కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -3
కోరాడ రామకృష్ణయ్యగారు 2-10-1891ఖరనామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధపాడ్యమి చిత్రా నక్షత్రం నాడు అమలాపురం లో మాతామహులు గొడవర్తి నాగేశ్వరావధానులు గారింట జన్మించారు .వెంకటేశ్వరస్వామి మహా భక్తులైన గొడవర్తివారు అమిత నిస్తాపరులు .ఇంటి ఆవరణలో ఒక చోట వెంకటేశ్వరస్వామి పటం పెట్టి దానివద్ద ఒక బిందె ఉంచేవారు .భక్తులకానుకలతో అది నిండగా,మరో బిందె పెట్టేవారు .ఈ డబ్బుతో నాలుగు గోడలపై పాక నిర్మాణం చేశారు .తర్వాత అది మండపంగామారి ,ఆతర్వాత వెంకటేశ్వర విగ్రహ ప్రతిష్ట జరిగి గుడి నిర్మాణం అయి ,గుడి చుట్టూ ఇళ్ళు ఏర్పడి , వెంకటేశ్వర అగ్రహారమై పెద్ద క్షేత్రంగా రూపు దాల్చింది .
రామకృష్ణయ్యగారు బందరులో తలిదండ్రులు లక్ష్మీ మనోహరం సీతమ్మగారి వద్ద పెరిగారు తాతగారు కోరాడ రామచంద్ర శాస్త్రిగారు అని మనకు తెలుసు .తాతగారి గాంభీర్య గౌరవాలు గ్రంథరచనాపటిమ ,పాండిత్య ప్రభావాలు మనవడిలో ఏర్పడ్డాయి .బందరులోనే ప్రాధమిక విద్య నేర్చారు .అప్పుడు ‘’మొద్దు రాచిప్ప’’లకు బండకొయ్యలు ,కొదండాలు శిక్షగా ఉండేవి .తోటిపిల్లలు ఈ శిక్షలకు గురైతే నిర్విణ్ణులై దుఖి౦చేవారు .తర్వాత నాదెళ్ళ పురుషోత్తమ కవిగారి ప్రాధమిక పాఠశాల లో చేరి చదివి ,హిందూ హైస్కూల్ లో మూడవఫారం వరకు చదివారు .నాలుగవ ఫారం నోబిల్ హైస్కూల్ లో చదివి ఆకాలేజీలోనే బి.ఏ చదివి పాసయ్యారు .బ్రహ్మయ్య లింగం గారు తెలుగు ,కుంటి రంగాచార్యులుగారు సంస్కృత గురువులు .హెడ్ మాస్టర్ కుంభకోణం కృష్ణమాచార్యులుగారి ‘’ బెత్తం హవా ‘’భయంకరంగా ఉండేది .అందరికీహడల్ .ఆయన ఆంగ్లపాండిత్యం, బోధనా కూడా హడలెత్తించేవి.తెలుగుక్లాస్ లో వేళాకోళాలు అల్లర్లు ఉత్సాహంగా ఉండేవి .టెన్నిస్ పోటీలు బాగా జరిగేవి .
స్వాతంత్రోద్యమం ఉధృతంగా ఉన్న ఆకాలం లో మహా వక్త బిపిన్ చ౦ద్రపాల్ దేశమంతా తిరుగుతూ బండరులోనూ ప్రసంగాలు చేసి ఉర్రూతలూగించాడు .కౌతా శ్రీరామ శాస్త్రిగారు మచ్చుల చావడిలో జాతిప్రధకప్రసంగాలు చేసి యువకులలో జాతీయభావం రగుల్కొల్పారు .బందరు హిందూ హైస్కూల్ ఇసుక తిన్నెలపై మహాత్మ గాంధి ప్రసంగించాడు .రామకృష్ణయ్యగారి సహాధ్యాయి శ్రీ మత్తిరుమల గుదిమెళ్ళ వరదా చార్యులుగారు గాంధీకి 500రూపాయలు నగదు అందజేయటం ,ఆంధ్రజాతీయ కళాశాల స్థాపన ప్రయత్నం ,దేవాలయాలలో వేదాంత ఉపన్యాసాలు ,మిషనరీల మతమార్పిళ్లు ,దానికి జరిగిన వ్యతిరేక ఉద్యమాలు ,శివగంగ మహిషాసుర మర్దినీ ఉత్సవాలు ,ఏనుగు అ౦బారీలు తాలిమ్ఖానాలు ,దీపావళినాడు ‘’తోటాల లడాయీలు ‘’అన్నీ రామకృష్ణయ్యగారికి పరమ ఆకర్షణీయంగా ఉండి,విద్యార్ధి దశ బహు చమత్కారంగా గడిచింది .మెట్రిక్ చదువు తుండగానే అమలాపురం దగ్గర ముంగండ కు చెందిన ఖండవల్లి రామమూర్తి గారి కుమార్తెతోఅన్నపూర్ణా౦బ తో వివాహం జరిగింది .
