కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -4(చివరిభాగం )
విజయనగరం రాజా గారి కాలేజీలో పని చేస్తుండగా రామకృష్ణయ్యగారికి ఇంగ్లీష్ లెక్చరర్ ఉల్లాల్ సుబ్బరాయభట్టు గారి తోపరిచయమై ఆయనద్వారా తుళు కన్నడ ద్రావిడ భాషాతత్వాన్ని తెలుసుకోవటం వలన ద్రావిడ భాషాతత్వ వివేచనం పై అమితాసక్తికలిగి కాలేజి మాగజైన్ లో ‘’ద్రావిడ భాషా పదచరితము ‘’వ్యాసం రాశారు .దీనితో రామకృష్ణయ్యగారు ‘’తొలి ద్రావిడ భాషా తులనాత్మక పరిశీలకుని ‘’గా మార్గదర్శిగా, వైతాళికునిగా పేరుపొందారు .తర్వాత వర్ణోత్పత్తి మొదలైన వ్యాసాలూ రాశారు .సాహిత్యవ్యాసాలు ,విమర్శలు ఆంద్ర పత్రిక సంవత్సరాది సంచికకు భారతి కి పుంఖానుపుంఖాలుగా గా రాశారు .అప్పటికి తెలుగు భాషా శాస్త్రం – ఫైలాలజి పై గిడుగురామమూర్తిగారు ,చిలుకూరి నారాయణరావు గారు మాత్రమె కృషి చేస్తున్నారు .వీరికి ద్రావిడభాషా శాస్త్రం పై అవగాహన లేదు .ఒకే మూల ధాతువు నుంచి తెలుగు తమిళ,కన్నడ పదాలు ఏర్పడ్డాయని సోదాహరణంగా రామకృష్ణయ్యగారు రుజువు చేశారు .దీనితోపాటు శ్రీనాథుడు –సంధియుగము ,భీమేశ్వరపురానం ,రస చర్చ మొదలగు వ్యాసాలూ రాసి తమ అసమాన పాండిత్యాన్ని లోకానికి చాటారు .1921లో ‘’ సంస్కృతాంధ్ర భాషలు అభిమాన విషయంగా ఎం. ఏ .పాసయ్యారు .1924లో మద్రాస్ లో జరిగిన ‘’ఆల్ ఇండియా ఓరియెంటల్ కాన్ఫరెన్స్ ‘’కు కాలేజి తరఫున ప్రతినిధిగా వెళ్ళారు .ఆతర్వాత ఇలాంటి సభలకు చాలావాటికి వెళ్లి ,బెంగాల్ రాష్ట్ర శాసనసభ అధ్యక్షుడు ,ద్రావిడ భాషా శాస్త్ర వేత్త సునీత్ కుమార్ చటర్జీ తో పరిచయం పొందారు .12ఏళ్ళు విజయనగరం కాలేజిలో పనిచేసి ,1947లో దర్భాంగలో జరిగిన 14వ ఓరియెంటల్ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించారు .
మద్రాస్ యూనివర్సిటి వైస్ చాన్సలర్ రఘుపతి వెంకటరత్నం నాయుడుగారు. అందులో తెలుగు తమిళ కన్నడ భాషల శాఖలు ప్రారంభించి ఫైలాజికి ప్రోత్సాహం కలిగించాలని భావించి ‘’కోలిన్స్ ‘’అనే పాశ్చాత్య భాషా శాస్త్ర వేత్తను ఆహ్వానించి ప్రేరణాత్మక ప్రసంగంచేయించారు .రామకృష్ణయ్య గారి ప్రతిభా పాండిత్యాలు తెలిసిన నాయుడుగారు తమ యూని వర్సిటిలో చేరమని ఆహ్వానించి ,విజయనగర రాజా దివాన్ శ్రీ మామిడిపూడి వెంకటరంగయ్యగారికి ఉత్తరం రాసి రామ కృష్ణయ్యగారిని తమ యూని వర్సిటీ లో చేరటానికి పంపమని కోరారు .కృష్ణయ్యగారికి ఉన్న చోట బాగానే ఉందికదా ,కదలటం ఎండుకనుకొని వెళ్లాలని లేక దరఖాస్తు చేయలేదు .మళ్ళీదివాన్ గారికి నాయుడు గారు ఉత్తరం రాస్తే ఆయన ఈయనతోమాట్లాడి,దరఖాస్తుపెట్టించి ఇక్కడ ఉద్యోగానికి భద్రత కల్పించే పూచీ తీసుకొన్నారు .విజయనగరం వదలలేక వదలలేక భార్యాభర్తలు మళ్ళీ తిరిగి వస్తామనే ధీమాతో సామానంతా హెడ్ మాస్టర్ చెరుకూరి జోగారావుగారింట్లోఒక గదిలో సర్దేసి మద్రాస్ వెళ్ళారు .
