొదలైన నాటకాలు రాసినట్లు ప్రచారం లో ఉన్నా ,వాటి చిరునామా లేనేలేదు .శాస్త్రిగారి నాటిక స్వకపోల కల్పితం, అపూర్వం . దీనికి పురాణమూలం లేదు .అంతకుముందే శాకుంతలం ,వేణీ సంహారం ,ముద్రారాక్షస నాటకాలను ఆంధ్రీకరించారు .తెలుగు వచనరచన చేసిన తొలితరం వారిలో శాస్త్రిగారూ ఒకరు .పంచతంత్ర నిగ్రహం కు అనువాదంగా ‘’నయప్రదీపం ‘’రాశారు .1-27ఉల్లాసాల మహాకావ్యం కుమారోదయ చంపు ,2-శృంగార సుధార్ణవ భాణం3-రామచంద్ర విజయ వ్యాయోగం 4-సంస్కృత విద్యార్ధులకు ఉపయోగపడే వ్యాకరణం ‘’ధీ సౌధం ‘’5-శృంగారమంజరి 6-కమనానంద భాణం 7-పుమర్ద సేవధి కావ్యం 8-దేవీ విజయ చంపు ,9-ఘన వృత్తం 10-వచన పరశురామవిజయం11-స్వోదయం అనే స్వీయ చరిత్ర మొదలైన 31 రచనలు చేశారు .వీటిలో ఘనవృత్తం అనే సంస్క్రుతకావ్యం , మంజరీ మధుకరీయం తెలుగు నాటకం విశేష ప్రాచుర్యం పొందాయి .కాళిదాసు మేఘసందేశం తర్వాత మేఘుని వృత్తాంతం ను వర్ణిస్తూ శాస్త్రిగారు ‘’ఘనవృత్తం’’రాశారు .’’శాస్త్రిగారి మంజరీ మధుకరీయం నాటకం ప్రధమ ఆంద్ర రూపకం ‘’అని తీర్పు చెప్పారు సుప్రసిద్ధ నాటక శాస్త్రజ్ఞులు ఆచార్య పోణ౦గి శ్రీరామ అప్పారావుగారు .శాస్త్రిగారి ఆత్మకథ ‘’స్వోదయం ‘’19 శతాబ్దిలో సంస్కృతం లో రాయబడిన మొదటి స్వీయ చరిత్ర కావ్యంగా రికార్డ్ సృష్టించింది . .1900 శార్వరి శ్రావణ బహుళ పాడ్యమినాడు రామచంద్ర శాస్త్రిగారు 84వ ఏట శివైక్యం చెందారు .
రామ చంద్రశాస్త్రిగారికి లక్ష్మీ మనోహరం,రామకృష్ణ శాస్త్రి ,దుర్గా నాగేశ్వర శాస్త్రి అనేకుమారులు ,ఇద్దరుకుమార్తెలు .లక్ష్మీమనోహరంగారు సంస్కృతం నేర్చి మెట్రిక్ పాసై , రెవిన్యు ఉద్యోగి అయ్యారు .రామకృష్ణ శాస్త్రిగారు సంస్కృత ఆంగ్లభాషలలో పాండిత్యం సాధించి అల్పవయస్సులోనే మరణించారు.దుర్గా నాగేశ్వర శాస్త్రి తండ్రిని మించిన తనయుడు .సహజ పాండిత్యం ఉన్నవారు .తండ్రివద్ద సంస్కృతం నేర్చి ,తండ్రి అనారోగ్యం తో కాలేజీకి వెళ్ళలేకపోతే పండితుడిగా చేరి ,కాలేజీ విద్యార్ధులకూ సమర్ధవంతంగా పాఠాలు బోధించి తండ్రిని మించినవాడు అనిపించారు .ఈయన బోధనను క్లాసు బయటనుంచి గమనించిన తోటి ఉపాధ్యాయులు ఆయన తండ్రిగారికి సంతోషంగా తెలియేసేవారు .కొద్దికాలం లోనే సర్వశాస్త్ర పారంగతులై యోగ౦లొనూ అనితర ప్రతిభ చూపిన నిరాడంబరులు ,పారమార్ధిక చింతన ఉన్నవారు .మిషనరీల అభిమానాన్ని తండ్రిగారిలాగానే పొందుతూ 33 ఏళ్ళు అక్కడే పని చేశారు .కాంచనపల్లి కనకాంబ గారు ‘’అతిశాంతుడు మహామహుండు ముని యోగానంద నాధు౦డు ,సా-దిక సర్వార్ధుడు ,దేశికా౦ఘ్రియుగభక్తిక్రీత ముక్త్యా౦గ నాయుతుడేకాంతుడు ,రామచంద్ర పరిచర్యోత్సాహి నాగేశుడ-ప్రతిముండుత్తము డాద్యయోగిజన సంభవ్యాంత రంగు౦ డహో ‘’అని ‘’శ్రీనివాస త్రిలింగ మహా విద్యా పీఠం గురుపరంపర’’లో ప్రస్తుతించారు .
రామచంద్ర శాస్త్రిగారు కొడుకు నాగేశ్వర శాస్త్రిగారు బందరు నోబుల్ కాలేజీలో 75ఏళ్ళు ఆంద్ర ఉపాధ్యాయులుగా పని చేసిన ఘనకీర్తి పొందారు .నాగేశ్వర శాస్త్రిగారి సమకాలికులు శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రిగారు చెళ్ళపిళ్ళ వారు తమ ‘కధలు గాధలు ‘’లో ఈతండ్రీ కొడుకులగురించి ముచ్చటించారు .నాగేశంగారి కొడుకులకు ఏ మంత్రమూ ఉపదేశించలేదు .ఎవరైనా అడిగితె ‘’గాయత్రి ‘’జపించుచాలు’’అనేవారు.దీన్ని వేదవాక్కుగా తీసుకొని లక్ష్మీ మనోరంజనం గారి రెండవకుమారుడు శేషావధాని గాయత్రిజపించి ,తైత్తిరీయం మొదలైనవి చదువుతూ చివరికాలం లో ‘’సోహం ‘’భావం పొంది 1960లో గతించారు .రామచంద్ర శాస్త్రిగారి పెద్దకుమారుడు ,కోరాడ రామక్రిష్ణయ్యగారి తండ్రీ అయిన లక్ష్మీ మనోహారం గారు మెట్రిక్ పాసై ,బందరుతాలూకా ఆఫీస్ లో గుమాస్తాగా చేరి ,ఎన్నో సార్లు ప్రమోషన్ వచ్చినా తండ్రి సేవకు దూరమౌతానని బందరు వదలక తండ్రి సేవలో ధన్యులై హెడ్ గుమాస్తాగా రిటైర్ అయిన త్యాగమూర్తి .1861లో జనించిన ఈయన 12ఏట సీతమ్మగారిని వివాహమాడి ,రామకృష్ణయ్య శేషావధానులు అనే ఇద్దరు కుమారులకు జన్మ నిచ్చారు .వీరిలో పెద్దకుమారుడైన కోరాడ రామ కృష్ణయ్య గారి గురించి తెలుసుకొనే ప్రయత్నం లో ఆ వంశఘన చరిత్ర అంతా అవగతం చేసుకొని పునీతులమయ్యాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-8-19-ఉయ్యూరు
.
—