రామకృష్ణయ్యగారి బాబాయి నాగేశ్వరశాస్త్రిగారికి సంతానం లేకపోవటంతో ఈయననే కొడుకులా భావించారు .కాలేజీలో ,ఇంట్లో కూడా గురువుగా ఉండేవారు .తమ ‘’భారత కవితా విమర్శనం ‘’లో రామకృష్ణయ్యగారు ‘’శ్రీరామ చంద్ర కృతినం-ద్వంద్వాతీతం గురోర్గురుం –యోగీశ్వరం జ్ఞానధనం – వందే నాగేశ్వరం గురుం ‘’అని పినతండ్రిగారిని ప్రస్తుతించారు .అప్పుడే ఇంటర్ (ఎఫ్ .ఎ.)బోధన కొత్తగా వచ్చి తెలుగు సంస్కృతం చరిత్ర చదివే మహదాకాశం వచ్చి లెక్కలబాద తప్పింది .బియేతెలుగు తీసుకొని సంస్కృతాంధ్రాలు నేరుస్తూ ఇంట్లో కావ్యశాస్త్ర పాఠాలు బాబాయ్ గారివద్ద నేర్చారు.అప్పుడు వీరిక్లాసులో ఇద్దరే విద్యార్ధులు ఉండేవారు .బి.ఎ .పాసవగానే అదే హైస్కూల్ లో తెలుగుపండితులుగా చేరారు .అప్పుడే వరదా చార్యులుగారు విజయనగరం సంస్కృత కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ గా ఉన్నారు .అప్పుడే బి ఏ లో పార్ట్ 111 తెలుగు –సంస్కృతం మొట్టమొదటి సారిగా ప్రవేశపెట్టారు .దీనికి ఆనంద గజపతి మహారాజు ప్రోత్సాహం ఉన్నది .అప్పుడు వియనగరం రాజమండ్రి బందరు అనంతపురం లలో మాత్రమె కాలేజీలున్నాయి . పండితుల వాగ్వాదాలలో తానుకూడాపాల్గొని పరీక్షకులుగా వ్యవహరించి ,విద్వత్తును గుర్తించి బహుమతులివ్వటం ,పాశ్చాత్య దేశాలలో జరిగే భాషా చర్చలపై అవగాహన ఉన్నవారు ,మాక్స్ ముల్లర్ మహాపండితుడు ఋగ్వేదాన్ని నాగరలిపి ముద్రించటానికిప్రోత్సాహక ద్రవ్య సహాయం చేసినవారు ,ఇండో –యూరోపియన్ ఏక భాషా కుటుంబ అవగాహన ఉన్నవారు ఆనంద గజపతి గారు . స్నేహితుడు వరదా చార్యుల పిలుపు ,రాజాగారి ప్రోత్సాహం , ప్రిన్సిపాల్ శ్రీ రామావ తారం గారి పట్టుదలతో రామకృష్ణయ్యగారికి విజయనగరం మహారాజా కాలేజిలో సంస్కృతాంధ్ర ఉపన్యాసకులుగా ఉద్యోగం లభించి వెంటనే చేరారు ఇక్కడ సంస్కృత భాషాశాస్త్రం ,ద్రావిడ వ్యాకరణం కూడా బోధించాల్సి రావటంతో అధిక శ్రమ చేసేవారు .వీరి సాహిత్య రచనా విశేషాలు తరువాత తెలుసుకొందాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-8-19-ఉయ్యూరు
.
—