1927లో మద్రాస్ యూని వర్సిటిలో రీడర్ గా చేరిన కృష్ణయ్యగారికి పెద్దగా పని ఉండేదికాదు నెలకు 150రూపాయలు జీతం .ఉదయం 11నుంచి సాయంత్రం 4వరకు డ్యూటి.1950లో సీనియర్ లెక్చరర్ గా పదవీ విరమణ చేశారు .తిరుపతి ప్రాచ్య పరిశోధనాలయం లో రీడర్ గా నియమితులై ,6ఏళ్ళు పనిచేసి మొత్తం 40ఏళ్ళు ఆంధ్రభాషా వాగ్మయ సేవలో తరించారు .భాషా పరిశోధన అభిమాన విషయం గా ఉన్న వీరు ‘’స్టడీస్ ఇన్ ద్రవిడియన్ ఫైలాలజి ‘’అనే మొదటి పుస్తకం రాసి ప్రచురించారు .1950లో మద్రాస్ ప్రభుత్వం వీరి భాషాకృషికి 500రూపాయల నగదు పారితోషికం అందజేసింది .కాళిదాసు ని కళా ప్రతిభలు మొదలైన వ్యాసాలూ రాశారు .’’ప్రాజ్న్ నన్నయయుగం లో తెలుగుభాష ,భాషా చారిత్రకవ్యాసాలు ,సంధి ,ద్రవిడభాష సమాన శబ్దాలు (ద్రవిడియన్ కాగ్నేట్స్)మొదలైన భాషాశాస్త్ర గ్రంథాలు రాశారు .సాహిత్య విమర్శ గ్రంథాలలో –1‘’ఆంధ్రభారత కవితా విమర్శనం’’మహా పండితుల విమర్శకుల విశ్లేషకులను అలరించి ఆయన ప్రతిభకు ఊయల అయింది ,2-దక్షిణ దేశ భాషా సాహిత్యములు 3-సారస్వత వ్యాసములు 4-తెలుగు లిటరేచర్ అవుట్ సైడ్ దితెలుగు కంట్రీ(తెలుగు దేశానికి వెలుపల తెలుగు సాహిత్యం )5-కాళిదాసుని కళాప్రతిభలు ఉన్నాయి
నవనాథ చరిత్ర ,పరతత్వ రసాయనం,వల్లవాభ్యుదయం నన్నెచోడునికుమారసంభవం మొదలైన 15ప్రాచీన గ్రంథాలను పరిష్కరించి విపుల పీఠికలతోప్రచురించారు ..వెంకటాద్రిమహాత్మ్యం శ్రీనివాస విలాస సేవధి పరిష్కరించి తిరుపతిలో ఉన్నప్పుడు ప్రచురించారు .మన సంస్కృతికి చెందిన తాళిబొట్టు ,మంగళసూత్రం,అక్కమహాదేవి వచనాలు దక్షిణాపద సంస్కృతీ మొదలైన ఎన్నో వ్యాసాలూ రాశారు .1940మార్చి లో తిరుపతిలో జరిగిన ఆల్ ఇండియా ఓరియెంటల్ కాన్ఫరెన్స్ ‘’లో తెలుగు విభాగానికి రామకృష్ణయ్యగారు అధ్యక్షత వహించి చేసిన 37పేజీల అధ్యక్షోపన్యాసం లో తెలుగుభాషా సాహిత్యాల చరిత్ర జరుగుతున్న పరిశోధనలువివరించి భావికి దిశా నిర్దేశనం చేశారు .
