ప్రథమాంధ్ర కవితా శిల్పి నన్నయ
నన్నయ కవితా శిల్పం ఆంద్ర భారతం లో ప్రతిఫలించి,మూర్తీభవించింది .ఈ రూప శిల్పీకరణతో ఆంద్ర భాషా స్వరూపాన్నే మార్చేశాడు కనుక వాగను శాసనుడైనాడు .నన్నయకు ముందు దేశీ పధ్ధతి అంటే నాటు పధ్ధతి ఉంది .ఆయనకు పూర్వం ఒక శతాబ్దికాలం లో రన్న ,పంప మొదలైనవారు మార్గ ,దేశీ మార్గాలను రెండిటినీ జోడించి భారతం ఆదిపురాణం కన్నడం లో రాశారు .అప్పటికి తెలుగు దేశం లో దేశీయమే వాడుకలో ఉందని యుద్ధమల్లుని బెజవాడ శాసనం తెలియ జేస్తోంది .ఇందులో భాష, ఛందస్సు, రచనా రీతి దేశీయం లోనే సాగాయి .తెలుగుకు సంస్కారం అప్పటికి రాలేదుకాని, కన్నడానికి 9వ శతాబ్దికి పూర్వమే వచ్చినట్లు కనిపిస్తోంది .భాషా ,చ్చంద సంస్కారాలతో కూడిన మార్గ పధ్ధతి రచన 8వ శతాబ్దిలోనే శాసనాలలో కనిపించింది .9వ శతాబ్దిలో రాష్ట్ర కూట రాజు నృప తు౦గుని చేత ‘’కవిరాజమార్గం ‘’అనే లక్షణ గ్రంథంప్రతిపాదింపబడింది .ఈతని తర్వాత యాభై అరవై ఏళ్ళకే పంపకవి మార్గం లోఉద్గ్ర౦థ రచన చేసి ‘’ఆదికవి పంపడు ‘’అని పించుకొన్నాడు .ఇంతకంటే పూర్వం నుంచే పంప, పొన్న ,రన్న అనే కవిరత్నాలచేత ఆదరి౦పబడి సాఫు తేరిన కన్నడ కవిరాజుల మార్గాన్ని అనుసరించే ,నన్నయభట్టు ఆంద్ర దేశీయ సంప్రదాయాను సారంగా వాజ్మయపథాన్నితీర్చి దిద్దాడు .
కవితా మార్గానికి ఛందస్సు ఒక ఆలంబనం .రైలు పట్టాలవంటిది .ఇంతకు పూర్వం ఉన్న మార్గం నన్నయ కవితాదాటికి ఆగేదికాదు .దాన్ని శక్తివంతం చేయటానికి కన్నడకవులలాగా సంస్కృత ఛందస్సు లను కూడా తీసుకొని ,ఆంద్ర దేశీయ సంప్రదాయ బద్ధంగా జోడించి మరింత ద్రుఢత్వం కలిగించాడు .అంతకు ముందేఉన్నపాద నియమాలు లేని దేశీయ ఛందస్సు లో ఉన్న ద్విపద మొదలైనవాటికి నాలుగు పాదాలు కల్పించి తరువోజ ,అక్కర ,సీసము, గీతము,ఆటవెలది మొదలైన వృత్తాలను పోలిన పద్యాలను ఏర్పరచాడు .వీటిలో మూడు భాగాల వేగమే ఉండగా సంస్కృత చందోమార్గాన్ని జోడించి ,మీటర్ గేజి ని బ్రాడ్ గేజిగా మార్చినట్లు ,సంకుచిత మార్గాన్ని విశాల దృఢ తర మార్గం గా మార్చి తెలుగు కవిత్వ శకటాన్ని శక్తి వంతమైన రెండు పట్టాలపై ధారాళం గా అప్రతిహతంగా పరుగు లెత్తించాడు .కన్నడంలో లేని అక్షర సామ్యమైన యతి లేక వడి ని కల్పించటంతో సంస్కృత వృత్తాలులుకూడా దేశీయ వృత్తాలలాగా వింత సొగసుతో విరాజిల్లాయి .అవసరమైన చోట్ల యతి స్థానం మార్చి వేగానికి అనువుగా చేశాడు .ఇలాంటి వాటిలో పృధ్వీ వృత్తం, శిఖరిణి ,భుజంగ ప్రయాతం ,పంచచామరం, మహాస్రగ్ధర, తరళ ఉదాహరణలు .
ఇలా నన్నయ సంస్కృత వృత్తాలను తెలుగులోకి మార్చినపుడు తెలుగు భాషకు అనువైన మార్పులు చేశాడని గ్రహించాలి .సంస్కృతం లో ప్రచారం లేక మూల పడిఉన్న చంపకమాల ,ఉత్పలమాల లను కూడా గ్రహించి విపులంగా ప్రచారం చేసి అందలం ఎక్కించి సొబగులు అద్దాడు .తరువోజ నాలుగుపాదాలున్న ద్విపద వంటిదే అని భావించి ద్విపద రచన చేయలేదు నన్నయ .సీస పద్యాలలో ఉన్న సర్వప్రాస మొదలైన నియమాలను జాగ్రత్తగా పాటించాడు .శాసనాలలో, కన్నడం లోనూ ఉన్న అక్కర కు యతి పాటించి రాశాడు .ఈ అక్కర అరణ్య పర్వ శేషాన్ని రాసిన ఎఱ్ఱనకు తప్ప నన్నెచోడ ,తిక్కనాదులకు దాని ‘’అక్కర ‘’ లేకుండా పోయింది .యుద్ధమల్లుని బెజవాడ శాసనం అక్కర లో ఉన్నట్లు అయిదవ గణం మొదటి అక్షరం పై యతి ని పాటించాడు .కన్నడం లో లేని యతికి ,తెలుగులోపూజనీయ ‘’యతి మర్యాద ‘’కల్పించి ఆంద్ర దేశ సంప్రదాయాన్నే పాటించాడు ‘నన్నయభట్టు .
ఆధారం –కోరాడ రామ కృష్ణయ్యగారి ‘’ప్రథమాంధ్ర కవితా శిల్పి –నన్నయభట్టు ‘’వ్యాసం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-8-19-ఉయ్యూరు