రామ కృష్ణయ్యగారి జీవితం నిండుగోదావరి గాసాగింది .నిరాడంబరత, మితభాషణం, అజాత శత్రుత్వం ఆయనకు అలంకారాలు .సాధారణ వస్త్ర ధారణా, దేనికీ తాపత్రయపడని నైజం ,ఉద్యోగాలు ఆయన వెంటపడ్డాయికాని, ఆయన ఉద్యోగం కోసం ప్రయత్నించలేదు .సంపూర్ణ ఆరోగ్యం ఆయన కవచం .ఉద్యోగం లో సెలవు పెట్టలేదు .కరుకైన క్రమ శిక్షణ ఆయనది .తోటలంటే మహా ఇష్టం .ప్రతి వేసవిలో సకుటుంబంగా అమలాపురం వెళ్లి చెట్లకు నీరుపెడుతూ ,పంటపండిస్తూ ఆనందంగా గడిపేవారు .తిరుపతిలో ఉద్యోగ విరమణ తర్వాత ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలు పఠిస్తూ ఆధ్యాత్మిక జీవితం గడిపారు .పవిత్ర జీవనం ,సత్యనిస్ట,శ్రద్ధా సమావిస్ట,పవిత్ర త్రివేణీ సంగమమైనది రామకృష్ణయ్యగారి జీవితం .ఇంతటి పవిత్ర ఆదర్శ సార్ధక జీవితం గడిపిన కోరాడ రామకృష్ణయ్యగారు 28-3-1962 న 71వ ఏట కీర్తి శేషులయ్యారు .
సహృదయత చిత్తశుద్ధి ,ప్రామాణికత భాషా సాహిత్య రంగాలలో ప్రధములురామ క్రిష్ణయ్యగారు సాహిత్య వ్యాసంగాన్ని జీవిత పరమార్ధాన్ని సాధించే తపస్సుగా కొనసాగించిన రుషి వరేణ్యులు .తెలుగు కన్నడ తమిళ భాషలకు ఒకే రకమైన’’ ఛంద స్సాహితీ సంప్రదాయం’’ఉందని చెప్పి నిరూపించటానికి గ్రంధం రాశారు .పరిశోధనలో వారిది సత్యైక దృష్టి . రామకృష్ణయ్యగారి రెండవ కుమారుడుఆచార్య డాక్టర్ కోరాడ మహాదేవ శాస్త్రిగారు ఎంయే ఎకనామిక్స్ పసి సిమ్లాలో కేంద్ర కార్మిక శాఖలో పని చేసి ఉద్యోగం మానేసి కలకత్తావిశ్వవిద్యాలయం లో సునీతికుమార్ చటర్జీ పర్యవేక్షణలో ‘’ది హిస్టారికల్ గ్రామర్ ఆఫ్ తెలుగు ‘’పై పరిశోధించి డిలిట్ పొందారు .కొంతకాలం జర్మనీలో భాషా శాస్త్రాచార్యులుగా ఉన్నారు .శ్రీ కృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయం లో ఆంద్ర శాఖాచార్యులుగా ,అధ్యక్షులుగా చేసి పదవీ విరమణ చేశారు .తండ్రిని మించిన తనయులనిపించుకొని తండ్రిగారు వ్రాయ సంకల్పించిన ‘’చరిత్రక వ్యాకరణం ‘’రచించారు .వర్ణనాత్మక ఆధునిక ఆంధ్రభాషా వ్యాకరణం (డిస్క్రిప్టివ్ గ్రామఅండ్ హాండ్ బుక్ ఆఫ్ మోడరన్ తెలుగు )ను విదేశీయులకోసం రాశారు .
మొదట్లోనే చెప్పుకొన్నట్లు కోరాడ వారి వంశం లో శ్రీశైల భ్రమరాంబికా వరప్రసాద లబ్దులైన మహాదేవ శాస్త్రి గారు అమ్మవారిని కోరినట్లు, ఈ మహాదేవ శాస్త్రి గారి నుంచి ఇప్పటితరం అంటే రామకృష్ణయ్యగారికుమారులు మహాదేవ శాస్త్రి గారివరకు అందరూ సరస్వతీ పుత్రులే జన్మించి వంశకీర్తిని ఇనుమడింప జేసిన వారే .వీరందరినీ స్మరించటమే నిజమైన సరస్వతీ పూజ .
ఆధారం –‘’ కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం’’అనే ఈ నాలుగుభాగాల ధారావాహికకు ఆధారం శ్రీ కోరాడ రామకృష్ణయ్య గారి శతజయంతి వేడుకల సందర్భంగా ప్రచురించిన ప్రత్యేక సంచిక ‘’కోరాడ రామ కృష్ణయ్య శత జయంతి –సాహితీ నీరాజనం ‘’లో ఆచార్య తిరుమల రామ చంద్ర రాసిన వ్యాసం ‘’కోరాడ రామకృష్ణయ్య గారి వంశం –జీవితం –రచనలు ‘’.
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-8-19-ఉయ్యూరు
.
—